దేవుని నామము నా జీవితాన్నే మార్చేసింది!
దేవుని నామము నా జీవితాన్నే మార్చేసింది!
సాండీ యాసీ జోసీ చెప్పినది
మోర్మోన్‌లు వచ్చి మా తలుపు తట్టినప్పుడు నేనూ నా చెల్లెళ్ళూ, పడక కింద దాక్కునే ప్రయత్నంలో, ఒకళ్ళనొకళ్ళం గుద్దుకుని నవ్వుతున్నాం. * చివరికి నేను తలుపు తెరిచి వాళ్ళకు జవాబుగా, మేము సాంప్రదాయిక నవహోలము, తెల్లవాళ్ళ మతం గురించి మీరు మాతో మాట్లాడడం ఇష్టంలేదు అని కాస్త పరుషంగా చెప్పాను.
మా తల్లిదండ్రులు సరుకులు కొనుక్కురావడానికి సంతకు వెళ్లారు. సంధ్యా సమయానికిగానీ వాళ్ళు తిరిగిరారు. నేను మోర్మోన్‌లతో దురుసుగా ప్రవర్తించానని తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకు తెలిసింది. ఎవరితోను అలా అగౌరవంగా ప్రవర్తించవద్దని వాళ్ళు నన్ను గట్టిగా మందలించారు. ఇతరులతో గౌరవపూర్వకంగా, దయాపూర్వకంగా ప్రవర్తించాలని మాకు బోధించారు. ఒక రోజు ఎదురు చూడని ఒక అతిథి మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. మా తల్లిదండ్రులు ఇంటి బయట వంట చేశారు. వాళ్ళు అతిథ్యమివ్వాలన్న అభిలాషతో, ఆయనను భోజనానికి పిలిచారు. ఆ తర్వాతే మేము భోజనం చేశాం.
రిజర్వేషన్‌లో మా జీవితం
ఇరుకుగా ఉండే నగరాలకు, పట్టణాలకు ఎంతో దూరంలో ఉన్న హోపీ ఇండియన్ రిజర్వేషన్‌కి వాయవ్యాన పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న అరిజోనాలోని హౌవెల్ మేసాలో మేము నివసించేవాళ్ళం. అది ఆగ్నేయ అమెరికాలో ఉంటుంది. అక్కడి ఎడారి ఎంతో మనోహరంగా ఉంటుంది, అసాధారణమైన ఎర్రని ఇసుకరాళ్ళ దిబ్బలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అక్కడ, అనేక మేసాలు కనిపిస్తాయి. మేసాలు అంటే కొనదేలిన పీఠభూములుగల ఎత్తైన ప్రాంతాలు. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మేసే గొఱ్ఱెలను కూడా అక్కడి నుండి చూడవచ్చు. మా స్వదేశంలోని ప్రశాంతమైన ఎత్తైన ఆ ప్రాంతాన్ని నేనెంతో ఇష్టపడేదాన్ని!
నేను హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు, నా కజిన్‌లకు ఎంతో దగ్గరయ్యాను. వాళ్ళు అమెరికన్ ఇండియన్ మూవ్‌మెంట్ (ఎఐఎమ్)కి మద్దతునిచ్చేవారు. * నేను అమెరికన్ ఇండియన్ అయినందుకు ఎంతో గర్వించేదాన్ని. అనేక దశాబ్దాల క్రూరమైన అణచివేతను గురించి నాకున్న అభిప్రాయాలను తెల్లవాళ్ళతో నిర్మొహమాటంగా చెప్పేదాన్ని. ఆ అణచివేతకు కారణం బ్యూరో ఆఫ్ ఇండియన్ అఫైర్స్ (బిఐఎ) అని అనుకునేదాన్ని. మా కజిన్‌లలా నేను నాలోని ద్వేషాన్ని బయటికి కక్కలేదు. నేను మనస్సులోనే పెట్టుకున్నాను. అది, ఎవరి దగ్గర బైబిలుంటే వారిని నేను ద్వేషించేలా చేసింది.
