కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ఏనుగులు “తమ స్నేహితులను మరచిపోవు”

“ఎనుగులు దేన్నీ మరచిపోవు​—⁠తమ స్నేహితులను అసలు మరచిపోవు” అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక నివేదిస్తోంది. ఇంగ్లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ సస్సెక్స్‌లో డా. కరేన్‌ మెకోంబ్‌ కెన్యా దేశంలో ఉన్న ఆంబోసెలీ నేషనల్‌ పార్క్‌లోని ఆడ ఆఫ్రికా ఏనుగులు, తరచుగా కలుసుకునే ఏనుగులు దగ్గరికి వచ్చినప్పుడు చేసిన అరుపులనూ, ఇతర ఏనుగులు వచ్చినప్పుడు చేసిన “అరుపులనూ” రికార్డు చేసింది. ఆ తర్వాత ఆమె వాటి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దామని 27 ఏనుగు కుటుంబాలకు వాటిని వినిపించింది. ఆ ఏనుగులకు బాగా పరిచయమున్న అరుపు వినిపించినప్పుడు అవి వెంటనే తిరిగి ప్రతిస్పందించాయి. అంతగా పరిచయం లేని ఏనుగు అరుపులు వినిపించినప్పుడు వెంటనే ప్రతిస్పందించలేదు, ఏమాత్రం పరిచయం లేని అరుపు వినిపించినప్పుడు అవి కోపం తెచ్చుకొని ఆత్మరక్షణకోసం సిద్ధపడ్డాయి. “అరుపులను బట్టి అవి కనీసం 14 ఇతర కుటుంబాల సభ్యులను గుర్తించగలిగాయి, అంటే దానర్థం ఒక్కొక్క ఏనుగు కనీసం 100 ఏనుగులను గుర్తుంచుకోగలవన్నమాట” అని ఆ ఆర్టికల్‌ అంటోంది. ఏనుగులు మానవులను కూడా గుర్తుంచుకుంటున్నట్లు కనబడుతోంది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టాల్‌ జంతు ప్రదర్శనశాల అధ్యక్షుడు జాన్‌ పార్ట్‌రిడ్జ్‌, తాను 18 సంవత్సరాలపాటు కలిసి పనిచేసిన ఒక ఆసియా ఏనుగు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు గుర్తు పట్టిందని చెబుతున్నాడు.(g01 5/22)

మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో ఒత్తిడి

“బ్రిటన్‌లోని వర్కహాలిక్‌ ఉద్యోగులు మధ్యాహ్న విరామాల్లో భోజనం చేయడం మానేసి పనిచేసే కుర్చీల్లో నుండి ఎక్కడికీ కదలకుండా కేవలం సాండ్విచ్‌లు మాత్రమే తింటున్నారు. ఈ మగవీరుల దృష్టిలో లంచి చేసేవాళ్ళు బలహీన ఘటాలుగా కనిపిస్తున్నారు” అని లండన్‌లోని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదిస్తోంది. సగటు బ్రిటన్‌ పౌరుడి “లంచి అవరు” ఇప్పుడు ఒక గంట కాదు గానీ 36 నిమిషాలు మాత్రంగానే ఉంటుందని ఇటీవలి పరిశోధన చూపిస్తోంది. మధ్యాహ్న విరామం ఒత్తిడిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ కొందరు యజమానులు లంచ్‌టైమ్‌ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉద్యోగులకు అసలు విరామమే ఇవ్వడం లేదు. పై నివేదికను సమకూర్చిన డాటామానీటర్‌ అనే పరిశోధక సంస్థ ఇలా అభిప్రాయపడుతోంది: “ఉద్యోగుల నుండి ఎక్కువ పనిని ఆశిస్తూ, సమయాన్ని చాలా ఖరీదైన వస్తువుగా పరిగణించే సమాజంలో చిక్కుకుపోయినవారు మధ్యాహ్న విరామం అనేది అనవసరమైన విరామం అని దృష్టిస్తున్నారు.” డాటామానీటర్‌ విశ్లేషకురాలైన సేరా నన్నీ ఇలా అంటోంది: “మనం భౌగోళిక విపణిలో పోటీ పడుతున్నాం. ‘తర్వాత చేస్తానులే’ అనడం ఇక సాధ్యంకాదు. పని తక్షణం జరగాల్సిందే.” (g01 5/22)

