మరుభూమిని ఫలభరితంగా చేయడం
మరుభూమిని ఫలభరితంగా చేయడం
ఇండియాలోని తేజరిల్లు! రచయిత
భారతదేశపు ఉత్తారాన ఉన్న లడక్ జిల్లాలో మరుభూములుగా ఉన్న ప్రాంతాలను ఫలవంతంగా ఎలా చేయవచ్చు? పదవీవిరమణ చేసిన సివిల్ ఇంజనీరైన త్సెవాంగ్ నార్ఫెల్ మనస్సులో ఈ ప్రశ్నే మెదులుతుండేది. హిమాలయ పర్వతాల పైన ఉండే సహజ హిమనదులు జూన్ నెలలో ప్రవహించడం మొదలుపెడతాయి, కానీ ఏప్రిల్‌లో ప్రవహించవు, అప్పుడు వర్షాలూ పడవు కనుక, తమ పొలాలకు నీరు పెట్టడానికి రైతులకు నీళ్ళు కావాలి. నార్ఫెల్‌కి చివరికి చక్కని ఆలోచన వచ్చింది. ఎక్కువ ఎత్తు లేని ప్రాంతాల్లో, అంటే సంవత్సరారంభంలో మంచు కరగనారంభించే పల్లపు ప్రాంతాల్లో, కృత్రిమ హిమనదులను రూపొందించాలన్నదే ఆ ఆలోచన.
ఇండియా వార్తాపత్రిక ద వీక్ ప్రకారం, నార్ఫెల్, ఆయన జట్టూ ఒక పర్వతంపైనుండి వచ్చే ఒక హిమనదీ ప్రవాహాన్ని 70 ఉపకాలువలు గల 200 మీటర్ల పొడవైన మానవనిర్మిత కాలువగా మలచడం మొదలుపెట్టారు. వీటి నుండి ఆ నీళ్ళు పర్వత పల్లంవైపు నెమ్మదిగా, నియంత్రిత వేగంతో ప్రవహించి, ఆ పర్వతం దిగువ భాగాన నిర్మించిన రాళ్ళగోడను చేరుకోక ముందే ఘనీభవిస్తాయి. అక్కడ ఆ మంచు నెమ్మదిగా పేరుకుపోతుంది, చివరికి ఆ గోడ మీద కూడా మంచు పరుచుకుంటుంది. ఆ పర్వత నీడన ఉన్న ఆ కృత్రిమ హిమనది ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడే కరుగుతుంది, అలా పొలాలకు నీళ్ళు పెట్టవలసిన అవసరం బాగా ఉన్న సమయంలో నీళ్ళు సరఫరా అవుతాయి.
కృత్రిమ హిమనదిని సృష్టించాలన్న ఆలోచన సఫలమైందా? వాస్తవానికి, నార్ఫెల్ ఆలోచన ఎంతో ఆచరణాత్మకమైనదని నిరూపించబడడంతో, లడక్‌లో ఇప్పటికే అలాంటి పది హిమనదులు సృష్టించబడ్డాయి. మరిన్ని హిమనదులు సృష్టించాలన్న పథకాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఒక హిమనది, 4,500 అడుగుల ఎత్తున నిర్మించబడింది, అది 3 కోట్ల 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయగలదు. అలాంటి నదికి ఎంత ఖర్చవుతుంది? “ఒక కృత్రిమ హిమనదిని సృష్టించడానికి, సుమారు రెండు నెలలు పడుతుంది, 80,000 రూపాయలు [1,860 డాలర్లు] ఖర్చవుతుంది, ఆ ఖర్చులో ఎక్కువ భాగము కార్మికుల వేతనానికే అవుతుంది” అని ద వీక్ చెబుతోంది.
మానవుని ప్రజ్ఞను సరైనవాటికి ఉపయోగించినప్పుడు, అది నిశ్చయంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడుతోంది. దేవుని పరలోక రాజ్యపు నిర్దేశం క్రింద మానవజాతి ఎంతటి కార్యాలను సాధించగలదో ఆలోచించండి! “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును . . . అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును” అని బైబిలు వాగ్దానం చేస్తోంది. (యెషయా 35:1, 6) మన భూమిని సుందరంగా మార్చడంలో మనమూ భాగం వహించడం ఎంత ఆనందకరంగా ఉంటుంది!(g01 4/8)
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
Arvind Jain, The Week Magazine
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc. ▸