బైబిలు మూలంగానే, మా భూములను హక్కులను, మా మత సంబంధ పవిత్ర కర్మలను ఆచరించే స్వాతంత్ర్యమును మా నుండి తీసివేసే అధికారం తెల్లవాళ్ళకు లభించిందని నేను తర్కించేదాన్ని! నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో చర్చికి వెళ్ళాలని మమ్మల్ని బలవంతం చేసినప్పుడు ప్రొటెస్టెంట్, క్యాథలిక్ మతకర్మల్లో పాల్గొనకుండా తప్పించుకునేందుకు మా నాన్నకు బదులు నేనే దొంగసంతకం కూడా చేశాను. మమ్మల్ని వాళ్ళ మతంలోకి కలుపుకోవాలి, మేము మా ఇండియన్ వారసత్వాన్ని మరిచిపోయేలా చేయాలి అన్నదే ఆ స్కూళ్ళ ఉద్దేశము. మమ్మల్ని మా సొంత భాషలో మాట్లాడనిచ్చేవాళ్ళు కూడా కాదు!
మాకు ప్రకృతన్నా, మా పరిసరప్రాంతాలన్నా ప్రగాఢమైన గౌరవముండేది. ప్రతిరోజు ఉదయం మేము తూర్పుకు తిరిగి పవిత్రమైన మొక్క జొన్నల పుప్పొడిని చల్లుతూ, ప్రార్థనలు చేసి కృతజ్ఞతలు తెలిపేవాళ్ళం. * ఇది నాకు చిన్నప్పుడు నేర్పిన నవహో ఆరాధనా పద్ధతి. దాన్ని గర్వంగా హృదయపూర్వకంగా అంగీకరించాను. పరలోకానికి వెళ్తారన్న క్రైస్తవమత సామ్రాజ్యపు తలంపు నాకు నచ్చనూ లేదు, నరకంలో అగ్నిమయ బాధను గురించి నేను నమ్మనూ లేదు. నా హృదయం భూమిమీది జీవితంపైనే ఉండేది.
బడి సెలవులప్పుడు, నేను కుటుంబ సభ్యుల సహచర్యంలో ఆనందించేదాన్ని. హోగన్, అంటే మా నవహో నివాసస్థలము, దాన్ని శుభ్రం చేయడం, బట్టలను నేయడం, గొఱ్ఱెలను కాయడం నా దైనందిన చర్య. మేము నవహోలము శతాబ్దాలుగా గొఱ్ఱెల కాపరులము. నేను మా హోగన్‌ని (క్రింద ఫోటో చూడండి) శుభ్రం చేసే ప్రతిసారీ, అక్కడ బైబిలులో భాగమైన కీర్తనల గ్రంథంతోపాటు “క్రొత్త నిబంధన”లోని కొన్ని పుస్తకాలు ఉన్న ఒక ఎర్రని పుస్తకం కనిపించేది. నేను దాన్ని అటూ ఇటూ తన్నేదాన్నే తప్ప దాంట్లో ఏముందనిగానీ వాటి అర్థమేమిటని గానీ ఎన్నడూ ఆలోచించలేదు. కానీ, దాన్ని అక్కడినుండి తీసిపారవేయలేదు.
వివాహం—వంచన, విమోచన
నేను హైస్కూల్‌లో చదువు పూర్తి చేసిన తర్వాత, న్యూ మెక్సికోలోని ఆల్బూకెరెక్‌లో వృత్తివిద్యను నేర్పే స్కూల్‌కి వెళ్ళాలని ప్లాన్ వేశాను. అయితే నేనక్కడికి బయలుదేరక ముందే, నాకు కాబోయే భర్తను కలవడం జరిగింది. మా పెళ్ళి కోసం నేను నవహో రిజర్వేషన్‌కి తిరిగివచ్చాను. ఆ రిజర్వేషన్‌ని రెజ్ అంటాము. నా తల్లిదండ్రులు వివాహం చేసుకుని అనేక సంవత్సరాలుగా కలిసివుంటున్నారు, నేను కూడా వారి అడుగుజాడలను అనుసరించాలని కోరుకున్నాను, కనుక పెళ్ళి చేసుకున్నాను. నేను గృహిణిగా ఉండిపోవడానికి ఇష్టపడ్డాను, ముఖ్యంగా మా కుమారుడు లయనెల్ పుట్టిన తర్వాత నేను కుటుంబ జీవితాన్ని ఆనందించాను. ఒకరోజు గుండె బ్రద్దలయ్యే ఒక వార్తను వినేవరకు నేనూ నా భర్తా చాలా సంతోషంగా ఉన్నాం!
