కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ కేశాలను కాస్త పరిశీలనగా చూద్దాం

మీ కేశాలను కాస్త పరిశీలనగా చూద్దాం

మీ కేశాలను కాస్త పరిశీలనగా చూద్దాం

“ప్రతి యుగంలోను ప్రతి సంస్కృతిలోను శిరోజాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కొంతైనా వ్యక్తం చేశాయి” అని ఒక రెఫరెన్సు పుస్తకం చెబుతోంది. అందుకే మరి, సాధారణంగా ప్రజలు తమ శిరోజాలను ఆరోగ్యంగాను ఆకర్షణీయంగాను ఉంచుకోవడానికి ఎంతో తాపత్రయపడతారు.

శిరోజాల నిర్మాణం ఎలాంటిది, దాన్ని ఎలా చూసుకోవాలి అన్న విషయాలపై సామాన్యంగా ప్రజలు అడిగే ప్రశ్నల గురించి తేజరిల్లు! నలుగురు అనుభవజ్ఞులైన హేర్‌ స్టైలిస్టులను అడిగింది. తేలిందేమిటంటే, మీ జుట్టు కనబడ్డానికి సామాన్యమైనదిగా ఉన్నా అది చాలా సంక్లిష్టమైనది.

జుట్టు పెరుగుదల, జుట్టు రాలిపోవడం

ప్ర: అసలు జుట్టు ఎలా రూపొందుతుంది?

జ: జుట్టులో కెరాటిన్‌ అనే పీచులాంటి ప్రొటీన్‌ ఉంటుంది. తలపై చర్మంలో ఉన్న కేశపుటిక అనబడే రోమకూపంలో నుండి వెంట్రుక బయటికి పెరుగుతుంది. ఒక్కొక్క కేశపుటిక మూలం దగ్గర కేశ సూక్ష్మాంకురం ఉంటుంది, అందులో రక్త సరఫరా సమృద్ధిగా ఉంటుంది. కేశ సూక్ష్మాంకురం కేశకణాలను ఉత్పత్తి చేస్తుంది, అవన్నీ కలిసి కేశపుటిక గుండా పైకి వచ్చి ఒక వెంట్రుకగా గట్టిపడుతాయి.

ప్ర: జుట్టును కత్తిరిస్తే ఇంకా త్వరగా పెరుగుతుందంటారు. అది నిజమేనా?

జ: అది నిజం కాదు. చెట్టు కాండం తన కొమ్మలను పోషిస్తున్నట్లే జుట్టును కూడా శరీరం పోషిస్తుందని కొందరు అనుకుంటారు. కానీ మాడు మీద వెంట్రుక ఎదిగి బయటికి వచ్చిన తర్వాత అది మృత పదార్థమే. కాబట్టి జుట్టును కత్తిరించడం దాని పెరుగుదలకేమీ దోహదపడదు.

ప్ర: జుట్టు ఎందుకు తెల్లబడుతుంది?

జ: జుట్టు లోపలి పొరలో ఒక వర్ణకం ఉంటుంది, దాని మూలంగానే జుట్టుకు ఆయా రంగులు వస్తాయి. ఆ వర్ణ కణాలు నశిస్తుండగా జుట్టు తెల్లబడుతుంది; అది వయస్సు పైబడడంలో భాగం. వయసుకు ముందే జుట్టు తెల్లబడడం అనేది జన్యువులు లేదా వ్యాధుల కారణంగా జరుగుతుండవచ్చు. అయితే జుట్టు ఒక్క రాత్రిలో తెల్లబడడం మాత్రం వాస్తవం కాదు. వర్ణకం తలపై చర్మం క్రింద ఉంటుంది. కాబట్టి తెల్ల జుట్టు (నెలకు దాదాపు 1.25 సెంటీమీటర్లు) పెరిగి తలలో కనిపించాలంటే సమయం పడుతుంది.

ప్ర: జుట్టు రాలిపోవడానికి కారణాలేమిటి?

