కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు విరోధి ఎవరు?

క్రీస్తు విరోధి ఎవరు?

బైబిలు ఉద్దేశము

క్రీస్తు విరోధి ఎవరు?

“క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి.”​—1 యోహాను 2:18.

ఒక ప్రమాదకరమైన నేరస్థుడు మీ ప్రాంతం వైపుకి వస్తున్నాడని హెచ్చరికలు చేయబడితే మీరేం చేస్తారు? మీరు బహుశ, ఆయనెలా ఉంటాడో ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తాడో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు మీరు జాగ్రత్తగా కూడా ఉంటారు.

నేడు అలాంటి పరిస్థితే ఒకటి ఉంది. అపొస్తలుడైన యోహాను మాటల్లో మనకు ఈ హెచ్చరిక ఉంది: “యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; . . . క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.” (1 యోహాను 4:2-3) సర్వమానవాళి సంక్షేమానికి ముప్పు తెస్తున్న అలాంటి క్రీస్తు విరోధి, దేవుని శత్రువు మనుష్యుల మోసగాడు అయిన క్రీస్తు విరోధి నేడు ఉన్నాడా?

యోహాను తన రెండు పత్రికల్లో ‘క్రీస్తువిరోధి’ అన్న మాటను ఐదు సార్లు ఉపయోగించాడు. అది యేసుక్రీస్తును గురించి బైబిలు బోధించేదాన్ని వ్యతిరేకిస్తున్న, తమను తాము క్రీస్తు అని ప్రకటించుకునే లేదా క్రీస్తు ద్వారా పంపబడినవారమని చెప్పుకునే మోసగాళ్ళను కూడా సూచిస్తుంది. క్రీస్తు విరోధి గురించి బైబిలు నమ్మదగిన సమాచారాన్ని ఇస్తోంది. కానీ ఒక ఘోరాపరాధి విషయంలో కొన్నిసార్లు జరిగినట్లే, ఈ గూఢ వ్యక్తి గురించి వాస్తవాల కన్నా అవాస్తవాలు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి.

తప్పుడు గుర్తింపు

అపొస్తలుడైన యోహాను కాలం నుండి ఎంతో మంది వ్యక్తులు క్రీస్తు విరోధిని గురించిన యోహాను మాటలు ఫలాని వ్యక్తిని సూచిస్తాయని చెప్పారు. ప్రజలు అనేక వ్యక్తుల పేర్లు ప్రతిపాదించారు. రోమా చక్రవర్తి నీరో క్రీస్తు విరోధి అని శతాబ్దాల క్రితం చాలామంది తలంచారు. అటు తర్వాత, అడాల్ఫ్‌ హిట్లర్‌ వెళ్ళగ్రక్కిన విపరీతమైన ద్వేషం, పుట్టించిన భయోత్పాతం చాలామందిని ఆయనే క్రీస్తు విరోధి అని నమ్మించాయి. జర్మన్‌ తత్త్వజ్ఞానియైన ఫ్రీడ్‌రిక్‌ నీఛీకి కూడా ఆ మాట అన్వయించబడింది. అయితే, మరికొందరు ప్రజలు క్రీస్తు విరోధి ఇంకా రావాల్సివుందని, అతడు లోకాన్ని పరిపాలించాలన్న ఉద్దేశంగల తెలివైన, నిర్దయుడైన రాజకీయవాదిగా ప్రత్యక్షమౌతాడని నమ్ముతారు. వారు, యోహాను పేర్కొన్న క్రీస్తువిరోధి ప్రకటన 13వ అధ్యాయంలోని క్రూర మృగంతో సరిసమానమని నమ్ముతారు. ఒక విధంగా భవిష్య దుష్టత్వానికే మహరాజైన వాడిని ఈ 666 అనే దాని చిహ్నం గుర్తిస్తుందని వారు చెబుతారు.

ఈ తలంపులను పెంపొందించేవారు యోహాను ఒకే క్రీస్తు విరోధి గురించి చెప్పాడని ఊహిస్తున్నారు. కానీ ఆయన మాటలు ఏమి చెబుతున్నాయి? 1 యోహాను 2:18 చూడండి: “క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు.” అవును, మొదటి శతాబ్దంలోని ఆధ్యాత్మిక సమస్యాపూరిత పరిస్థితికి ఒక్కరు కాదు గానీ “అనేకులైన క్రీస్తు విరోధులు” బాధ్యులు. నేడు ఒక్కరు కాదు గానీ అనేకమంది క్రీస్తు విరోధులు, క్రీస్తు విరోధి తరగతిగా ఏర్పడుతున్నారు. సమష్ఠిగా వారు మానవజాతిపైకి ఆధ్యాత్మిక వినాశనాన్ని తీసుకువచ్చారు. (2 తిమోతి 3:1-5, 13) క్రీస్తు విరోధిలో ఎవరెవరు చేరివున్నారు?

