కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గుటెన్‌బర్గ్‌—ఆయన లోకాన్ని ఎంతగా సుసంపన్నం చేశాడు!

గుటెన్‌బర్గ్‌—ఆయన లోకాన్ని ఎంతగా సుసంపన్నం చేశాడు!

గుటెన్‌బర్గ్‌—ఆయన లోకాన్ని ఎంతగా సుసంపన్నం చేశాడు!

జర్మనీలోని తేజరిల్లు! విలేఖరి

గత వెయ్యి సంవత్సరాల్లోని ఏ ఆవిష్కరణ మీ జీవితంలో అత్యధిక ప్రభావాన్ని చూపించింది? టెలిఫోనా, టీవీయా, లేదా వాహనాలా? ఇవేవీ కాకపోవచ్చు. అనేకమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతటి ప్రభావాన్ని చూపించినది ముద్రణా యంత్రం. మొట్టమొదటి ఆచరణీయమైన పద్ధతిని కనుగొన్న వ్యక్తి యోహాన్నెస్‌ గెన్స్‌ఫ్లయిష్‌ ట్సూర్‌ లేడెన్‌ అని పేర్కొంటారు, ఆయన ఎక్కువగా యోహాన్నెస్‌ గుటెన్‌బర్గ్‌ అని పిలువబడతాడు. ఆయన ఉన్నత వంశీయుల కుటుంబం నుండి వచ్చాడు, అందుకనే వృత్తివిద్యార్థిగా పనిచేయాల్సిన అవసరం లేకపోయింది.

గుటెన్‌బర్గ్‌ సృష్టి “నాగరికతకు జర్మనీ ఇచ్చిన గొప్ప బహుమానం” అని వర్ణించబడింది. ఆయన ముద్రించిన 42-లైన్ల గుటెన్‌బర్గ్‌ బైబిలు అనే కళాఖండం యొక్క ప్రతి కాపీ గొప్ప ఖజానాయే.

గోల్డెన్‌ మైన్ట్స్‌

గుటెన్‌బర్గ్‌ 1397వ సంవత్సరం దరిదాపుల్లో మైన్ట్స్‌లో జన్మించాడు. రైన్‌ నదీతీరంలో ఉన్న ఈ మైన్ట్స్‌ పట్టణంలో అప్పట్లో 6,000 జనాభా ఉండేది. శక్తివంతమైన పట్టణాల సమితికి కేంద్రంగా ఉండడంతో అది గోల్డెన్‌ మైన్ట్స్‌ అని కూడా పిలువబడింది. మైన్ట్స్‌లోని ఆర్చిబిషప్పులు పవిత్ర రోమా సామ్రాజ్యంలో ఓటువేసే హక్కుగలవారిగా ఉన్నారు. మైన్ట్స్‌ కంసాలులకు ఖ్యాతి గాంచిన పట్టణం. యోహాన్నెస్‌ యౌవనస్థుడిగా ఉన్నప్పుడు లోహపు పనుల గురించి చాలా నేర్చుకున్నాడు, చివరికి లోహంలో అక్షరాలను ఎంబాసింగ్‌ చేయడం కూడా నేర్చుకున్నాడు. రాజకీయ గొడవల మూలంగా ఆయన కొన్ని సంవత్సరాలపాటు స్ట్రాస్‌బర్గ్‌కు వెళ్ళిపోయాడు, అక్కడాయన రత్నాలకోత పని చేస్తూ ఆ వృత్తిని ఇతరులకు నేర్పించాడు కూడా. కానీ ఆయన్ను ఎక్కువగా పనిరద్దీలో ఉంచినది, ఒక క్రొత్త ఆవిష్కరణ సంబంధంగా తాను రహస్యంగా చేస్తున్న పనే. యాంత్రీకరించబడిన ముద్రణా కళను పరిపూర్ణంగా సాధన చేయడానికి గుటెన్‌బర్గ్‌ ప్రయత్నిస్తున్నాడు.

