కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాత్‌ అందమైన

మాత్‌ అందమైన

మాత్‌ అందమైన

అది ఖరీదైన ఒక రెస్టారెంట్‌. సాయంకాలపు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది, అంతలో ఒక మాత్‌ ఎగురుకుంటూ లోపలికొచ్చింది. అది రెక్కలు టపటపలాడించుకుంటూ ఒక టేబుల్‌ దగ్గరికి రాగానే అక్కడ కూర్చున్న స్త్రీ అదిరిపోయి ఏదో మలేరియా దోమ దాడి చేస్తుందన్నంత భయంతో దాన్ని తరిమేసింది! ఆ మాత్‌ ఉస్సురుమంటూ మరో టేబుల్ని ఆశ్రయించి, అక్కడ కూర్చున్న వ్యక్తి కోటు మీద వాలింది. ఆయనా ఆయన భార్య పూర్తి భిన్నంగా ప్రతిస్పందించారు​—⁠వాళ్ళు ఆ మాత్‌ని చూసి అబ్బురపడ్డారు, దాని అందాన్ని తిలకిస్తూ సున్నితమైన ఆ ప్రాణి ఎంత నిరపాయకరమైనదో ఆలోచిస్తున్నారు.

“మాత్‌లు పూర్తి నిరపాయకరమైన ప్రాణులు” అని కన్నెక్టికట్‌ సీతాకోకచిలుకల సంఘం వ్యవస్థాపకుడైన జాన్‌ హిమ్మల్‌మ్యాన్‌ వివరిస్తున్నాడు. “కొరకడానికి వాటికి నోట్లో దంతాల్లాంటివేమీ లేవు, ప్రఖ్యాత లూనా మాత్‌ లాంటి కొన్ని మాత్‌లైతే ప్రౌఢదశలో అసలు ఏమీ తినవు. వాటి నుండి రేబీస్‌ గానీ వేరే ఇతర వ్యాధులు గానీ సోకవు, అవి కుట్టవు కూడా. . . . నిజానికి సీతాకోక చిలుకలు పగలు ఎగిరే మాత్‌లని చాలామంది గ్రహించరు.”

సీతాకోక చిలుకలను చూసి అందరూ ఆనందిస్తారు, కానీ ఒక్క నిమిషమాగి మాత్‌ల వైవిధ్యాన్నీ అందాలను చూడాలని ఎవ్వరూ ఆలోచించరు. ‘అందమా?’ అంటూ మీరు ముఖం చిట్లించవచ్చు. మాత్‌ను చూసి, ‘ఈ సీతాకోక చిలుకకు మెరుపు లేదేమిటా’ అని కొందరనుకుంటారు. రెండింటికీ “పొలుసుల రెక్కలు” అని అర్థం వచ్చే లెపిడోప్టెరా అనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. ఈ సుందరమైన ప్రాణులు ఎంత వైవిధ్యమైనవో పరిశీలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాము. లెపిడోప్టెరాలో 1,50,000 నుండి 2,00,000 వరకు తెలిసిన జాతులున్నాయని ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఇన్‌సెక్ట్స్‌ చెబుతోంది. కానీ వీటిలో కేవలం 10 శాతం మాత్రమే సీతాకోక చిలుకలు​—⁠మిగతావన్నీ మాత్‌లే!

అందరిలాగే నేను కూడా మాత్‌ల గురించి ఇంతకు ముందెప్పుడూ ఆలోచించలేదు, శీతాకాలపు బట్టలను సర్దిపెట్టేటప్పుడు బట్టలు కొట్టేసే మాత్‌లు (క్లాత్‌ మాత్‌లు) రాకుండా ఉండేందుకు బట్టల చుట్టూ కలరా ఉండలను పెట్టేటప్పుడే అవి గుర్తొచ్చేవి. ప్రౌఢదశలోవున్న మాత్‌లు బట్టలను కొట్టవని నాకు తెలీదు, కేవలం లార్వా దశలో గొంగళిపురుగులుగా ఉన్నప్పుడే అలా తింటాయి. *