జ: జుట్టు రాలిపోవడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. సగటున, ప్రతి వ్యక్తికి ప్రతిరోజూ 50 నుండి 80 వెంట్రుకలు రాలిపోతుంటాయి. కానీ మగవాళ్ళలో బట్టతల వంశానుగతంగా వస్తుంది, బహశ అది హార్మోనులు సమతుల్యాన్ని కోల్పోవడం మూలంగా ఏర్పడుతున్నట్లుంది. చివరికి జుట్టు శాశ్వతంగా ఊడిపోతుంది. జుట్టు అసహజంగా రాలిపోవడాన్ని అలోపెసియా అంటారు. *

ప్ర: ఒక వ్యక్తి జుట్టు ఆయన ఆరోగ్యానికి అద్దం లాంటింది అంటారు. మీరు దీన్ని గమనించారా?

జ: అది నిజమే. తలపై చర్మం క్రింద జుట్టుకు రక్తం పోషణను అందిస్తుంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జుట్టు రక్త సరఫరా చక్కగా జరుగుతుందని సూచిస్తుండవచ్చు. ఒక వ్యక్తి సరైన ఆహారం తినకపోతే లేదా మద్యపానీయాలు విపరీతంగా సేవిస్తూ ఉంటే ఆయన జుట్టు పటుత్వాన్ని కోల్పోయి బలహీనమౌతుంది, ఎందుకంటే ఆయన రక్త సరఫరా జుట్టుని సరైన విధంగా పోషించలేదు. జుట్టు కోల్పోవడం లేదా జుట్టు పటుత్వాన్ని కోల్పోవడం అనేవి ఏదైనా వ్యాధికి లేదా గర్భధారణకు తొలి సూచన కూడా అయ్యుండవచ్చు.

మీ తలపై చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడమెలా?

ప్ర: జుట్టుకు తలపై చర్మానికి షాంపూ ఎలా పెట్టుకోవాలో వివరించండి?

జ: తలపై చర్మం పొడిగా ఉండడం అనే సమస్యతో బాధపడే ప్రజల్లో అత్యధికులు చాలా తరచుగా షాంపూ ఉపయోగించేవారని అనుభవం చూపిస్తోంది. నిజమే మీ జుట్టులో సహజంగా ఉండే నూనె దుమ్మును చర్మపు పొట్టును ఆకర్షించి కేశపుటికలకు వెళ్ళే నూనె నాళాలను మూసే అవకాశం ఉంది. అందుకని క్రమంగా షాంపూతో స్నానం చేయడం అవసరమే. కానీ ఈ సహజ నూనెలు మీ చర్మాన్ని హానికరమైన సూక్ష్మక్రిముల నుండి కాపాడుతాయి కూడా, అలాగే మనకవసరమైన తేమ పోకుండా కాపాడుతాయి. మరీ తరచుగా షాంపూ పెట్టుకోవడం ద్వారా మీరు మీ తలపై చర్మానికి కావలసిన ఈ సంరక్షక పొర లేకుండా చేసుకున్నవారవుతారు, తత్ఫలితంగా తలపై చర్మం పొడిగా మారే సమస్యలను సృష్టించుకుంటారు. కేశనిపుణుల్లో అత్యధికులు తలపై చర్మం గాని జుట్టు గాని దుమ్ము ధూళి పట్టినప్పుడల్లా షాంపూ ఉపయోగించమని సిఫారసు చేస్తారు. నూనె జుట్టు ఉన్న వారు మామూలు జుట్టున్న లేదా పొడి జుట్టున్న వారికంటె ఎక్కువ తరచుగా షాంపూ పెట్టుకోవాలి.

షాంపూ పెట్టుకునేటప్పుడు మీ తలపై చర్మాన్ని మర్దన చేసుకోండి. అలా చేయడం ద్వారా తలపై చర్మం నుండి మృత కణాలు వదిలిపోయి, మీ జుట్టుకు పోషణనిచ్చే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నీటితో బాగా కడగడం మర్చిపోవద్దు! సబ్బుతో మీ చేతులను కడుగుకున్న తర్వాత వాటిని నీళ్ళతో బాగా కడుక్కోకపోతే మీ చేతి చర్మం పొడిగా అయిపోయి పగులుతుంది. అదే విధంగా షాంపూని బాగా కడిగివేయకపోతే తలపై చర్మం పొడిగా మారిపోయి పొలుసులుగా ఏర్పడుతుంది.

ప్ర: తలపై చర్మం పొడిగా అయితే దానికి చికిత్స ఏమిటి?

