కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మతాలన్నీ దేవుని దగ్గరికి నడిపించే విభిన్న మార్గాలా?

మతాలన్నీ దేవుని దగ్గరికి నడిపించే విభిన్న మార్గాలా?

బైబిలు ఉద్దేశము

మతాలన్నీ దేవుని దగ్గరికి నడిపించే విభిన్న మార్గాలా?

“విశ్వానికంతటికీ దేవుడైనవాడు ఒకే ఒక్క మతంలో దొరుకుతాడని నమ్మడం నాకు అసంభవంగా ఉంది” అని వ్రాశాడు మార్కస్‌ బోర్గ్‌ అనే రచయిత. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్‌ టుటు ఇలా అన్నాడు: దేవుని విశ్వాస “మర్మాన్ని గురించిన సంపూర్ణ సత్యం తమ దగ్గరే ఉన్నట్లు ఏ ఒక్క మతం చెప్పుకోలేదు.” బెంగాలీలు జోటో మూట్‌, టోటూ పోథ్‌ అంటారు, మతాలన్నీ ఒకే గమ్యానికి నడిపించే విభిన్న మార్గాలు అని దానర్థం. బౌద్ధులు కూడా అదే విధంగా దృష్టిస్తారు. నిజానికి, మతాలన్నీ దేవుని దగ్గరికి నడిపించే విభిన్న మార్గాలని లక్షలాదిమంది ప్రజలు నమ్ముతారు.

జెఫ్రీ పారిండర్‌ అనే చరిత్రకారుడు ఇలా అంటున్నాడు: “మతాలన్నింటికీ ఒక గమ్యం ఉన్నదని, లేదా మతాలన్నీ సత్యాన్ని చేరుకోవడానికి సమాన మార్గాలనీ, లేదా మతాలన్నీ ఒకే విధమైన సిద్ధాంతాలను బోధిస్తాయనీ కొందరంటారు.” మతాల్లోని బోధలు, ఆచారాలు, దేవతలు నిజంగానే పోలికలు కలిగివున్నాయి. దాదాపు అన్ని మతాలు ప్రేమ గురించే చెబుతాయి, హత్య దొంగతనాలు అబద్ధాలు తప్పని చెబుతాయి. చాలా మతగుంపుల్లోని సభ్యులు ఇతరులకు సహాయపడడానికి ఎంతో కృషిచేస్తుంటారు. కాబట్టి ప్రశ్నేమిటంటే, ఒక వ్యక్తి తన విశ్వాసాలను నిజాయితీగా నమ్మితే, మంచిగా జీవించడానికి ప్రయత్నిస్తే, ఆయన ఏ మతం వాడన్నది అంత పట్టించుకోవల్సిన విషయమా? లేక మతాలన్నీ దేవుని దగ్గరికి నడిపించే వేర్వేరు మార్గాలు మాత్రమేనా?

నిజాయితీగా ఉంటే చాలా?

మొదటి శతాబ్దపు యూదుడైన సౌలు విషయమే తీసుకోండి, ఆయన తర్వాత పౌలు అనే క్రైస్తవ అపొస్తలుడిగా మారాడు. ఆయన అత్యంతాసక్తితో యూదా మతాన్ని అవలంబించినవాడు. అందుకనే క్రీస్తు అనుచరుల ఆరాధనను తుడిచిపెట్టేయడానికి ప్రయత్నం చేశాడు. వారి ఆరాధన తప్పని ఆయన భావించాడు. (అపొస్తలుల కార్యములు 8:1-3; 9:1, 2) కానీ, తనలాంటి మతనిష్ఠగల వ్యక్తులకు దేవుని మీద ఆసక్తి ఉండవచ్చు, అయినా వాస్తవాలేమిటో తెలియనందున వారు తప్పుడు మార్గంలో ఉండే అవకాశం ఉందని సౌలు చివరికి దేవుని కృప మూలంగా గ్రహించాడు. (రోమీయులు 10:2) దేవుని చిత్తాన్ని గురించి ఆయన వ్యవహారాల గురించి సౌలు మరింత ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఆయన మారిపోయి తాను హింసిస్తూ వచ్చిన వ్యక్తులతోనే, అంటే క్రైస్తవులతోనే ఆరాధించడం ప్రారంభించాడు.​—1 తిమోతి 1:12-16.

