కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అతిగా చింతించకుండా ఎలా ఉండగలను?

అతిగా చింతించకుండా ఎలా ఉండగలను?

యువత ఇలా అడుగుతోంది . . .

అతిగా చింతించకుండా ఎలా ఉండగలను?

“ఒక యౌవనస్థుడికి అత్యధిక ఒత్తిడి కలిగించే విషయాల్లో భవిష్యత్తు ఒకటై ఉండవచ్చు. ఆయనకు తన భవిష్యత్తు గురించి చింతగా ఉంటుంది. నేను ఇల్లు వదిలి వెళ్ళాలా? స్కూల్‌కి వెళ్ళాలా? పూర్తికాల పరిచర్యను చేపట్టాలా? పెళ్ళి చేసుకోవాలా? ఎంపిక చేసుకోవడానికి అనేక విషయాలున్నాయి, తలచుకుంటే భయం కలుగుతుంది.”​—షేన్‌. 20 ఏండ్లు.

మీరు బాగా చింతిస్తుంటారా? చాలా మంది యౌవనస్థులకు వివిధ కారణాల వల్ల చింతగా ఉంటుంది. “నేడు కౌమారప్రాయంలోనివారు అన్నింటికన్నా ఎక్కువగా చింతించేది మంచి ఉద్యోగం సంపాదించుకోవడం గురించేనని 41 దేశాల్లోని కౌమారప్రాయంలోని 15 నుండి 18 ఏండ్లలోపు వారిపై చేసిన ప్రపంచవ్యాప్త సర్వే చూపించింది” అని తల్లిదండ్రులకు మార్గనిర్దేశాలనిస్తూ ప్రచురించబడిన ఒక వార్తాలేఖ నివేదించింది. తర్వాత వారు చింతించేది తమ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి. తాము ప్రేమిస్తున్నవారిని పోగొట్టుకుంటామేమోనన్న భయం కూడా వాళ్ళు అతిగా చింతించడానికి ఒక పెద్ద కారణం.

ముఖ్యంగా “మంచి ర్యాంకులు సంపాదించుకోవాలన్న ఒత్తిడి” అమెరికాలోని చాలా మంది యౌవనస్థులకు చింత కలిగిస్తుందని అక్కడి విద్యా శాఖవారు చేసిన సర్వేలో కనుగొనబడింది. (మొదట్లో పేర్కొన్న) షేన్‌ భావించినట్లే చాలా మంది యౌవనస్థులు భావిస్తున్నారని ఆ సర్వే వెల్లడిచేసింది. అష్లీ అనే మరొక యౌవనస్థురాలు, “నాకు నా భవిష్యత్తు గురించి చాలా చింతగా ఉంది” అని అంటోంది.

అయితే ఇతర యౌవనస్థులు తమ సంరక్షణ గురించి చింతిస్తుంటారు. తమ స్కూలు రోజురోజుకూ దౌర్జన్యపూరితంగా మారుతున్నట్లు అమెరికాలోని దాదాపు 50 శాతం మంది యౌవనస్థులు భావించారనీ, తమకు తెలిసిన వ్యక్తలు తుపాకీతో కాల్చి చంపబడ్డారని కౌమారప్రాయంలో ఉన్న 80 లక్షలకన్నా ఎక్కువ మంది (37 శాతం మంది) నివేదించారనీ 1996లో జరిపిన సర్వే తెలిపింది!

అయితే, చింతలన్నీ అంత భయంకరమైనవేమీ కాదు. చాలా మంది యౌవనస్థులకున్న చింత తమ సాంఘిక జీవితాన్ని గురించే. తల్లిదండ్రుల కోసం ప్రచురించబడే ఒక ఇంటర్నెట్‌ పత్రిక, “కౌమారప్రాయంలోని పిల్లలు తమకు బాయ్‌ఫ్రెండ్స్‌ లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ లేరని వ్యాకులపడతారు, తమకు స్నేహితులే లేకుండా పోతారేమోనని ఎక్కువగా చింతిస్తుంటారు” అని అంటోంది. “ఫ్యాషనబుల్‌గా ఉండడమూ ప్రవర్తించడమూ ఎలా? నాకు కొంతమంది స్నేహితులు కావాలి” అని కౌమారప్రాయంలోని మేగన్‌ అనే ఒకమ్మాయి వాపోయింది. అదేవిధంగా, 15 ఏండ్ల క్రైస్తవుడైన నాటానాయెల్‌, “స్కూల్లోని పిల్లలు స్టయిలు గురించి చింతిస్తుంటారు. ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఇతరులకెలా కనబడుతున్నాం అన్నదే వాళ్ళకున్న చింత. వెర్రివాళ్ళలా కనిపిస్తామా అని భయపడతారు” అని అంటున్నాడు.