ప్రకటన 13 అధ్యాయంలోని క్రూర మృగం అందులో చేరివుండే సాధ్యతను గురించి పరిశీలిద్దాం. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది.” (ఇటాలిక్కులు మావి.) (ప్రకటన 13:2) ఈ లక్షణాలు దేన్ని సూచిస్తున్నాయి?

ప్రకటన 13వ అధ్యాయానికీ దానియేలు 7వ అధ్యాయానికీ మధ్య ఉన్న ఒక సంబంధాన్ని బైబిలు పండితులు గమనించారు. అలంకారిక మృగాల దర్శనాన్ని దేవుడు దానియేలుకు ఇచ్చాడు, అందులో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి, ఒక సింహము ఉన్నాయి. (దానియేలు 7:2-6) దేవుని ప్రవక్త వాటికి ఏ అర్థాన్ని ఇచ్చాడు? ఆ క్రూర మృగాలు భూరాజులను, అంటే ప్రభుత్వాలను సూచిస్తున్నాయని ఆయన వ్రాశాడు. (దానియేలు 7:17) కాబట్టి ప్రకటనలోని క్రూర మృగం మానవ ప్రభుత్వాలను సూచిస్తుందని నిర్ధారించడం సహేతుకమే. ఈ ప్రభుత్వాలు దేవుని రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నందున అవి క్రీస్తు విరోధిలో భాగమే అవుతాయి.

క్రీస్తు విరోధిలో ఇంకా ఎవరు చేరి ఉన్నారు?

దేవుని కుమారుడైన క్రీస్తు భూమ్మీద సంచారం చేసినప్పుడు ఆయనకు అనేకమంది శత్రువులు ఉన్నారు. ఆయనిప్పుడు శారీరకంగా అందనంత దూరంలో ఉన్నా ఆయనకు ఆధునిక-దిన వ్యతిరేకులు ఉన్నారు. వారిలో ఎవరెవరు చేరివున్నారో చూడండి.

అపొస్తలుడైన యోహాను ఇలా పేర్కొన్నాడు: “యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.” (1 యోహాను 2:22) మతభ్రష్టులు, అబద్ధారాధనా నాయకులు సరళమైన యేసు బోధలను వక్రీకరించి మోసంతో కూడిన మతపరమైన చిక్కుముడులుగా తయారుచేస్తుంటారు. అలాంటివారు బైబిలు సత్యాన్ని తిరస్కరించి దేవుని పేరిట క్రీస్తు పేరిట అబద్ధాలను ప్రచారం చేస్తుంటారు. వారు తమ త్రిత్వ సిద్ధాంతం ద్వారా తండ్రి, కుమారుల మధ్యనున్న నిజమైన సంబంధాన్ని నిరాకరిస్తారు. కాబట్టి వారు కూడా క్రీస్తు విరోధిలో భాగమే.

లూకా 21:12 లో యేసు తన శిష్యులను ముందే ఇలా హెచ్చరించాడు: “వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును . . . సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.” మొదటి శతాబ్దం మొదలుకొని నిజ క్రైస్తవులు ఘోరమైన హింసలను సహించారు. (2 తిమోతి 3:12) అలాంటి హింసలను రేకెత్తించేవారు క్రీస్తుకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. వారు కూడా క్రీస్తు విరోధిలో భాగమే.

“నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.” (లూకా 11:23) ఇక్కడ క్రీస్తు, తననూ తాను మద్దతిచ్చే దైవిక సంకల్పాలనూ వ్యతిరేకించేవారందరు క్రీస్తు విరోధి వర్గంలోకి వస్తారని ప్రకటిస్తున్నాడు. వీరికి ఎలాంటి అంతం వస్తుంది?

క్రీస్తు విరోధులకు ఏమి జరుగనైయుంది?

‘అబద్ధమాడువారిని దేవుడు నశింపజేస్తాడు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు’ అని అంటోంది కీర్తన 5:6. ఇది క్రీస్తు విరోధులకు వర్తిస్తుందా? అవును, వర్తిస్తుంది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు.” (2 యోహాను 7, 8) క్రీస్తు విరోధుల అబద్ధాల కారణంగా వారి వంచనల కారణంగా సర్వశక్తుడైన దేవుడు వారికి నాశనాన్ని తీసుకువస్తాడు.

ఆ శిక్షను అమలు చేసే సమయం దగ్గరపడుతుండగా, నిజ క్రైస్తవులు క్రైస్తవ విరోధ వంచనా వత్తిడిలు, ప్రత్యేకంగా మతభ్రష్టుల వైపు నుండి వచ్చేవి, తమ విశ్వాసాన్ని బలహీనం చేయడానికి అనుమతించకూడదు. యోహాను ఇచ్చిన ఈ హెచ్చరిక చాలా అత్యవసరమైనది: “మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.”​—2 యోహాను 8.(g01 8/8)

[20వ పేజీలోని చిత్రసౌజన్యం]

20వ పేజీలోని నీరో: Courtesy of the Visitors of the Ashmolean Museum, Oxford