నా భర్తకు మరొక స్త్రీ ఉంది! ఆయన నమ్మకద్రోహంతో మా వివాహ జీవితం ఛిన్నాభిన్నమైంది. నేను చాలా కృంగిపోయాను, ఆయనను చాలా అసహ్యించుకున్నాను. నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను! విడాకుల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో, మా కుమారుని కోసమూ, భరణం కోసమూ చేసిన పోరాటంలో నేను చాలా మానసిక క్షోభకు గురయ్యాను, అప్రయోజకురాలనని అనిపించేది, నిరాశే మిగిలేది. నేను నా దుఃఖాన్ని తగ్గించుకునేందుకు అనేక కిలోమీటర్లు పరుగెట్టేదాన్ని. నాకు తరచూ ఏడుపొచ్చేది, త్వరలోనే నా ఆకలి కూడా చచ్చిపోయింది. పూర్తిగా ఏకాకినని అనిపించేది.
కొంత కాలం తర్వాత, నాలాగే వివాహంలో విఫలుడైన ఒక వ్యక్తికి దగ్గరయ్యాను. ఇద్దరమూ బాధననుభవిస్తున్నవాళ్ళమే. ఆయన నాపై సానుభూతిని చూపించాడు, నాకు అవసరమైన భావోద్వేగపరమైన మద్దతునిచ్చాడు. నా హృదయాంతరాల్లోని తలంపులను, జీవితాన్ని గురించిన నా అనుభూతులను ఆయనకు చెప్పాను. ఆయన వినేవాడు, అది ఆయనకు నాపై శ్రద్ధ ఉందని చూపించింది. మేము పెళ్ళి చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నాం.
అలా ఉండగా ఆయన కూడా నమ్మదగినవాడు కాదని తెలుసుకున్నాను! ఎంతో కష్టమైనా, బాధాకరమైనా సరే నేను ఆయనను నా జీవితంలోకి ప్రవేశించకుండా గెంటేశాను. నేను తృణీకరించబడినదానిగా భావించాను, మానసికంగా చాలా కృంగిపోయాను. నాకు చాలా ఆగ్రహం కలిగింది, ప్రతీకారభావం కలిగింది, ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. నేను నా జీవితాన్ని అంతం చేసుకునేందుకు రెండు సార్లు ప్రయత్నం చేశాను. నేను చనిపోవాలని మాత్రమే కోరుకున్నాను.
నిజమైన దేవుణ్ణి గురించి మొదటిసారిగా తెలుసుకోవడం
నాకు తెలియని దేవునికి నేను ప్రార్థిస్తూ ఏడ్చేసేదాన్ని. అయితే, సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఈ విశ్వాన్ని సృష్టించిన ఒక సర్వోన్నతుడు ఉన్నాడన్న నమ్మకం ఉండేది. సుందరమైన సూర్యాస్తమయాలకు ఆకర్షితురాలినయ్యేదాన్ని, ఈ అద్భుతాలను మనము ఆస్వాదించేందుకు అనుమతించిన ఆయన ఎంత ఆశ్చర్యకరుడై ఉంటాడని ఆలోచించేదాన్ని. నాకు తెలియని ఆ వ్యక్తిపట్ల ప్రేమ పెరిగింది. “దేవా, నువ్వు నిజంగా ఉంటే, నాకు సహాయం చేయి, నాకు నడిపింపునివ్వు, నన్ను మళ్ళీ సంతోషంగలదానిగా చెయ్యి” అని ఆయనతో అనడం మొదలుపెట్టాను.
ఈ సమయంలో మా కుటుంబం, ముఖ్యంగా మా నాన్న నా గురించి చాలా బాధపడ్డారు. నన్ను బాగు చేసేందుకు నా తల్లిదండ్రులు మాంత్రికులను సంప్రదించారు. మంచి మాంత్రికుడు మీకు ఇంత ఖర్చవుతుందని చెప్పడు, తానేమి బోధిస్తాడో వాటిని ఆచరణలో పెడతాడు అని మా నాన్నగారు అన్నారు. నా తల్లిదండ్రుల సంతోషం కోసం నవహో బ్లెస్సింగ్ వే అనే మత కర్మలకు అనేకసార్లు వెళ్ళాను.
