కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషానికి మూలకారణాలు

ద్వేషానికి మూలకారణాలు

ద్వేషానికి మూలకారణాలు

ద్వేషం అనేది మానవజాతి చరిత్ర ప్రారంభంలోనే పొడచూపింది. ఆదికాండము 4:8 లోని బైబిలు వృత్తాంతం ఇలా చెబుతోంది: “వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.” బైబిలు రచయిత యోహాను “వాడతనిని ఎందుకు చంపెను?” అని అడుగుతున్నాడు. “తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?” (1 యోహాను 3:12) హేబెలు ద్వేషం కలిగించే ఒక అతి సామాన్యమైన కారణానికి బలయ్యాడు: అదే అసూయ. “అసూయకు గురియైన భర్త రౌద్రముతో మండిపడును” అని సామెతలు 6:34, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము చెబుతోంది. సమాజంలో కొంతమంది ప్రజలకు ఉన్న హోదా, వస్తుసంపదలు, ఆదాయం వచ్చే ఇతర వనరులు, మరితర ఆనుకూల్య పరిస్థితుల మూలంగా ఇతర ప్రజల్లో అసూయ భావాలు చెలరేగి నేడు ఒకరికొకరు విరుద్ధంగా తలపడుతూనే ఉన్నారు.

అజ్ఞానము, భయం

కానీ ద్వేషాన్ని పుట్టించే అనేక కారణాల్లో అసూయ కేవలం ఒక్కటి మాత్రమే. తరచుగా అజ్ఞానము, భయం వంటి వాటి మూలంగా కూడా ద్వేషం ఏర్పడుతుంది. “నేను ద్వేషించడం నేర్చుకోవడానికి ముందు భయపడడం నేర్చుకున్నాను” అని హింసాపూరిత చర్యలకు పూనుకునే ఒక జాత్యాహంకార గుంపులోని సభ్యుడు అన్నాడు. అలాంటి భయం చాలా మట్టుకు అజ్ఞానంలో వేళ్ళూనుకుని ఉంటుంది. ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతున్నదాని ప్రకారం దురభిమానంతో ఉన్న ప్రజలు “సరైన సాక్ష్యాధారాలతో సంబంధం లేకుండానే” అభిప్రాయాలను కలిగివుంటున్నట్లు కనబడుతోంది, “దురభిమానంతో ఉన్న వ్యక్తులు తమ మనస్సుల్లో ముందే నిర్ధారించుకున్న అభిప్రాయాలకు భిన్నంగా ఉన్న వాస్తవాలను వక్రీకరిస్తారని, వాటికి తప్పుడు భాష్యం చెబుతారని, లేదా చివరికి అలక్ష్యం చేస్తారని స్పష్టమవుతోంది.”

ఈ అభిప్రాయాలు ఎక్కణ్నుంచి వస్తాయి? ఒక ఇంటర్నెట్‌ సమాచార సర్వీసు ఇలా చెబుతోంది: “సంస్కృతుల పట్ల మనస్సుల్లో ఏర్పడే అధికశాతం అభిప్రాయాలకు చరిత్రే కారణం, కానీ మన స్వంత వ్యక్తిగత చరిత్ర కూడా మనలోని అనేక దురభిమానాలకు కారణం అవుతుంది.”

ఉదాహరణకు అమెరికాలోని బానిస వ్యాపారం మూలంగా చాలామంది తెల్లజాతివారి మధ్యా ఆఫ్రికా దేశాల జాతులవారి మధ్యా తరతరాలుగా ఎన్నెన్నో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి​—ఈ ఉద్రిక్తతలు నేటికీ ఉన్నాయి. పరజాతుల ప్రజల పట్ల ప్రతికూల దృక్కోణాలు తరచుగా తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమింపజేయబడ్డాయి. తాను జాత్యహంకారినని స్వయంగా ఒప్పుకున్న ఒక తెల్లజాతి వ్యక్తి, “నల్లజాతి ప్రజలతో తనకు ఏమాత్రం పరిచయం లేకున్నా కూడా” తాను వారిపట్ల జాతివిద్వేష భావాలను పెంపొందించుకున్నది ఆ రీతిలోనేనని ఒప్పుకున్నాడు.

తమ నుండి వేరుగా ఉన్న ప్రజలు ఎందుకూ పనికిరాని వారని గుడ్డిగా నమ్మే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి అభిప్రాయం బహుశ వేరే జాతికి లేదా సంస్కృతికి చెందిన ఒక వ్యక్తితో ఏదో ఒకానొక సందర్భంలో పొందిన చేదైన అనుభవంవల్ల కలిగినదైవుండవచ్చు. అలాంటి అనుభవం కారణంగా వారు అక్కణ్ణుంచి ఒక్క దూకుడు దూకి, ఆ జాతికి లేదా ఆ సంస్కృతికి చెందిన వారందరిలోను అలాంటి అవాంఛనీయమైన లక్షణాలు ఉండివుంటాయన్న ఒక నిర్ధారణకు వచ్చేస్తారు.