గుటెన్‌బర్గ్‌ మేధాశక్తి, ఫుస్ట్‌ ఆర్థిక పుష్టి

గుటెన్‌బర్గ్‌ మైన్ట్స్‌కి తిరిగివచ్చి తన ప్రయోగాలను కొనసాగించాడు. ఆర్థిక వనరుల కోసం ఆయన యోహాన్‌ ఫుస్ట్‌ను ఆశ్రయించాడు, ఫుస్ట్‌ ఆయనకు 1,600 గుల్డెన్‌లు అప్పిచ్చాడు, ప్రజ్ఞావంతుడైన ఒక వృత్తిపనివాడు సాలీనా 30 గుల్డెన్‌లు మాత్రమే సంపాదించే ఆ కాలంలో అది పెద్ద రొక్కమే. ఫుస్ట్‌ సూక్ష్మబుద్ధిగల వ్యాపారి, ఆయనకు ఈ సాహస వ్యాపారంలో లాభం ఉంటుందని గ్రహించాడు. గుటెన్‌బర్గ్‌ మనస్సులో ఎలాంటి సాహస వ్యాపారం ఉంది?

కొన్ని వస్తువులు పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయబడడం, వాటిలో ప్రతీదీ ఒకే రూపంలో ఉండడం గుటెన్‌బర్గ్‌ నిశిత దృష్టిని ఆకర్షించింది. నాణేలను ముద్రించడం, బుల్లెట్లను లోహంతో పోత పోయడం వంటివి రెండు ఉదాహరణలు. కాబట్టి ఒకేలా ఉన్న వందలాది లిఖిత పేజీలను ముద్రించి, ఆ పేజీలను ఒకేలా కన్పిస్తున్న పుస్తకాలుగా నంబర్లవారీగా ఎందుకు సమకూర్చకూడదు? కానీ ఏ పుస్తకాలు? ఆయన బైబిలు గురించి ఆలోచించాడు, అదెంత ఖరీదైనదంటే అప్పట్లో చాలా కొద్దిమంది బాబుల దగ్గరే వ్యక్తిగత కాపీలు ఉండేవి. గుటెన్‌బర్గ్‌ ఒకేలా కనిపిస్తున్న బైబిళ్ళను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అలా, చేతితో నకలు చేయబడిన వాటికన్నా ఎంతో చౌకగా వాటి అందాన్నేమీ పాడుచేయకుండానే తయారు చేయాలనుకున్నాడు. ఇదెలా జరుగుతుంది?

అనేక పుస్తకాలను చేత్తో నకలు వ్రాసేవారు, ఇందుకు ఎంతో శ్రద్ధ, సమయమూ అవసరమయ్యేది. చెక్క ముక్కలపై చేత్తో చెక్కి వాటిని ముద్రణకు ఉపయోగించడానికి ప్రయత్నాలు జరిగాయి, ఒక్కో ముక్కపై ఒక్కో పేజీ లిఖిత సమాచారం ఉండేది. బీ షెంగ్‌ అనే చైనీయుడు ముద్రణలో ఉపయోగించడానికిగాను బంక మట్టితో అక్షరాలను విడివిడిగా తయారుచేశాడు. కొరియాలో రాగితో తయారు చేయబడిన అక్షరాలను ఒక ప్రభుత్వ ముద్రణా సంస్థలో ఉపయోగించారు. కానీ మూవబుల్‌ టైప్‌తో, అంటే ప్రతి క్రొత్త పేజీలో మళ్ళీ పేర్చగల అక్షరాలతో ముద్రించడానికి పెద్ద సంఖ్యలో అక్షరాలు కావాల్సివచ్చింది, వాటిని ఉత్పత్తి చేసే పద్ధతిని ఎవరూ అభివృద్ధి చేయలేదు. దాన్ని గుటెన్‌బర్గ్‌ మాత్రమే సాధించగలిగాడు.