సమస్యలు​—జీవితంలో ఒక భాగం

చింతలు లేని జీవితం గడపగలిగితే చాలా బాగుంటుంది. కానీ, “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును” అని బైబిలు చెబుతోంది. (యోబు 14:1) కనుక సమస్యలు, వాటితోపాటు కలిగే చింతలు జీవితంలో భాగమే. కానీ మీ ఆలోచనా సరళిని శాసించడానికి మీరు మీ చింతలను వ్యాకులతలను అనుమతిస్తే, మీకు మీరు చాలా హాని కలిగించుకోగలరు. అందుకే, “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును” అని బైబిలు హెచ్చరిస్తోంది.​—సామెతలు 12:25.

అనవసర చింతలను నివారించుకునేందుకు ఒక మార్గం, మీ ప్రవర్తనను నియంత్రించుకోవడమే. “నా తోటి విద్యార్థుల్లో అనేకులు గర్భిణులము అవుతామేమో అనో లైంగికంగా సంక్రమించే వ్యాధులు వస్తాయేమో అనో భయపడుతుంటారు” అని పదహారేండ్ల ఆనా అంటోంది. కానీ మీరు బైబిలు ప్రమాణాలను అనుసరిస్తే అలాంటి భయాలు లేకుండా ఉండవచ్చు. (గలతీయులు 6:7) అంతమాత్రాన, మీ సమస్యలన్నింటినీ సులభంగా అర్థం చేసుకోవచ్చని గానీ, సులభంగా పరిష్కరించవచ్చని గానీ కాదు. మీరు అతిగా చింతించడాన్ని ఎలా మానుకోవచ్చు?

“జ్ఞానయుక్తంగా చింతించండి”

చింత తమను కృంగదీసేందుకు అనేకులు అనుమతిస్తారు. కానీ కౌమారప్రాయంలోని వారి కోసం ఒక పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్‌, చింతను నిర్మాణాత్మకమైన చర్యగా మలుస్తూ “జ్ఞానయుక్తంగా చింతించవచ్చు” అని కౌమారప్రాయంలోనివారికి సూచించింది. మీరు ఆవిధంగా చేసేందుకు సహాయపడే అనేక సూత్రాలు బైబిలులో ఉన్నాయి. “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు” అని చెబుతున్న సామెతలు 21:5 ని పరిగణనలోకి తీసుకోండి. ఉదాహరణకు, మీరు సంఘంలోని కొందరు స్నేహితులను పిలవాలని అనుకుంటున్నారు. మీరు మంచిగా ఆలోచించి చేస్తే ఎక్కువ చింత లేకుండా ఉండవచ్చు. ‘నిజానికి ఎవరెవర్ని పిలవాలి? వాళ్ళెప్పుడు రావాలని కోరుకుంటున్నాను? వాళ్ళెప్పుడు తిరిగి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను? రిఫ్రెష్‌మెంట్‌లకు నిజానికి ఎంత డబ్బు అవసరమవుతుంది? అందరూ ఆనందించగల వినోద కార్యక్రమాలు ఏమిటి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎన్ని విధాలుగా ఆలోచిస్తే, మీ పార్టీ అంత చక్కగా జరుగుతుంది.

అయితే, కార్యాలు క్లిష్టతరంగా మారడానికి అనుమతిస్తే, మీకు చింత మొదలవుతుంది. తన అతిథులకు ఆతిథ్యమివ్వడంలో అవసరమైనదానికన్నా ఎక్కువ శ్రమ తీసుకున్న ఒక స్త్రీకి యేసు క్రీస్తు, “నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే” అని సలహా ఇచ్చాడు. (లూకా 10:​41) ‘ఈ పార్టీ మంచిగా జరగడానికి ముఖ్యంగా కావలసిందేమిటి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. విషయాలను సరళంగా చేసుకొంటే వ్యాకులతను తగ్గించుకోవచ్చు.

మీకున్న మరొక చింత, పాఠశాలలో మీ సంరక్షణ గురించినదై ఉండవచ్చు. అక్కడున్న పరిస్థితిని మార్చడానికి మీరు చేయగలిగింది ఏమీ లేకపోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మీరు ఆచరణాత్మకమైన కొన్ని చర్యలు తీసుకోవచ్చు. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అని సామెతలు 22:3 చెబుతోంది. ప్రమాదకరమైన చోట్లకు అంటే ఎవరూ లేని చోట్లకు మాత్రమే కాక, క్రమశిక్షణలేని పిల్లలు సమకూడేటువంటి, ఎవరూ పర్యవేక్షించని చోట్లకు కూడా వెళ్ళకుండా ఉండడం ప్రమాదానికి గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.