నేను మా హోగన్‌లో ఒంటరిగా అనేక రోజులు గడిపాను, కేవలం రేడియో మాత్రమే నా ప్రక్కనుండేది. నీవు యేసును నీ హృదయంలోకి స్వీకరించలేదు గనుక నీకు నాశనమే గతి అంటున్న పాదిరీల అధిక్షేపణను విన్నప్పుడు అసహ్యించుకునేదాన్ని. కనుక, ఆసక్తిని కోల్పోయి, వినడం మానేశాను! అప్పటి నుండి నేను తెల్లవారి మతాన్ని ఇక ఏ మాత్రం సహించలేకపోయాను, మా మతాన్ని సహితం సహించలేకపోయాను! నా సొంత పద్ధతిలో నేను దేవుడ్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాను.
నేనలా ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ ఎర్రని పుస్తకం మళ్ళీ నా కంటపడింది. అందులో ఉన్న బైబిలు భాగమైన కీర్తనల గ్రంథాన్ని ఈ సారి చదివాను, అలా చదివినప్పుడు, రాజైన దావీదు అనుభవించిన బాధలను, కృంగుదలను గురించి తెలుసుకుని, నేను ఎంతో ఊరటను పొందాను. (కీర్తన 38:1-22; 51:1-19) కానీ నా అహంకారంవల్ల, నేను చదివినదంతా వెంటనే కొట్టిపారేశాను. నేను తెల్లవాళ్ళ మతాన్ని అంగీకరించను గాక అంగీకరించను అని అనుకున్నాను.
నేనంత నిరాశలో ఉన్నప్పటికీ, నేను నా కుమారుడ్ని మంచిగా చూసుకోగలిగాను. వాడు నాకు ప్రోత్సాహాన్నిచ్చేవాడు. టీవిలో ప్రార్థనలను చేసే మతసంబంధ ప్రోగ్రాములను చూడడం మొదలుపెట్టాను. నిరాశగా ఉన్న నేను, 800 నెంబర్‌కి ఫోన్ చేసి, నాకు సహాయం చేయమని చెప్పాను. అందుకు 50 లేదా 100 డాలర్లు ఇస్తానని మాటియ్యాలని వాళ్ళనగానే టప్పుమని ఫోన్ పెట్టేశాను!
మా విడాకుల కేసు విచారణలు నన్ను బాగా నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా మా తెగ న్యాయాధిపతి ఎదుట నా భర్త సత్యసంధంగా మాట్లాడకపోవడంతో నాకు చాలా నిరాశ కలిగింది. మా కుమారుడ్ని నా దగ్గరంటే నా దగ్గర ఉంచుకోవాలన్న పోరాటం మూలంగా మా కేసు ముగిసేందుకు చాలా కాలం పట్టింది. కానీ నేనే గెలిచాను. మా నాన్నగారు, ఒక్కమాట కూడా అనకుండా, కేసు విచారణల సమయంలో నాకు మద్దతునిచ్చారు. నేను మానసికంగా చాలా నలిగిపోయానని ఆయన గ్రహించారు.
సాక్షులతో నా మొదటి కలయిక
ఏ రోజుకా రోజు భరించాలని నేను నిర్ణయించుకున్నాను. ఒక సందర్భంలో, ఒక నవహో కుటుంబం మా పొరుగువాళ్ళతో మాట్లాడడం గమనించాను. నేను దొంగచాటుగా చూడకుండా ఉండలేకపోయాను. ఆ వచ్చినవాళ్ళు ఇంటింటికి వెళ్ళి చేసే ఏదో పనిలో ఉన్నారు. వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చారు. నవహో అయిన సాండ్రా తాను యెహోవాసాక్షుల్లో ఒకరినని తెలిపింది. అన్నింటికన్నా యెహోవా అన్న పేరు మీదే నా మనస్సు నిలిచింది. “యెహోవా ఎవరు? మీదేదో క్రొత్త మతంలాగుంది. చర్చిలో మాకు దేవుని నామాన్ని ఎందుకు బోధించలేదు?” అని నేనన్నాను.