లోహకార వృత్తిలో అనుభవజ్ఞుడైన వ్యక్తిగా ఆయన, మూవబుల్‌ లెటర్లను బంకమన్నుతోనో లేదా చెక్కతోనో కాక లోహంతో తయారుచేసినట్లైతే ముద్రణ శ్రేష్ఠంగా ఉంటుందని గ్రహించాడు. వాటిని చెక్కడమో లేదా బట్టీలో కాల్చడమో కాక ఒక మూసలో పోత పోయాల్సివుంటుంది. గుటెన్‌బర్గ్‌ తన భాషలోని 26 అక్షరాలను, పెద్దక్షరాల్లోను చిన్నక్షరాల్లోను, అలాగే రెండక్షరాలు కలిసివున్నవి, విరామచిహ్నాలు, మరితర చిహ్నాలు, సంఖ్యలు, వీటన్నింటినీ పోత పోయడానికి మూసలు కావాల్సివచ్చాయి. మొత్తంగా చూస్తే తనకు 290 వేర్వేరు అక్షరాలు కావాలని, ఒక్కొక్కటి డజన్లకొద్దీ సంఖ్యలో కావాలని లెక్కించాడు.

పనిలో పడడం

లాటిన్‌లోని గాతిక్‌ లిపిని తన గ్రంథంలో ఉపయోగించబోయే శైలిగా ఎంపిక చేసుకున్నాడు, సన్యాసులు ఆ శైలిని బైబిలును నకలు వ్రాయడానికి ఉపయోగించేవారు. లోహకార వృత్తిలో తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ఆయన, ప్రతి అక్షరం, ప్రతి చిహ్నం యొక్క ప్రతిబింబపు రూపాన్ని చిన్న చిన్న స్టీలు ముక్కలపై ఉబ్బెత్తుగా ఎంబాసింగ్‌ చేశాడు, అంటే స్టీలు ఉపరితలంపైన వాటి ప్రతిబింబాన్ని ఎత్తుగా చెక్కాడు. (1వ చిత్రం) ఈ స్టీలు స్టాంపుతో ఆ ప్రతిబింబాన్ని స్టీలు కన్నా తక్కువ గట్టిదనం ఉన్న మరో లోహపు ముక్కపై, రాగి లేదా ఇత్తడి ముక్కలపై పంచ్‌ చేశాడు. అలా ఆయా అక్షరాల అసలైన రూపం ఆ తక్కువ గట్టిదనంగల లోహంలోకి దిగింది, దీన్ని మ్యాట్రిక్స్‌ అంటారు.

ఆ తర్వాతి దశలో పోతపోసే మూస రంగప్రవేశం చేస్తుంది, ఇది గుటెన్‌బర్గ్‌ మేధాశక్తి ఫలితమే. ఈ మూస పిడికిలి పరిమాణంలో ఉంటుంది, పైనా క్రిందా బోలుగా ఉంటుంది. ఒక అక్షరం యొక్క మ్యాట్రిక్స్‌ మూస క్రింది భాగంలో జొప్పించబడుతుంది, కరగబెట్టిన లోహమిశ్రణం పైనుండి పోయబడుతుంది. (2వ చిత్రం) తగరం, సీసం, యాంటిమనీ, బిస్మత్‌లతో కూడిన లోహమిశ్రణం చల్లబడి వెంటనే గట్టిబడుతుంది.

మూస నుండి తీయబడిన లోహమిశ్రణానికి ఒక చివర ఉబ్బెత్తుగా ఉన్న అక్షరం యొక్క ప్రతిబింబం ఉంటుంది, దీన్ని టైప్‌ అని పిలిచారు. ఈ ప్రక్రియను ఆ అక్షరం యొక్క సరిపడినన్ని ముక్కలు ఉత్పత్తి అయ్యేంత వరకు కొనసాగించేవారు. తర్వాత మ్యాట్రిక్స్‌ను మూస నుండి తీసేసి, దాని స్థానంలో తర్వాతి అక్షరం యొక్క మ్యాట్రిక్స్‌ను ఉంచుతారు. అలా ఒక్కొ అక్షరం, ఒక్కో చిహ్నం యొక్క టైపు ముక్కలను చాలా తక్కువ వ్యవధిలో ఎన్ని కావాలంటే అన్ని ఉత్పత్తిచేయవచ్చు. టైప్‌లన్నింటి ఎత్తు ఒకేలా ఉంది, గుటెన్‌బర్గ్‌కి కావాల్సింది సరిగ్గా అదే.