మరి మాత్‌ల పట్ల నా అభిప్రాయాన్ని మార్చినదేమిటి? కొద్ది రోజుల క్రితం బాబ్‌, రాండా అనే మా స్నేహితులను కలవడానికి నేనూ నా భర్తా వాళ్ళింటికి వెళ్ళాము. బాబ్‌కు మాత్‌ల గురించి బాగా తెలుసు. ఆయన నాకొక చిన్న పెట్టెను చూపించాడు, లోపలికి చూసి ముందు అదొక అందమైన సీతాకోక చిలుక అనుకున్నాను. కానీ దాన్ని సిక్రోప్యా లేదా రాబిన్‌ మాత్‌ అంటారని, అది ఉత్తర అమెరికాలోని చాలా పెద్ద మాత్‌ అని ఆయన వివరించాడు. దాని రెక్కలు ఆరు అంగుళాల వరకు విచ్చుకోగలవు, దాని జీవిత కాలం సంవత్సరం వరకు ఉంటుంది. అది ప్రౌఢదశలో కేవలం 7 నుండి 14 రోజులు మాత్రమే జీవిస్తుందని తెలుసుకుని నేను ఎంత ఆశ్చర్యపోయానో! అందమైన ఆ సిక్రోప్యాను నిశితంగా పరిశీలించడంతో నేను మాత్‌లను పూర్తిగా క్రొత్త దృక్కోణంలోంచి చూడడం ప్రారంభించాను.

ఆ పెట్టెలో ఉన్న కొన్ని చిన్న చుక్కలను బాబ్‌ చూపించాడు. “ఇవి దాని గ్రుడ్లు, అవి ప్రౌఢదశకు చేరుకునేంత వరకు పెంచాలనుకుంటున్నాను” అన్నాడాయన. మాత్‌లను పెంచడమా? ఆ తలంపే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడం అంత సులభమేమీ కాదని నాకు తర్వాత తెలిసొచ్చింది. గ్రుడ్లను పొదిగించడానికి బాబ్‌ రెండు వారాలపాటు విఫలయత్నం చేశాడు. చివరికి వాటిని నీటి తుంపర్లతో తడిచేయాలని నిర్ణయించుకున్నాడు. అలా చేసిన తర్వాత వారం తిరిగే సరికే 29 గ్రుడ్లలో 26 ఒకే రోజు విచ్చుకున్నాయి. దోమ పరిమాణంలో సుకుమారంగా ఉన్న ఆ లార్వాలను బాబ్‌ లోతైన ఒక నున్నని స్టీలు పాత్రలో ఉంచాడు, అవి పాక్కుంటూ బయటికి పోకుండా ఆయనలా చేశాడు.

లార్వాలు ఆరగించిన తొలి ఆహారం తమ స్వంత గ్రుడ్ల పెంకులే. ఆ తర్వాత బాబ్‌ వాటికి ఆహారాన్ని ఇవ్వాల్సి వచ్చింది, అది పెద్ద సవాలైంది. కాస్త పరిశోధన చేసిన తర్వాత వాటికి మేపుల్‌ ఆకులను ఇచ్చి చూశాడు. అవి ఆకులమీదికి ఎగబ్రాకాయి గానీ వాటిని తినలేదు. చివరికి బాబ్‌ చెర్రీ ఆకులను కొండరావి ఆకులను ఇవ్వగానే వాటినవి ఆబగా తినేశాయి.

ఆ చిన్ని లార్వాలు గొంగళిపురుగు దశకు ఎదిగిన తర్వాత బాబ్‌ వాటిని తెరతో కప్పబడిన ఒక టెర్రేరియమ్‌లోకి మార్చాడు. అది గొంగళిపురుగులకు, ఆకులకు అవసరమయ్యే సమతుల్యమైన తేమను అందిస్తుంది. అవి కొంచెం ప్రాకడం నేర్చుకోగానే తిరుగుబోతులైపోయాయి, ఇప్పుడా క్రొత్త నివాసం అందుకు వీలుకాకుండా అడ్డుకట్ట వేసింది.

ఆకలో ఆకలి అంటున్న 26 గొంగళిపురుగులకు ఆహారాన్ని అందించడం అనుకున్న దానికన్నా పెద్ద పనే అయ్యింది. బాబ్‌ ఇన్ని ఆకులు వేయగానే అవి రెండ్రోజుల్లో వాటినన్నింటినీ స్వాహా చేసేశాయి. దినదినాభివృద్ధి చెందుతున్న వీటిని చూసుకోవడానికీ ఆహారాన్ని పెట్టడానికీ బాబ్‌ తన చెల్లి సహాయాన్ని తన స్నేహితులైన ఒకమ్మాయి ఒకబ్బాయి సహాయాన్ని అర్థించక తప్పలేదు.