స్వవిశ్వాస పక్షపాతం ఒక్క వ్యక్తిలోనే అసహ్యంగా కనిపిస్తుందంటే, ఇక అది మొత్తం దేశానికే లేక మొత్తం జాతికే జాడ్యంగా ఉన్నప్పుడు చాలా ప్రమాదకరంగా మారగలదు. ఒక వ్యక్తి జాతీయత, వర్ణం, సంస్కృతి, లేదా భాష వంటివి ఆ వ్యక్తిని ఇతరులకన్నా ఉన్నతులను చేస్తుందన్న నమ్మకం స్వవిశ్వాస పక్షపాతానికి, జీనోఫోబియాకు (పరదేశానికి చెందిన ఎవరినైనా దేనినైనా ఏవగించుకోవడం) దారితీయగలదు. 20వ శతాబ్దంలో అలాంటి స్వవిశ్వాస పక్షపాతం తరచూ హింసాత్మకమైన రీతిలో వెల్లడయ్యింది.

ఆసక్తికరంగా ద్వేషము స్వవిశ్వాస పక్షపాతము, వర్ణం గురించీ జాతీయత గురించే కానక్కరలేదు. “కొంతమంది వ్యక్తులను రెండు గ్రూపులుగా తోచిన విధంగా విభజించడం చాలు, చివరికి బొమ్మ బొరుసు ఆధారంగా విభజించడం కూడా సరిపోతుంది రెండు గ్రూపులలోని వారూ తామున్న గ్రూపు పట్ల అభిమానాన్ని పెంచుకోవడానికి” అని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన క్లార్క్‌ మెకాలే అనే పరిశోధకుడు వ్రాస్తున్నాడు. మూడవ తరగతి ఉపాధ్యాయురాలు ఒకామె దీన్ని ప్రదర్శించి చూపించింది, ప్రఖ్యాతి గాంచిన ఒక ప్రయోగంలో ఆమె తన విద్యార్థుల్ని రెండు గ్రూపులుగా విభజించింది​—ఒకవైపు నీలిరంగు కళ్ళున్న పిల్లల్ని, మరోవైపు గోధుమరంగు కళ్ళున్న పిల్లల్ని ఉంచింది. కొంచెం సేపటికే రెండు గ్రూపుల మధ్యా శత్రుత్వ భావాలు ఏర్పడిపోయాయి. గ్రూపులుగా ఏర్పడడం అనేది ఎంతో అల్పమైన విషయాల ఆధారంగా కూడా జరిగిపోతుంది, ఉదాహరణకు ఒకే క్రీడాజట్టు పట్ల అభిమానం ఏర్పడడం కూడా హింసాత్మక సంఘర్షణలు జరగడానికి నడిపిస్తుంది.

ఎందుకింత హింస?

కానీ అలాంటి శత్రుత్వ భావాలు హింసాత్మక రీతుల్లో అంత తరచుగా ఎందుకు వ్యక్తం చేయబడ్డాయి? అలాంటి వివాదాంశాలపై పరిశోధకులు ఎంతో లోతుగా పరిశీలనలు చేశారు, అయినా కేవలం కొన్ని సిద్ధాంతాలను మాత్రమే ప్రతిపాదించగలిగారు. మానవుల హింసాత్మక ప్రవృత్తిపై, దాడిచేసే ప్రవృత్తిపై జరిగిన పరిశోధనల గురించిన పుస్తకాల విస్తృతమైన పట్టికను క్లార్క్‌ మెకాలే సమకూర్చాడు. “హింసాత్మక నేరాలు పోరాడడంతో యుద్ధాలను గెలవడంతో సంబంధం కలిగివున్నాయి” అని సూచిస్తున్న ఒక అధ్యయనాన్ని ఆయన పేర్కొంటున్నాడు. ఆ అధ్యయన పరిశోధకులు, “మొదటి ప్రపంచ యుద్ధంలోను రెండవ ప్రపంచ యుద్ధంలోను పాల్గొన్న దేశాల్లో ప్రత్యేకంగా గెలిచిన పక్షంవైపు ఉన్న దేశాల్లో యుద్ధానంతరం ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం ఎక్కువైనట్లు కనిపించింది” అని కనుగొన్నారు. బైబిలు ప్రకారం మనం యుద్ధాల యుగంలో జీవిస్తున్నాము. (మత్తయి 24:6) అలాంటి యుద్ధాలు ఇతరత్రా హింసాత్మక సంఘటనల పెరుగుదలకు ఏదో రకంగా దోహదం చేసివుండవచ్చా?