ఇప్పుడిక ముద్రణ ప్రారంభించవచ్చు. గుటెన్‌బర్గ్‌ తాను కాపీ చేయాలనుకున్న బైబిలు భాగాన్ని ఎంపిక చేసుకున్నాడు. సెట్టింగ్‌ స్టిక్‌ను చేతిలో ఉంచుకుని పదాల్లోని అక్షరక్రమం ప్రకారం టైపులను పేరుస్తూ, పదాలను లైన్లుగా కూర్చాడు. (3వ చిత్రం) ప్రతి లైను జస్టిఫై అయివుండేది, అంటే పొడవు ఒకేలా ఉండేది. ఒక గ్యాలీని ఉపయోగిస్తూ ఆయన ఒక కాలమ్‌కి లైన్లను, ఒక పేజీకి రెండు కాలమ్‌లను కూర్చాడు. (4వ చిత్రం)

ఈ పాఠం ఉన్న పేజీ ముద్రణా యంత్రంపైనున్న ఫ్లాట్‌ బెడ్‌పై దాని స్థానంలోకి ఇమడ్చబడింది, తర్వాత దానికి నల్ల ఇంకును పామడం జరిగింది. (5వ పేజీ) వైన్‌ తయారీలో ఉపయోగించేలాంటి ప్రెస్‌నే ఉపయోగిస్తూ టైప్‌ల మీదనున్న ఇంకును కాగితం మీదికి బదలాయిస్తుంది. ఫలితమే ముద్రిత పేజీ. కావాల్సినన్ని ప్రతులు తయారయ్యేంత వరకు ఈ ప్రక్రియను కొనసాగిస్తూ మరింత ఇంకును మరిన్ని కాగితాలను ఉపయోగించడం జరిగింది. టైపులను కదల్చడానికి వీలయ్యేది గనుక వాటినే మరో కాగితాన్ని కూర్చడానికి ఉపయోగించడం సాధ్యమౌతుంది.

ముద్రణా కళాఖండం

15 నుండి 20 మంది పనివాళ్ళున్న గుటెన్‌బర్గ్‌ వర్క్‌షాపు మొట్టమొదటి ముద్రిత బైబిలును 1455లో పూర్తిచేసింది. దాదాపు 180 కాపీలు తయారుచేయబడ్డాయి. ఒక్కొక్క బైబిలులో 1,282 పేజీలు, ఒక్కో పేజీకి 42 లైన్లతో రెండు కాలమ్‌లు ఉన్నాయి. ఒక్కో బైబిలు రెండు వాల్యూములుగా ఉన్న ఈ గ్రంథాల బైండింగ్‌ పని, అలాగే అలంకరణగా హెడ్డింగులనూ ప్రతి అధ్యాయం మొదటి అక్షరాన్నీ చేతితో పెయింటు చేయడం గుటెన్‌బర్గ్‌ వర్క్‌షాపు బయట ఆ తర్వాత చేశారు.

బైబిలును ముద్రించడానికి ఎన్ని టైపుల ముక్కలు కావాల్సివచ్చిందో మీరు ఊహించగలరా? ఒక్కో పేజీలో 2,600 అక్షరాలున్నాయి. గుటెన్‌బర్గ్‌ దగ్గర ఆరుగురు టైప్‌సెట్టర్లు ఉన్నారని ఉజ్జాయింపుగా తీసుకుంటే, వారిలో ఒక్కొక్కరు మూడు పేజీల చొప్పున కూర్చారనుకుంటే, వారికి 46,000 టైప్‌లు కావాల్సివుంటుంది. మూవబుల్‌ టైప్‌లతో ముద్రించే పనికి గుటెన్‌బర్గ్‌ తయారు చేసిన పోతపోసే మూస నిర్ణాయకమైనదని అర్థం చేసుకోవడం అంత కష్టంకాదు.