గొంగళిపురుగులు అలా ఆహారాన్ని పెద్ద మొత్తంలో తినడం లార్వా దశలోని దాని పెరుగుదలకే కాదు, అవి ప్రౌఢదశకు చేరుకున్నాక వాటి పోషణకు కూడా చాలా కీలకం. గుర్తుంది కదా, ప్రౌఢదశలోవున్న సిక్రోప్యా నోట్లో కొరకడానికి దంతాల్లాంటివేమీ ఉండవు, అవి అసలు ఆహారమే తినవు! ఎంతో స్వల్పమైన ప్రౌఢదశలోని జీవితంలో అది పోషణకోసం లార్వా దశలో తాను తిన్న ఆహారంపైనే పూర్తిగా ఆధారపడుతుంది.

క్రొత్త చర్మాలు

గొంగళిపురుగులు పెరుగుతుండగా అవి తమ చర్మాలను అనేకసార్లు విడిచిపెడుతుంటాయి. అవి అలా వదిలిపెట్టిన తర్వాత నుండి మరోసారి వదిలిపెట్టేంతవరకు ఉండే దశను ఇన్‌స్టార్‌లని అంటారు.

సిక్రోప్యా గొంగళిపురుగు చర్మం పరిమాణం పెరగదు, అందుకనే శరీరం పెద్దదైనప్పుడు దాని చర్మం ఒక పరిధివరకు సాగదీయబడి చివరికి వదిలిపెట్టేయబడుతుంది. గొంగళిపురుగులు తినడం ఆపేయగానే బాబ్‌కి అర్థమైపోయింది అందుకు సమయం ఆసన్నమైందని. చిన్న పట్టు పట్టీలను ఉత్పత్తిచేసి తమ శరీరాలను వాటికి అంటించుకున్న తర్వాత ఆ గొంగళిపురుగులు కొన్ని రోజులపాటు నిశ్చలంగా ఉండిపోయి క్రొత్త చర్మాన్ని పొందాయి. క్రొత్త చర్మం సిద్ధం కాగానే అవి తమ పాత చర్మాలను ఆ పట్టు పట్టీలకు అంటించేసి వాటి నుంచి చక్కా బయటికి వచ్చేశాయి. గొంగళిపురుగులు చివరి ఇన్‌స్టార్‌లో ఉండగా అవెంత పెద్దగా ఎదిగాయో చూసి నేను ఆశ్చర్యపోయాను. అవి దాదాపు ఐదంగుళాల పొడవు ఎదిగాయి, నా చూపుడు వేలికన్నా మందంగా ఉన్నాయి.

కోశము కట్టడం

చివరి ఇన్‌స్టార్‌ తర్వాత ఒక్కో గొంగళిపురుగు ఒక్కో గూడును కడుతుంది. ఈ గూడు ఒక పుల్లను ఆధారం చేసుకున్న బూడిదరంగు దారాల పెద్ద ఉండ. సిక్రోప్యాలు రెండు రకాల గూళ్ళను కడతాయి. ఒకటేమో పెద్దది, వదులుగా ఉంటుంది, అడుగు భాగం గుండ్రంగా ఉండి మెడ భాగం సన్నగా ఉండి సంచిలా ఉంటుంది. మరొకటి చిన్నగా ఉంటుంది, బిగుతుగా అల్లబడి ఆకృతి కోలగా ఉండి మెడ భాగము అడుగు భాగము సన్నగా ఉంటాయి. రెండు రకాల గూళ్ళలోను లోపల గట్టిగా చుట్టబడిన చిన్న గూళ్ళు ఉంటాయి. సిక్రోప్యాల గూళ్ళు సాధారణంగా ఎరుపు కలిసిన గోదుమ, గోదుమ, లేత పచ్చ, లేదా బూడిద రంగుల్లో ఉంటాయి. ఉత్తర అమెరికాలోని మాత్‌ల గూళ్ళతో పోలిస్తే సిక్రోప్యా మాత్‌ల గూళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి​—⁠దాదాపు నాలుగు అంగుళాల పొడవు, రెండంగుళాల వెడల్పు ఉంటాయి. అద్భుతమైన ఈ నిర్మాణాలు అందులో ఉండే శరీరాలను మైనస్‌ 34 డిగ్రీల సెల్సియస్‌ అంత తక్కువ ఉష్ణోగ్రతలో కూడా కాపాడగలుగుతాయి.