ఫ్రిడ్జ్‌ లేకుండానే ఫ్రెష్‌ ఫుడ్‌

కుళ్ళిపోగల కూరగాయలను ఫ్రిడ్జి లేకుండా నిలవ ఉంచడం సవాలే. అయితే, చాలా సులువైన చవకైన ఒక పద్ధతి వర్షాపాతం తక్కువగా ఉండే ఉత్తర నైజీరియాలో చాలా విజయవంతంగా సాగుతోంది. ఒక మట్టి పాత్రను మరో మట్టి పాత్రలో ఉంచి మధ్యనున్న ఖాళీ స్థలాన్ని ఇసుకతో నింపి దాన్ని నీటితో తడి చేయడమే ఆ పద్ధతి. కూరగాయలను లోపలి పాత్రలో ఉంచి తడిగుడ్డతో కప్పేస్తారు. “బయటున్న వేడి గాలి ఇసుకలోని తేమని పైకి లాగడంతో అక్కడ ఆవిరి ఏర్పడుతుంది” అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక చెబుతోంది. “బాష్పవాయువుతోపాటు వేడి కూడా బయటికి వెళ్ళిపోతుంది, అలా పాత్ర లోపలి భాగం నుండి వేడిని బయటికి పంపించే ప్రక్రియ, బట్టను ఇసుకను తడిపి ఉంచినంత సేపు కొనసాగుతుంది.” ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు టమాటాలు, మిరపకాయలు మూడు వారాలకుపైగా తాజాగా ఉంటున్నాయి, వంకాయలైతే దాదాపు నెలరోజులు నిలవ ఉంటున్నాయి. రైతులు ఇప్పుడు తమ ఫలసాయాన్ని అవసరమైనప్పుడల్లా అమ్మగలుగుతున్నారనీ, సాధారణంగా ఇంటిపట్టునే ఉండిపోయి కూరగాయలమ్మే వాళ్ళ అమ్మాయిలు ఇప్పుడు పాఠశాలకు హాజరవుతున్నారనీ ఈ “పాత్రలో పాత్ర” పద్ధతిని కనిపెట్టిన మొహమ్మద్‌ బాహ్‌ అబ్బా అంటున్నాడు.(g01 6/8)

సెల్‌ఫోన్‌ దుర్ఘటనలు

సెల్‌ఫోన్లు ఉపయోగించడం మూలంగా జరిగే దుర్ఘటనలు రోడ్లకే పరిమితం కావడం లేదు. ప్లాట్‌ఫారమ్‌లపై వేచివుంటున్న ప్రయాణికులు సెల్‌ఫోనుల్లో మాట్లాడుతూ ఎంతగా లీనమైపోతున్నారంటే తామెక్కడున్నదీ మర్చిపోతున్నారని జపాన్‌లోని రైల్వే అధికారులు అంటున్నారు. ప్లాట్‌ఫారమ్‌ చివర నిలబడి తన సెల్‌ఫోనులో మాట్లాడుతున్న ఒక యౌవనస్థుడి ఉదంతాన్ని ఆసాహీ ఈవెనింగ్‌ న్యూస్‌ నివేదించింది. తాను ఫోనులో మాట్లాడుతున్న వ్యక్తికి అభివాదం చేయడానికి ఆయన అసంకల్పితంగా ముందుకు వంగాడు, అంతలో అటుగా వెళ్తున్న ట్రైను ఆయనను రాసుకుంటూ పోయింది. సంతోషకరంగా ఆయన “తన కుడికంటి పైన చిన్న గాయంతో” తప్పించుకున్నాడు. అయితే మరో దుర్ఘటనలో, “ఒక హైస్కూలు విద్యార్థి ప్లాట్‌ఫారమ్‌ చివర నిలబడి సెల్‌ఫోనులో మాట్లాడుతూ ఉండగా ఒక గూడ్సు ట్రైన్‌ వచ్చి గుద్దేసింది, ఆయన చనిపోయాడు.” ప్రజలు కొన్నిసార్లు తమ సెల్‌ఫోన్లను పట్టాల మీద పడేసుకుంటుంటారని స్టేషన్‌ సిబ్బంది నివేదిస్తోంది. 26 ఏండ్ల ఒక యువకుడు తన టెలిఫోనును తీసుకోవడానికి పట్టాల మీదికి దూకాడు, అంతలో ఒక ట్రైన్‌ వచ్చి ఆయనను “నుజ్జునుజ్జు చేసి మృత్యువాతకు గురిచేసింది.” “రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు చాలా ప్రమాదకరమైన ప్రాంతాలని జ్ఞాపకముంచుకోవాలని” రైల్వే అధికారులు ప్రజలను కోరుతున్నారు.

(g01 6/22)