ప్రజలు బైబిళ్ళను పోల్చిచూసినప్పుడు ఆశ్చర్యపోయారు: ప్రతి పదము అదే స్థానంలో ఉంది. చేత్తో వ్రాసిన వ్రాతప్రతుల్లో అది సాధించడం అసాధ్యం. 42-లైన్‌ల బైబిల్లో “ఎంత ఏకరూపత, ఎంత పొందిక, ఎంత అనుగుణ్యత, ఎంత రమణీయత ఉందంటే ప్రతి శతాబ్దంలోని ముద్రాపకులూ ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందారు” అని గుంటర్‌ ఎస్‌. వేగనర్‌ వ్రాస్తున్నాడు.

ఆర్థిక వినాశనం

అయితే ఫుస్ట్‌ ఏదో కళాఖండాన్ని రూపొందించడం కన్నా డబ్బు సంపాదించడంలో ఎక్కువ ఆసక్తిని కలిగివున్నాడు. తాను పెట్టిన పెట్టుబడికి లాభాలు రావడానికి తాను ఊహించిన దానికన్నా ఎక్కువ సమయం పడుతోంది. భాగస్వాములు విడిపోయారు, 1455లో సరిగ్గా బైబిళ్ళు పూర్తి అవుతూ ఉండగా ఫుస్ట్‌ పెట్టుబడిని పెట్టడం ఆపేశాడు. గుటెన్‌బర్గ్‌ తాను తీసుకున్న డబ్బును తీర్చలేకపోయాడు, చివరికి ఆ తర్వాత కోర్టు కేసులో కూడా ఓడిపోయాడు. ఆయన తన ముద్రణా పరికరాల్లోను బైబిళ్ళ టైపులలోను కనీసం కొన్నింటినైనా బలవంతంగా ఫుస్ట్‌ వశం చేయాల్సివచ్చింది. గుటెన్‌బర్గ్‌ దగ్గర పనిచేసిన పీటర్‌ షోఫర్‌ అనే నిపుణుడిని ఫుస్ట్‌ కొలువుకి పెట్టుకుని తన స్వంత ముద్రణాలయాన్ని తెరిచాడు. గుటెన్‌బర్గ్‌ సంపాదించిన మంచి పేరు, ఫుస్ట్‌ అండ్‌ షోఫర్‌ అనే వారి కంపెనీకి లాభించింది, అది ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్యపరంగా విజయవంతమైన ముద్రణాలయంగా మారింది.

గుటెన్‌బర్గ్‌ మరో ముద్రణాలయాన్ని స్థాపించి తన పనిని కొనసాగించడానికి ప్రయత్నించాడు. 15వ శతాబ్దానికి చెందిన కొన్ని ముద్రిత పుస్తకాలు ఆయన ముద్రించినవేనని కొందరు పండితులు అంటారు. కానీ 42-లైన్ల బైబిలు సంపాదించిన గొప్పదనాన్ని వైభవాన్ని ఏదీ సాధించలేకపోయింది. 1462లో మరో ఘోరం జరిగిపోయింది. క్యాథలిక్‌ మతాచార్యుల మధ్య జరిగిన శక్తి ప్రదర్శనా సంఘర్షణల ఫలితంగా మైన్ట్స్‌ పట్టణం దగ్ధమైంది, అది దోపిడీకి గురైంది. గుటెన్‌బర్గ్‌ తన వర్క్‌షాపును రెండోసారి కోల్పోయాడు. అటు తర్వాత ఆరు సంవత్సరాలకు ఆయన 1468 ఫిబ్రవరిలో మరణించాడు.