గొంగళిపురుగులు తమ గూళ్ళలో స్థిరపడిన తర్వాత మనమిక ఓపిగ్గా వేచి ఉండడం మినహా చేసేదేమీ ఉండదు. ఆ తర్వాతి వసంతంలో అవి బయటికి వచ్చాయి, అంటే బాబ్‌ ప్రౌఢదశలోవున్న మాత్‌ను సంపాదించినప్పటి నుండి దాదాపు ఒక సంవత్సరం తర్వాత. గూళ్ళు అంటుకుని ఉన్న పుల్లలను బాబ్‌ ప్లాస్టిక్‌ ఫోమ్‌మీద నిలువుగా ఉంచాడు. త్వరలోనే ఒక్కటి తప్ప మిగతా సిక్రోప్యాలన్నీ గూళ్ళ నుండి బయటికి వచ్చాయి, మా ఓపికకు కష్టానికి తగ్గ ఫలితం లభించింది.

మాత్‌ల పట్ల మెప్పుదల పెరిగింది

సిక్రోప్యా యొక్క ఆసక్తికరమైన జీవిత చక్రాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత, గోడలమీద వాలుతూ విద్యుద్దీపాల చుట్టూ రెక్కలాడించుకుంటూ ఎగిరే మాత్‌లను నేను మరింత శ్రద్ధతో గమనించనారంభించాను. ఈ అనుభవం అందమైన ఈ ప్రాణుల గురించి మరింత తెలుసుకోవాలన్న ప్రేరణనిచ్చింది. తెలుసుకున్నాను కూడా, ఉదాహరణకు మాత్‌లు సీతాకోక చిలుకలు చాలా దూరం, కొన్ని రకాలైతే విపరీతమైన దూరాలకు వలసవెళ్తాయని తెలుసుకున్నాను. చిన్న శరీరం గల డైమండ్‌బ్యాక్‌ మాత్‌ రెక్కలు పూర్తిగా విప్పితే ఒకే ఒక్క అంగుళం ఉంటుంది, కానీ అది అప్పుడప్పుడు యూరప్‌ నుండి బ్రిటన్‌కు అల్లకల్లోలంగా ఉండే నార్త్‌ సీ మీదుగా ప్రయాణిస్తుంది. స్ఫింక్స్‌ మాత్‌లు, లేదా హాక్‌మాత్‌లు పూలపై రెక్కలు టపటపలాడించుకుంటూ హమ్మింగ్‌బర్డ్‌లా ఎగురుతాయి.

సిక్రోప్యా జీవిత చక్రాన్ని కళ్ళారా చూసిన కొంతకాలం తర్వాత ఒక సిక్రోప్యా ఒక విద్యుద్దీపం క్రింద ఒక పొదపై వాలివుండడం చూశాను. దాని రెక్కలమీది పొలుసులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి దాని రెక్కలను పట్టుకొని లేపకూడదని నాకు తెలుసు. అయితే, చేతిని దాని ముందు చాచి ఉంచితే అది వ్రేలి మీదికి నడుచుకుంటూ ఎక్కే అవకాశం ఉంది. అలా చేయడానికి ప్రయత్నించాను, ఆ అందమైన ప్రాణి నన్ను కరుణించింది, నా మధ్య వ్రేలి మీదికి వాలింది. చివరికి చెట్లమీదకి ఎగిరిపోయింది. అది ఎగురుతూ ఉంటే అది సీతాకోక చిలుకను ఎంతగా పోలివుందా అనుకున్నాను. ఈసారి మీకు సీతాకోక చిలుక కనబడిందని అనుకున్నప్పుడు మళ్ళీ జాగ్రత్తగా చూడండి. బహుశ అది అందమైన నిరపాయకరమైన మాత్‌ అయివుండవచ్చు.​—⁠ఉచితవ్యాసం. (g01 6/8)

[అధస్సూచి]

^ కొన్ని మాత్‌ లార్వాలు పెద్ద మొత్తంలో పంటలను నాశనం చేస్తాయి కూడా.

[18, 19వ పేజీలోని చిత్రాలు]

1. రాబిన్‌ మాత్‌ (సిక్రోప్యా)

2. పాలిఫెమస్‌ మాత్‌

3. సన్‌సెట్‌ మాత్‌

4. అట్లాస్‌ మాత్‌

[చిత్రసౌజన్యం]

Natural Selection© - Bill Welch

A. Kerstitch

[20వ పేజీలోని చిత్రాలు]

సిక్రోప్యా మాత్‌ పెరుగుదలలోని దశలు: 1. గ్రుడ్లు

2. గొంగళిపురుగు

3. ప్రౌఢదశలోవున్న మాత్‌

[చిత్రసౌజన్యం]

Natural Selection© - Bill Welch