కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

పీల్చుకునే గరాటాలా అయ్యే నాలుక

ఊసరవెల్లి, తన బరువులో పదిశాతం బరువుగల బల్లులను, పక్షులను సహితం ఎలా పట్టుకోగలదు? ఊసరవెల్లికి బలయ్యే ప్రాణులు గరుకుగాను జిగటగాను ఉండే దాని నాలుక ఉపరితలానికి అంటుకుపోతాయని ఇప్పటి వరకూ నమ్మేవారు. కానీ ఊసరవెల్లి అంత బరువైనవాటిని ఎలా పట్టగలదన్నదాన్ని సహేతుకంగా వివరించలేకపోతున్నారు. అది తెలుసుకునేందుకు, బెల్జియమ్‌లోని ఆంట్వెర్ప్‌లోని శాస్త్రజ్ఞులు ఊసరవెల్లి నాలుక అతివేగంగా చేసే చర్యను హై స్పీడ్‌ వీడియో రికార్డింగ్‌తో వీడియో తీశారని జర్మన్‌ సైన్స్‌ న్యూస్‌ సర్వీస్‌ అయిన బిల్డ్‌ డర్‌ విషన్షాఫ్ట్‌ ఆన్‌లైన్‌ చెబుతోంది. అది నాలుకను బయటకు చాపినప్పుడు, నాలుక చివరిభాగం గుండ్రంగా మారుతుంది, నాలుకలోని రెండు కండరాలు సంకోచించినప్పుడు, ఆ చివరన ఖాళీ ఏర్పడి పీల్చుకునే గరాటాలా తయారవుతుంది, అది అల్పప్రాణులను లాగుతుంది అని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. (g01 7/22)

నిద్రా - జ్ఞాపకశక్తి

నేర్చుకున్న విషయాలు “తర్వాతి వారాల్లో జ్ఞాపకముండడానికి” అర్ధరాత్రి దాకా మేల్కొని ఉండి చదవడం కన్నా, రాత్రి బాగా నిద్ర పోవడం “చాలా అవసరం” అని నిద్ర పరిశోధకులు కనుగొన్నారని లండన్‌లోని ది ఇండిపెండెంట్‌ వ్యాఖ్యానిస్తోంది. హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ స్టిక్‌గోల్డ్‌, ప్రయోగానికి స్వచ్ఛందంగా వచ్చిన 24 మందిని తీసుకున్నాడు. వాళ్ళలో సగం మందిని ఒక క్లాస్‌ తర్వాత, రాత్రి నిద్రపోయేందుకు అనుమతించాడు, మిగతా వాళ్ళను రాత్రంతా మేల్కొనే ఉండమన్నాడు. ఆ తర్వాతి రెండు రాత్రులు రెండు గుంపులవారూ మామూలుగా నిద్రపోయారు, ముందటి రోజు నిద్రపోని వారు నిద్రపోయి తమ అలసటను తీర్చుకున్నారు. ముందటి రాత్రి నిద్రపోయినవారు, “జ్ఞాపకశక్తి ఇమిడివున్న పనిలో మెరుగైన జ్ఞాపకశక్తిని చెప్పుకోదగిన రీతిలో స్థిరంగా కనబరచారనీ, అయితే, రెండవ గుంపువారు, తాము తరువాతి రోజుల్లో బాగా నిద్రపోయినప్పటికీ, వారి జ్ఞాపకశక్తి మెరుగుకాలేదని” ఒక జ్ఞాపకశక్తి పరీక్ష వెల్లడి చేసింది. స్పష్టంగా జ్ఞాపకముంచుకోవడానికి నిద్ర సహాయం చేస్తుందని స్పష్టమవుతోంది కనుక, రాత్రులు నిద్రపోకుండా ముఖ్యంగా త్వరగా గాఢనిద్రలోకి, అంటే “స్లో-వేవ్‌” నిద్రలోకి పోకుండా చదువుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని దీన్ని బట్టి తెలుస్తోంది.(g01 8/8)