గుటెన్‌బర్గ్‌ వారసత్వం

గుటెన్‌బర్గ్‌ ఆవిష్కరణ చాలా త్వరితంగా వ్యాపించింది. 1500వ సంవత్సరానికల్లా జర్మనీలోని 60 పట్టణాల్లోను యూరప్‌లోని మరితర 12 దేశాల్లోను ముద్రణా యంత్రాలు వెలిశాయి. “ముద్రణా అభివృద్ధి సమాచార వినిమయ విప్లవానికి దోహదపడింది” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వ్యాఖ్యానిస్తోంది. “ఆ తర్వాతి 500 సంవత్సరాల్లో ముద్రణా యంత్రాల్లో గొప్ప గొప్ప మెరుగులు దిద్దబడ్డాయి, కానీ ప్రాథమిక ప్రక్రియ మాత్రం దాదాపు అలానే ఉండిపోయింది.”

ముద్రణ యూరోపియన్ల జీవితాల్ని మార్చేసింది, ఇక పరిజ్ఞానం కేవలం ఘనతవహించిన ఏదో కొద్దిమంది సొత్తు మాత్రమే కాదు మరి. వార్తలు సమాచారము సగటు మానవుడిని చేరసాగాయి, తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆయనకు మరింత స్పష్టంగా అర్థంకానారంభించింది. ముద్రణ మూలంగా ప్రతి జాతీయ భాషకూ అందరూ అర్థం చేసుకునే విధమైన ఒక ప్రామాణిక లిఖిత రూపాన్ని ఇవ్వాల్సి వచ్చింది. అందుకని, ఇంగ్లీషు ఫ్రెంచి, జర్మన్‌ భాషలను ప్రామాణీకరించి వాటిని కాపాడడమైంది. చదివే సమాచారం కోసం డిమాండు విపరీతంగా పెరిగిపోయింది. గుటెన్‌బర్గ్‌ కాలానికి ముందు యూరప్‌లో కేవలం కొన్ని వేల వ్రాతప్రతులు ఉండేవి; ఆయన చనిపోయిన 50 సంవత్సరాలకు పుస్తకాల సంఖ్య లక్షలు దాటింది.

ముద్రణా యంత్రాలు లేకపోయి ఉండుంటే 16వ శతాబ్దపు సంస్కరణోద్యమం ఆవిర్భావంలోనే కుంటుపడి ఉండేది. బైబిలు ఆంగ్లం, ఇటాలియన్‌, జర్మన్‌, జెక్‌, డచ్‌, పోలిష్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌ భాషల్లోకి అనువదించబడింది, వేలాది కాపీలను ప్రచురించే పని ముద్రణా యంత్రాల మూలంగా సులభతరమైంది. మార్టిన్‌ లూథర్‌ తన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ముద్రణాలయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. గుటెన్‌బర్గ్‌ ముద్రణా యంత్రానికి ముందున్నవారు విఫలమైతే, ఈయన తన ప్రయత్నాల్లో సఫలీకృతుడయ్యాడు. “నిజమైన మతాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి” ముద్రణా యంత్రం అనేది దేవుని మాధ్యమం అని లూథర్‌ అనడంలో ఆశ్చర్యం లేదు!

మిగిలివున్న గుటెన్‌బర్గ్‌ బైబిలు కాపీలు

గుటెన్‌బర్గ్‌ బైబిళ్ళలో ఎన్ని కాపీలు మిగిలివున్నాయి? ఇటీవలి వరకు యూరప్‌లోను ఉత్తర అమెరికాలోను చెదిరివున్న వీటి సంఖ్య 48 అనుకున్నారు​—⁠వీటిలో కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి. వాషింగ్టన్‌ డీ.సీ.లో లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌లో ఉన్న చర్మపు పత్రాలుగల బైబిలు అతి సుందరమైన కాపీల్లో ఒకటి. తర్వాత 1996లో సంచలనాన్ని సృష్టించిన కొంత భాగాన్ని కనుగొన్నారు: జర్మనీలోని రెంట్స్‌బుర్క్‌లో ఉన్న ఒక చర్చి ఆర్కైవ్‌లలో గుటెన్‌బర్గ్‌ బైబిలు యొక్క కొంత భాగాన్ని కనుగొన్నారు.​—⁠తేజరిల్లు! ఫిబ్రవరి 8, 1998, 29వ పేజీ చూడండి.