ఇతర పరిశోధకులు, మానవుల్లో దాడిచేసే ప్రవృత్తి ఎందుకొచ్చిందో వివరించడానికి జీవశాస్త్రాల సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక పరిశోధక అధ్యయనం, కొన్ని రకాల దాడిచేసే ప్రవృత్తులకు “మెదడులో సెరోటోనిన్‌ మోతాదులు తక్కువగా ఉండడంతో” సంబంధం ఉందని చెప్పడానికి ప్రయత్నించింది. దాడిచేసే ప్రవృత్తి మన జన్యువుల్లోనే దాగివుందని మరో ప్రఖ్యాత పరికల్పన చెబుతోంది. “[ద్వేషంలో] చాలా భాగం వారసత్వంగా కూడా వచ్చివుండవచ్చును” అని ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు వాదించాడు.

అపరిపూర్ణ మానవులు చెడు ప్రవృత్తులతో లోపాలతో జన్మించారని బైబిలే చెబుతోంది. (ఆదికాండము 6:5; ద్వితీయోపదేశకాండము 32:5) నిజమే, ఆ మాటలు మానవులందరికీ వర్తిస్తాయి. కానీ మానవులందరూ ఇతరులపట్ల నిర్హేతుకంగా ద్వేషాన్ని కలిగివుండరు. దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకనే ప్రఖ్యాత మనస్తత్వశాస్త్రజ్ఞుడు గోర్డన్‌ డబ్ల్యు. ఆల్‌పోర్ట్‌ పసిపిల్లల్లో “నాశనకరమైన ప్రవృత్తులు ఉన్నట్లు . . . చాలా తక్కువగా రుజువులు కనిపిస్తాయి. . . . చిన్న పిల్లలు ఎప్పుడూ నమ్మకంతో ఉంటారు, దాదాపు ఎలాంటి ప్రేరణకైనా ప్రతిస్పందిస్తారు, ఎలాంటి వ్యక్తినైనా సమీపిస్తారు” అని పేర్కొన్నాడు. ఇలాంటి పరిశీలనలు దాడిచేసే ప్రవృత్తి, దురభిమానం, ద్వేషం అనేవి ప్రాధమికంగా నేర్చుకోబడే ప్రవర్తనలు అన్న విషయానికి మద్దతునిస్తాయి! మానవులకున్న, ద్వేషాన్ని నేర్చుకోగల సామర్థ్యం ద్వేషాన్ని బోధించేవారి స్వలాభానికి ఉపయోగించుకోబడుతోంది.

మనసుల్లో విషం నింపడం

ఈ రంగంలో అందరికన్నా ముందున్నది, నియో-నాజీ స్కిన్‌హెడ్స్‌, కు క్లుక్స్‌ క్లాన్‌ వంటి వేర్వేరు ద్వేష గ్రూపుల నాయకులు. ఈ గ్రూపులు సాధారణంగా కల్లోలభరిత కుటుంబాలకు చెందిన యువతను తమలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి, అలాంటి యువత మనస్సును ఆకర్షించడం చాలా సులభం. అభద్రతా భావాలు, ఆత్మన్యూనతా భావాలతో బాధపడుతున్న యౌవనస్థులకు ద్వేష గ్రూపులు తమకు ఆప్తమిత్రులన్న భావన కలుగుతుండవచ్చు.

ద్వేషాన్ని రగిలించడానికి ప్రాముఖ్యంగా వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను కొందరు శక్తివంతమైన ఉపకరణంగా ఉపయోగించారు. ఇటీవలి గణాంకాల ప్రకారం ఇంటర్నెట్‌పై ద్వేషాన్ని రేకెత్తించే వెబ్‌ సైట్లు 1,000 దాకా ఉన్నాయని తేలింది. ద్వేషాన్ని రేకెత్తించే ఒక వెబ్‌ సైట్‌ యజమాని ఇలా గొప్పలు చెప్పినట్లు ది ఎకానమిస్ట్‌ పత్రిక తెలియజేస్తోంది: “లక్షలాదిమంది ప్రజలకు మా దృక్కోణాన్ని తెలియజేసే అవకాశాన్ని ఇంటర్నెట్‌ మాకు కలుగజేసింది.” ఆయన వెబ్‌ సైట్‌లో “పిల్లల పేజీ” కూడా ఒకటి ఉంది.