జ: మంచినీళ్ళు బాగా తాగండి, పోషక విలువలున్న ఆహారాన్ని తినండి. అది మీ చర్మానికి తేమని అధికం చేస్తుంది, రక్త సరఫరాను సమృద్ధి చేస్తుంది. ఎక్కువ గాఢతలేని షాంపూని ఉపయోగించండి, తలపై చర్మాన్ని క్రమంగా మర్దన చేసుకోండి. కొంతమంది తలపై చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసుకోవడానికి నీటితో కడిగినా పోని కండీషనర్లనూ, లోషన్‌లనూ వాడతారు.

శిరోజాలంకరణ

ప్ర: హేర్‌ స్టైలిస్ట్‌ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలి?

జ: మీ హేర్‌ స్టైల్‌ని మార్చుకోవాలనుకుంటే మీకు కావాల్సిన స్టైల్‌ ఉన్న చిత్రాన్ని, అలాగే బహుశ మీరు వద్దనుకునే స్టైల్‌ ఉన్న చిత్రాన్ని కూడా తీసుకెళ్లండి. మీరేం కావాలనుకుంటున్నారో నిర్మొహమాటంగా చెప్పండి, ప్రతిరోజు జుట్టు కోసం మీరెంత సమయాన్ని వెచ్చించడానికి సిద్ధపడుతున్నారో కూడా చెప్పండి, ఎందుకంటే కొన్ని హేర్‌స్టైళ్ళకు మిగతా వాటికన్నా ఎక్కువ సమయం వెచ్చించాల్సివుంటుంది. హేర్‌ స్టైలిస్ట్‌కి మీ జుట్టు గురించి తెలియడానికీ, మీకు సులువుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికీ మీరు రెండు మూడు సార్లు ఆయన దగ్గరకు వెళ్ళాల్సివుంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి నిరుత్సాహపడి మీ హేర్‌ స్టైలిస్ట్‌ని వెంటనే మార్చేయకండి!

మీ శిరోజాలు వెల్లడించే విషయాలు

శిరోజాల సంరక్షణ, అలంకరణ అనేవి మీ గురించి మీరు వ్యక్తం చేసుకునే మార్గాలు. మారుతున్న ఫ్యాషన్‌లకు, మత నమ్మకాలకు, చివరికి సాంఘిక రాజకీయ తలంపులకు అనుగుణంగా జుట్టు కత్తిరించుకోవడం, పెంచుకోవడం, ఉంగరాల జుట్టయితే ఉంగరాలు లేకుండా చేసుకోవడం, ఉంగరాలు లేని జుట్టయితే ఉంగరాలు తిరిగేలా చేయించుకోవడం, రంగులద్దుకోవడం, విభిన్న రీతులలో అలంకరించుకోవడం జరుగుతోంది. మీ కేశాలను కాస్త పరిశీలనగా చూడండి. మీ గురించి అవేమని వ్యక్తం చేస్తున్నాయి? ఆరోగ్యకరమైన శిరోజాలను, చక్కని అభిరుచికి అనుగుణంగా మలుచుకున్నప్పుడు అది ఆ వ్యక్తికి అలంకారంగా ఉంటుంది, ఇతరులది చూసి మెచ్చుకుంటారు కూడా.(g01 4/8)

[అధస్సూచి]

^ మరింత సమాచారం కోసం, తేజరిల్లు! యొక్క ఏప్రిల్‌ 22, 1991, (ఆంగ్లం) సంచికలోని “అలోపెసియా​—⁠జుట్టు కోల్పోవడాన్ని ఎదుర్కోవడం” అనే ఆర్టికల్‌ చూడండి.

[24వ పేజీలోని చిత్రాలు]

తలపై చర్మం పొడిగా ఉంటే పోషక విలువలున్న ఆహారాన్ని తినడం, మంచినీరు సమృద్ధిగా త్రాగడం మంచిది

[24వ పేజీలోని చిత్రం]

జుట్టు తెల్లబడడం వయస్సు పైబడడంలో భాగము

[24వ పేజీలోని చిత్రం]

మరీ తరచుగా షాంపూ పెట్టుకోవడం మూలంగా మీ తలపై చర్మానికి సంరక్షకమైన నూనెలు లేకుండా పోతాయి