ఆమె దయాపూర్వకంగా తన బైబిలులో కీర్తన 83:18 తీసింది. ఆ వచనం, “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక” అని చెబుతోంది. దేవునికి వ్యక్తిగతంగా పేరుందనీ, ఆయన కుమారుడే యేసుక్రీస్తని, ఆయన యెహోవాకు సాక్షియని ఆమె నాకు వివరించింది. యెహోవాను గురించి, యేసును గురించి నాకు బోధిస్తానని చెప్పి ఆమె నిత్య జీవమునకు నడుపు సత్యము * అనే పుస్తకాన్ని నాకిచ్చి వెళ్ళింది. నేనెంతో పులకించిపోయి, “అవును, నేను ఈ క్రొత్త మతాన్ని పరీక్షించి చూస్తాను” అని అన్నాను.
నేను ఆ పుస్తకాన్ని ఒక్క రాత్రిలో చదివేశాను. దానిలో ఉన్న విషయాలు క్రొత్తగా, భిన్నంగా ఉన్నాయి. జీవితానికి ఒక సంకల్పం ఉందని అది వివరించింది. జీవితంపై ఆసక్తిని తిరిగి పెంపొందించుకునేందుకు నాకు సరిగ్గా కావలసింది అదే. నేను బైబిలును అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నా మనసులోని అనేక ప్రశ్నలకు బైబిలు నుండి జవాబులు లభించడం నాకు ఆనందం కలిగించింది. నేను తెలుసుకున్నవాటినన్నింటినీ నమ్మాను. అవన్నీ అర్థవంతమైనవే, అదే సత్యమై ఉండాలి!
లయనల్‌కి ఆరేండ్లు నిండినది మొదలుకొని నేను బైబిలు సత్యాన్ని వాడికి నేర్పించడం మొదలుపెట్టాను. మేము కలిసి ప్రార్థించాము. మనలను యెహోవాయే చూసుకున్నాడు, మనం ఆయనను నమ్మాలి అన్న ఆలోచనతో మేము ఒకళ్ళనొకళ్ళం ప్రోత్సహించుకునేవాళ్ళం. కొన్ని సార్లు నాకు తట్టుకునే శక్తి ఉండేది కాదు. అయితే, వాడు తన చిన్ని చేతులతో నన్ను వాటేసుకుని, “ఏడ్వకు మమ్మీ, యెహోవాయే మనలను చూసుకుంటాడు” అని మరింత భరోసానిచ్చే విధంగా విశ్వాసంతో అనే మాటలు భిన్నమైన లోకాన్ని కళ్ళ ముందు చూపించేవి. అవి నాకెంతో ఓదార్పునిచ్చి, బైబిలు అధ్యయనం కొనసాగించాలన్న నా నిర్ణయాన్ని దృఢపరచేవి! నేను దేవుని నడిపింపు కోసం పట్టుదలగా ప్రార్థించేదాన్ని.
క్రైస్తవ కూటాల ప్రభావం
యెహోవా అంటే మాకున్న మెప్పు, మేము రాను పోను 240 కిలోమీటర్లు ప్రయాణించి, టూబా నగరంలోని యెహోవాసాక్షుల కూటాలకు హాజరయ్యేందుకు ప్రేరేపించింది. మేము వేసవికాలంలో వారానికి రెండుసార్లు హాజరయ్యేవాళ్ళం. చలికాలంలో వాతావరణం అనుకూలం ఉండదు గనుక, ఆదివారమే అన్ని కూటాలూ జరిగేవి. ఒకసారి మార్గమధ్యంలో మా కారు పాడైపోయినప్పుడు, రాజ్య మందిరానికి వేరే వాళ్ళను లిఫ్ట్ అడిగి వెళ్ళాం. దూర ప్రయాణాలు చాలా బడలిక కలిగించేవి. మనం చనిపోతే తప్ప కూటాలకు వెళ్ళకుండా ఉండకూడదు అని లయనల్ అన్న మాటలు, యెహోవా నుండి వచ్చే ఆధ్యాత్మిక నిర్దేశాలను తేలికగా తీసుకోకుండా ఉండవలసిన ప్రాముఖ్యతను నా మనుసులో నాటుకునేలా చేశాయి.