టీనేజ్‌ పిల్లలు మ్యూజిక్‌ కోసం నెట్‌ సర్ఫింగ్‌ చేసినప్పుడు ద్వేషాన్ని రగిలించే మ్యూజిక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఏర్పాటు చేయబడిన సైట్‌లను కనుగొనే అవకాశం ఉంది. అలాంటి మ్యూజిక్‌ సాధారణంగా కర్ణ కఠోరంగా హింసాత్మకంగా ఉంటుంది, వాటి పాటలు బలమైన జాతివాద సందేశాలను వ్యక్తం చేస్తుంటాయి. అంతేగాక, ఈ వెబ్‌ సైట్‌లు ద్వేషాన్ని అభివృద్ధి చేసే ఇతర న్యూస్‌గ్రూపులకు, చాట్‌ రూమ్‌లకు, లేదా మరితర వెబ్‌ సైట్‌లకు లింకులను కూడా కలిగివుంటుండవచ్చు.

కొన్ని ద్వేష వెబ్‌ సైట్‌లలో యౌవనస్థుల కోసం గేమ్‌లు ఇతర కార్యకలాపాలతో కూడిన ప్రత్యేక విభాగాలుంటాయి. ఒక నియో-నాజీ వెబ్‌ సైట్‌ జాతివాదాన్ని, యూదువ్యతిరేక భావాన్ని సమర్థించుకోవడానికి బైబిలును ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. ఈ గ్రూపు జాతివాద వ్యాఖ్యానాలతో కూడిన పదబంధాల పజిల్‌లతో ఒక వెబ్‌ పేజీని కూడా సృష్టించింది. దాని సంకల్పం ఏమిటి? “మా పోరాటాన్ని తెల్లజాతి యౌవనస్థులు అర్థం చేసుకోవడానికి సహాయం చేయడమే.”

ద్వేషాన్ని అభివృద్ధి చేసే వారందరూ అతివాద దృక్పథాలు ఉన్నవారు కాదు. ఇటీవల బాల్కన్‌ ప్రాంతాల్లో జరిగిన సంఘర్షణల గురించి వ్రాసిన ఒక సమాజశాస్త్రవేత్త, పేరుగాంచిన రచయితల గురించి ప్రజాభిప్రాయ రూపకర్తల గురించి ఇలా అన్నాడు: “తమ తోటి దేశస్థుల అతి నీచమైన ప్రేరణలు సరైనవేనని తృప్తి పరుస్తూ [వారు] చేసిన రచనలను చూసి నాకు నోట మాటరాలేదు. ఆ రచనా శైలి ప్రజల విపరీతమైన ద్వేషాన్ని ఇంకా రేకెత్తిస్తూ, ఎలాంటి ప్రవర్తనైనా తప్పుకాదన్నట్లుగా దృష్టించేందుకు వారిని పురికొల్పుతూ వారి వివేచనా శక్తికి అంధత్వాన్ని కలిగించింది. . . . , చివరికి వాస్తవాలు వక్రీకరించబడ్డాయి.”

ఈ సంబంధంగా పాదిరీల పాత్రను మనం అలక్ష్యం చేయలేము. పవిత్ర ద్వేషం: 90లలోని మత కలహాలు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో జేమ్స్‌ ఎ. హాట్‌ విభ్రాంతికరమైన ఈ వ్యాఖ్యానాన్ని చేస్తున్నాడు: “1990లలోని హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, మానవులు ఒకరిపట్ల ఒకరు దయతో ఉంటూ శ్రద్ధ కలిగివుండడానికి దోహదపడాల్సిన మతం ద్వేషానికీ యుద్ధాలకూ ఉగ్రవాదాలకూ ప్రధాన కారణమైంది.”

దీన్ని బట్టి చూస్తుంటే ద్వేషానికి కారణాలు చాలా ఉన్నాయనీ, అవి చాలా సంక్లిష్టభరితంగా ఉన్నాయనీ తెలుస్తోంది. అంటే దీనర్థం, ద్వేష భరితమైన మానవచరిత్రలోని మూర్ఖత్వం పునరావృతం కాకుండా ఆపే మార్గమేమీ లేదా మానవజాతికి? వ్యక్తిగతంగాను అలాగే భౌగోళిక స్థాయిలోను ద్వేషాన్ని పుట్టించే అపార్థాలకు, అజ్ఞానానికి, భయానికి విరుద్ధంగా పోరాడేందుకు చేయగలదేమైనా ఉందా?(g01 8/8)

[6వ పేజీలోని బ్లర్బ్‌]

దురభిమానము, ద్వేషము నేర్చుకునే ప్రవర్తనలు!

[4, 5వ పేజీలోని చిత్రం]

మనకు పుట్టుకతోనే లేవు . . .

. . . ద్వేషభావాలూ స్వవిశ్వాస పక్షపాతాలూను

[7వ పేజీలోని చిత్రం]

ద్వేష గ్రూపులు యౌవనస్థులను తమలో చేర్చుకోవడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నాయి

[7వ పేజీలోని చిత్రం]

తరచుగా మతం సంఘర్షణలకు ఆజ్యం పోసింది

[చిత్రసౌజన్యం]

AP Photo