హోమ్‌వర్క్‌ కూడా చింతలకు కారణం కావచ్చు. మీకు ప్రాముఖ్యమైన అనేక హోమ్‌వర్క్‌లుండవచ్చు. వాటన్నింటిని సమయానికి పూర్తి చేయలేనన్న చింత మీకుండవచ్చు. “మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచిం[చండి]” అని ఫిలిప్పీయులు 1:​9-11 చెబుతున్న సూత్రం సహాయకరమైనది. అవును, ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం నేర్చుకోండి! మీకున్న హోమ్‌వర్క్‌లలో అన్నింటికన్నా ముందు ముగించాల్సిందేమిటో నిర్ణయించుకుని, దానిని పూర్తిచేయండి. ఆ తర్వాత రెండవదాన్ని చేయండి. పరిస్థితి మీ అదుపులోనే ఉందన్న భావము నెమ్మదిగా మీకు కలుగుతుంది.

సలహా తీసుకోండి

ఏరన్‌, పిల్లవాడిగా ఉన్నప్పుడు ఫైనల్‌ పరీక్షలు వ్రాశాక, పాసవుతానా లేదా అని అతిగా చింతించడంతో ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. “నేను మా అమ్మానాన్నలకు చెప్పాను, వాళ్ళు నన్ను డాక్టర్‌ దగ్గరికి పంపారు. నా గుండెకు సమస్యేమీ లేదని ఆయన వెంటనే కనుగొన్నాడు. వ్యాకులత శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆయన వివరించాడు. నేను పరీక్షలకు సిద్ధపడడంలో చేయగలిగిందంతా చేశానని, ఇప్పుడు ఎక్కువగా నా ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్తపడాలని నేను గుర్తించేందుకు నా తల్లిదండ్రులు తర్వాత నాకు సహాయం చేశారు. నాకు వ్యాకులత తగ్గింది, దాంతో ఛాతి నొప్పి కూడా తగ్గిపోయింది. పరీక్షా ఫలితాలు కూడా బాగా వచ్చాయి” అని ఆయన గుర్తుచేసుకుంటున్నాడు.

మీరు వ్యాకులతతో కృంగిపోతున్నట్లయితే, మౌనంగా లోలోపల బాధపడుతూ ఉండకండి. సామెతలు 12:25 వ వచనంలోని రెండవ భాగం “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును” అని చెబుతోంది. మీరు మీ “విచారము” గురించి ఎవరితోనైనా మాట్లాడితేనే, ప్రోత్సాహకరమైన “దయగల మాట”ను వినగలుగుతారు!

మీరు మొదట, విషయాలను గురించి మీ తల్లిదండ్రులతో చర్చించాలని కోరుకోవచ్చు; వాళ్ళు మీకు మంచి సలహాలను ఇవ్వవచ్చు. మీ స్థానిక క్రైస్తవ సంఘంలోని ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవారు కూడా మీకు మద్దతునివ్వగలరు. పదిహేనేండ్ల జనెల్‌, “హైస్కూల్‌కి వెళ్ళాలంటే విచారంగా ఉండేది. మత్తుమందులు, అనైతిక లైంగికత, దౌర్జన్యం వంటి ప్రతిదాన్ని గురించి, నేను సంఘ పెద్దతో మాట్లాడే వరకు వాటి గురించి విచారంగా ఉండేది. ఆయన నాకు అనేక ఆచరణాత్మక సూచనలిచ్చాడు. నాకు వెంటనే ఎంతో ఉపశమనం కలిగింది, నేను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోను చక్కగా వ్యవహరించగలనని అనిపించింది” అని చెబుతోంది.

చేయాల్సిన పనులను వాయిదా వేయకండి

కొన్నిసార్లు మనం చేయవలసిన పనులు ఉంటాయి. అయితే మనకు అవి అంత ఆహ్లాదకరమైనవిగా అనిపించనందువల్ల వాయిదా వేస్తుంటాం. ఉదాహరణకు, పంతొమ్మిదేండ్ల షివోన్‌కి తన తోటి క్రైస్తవురాలితో ఏదో భేదభావం కలిగింది. తాను విషయాలను అరమరికలు లేకుండా మాట్లాడాల్సి ఉందని ఆమెకు తెలుసు. కానీ ఆమె ఆ పనిని అలా వాయిదా వేస్తూనే వచ్చింది. “నేనెంత ఎక్కువగా వాయిదావేస్తూ వచ్చానో, అది నన్నంతగా కలతపరచింది” అని ఆమె ఒప్పుకుంటోంది. అలాంటి సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని క్రైస్తవులకు బోధిస్తున్న మత్తయి 5:23, 24 లోని మాటలను ఆమె గుర్తుచేసుకుంది. “చివరికి నేనలా చేసినప్పుడు నాకెంతో ఉపశమనం కలిగింది” అని ఆమె గుర్తుచేసుకుంటోంది.