జీవితంలో బాధలు లేకుండా శాశ్వతకాలం జీవించగలమన్న రాజ్యగీతాన్ని పాడేటప్పుడు నా కళ్ళ వెంట కన్నీళ్ళు జలజలా జారేవి. యెహోవాసాక్షుల నుండి ఊరటను ప్రోత్సాహాన్ని పొందాను. వాళ్ళు తమ ఇండ్లకు మమ్మల్ని భోజనానికి ఫలహారాలకు ఆహ్వానించి ఆతిథ్యమిచ్చేవారు, వాళ్ళ కుటుంబ బైబిలు అధ్యయనాల్లో మేము పాల్గొనేవాళ్ళం. వాళ్ళు మాపై ఎంతో శ్రద్ధ చూపించేవారు, మేము చెప్పేది వినేవారు. ముఖ్యంగా పెద్దలు, మాపై సానుభూతిని చూపించి, యెహోవాకు మా మీద శ్రద్ధ ఉందన్న నమ్మకాన్ని ధ్రువీకరించడంలో ప్రముఖ పాత్రను వహించారు. నిజమైన స్నేహితులను పొందగలిగినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. వాళ్ళు నాకు ఎంతో నూతనోత్తేజాన్ని కలిగించేవారు, నేనిక తట్టుకోలేనని అనిపించినప్పుడు నాతోపాటు ఏడ్చేవారు కూడా.—మత్తయి 11:28-30.
రెండు పెద్ద నిర్ణయాలు
యెహోవా చేసిన ఏర్పాట్లలో నేను సంతృప్తిని పొందగలిగినప్పుడే, నా బాయ్‌ఫ్రెండ్ నాతో సమాధానపడేందుకు తిరిగివచ్చాడు. నేను అప్పటికీ ఆయనను ప్రేమిస్తున్నాను, కనుక ఆయన విజ్ఞప్తిని కాదనలేకపోయాను. మేము పెళ్ళి చేసుకుందామని ప్లాన్‌లు వేసుకున్నాము. సత్యం ఆయనను మార్చగలదని అనుకున్నాను. అది నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద పొరపాటు! నాకు చాలా అసంతోషం కలగనారంభించింది. నా మనస్సాక్షి నన్ను తీవ్రంగా బాధపెట్టింది. ఆయన సత్యాన్ని కోరుకోకపోవడం నాకు దిగులు కలిగించింది.
నేను పెద్దలలో ఒకరికి విషయాన్ని చెప్పాను. ఆయన లేఖనాల నుండి నాతో తర్కించాడు, నా నిర్ణయాన్ని గురించి ప్రార్థించాడు. యెహోవా నన్నెప్పుడూ నొప్పించడు, బాధ కలిగించడు, కానీ అపరిపూర్ణులైన మానవులైతే, వాళ్ళను మనమెంతగా ఆదరించినా వాళ్ళు బాధపెడతారు అన్న నిర్ధారణకు వచ్చాను. వాస్తవానికి, సామాన్య చట్టానుసారమైనవిగా చెప్పబడే వివాహాల్లో భద్రత లేదని తెలుసుకున్నాను. నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవడం చాలా కష్టమైనది, చాలా బాధాకరమైనది. నేను ఆర్థికంగా బాధపడాల్సివచ్చినా, నేను నా పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకముంచాల్సిన అవసరముంది.
నేను యెహోవాను ప్రేమించాను, ఆయనను సేవిస్తానని నిర్ణయించుకున్నాను. యెహోవా దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్న విషయాన్ని 1984, మే 19న, నీటి బాప్తిస్మం ద్వారా బహిరంగంగా తెలిపాను. నా కుమారుడు లయనల్ కూడా బాప్తిస్మం తీసుకున్న యెహోవా సాక్షే. మేము మా కుటుంబం నుండి, మాజీ భర్త నుండి చాలా వేధింపును ఎదుర్కోవలసి వచ్చింది, కానీ మేము విషయాలను యెహోవాకు వదిలేయడంలో కొనసాగాము. దానివల్ల మాకు ఆశాభంగం కలుగలేదు. మా కుటుంబం 11 సంవత్సరాల దీర్ఘకాలం తర్వాత, చివరికి మమ్మల్ని వేధించడం మానుకుంది, మా క్రొత్త జీవిత విధానాన్ని అంగీకరించింది.