స్త్రీలు పురుషులు భిన్నంగా వింటారు

వినేందుకు స్త్రీలు తమ మెదడు యొక్క ఇరుప్రక్కలను ఉపయోగిస్తారు, అయితే, మగవాళ్ళు ఒక ప్రక్కను మాత్రమే ఉపయోగిస్తారన్న నిర్ధారణకు పరిశోధకులు వచ్చారని డిస్కవరీ డాట్‌ కామ్‌ న్యూస్‌ నివేదిస్తోంది. ఒక అధ్యయనంలో, 20 మంది స్త్రీలు 20 మంది పురుషులు ఒక పుస్తకం టేప్‌ రికార్డింగ్‌ వింటుండగా, వాళ్ళ మెదడును స్కాన్‌ చేశారు. మగవాళ్ళు ఎక్కువగా తమ మెదడు యొక్క ఎడమ భాగంతో అంటే వినడానికీ మాట్లాడడానికీ సంబంధించిన భాగంతో విన్నారనీ, అయితే, ఆడవాళ్ళ మెదళ్ళ ఇరువైపు బాగాలు క్రియాశీలంగా ఉన్నాయి అని ఆ స్కాన్‌లు చూపించాయి. “స్త్రీ పురుషుల మెదళ్ళలోని భాషా ప్రక్రియలు వేరుగా ఉన్నాయనీ, అయినంత మాత్రాన ఫలితం కూడా వేరుగా ఉండాలనేమీ లేదనీ ఆ పరిశోధన సూచిస్తోంది” అని ఇండియానా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో అసిస్టెంట్‌ రేడియాలజీ ప్రొఫెసర్‌ అయిన డా. జోసెఫ్‌ టి. లూరిటో అంటున్నాడు. స్త్రీలు, “ఒకే సమయంలో రెండు సంభాషణలను వినగలరని” ఇతర అధ్యయనాలు సూచిస్తున్నట్లు అగుపిస్తోందని డా. లూరిటో అంటున్నాడు. (g01 8/8)

రష్యా కోర్టులో సాక్షులు విజయాన్ని సాధించారు

“ద్వేషాన్ని గానీ అసహనాన్ని గానీ రేకెత్తించే మతతెగలను నిషేధించేందుకు 1997లో రూపొందించబడిన చట్టం క్రింద తమను నిషేధించాలని చూసిన ప్రాసిక్యూటర్లపై యెహోవాసాక్షులు మాస్కో కోర్టులో ఈ రోజున [ఫిబ్రవరి 23] సుదూరాల వరకు ప్రభావం చూపగల విజయాన్ని సాధించారు” అని ఫిబ్రవరి 24, 2001 నాటి ద న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక నివేదించింది. 1999, మార్చి 12 మొదలుకొని పెండింగ్‌లో ఉన్న విచారణ అది. యెహోవాసాక్షుల నమ్మకాలను అధ్యయనం చేయడానికి ఐదుగురు నిపుణులు నియమించబడ్డారు. ఈ కేసుని దాదాపు రెండు సంవత్సరాల దాకా వాయిదా వేశారు. 2001, ఫిబ్రవరి 6న దీని విచారణ పునఃప్రారంభమయ్యాక, ప్రాసిక్యూటర్ల నిందలకు ఆధారాలేమీ లేవని కోర్టు మూడు వారాల్లోపే తెలుసుకుంది. అయినప్పటికీ, ఈ కేసును మళ్ళీ విచారించవలసిందిగా, మాస్కో సిటీ కోర్టు వారిని ఆ ప్రాసిక్యూషన్‌ కోరింది. మే 30న వారి విజ్ఞప్తి అంగీకరించబడింది, ఈ కేసును కోర్టులో మళ్ళీ విచారించేందుకు మళ్ళీ ఫైల్‌ చేయబడింది. “1997లో రూపొందించబడిన మత చట్టాన్ని ప్రతిపాదించిన ముఖ్యుల్లో ఒకరు మిషనరీ కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకించే రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చీయే. ఆ చట్టం క్లిష్టమైన రిజిస్ట్రేషన్‌ పద్ధతులను అనుసరించాలని అనేక మతవర్గాలను బలవంతపెట్టింది” అని లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ అనే పత్రిక అంది. (g01 8/22)