మీకు అంత ఇష్టంలేని పనిని లేదా ఇబ్బందిగా అనిపించే చర్చను వాయిదా వేస్తూ వస్తున్నారా? మీరు దానిని త్వరగా పరిష్కరించుకుంటే మీకు చింత కలిగించే ఒక విషయాన్ని తగ్గించుకున్నవారవుతారు.

తీవ్రమైన పరిస్థితులు

పరిస్థితులన్నింటినీ అంత సులభంగా పరిష్కరించుకోలేము. ఆబ్దూర్‌ అనే యువకుని విషయమే తీసుకోండి. ఆయన తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆయన, తన తల్లినీ, తన తమ్ముణ్ణీ చూసుకోవాలి. సహజంగానే, ఆబ్దూర్‌ తన తల్లి పరిస్థితిని గురించి చింతిస్తుంటాడు. “‘మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?’ అన్న యేసు మాటల్లో నాకొక సూచన కనిపిస్తుంది. అతిగా కృంగిపోయే బదులు, పరిస్థితిని గురించి ఆలోచించడానికి ప్రయత్నించి, ఏం చేస్తే మంచి ఫలితాలు కలగవచ్చన్నది నిర్ణయించుకుంటాను” అని ఆయన అంటున్నాడు.​—మత్తయి 6:27.

క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండడం సులభమేమీ కాదు. కొందరు ఎంత నిరాశకు గురవుతారంటే, తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటూ, భోజనం చేయడానికి కూడా నిరాకరిస్తారు. అయితే, ఒత్తిళ్ళతో వ్యవహరించడానికి కౌమారప్రాయంలో ఉన్న మీ పిల్లలకు సహాయపడడం (ఆంగ్లం) అనే పుస్తకం, మీకు ప్రాథమిక పోషణ కూడా జరగకపోతే “మీరు ఒత్తిళ్ళ వల్ల కలిగే దుష్ఫలితాలను తట్టుకోలేనంత బలహీనులౌతారు, మీరు తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం పెరుగుతుంది” అని చెబుతోంది. కాబట్టి మీ శారీరక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి. కావలసినంత విశ్రాంతి, ఆహారమూ తీసుకోండి.

“నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” అని బైబిలిస్తున్న సలహాను అనుసరించడం ద్వారా మీరు మరెక్కువ ఉపశమనాన్ని పొందగలరు. (కీర్తన 55:​22) ముందు పేర్కొన్న షేన్‌ తన భవిష్యత్తు గురించి చింతిస్తుండేవాడు. “నేను దేవుని వాక్యంపైనా, ఆయన సంకల్పంపైనా ఎక్కువ శ్రద్ధ కేంద్రీకరించడం మొదలుపెట్టాను” అని ఆయన గుర్తుచేసుకుంటున్నాడు. తన జీవితాన్ని దేవుణ్ణి సేవించేందుకు ఉపయోగిస్తే తన భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందని ఆయన త్వరలోనే గ్రహించాడు. (ప్రకటన 4:​10, 11) “నేను నా గురించి చింతించడం మానుకున్నాను. నాకిప్పుడు ఆలోచించడానికి ఇంకా ప్రాముఖ్యమైన విషయముంది” అని షేన్‌ అంటున్నాడు.

మీరు అతిగా చింతిస్తున్నట్లు మీరు కనుగొంటే, మీ సమస్యతో వ్యవహరించేందుకు నిర్మాణాత్మకమైన మార్గాల కోసం చూడండి. పరిణతిచెందినవారి సలహాను తీసుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా, యెహోవా “మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” గనుక మీ చింతలన్నింటినీ ఆయన దగ్గరకు తీసుకువెళ్ళండి. (1 పేతురు 5:7) ఆయన సహాయంతో, మీరు అతిగా చింతించడాన్ని మానుకోవచ్చు.(g01 9/22)

[13వ పేజీలోని చిత్రం]

మీ చింతలను గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి

[14వ పేజీలోని చిత్రం]

మీరు మీ సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే, అతిగా చింతించడాన్ని అంత త్వరగా మానుకుంటారు