నాకు వాళ్ళంటే చాలా ప్రేమ, వాళ్ళు కూడా సంతోషంగా ఉండేందుకు వాళ్ళు యెహోవాను గురించి తెలుసుకోవాలన్నదే నా కోరిక. నేను కృంగుదలలో మునిగిపోతానేమో ఆత్మహత్య చేసుకుంటానేమో అనుకున్న మా నాన్న ధైర్యంగా నాకు మద్దతునిచ్చారు. నేను మళ్ళీ సంతోషంగా ఉండడం చూసి ఆయన తృప్తిపడ్డారు. యెహోవాకు ప్రార్థన చేయడం, యెహోవాసాక్షుల కూటాలకు హాజరుకావడం, దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడం నేను స్వస్థతను అనుభవించడానికి చాలా ప్రాముఖ్యమని నేను కనుగొన్నాను.
భవిష్యత్తును గురించిన నిరీక్షణ
అన్ని రకాల బాధల కారణాలు, అపరిపూర్ణత, అబద్ధం, ద్వేషం బొత్తిగా లేకుండా పోయే సమయం కోసం నేను ఎదురుచూస్తున్నాను. మా నవహో భూమిపై అనేకానేక మొక్కలు విరగబూయడాన్ని, మునుపటిలా పీచ్ పండ్ల, జల్దరు పండ్ల చెట్లతో నిండివుండడాన్ని ఊహించుకోండి. పైరుపచ్చలులేని తమ స్వదేశాలను నదులు, వర్షాల సహాయంతో సుందరమైన పరదైసుగా మార్చుకోవడంలో వివిధ తెగలవారు పాల్గొనడంలోని ఆనందాన్ని నేను నా మనోఫలకంపై చూస్తాను. ఇటీవలి చరిత్రలో జరిగినట్లు పోట్లాడుకోకుండా, మేము మా హోపీ పొరుగువారితోను, మరితర తెగలవారితోను భూమిని పంచుకోవడాన్ని చూస్తాను. దేవుని వాక్యం సమస్త జాతుల, తెగల, వంశాల వారిని ఎలా ఐక్యపరుస్తుందో నేనిప్పుడు చూడగలుగుతున్నాను. భవిష్యత్తులో, కుటుంబాలు, స్నేహితులు, మృతులైన తమ ప్రియమైనవారు పునరుత్థానం పొంది వచ్చినప్పుడు వారిని తిరిగి కలవడాన్ని చూస్తాను. నిత్యజీవపు దృష్టితో ఎంతగానో ఆనందించే సమయమది. ఈ అద్భుతమైన నిరీక్షణను గురించి తెలుసుకోవడానికి ఎవరైనా ఇష్టపడకపోవడాన్ని నేను ఊహించలేకపోతున్నాను.
నవహో ప్రాంతంలో దైవపరిపాలనా విస్తరణ
టూబా నగరంలో ఇప్పుడు రాజ్య మందిరం ఉండడమూ, నవహో, హోపీ రిజర్వేషన్‌లలోని, * చిన్లీ, కేయంటా, టూబా నగరం, కీమ్స్ కెన్యన్‌లలోని నాలుగు సంఘాల పెరుగుదలను చూడడమూ ఎంతో పులకింత కలిగిస్తాయి. నేను 1983లో, మొదటిసారిగా, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పాల్గొన్నప్పుడు, ఒకరోజు అది నవహో భాషలోకూడా నిర్వహించబడుతుంది అని కేవలం ఊహించుకున్నాను. కాని అది నేడు కేవలం ఊహ మాత్రమే కాదు. 1998 మొదలుకొని, నవహో భాషలో ఈ పాఠశాల నిర్వహించబడుతోంది.
దేవునికి వ్యక్తిగత నామము ఉంది అని ఇతరులకు చెప్పడం అనంతమైన ఆశీర్వాదాలను తీసుకువచ్చింది. నవహో భాషలో లభ్యమవుతున్న భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, ఇటీవలే విడుదలైన, మీరు దేవుని స్నేహితునిగా ఉండగలరు! అనే బ్రోషూర్లలోని విశ్వాసాన్ని బలపరచే వ్యక్తీకరణలు, చదివి ఇతరులతో పంచుకోగలగడం కూడా మాటల్లో వివరించలేనంత ఆనందాన్నిస్తుంది. నవహో ప్రజలైన డీనేలతో సహా సమస్త జనములు, తెగలు, భాషలవారు ప్రయోజనం పొందేలా ఈ బైబిలు విద్యా పనిని సర్వవ్యాప్తం చేసినందుకు నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసునికి నేను కృతజ్ఞురాలిని.—మత్తయి 24:45-47.