నేడు బైబిలు ఎవరికైనా కొనుగోలు చేసే ధరలో అందుబాటులో ఉన్నందుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి! అంటే దీనర్థం మనం మార్కెట్టుకి వెళ్ళి 42-లైన్ల గుటెన్‌బర్గ్‌ బైబిలును కొనుక్కోవచ్చని కాదు! అది ఎంత ఖరీదు ఉంటుంది? 1978లో మైన్ట్స్‌లోని గుటెన్‌బర్గ్‌ మ్యూజియం ఒక కాపీని 3.7 మిలియన్‌ డ్యూష్‌ మార్కులకు కొన్నది (నేటి 2 మిలియన్‌ డాలర్లతో సమానం). ఈ బైబిలు ఇప్పుడు దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఖరీదు చేస్తుంది.

గుటెన్‌బర్గ్‌ బైబిలు ఎందుకు అంత విశిష్టమైనది? గుటెన్‌బర్గ్‌ మ్యూజియం మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ హెల్మూట్‌ ప్రెస్సర్‌ మూడు కారణాలను పేర్కొంటున్నాడు. మొట్టమొదటిగా, గుటెన్‌బర్గ్‌ బైబిలు పాశ్చాత్య దేశాల్లో మూవబుల్‌ టైప్‌లతో ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం. రెండవదిగా, అది మొట్టమొదటి ముద్రిత బైబిలు. మూడవదిగా, అది విస్మయంగొలిపే సౌందర్యం గలది. గుటెన్‌బర్గ్‌ బైబిల్లో “గాతిక్‌ వ్రాత అత్యుచ్ఛస్థాయిలో ఉండడాన్ని” మనం చూస్తామని ప్రొఫెసర్‌ ప్రెస్సర్‌ వ్రాస్తున్నాడు.

గుటెన్‌బర్గ్‌ మేధాశక్తికి ప్రతి సంస్కృతిలోని ప్రజలూ ఋణపడివున్నారు. పోతపోసే మూసను, లోహమిశ్రణాన్ని, ఇంకును, ముద్రణా యంత్రాన్ని ఒక్కచోటికి చేర్చాడాయన. ఆయన ముద్రణను యాంత్రీకరించాడు, లోకాన్ని సుసంపన్నం చేశాడు.(g98 11/8)

[16, 17వ పేజీలోని చిత్రాలు]

1. అక్షరం ప్రతిబింబాన్ని రాగి మ్యాట్రిక్స్‌లోకి పంచ్‌ చేయడానికి ఒక స్టీలు స్టాంపు ఉపయోగించబడింది

2. కరగబెట్టిన లోహమిశ్రణం పోతపోసే మూసలోకి వేయబడింది. లోహమిశ్రణం గట్టిబడిన తర్వాత, టైపును వెలికి తీస్తే అక్షరం యొక్క ప్రతిబింబ రూపం దానికి వచ్చింది

3. పదాల్లోని అక్షరక్రమం ప్రకారం టైపులు ఒక సెట్టింగ్‌ స్టిక్‌లో పేర్చి లైన్లుగా అమర్చబడ్డాయి

4. లైన్లు గ్యాలీలో కాలమ్‌లుగా కూర్చబడ్డాయి

5. పాఠం ఉన్న పేజీ ముద్రణా యంత్రంపైనున్న ఫ్లాట్‌ బెడ్‌పై ఇమడ్చబడేది

6. 1584వ సంవత్సరంలో రాగిరేకుపై చెక్కబడిన గుటెన్‌బర్గ్‌ చిత్రం

7. నేడు, గుటెన్‌బర్గ్‌ బైబిలు యొక్క ఒక్క ప్రతి లక్షల డాలర్లు పలుకుతుంది

[చిత్రసౌజన్యం]

1-4, 6, 7 చిత్రాలు: Gutenberg-​ Museum Mainz; 5వ చిత్రం: Courtesy American Bible Society