మనం ఎంపిక చేసుకోవడానికిగాను వందలాది మతవిశ్వాసాలున్నాయని మనమేది ఎంపిక చేసుకున్నా ఫర్వాలేదని బైబిలు చెబుతోందా? పునరుత్థానుడైన యేసుక్రీస్తు నుండి అపొస్తలుడైన పౌలు పొందిన నిర్దేశాలు భిన్న విషయాన్ని చెబుతున్నాయి. ఆయన అన్యజనులలోకి వెళ్ళి, వారు “చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరి[గేలా] . . . వారి కన్నులు” తెరిచేందుకు యేసు ఆయనను పంపించాడు. (అపొస్తలుల కార్యములు 26:16-18) దీన్నిబట్టి స్పష్టమయ్యేదేమిటంటే, మతం విషయంలో మన ఎంపిక తప్పకుండా ప్రాముఖ్యమైన విషయమే అవుతుంది. పౌలు పంపబడిన ప్రజలు అప్పటికే ఏదో ఒక మతాన్ని అవలంబిస్తూ ఉన్నారు. కానీ వారు “చీకటిలో” ఉన్నారు. నిజానికి, ఒకవేళ మతాలన్నీ కేవలం నిత్యజీవానికీ దేవుని అనుగ్రహానికీ నడిపించే వేర్వేరు మార్గాలే అయితే, యేసు తన అనుచరులకు శిష్యులను చేసే పనిలో శిక్షణనిచ్చే అవసరం గానీ, ఆ పనిని చేయడానికి వారిని నియమించాల్సిన అవసరం గానీ ఉండేది కాదు.​—మత్తయి 28:19, 20.

ప్రఖ్యాతిగాంచిన తన కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:13, 14) “విశ్వాసమొక్కటే” అని బైబిలు నిక్కచ్చిగా చెబుతోంది. (ఎఫెసీయులు 4:5) “విశాలము”గా ఉన్న దారిలో ఉన్నవారిలో చాలామందికి ఏదో ఒక మతం ఉన్నది. కానీ వారిది “విశ్వాసమొక్కటే” కాదు. ఒకే ఒక్క సత్యారాధన ఉంది కాబట్టి ఆ సత్య మతాన్ని కనుగొనాలని కోరుకునేవారు దానికోసం అన్వేషించాల్సిన అవసరం ఉంది.

సత్య దేవుని కోసం అన్వేషించండి

మానవ చరిత్ర ప్రారంభం నుండే మానవులేం చేయాలన్నది దేవుడు వారికి చెప్పాడు. (ఆదికాండము 1:28; 2:15-17; 4:3-5) నేడు ఆయన కోరుతున్న విధులు బైబిలులో స్పష్టంగా వివరించబడివున్నాయి. ఇందు మూలంగా మనం ఆమోదయోగ్యమైన ఆరాధనేమిటో ఆమోదయోగ్యం కాని ఆరాధనేమిటో తేడాను గ్రహించేందుకు సాధ్యమవుతుంది. (మత్తయి 15:3-9) కొందరు తామవలంబిస్తున్న మతాన్ని వారసత్వంగా పొందారు, ఇతరులు సమాజంలోని అత్యధికులు పాటించేదాన్నే పాటిస్తుంటారు. అనేకమంది విషయంలో మతం అనేది కేవలం తామెప్పుడు ఎక్కడ జన్మించామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ మీ మత ఎంపిక అనేది కేవలం మీ ప్రమేయం లేకుండా యాదృచ్ఛికంగా జరిగిపోవాలా, లేదా ఈ విషయంలో ఇతరులు మీ పక్షాన నిర్ణయం తీసుకోవాలా?

మీ మత ఎంపిక లేఖనాలను జాగ్రత్తగా తరచి చూసిన తర్వాత తీసుకోబడిన ఎంపిక అయివుండాలి. మొదటి శతాబ్దంలో కొందరు విద్యావంతులు అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలను ఊరికినే నమ్మేయలేదు. వారు పౌలు “చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” (అపొస్తలుల కార్యములు 17:11; 1 యోహాను 4:1) మీరు కూడా అలాగే ఎందుకు చేయకూడదు?

విశ్వానికి దేవుడైన వాడు తనను సత్యంతో ఆరాధించే ప్రజల కోసం చూస్తున్నట్లు బైబిలు వర్ణిస్తోంది. యోహాను 4:23, 24 లో నమోదు చేయబడినట్లుగా యేసు ఇలా వివరించాడు: “అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతోను ఆరాధింపవలె[ను].” దేవుని “యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి” మాత్రమే ఆయనకు ఆమోదయోగ్యమైనది. (యాకోబు 1:27) జీవానికి నడిపించే ఇరుకైన దారి కోసం లక్షలాదిమంది చేసిన అన్వేషణను దేవుడు ఆశీర్వదించాడు. ఆయన నిత్యజీవాన్ని ఆసక్తి చూపనివారికి ఇవ్వడు గానీ, తానేర్పర్చిన ఇరుకైన దారిని కనుగొనడానికి నిజంగా శ్రమించే వారికీ దానిలో ఉండేవారికీ ఇస్తాడు.​—మలాకీ 3:18. (g01 6/8)