నన్ను నేను పోషించుకునేందుకు పూర్తికాలం పని చేస్తున్నాను, కానీ, క్రమంగా సహాయ పయినీరింగ్ చేయడంలో ఆనందిస్తున్నాను. నేను నా ఒంటరి జీవితంలో ఆనందిస్తున్నాను, ఎటువంటి ఆటంకాలు లేకుండా యెహోవాను సేవించాలని కోరుకుంటున్నాను. “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని నా ప్రజలకు, ఇతరులకు, ముఖ్యంగా, నిరాశలో మునిగివున్నవారికి చెప్పడంలో నేను ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని పొందుతున్నాను.—కీర్తన 34:18.
బైబిలు తెల్లవారి మతమని ఇక మీదట నేను భావించను. బైబిలు దేవుని వాక్యం, దానిని తెలుసుకుని, ఆచరణలో పెట్టాలనుకునే వారందరిది. యెహోవాసాక్షులు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు నిజంగా సంతోషంగా ఎలా ఉండగలరో వారిని చూపించనివ్వండి. దేవుని నామమైన యెహోవాను గురించిన, నా జీవితాన్నే మార్చేసిన నామాన్ని గురించిన సువార్తను వారు మీ దగ్గరికి తీసుకువస్తున్నారు. “అవును, దేవుని నామము యెహోవా.”(g01 7/8)
[అధస్సూచీలు]
^ మోర్మోన్ మతం గురించిన విశద వివరాల కోసం, తేజరిల్లు! (ఆంగ్లం) నవంబరు 8, 1995 సంచిక చూడండి.
^ 1968లో ఒక అమెరికన్ ఇండియన్ స్థాపించిన పౌరహక్కుల సంస్థే ఎఐఎమ్. ఆ సంస్థ తరచూ బిఐఎని విమర్శించేది. బిఐఎ 1824లో స్థాపించబడిన ప్రభుత్వ ఏజెన్సీ, అది ఈ దేశపు ఇండియన్ల సంక్షేమాభివృద్ధి కోసమే ఉద్దేశించబడినట్లు చెప్పుకునేది. బిఐఎ, తరచూ, నాన్ ఇండియన్‌లకు రిజర్వేషన్‌లలోని ఖనిజాలను, నీటిని, మరితర హక్కులను కౌలుకిచ్చేది.—వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా.
^ మరెక్కువ సమాచారం కోసం, తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబరు 8, 1996 సంచికలో వచ్చిన “అమెరికన్ ఇండియన్స్—వారికి ఎలాంటి భవిష్యత్తుంది?” అనే శీర్షికను చూడండి.
^ పుప్పొడిని పవిత్రమైన పదార్థంగా ఎంచుతారు, జీవానికీ నూతనపర్చే ప్రక్రియకూ ప్రతీకగా ప్రార్థనల్లోను ఇతర ఆచారాల్లోను ఉపయోగిస్తారు. పుప్పొడి చల్లబడిన దారిలో ఎవరైనా ప్రయాణిస్తే, వారి శరీరం పవిత్రమవుతుందని నవహోల నమ్మకం.—ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ నేటివ్ అమెరికన్ రిలిజియన్స్.
^ యెహోవాసాక్షులు ప్రచురించిన పుస్తకం, ఇప్పుడు ముద్రించడం లేదు.
[27వ పేజీలోని చిత్రం]
సగటు నవహో హోగన్
[27వ పేజీలోని చిత్రం]
నా కుమారుడు లయనల్‌తో
[29వ పేజీలోని చిత్రం]
1993లో, మాస్కోలోని అంతర్జాతీయ సమావేశంలో రష్యన్ స్నేహితులతో
[30వ పేజీలోని చిత్రం]
అరిజోనాలోని కేయంటా సంఘంలోని నా ఆధ్యాత్మిక కుటుంబంతో