భూగోళ వ్యాప్త విద్వేష మహమ్మారి
భూగోళ వ్యాప్త విద్వేష మహమ్మారి
ఒక రాక్షసి స్వైరవిహారం చేస్తోంది—దాని పేరు ద్వేషం. అది అంతకంతకూ విజృంభిస్తోంది, భూమంతా కలియతిరుగుతోంది.
బాల్కన్ దేశాల్లోని ఒక ప్రాంతం ఇటీవల జరిగిన జాతి ప్రక్షాళనా హింసాజ్వాలల ప్రభావాన్ని ఇంకా అనుభవిస్తోంది. శతాబ్దాల పూర్వపు కక్షల కారణంగా సామూహిక హత్యలు, మానభంగాలు, సమాజ బహిష్కరణలు, గృహాల గ్రామాల లూటీలు దహనాలు, పాడిపంటల ధ్వంసాలు సంభవించాయి, ప్రజలు ఆహార కొరతలు ఆకలి బాధలు అనుభవించారు. భూమిలో మందు పాతరలు ఇప్పటికీ లెక్కలేనన్ని ఉన్నాయి.
ఆగ్నేయాసియాలోని ఈస్ట్ టీమూర్‌లో భీతావహులైన 7,00,000 మంది ప్రజలు దారుణ హత్యా కాండలు, కొట్లాటలు, విచక్షణారహితమైన కాల్పులు, స్వస్థలాల్ని విడిచివెళ్ళాల్సిరావడం వంటివాటి నుండి తప్పించుకోవడానికి పారిపోవలసి వచ్చింది. వారు విడిచి వెళ్ళిన ప్రాంతాలు మిలిటెంట్ల దాడుల మూలంగా శిథిలాలయ్యాయి. “నన్ను పిచ్చి కుక్కలా తరుముతున్నట్లు నాకనిపించింది” అని ఒక బాధితుడు రోదిస్తూ అన్నాడు.
మాస్కోలో ఒక అపార్ట్‌మెంటు ఉగ్రవాదుల బాంబు విస్ఫోటనంలో తునాతునకలైంది. ఆ విస్ఫోటనం మూలంగా 94 మంది అమాయక ప్రాణుల శరీరాలు చిందరవందరగా ఎగిరి పడ్డాయి—ముక్కుపచ్చలారని చిన్న పిల్లలు కూడా చనిపోయినవారిలో ఉన్నారు. 150 మందికి పైగా గాయపడ్డారు. అంతటి ఘోరకలి తర్వాత ప్రజలు ‘ఈసారి ఎవరి వంతు?’ అని అడుగుతారు.
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒక జాత్యహంకారవాది యూదా మతానికి చెందిన నర్సరీ స్కూలు పిల్లల గుంపుకి తుపాకీ గురిపెట్టి కాల్చాడు, ఆ తర్వాత ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఒక పోస్టుమ్యాన్‌ని కాల్చిచంపాడు.
ద్వేషం భూగోళ వ్యాప్తంగా విస్తరిస్తోందని చెప్పడం సబబే. జాతి, తెగ, లేదా మతపరమైన కక్షలకు అక్రమ కార్యకలాపాలు తోడైతే ఏమౌతుందో వార్తా నివేదికలు దాదాపు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాయి. దేశాలు, సమాజాలు, కుటుంబాలు విభజించుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాము. సామూహిక ఊచకోతల్లో కూరుకుపోతున్న దేశాలను మనం చూస్తూనే ఉన్నాము. అవతలి ప్రజలు తమనుండి కేవలం “వేరుగా” ఉన్న కారణంగా ఇవతలివారు అమానుష చర్యలకు పూనుకోవడం మనం చూస్తూనే ఉన్నాము.
ద్వేషం అనే రాక్షసిని పట్టి బంధించాలంటే అలాంటి ద్వేషపూరితమైన హింసాకాండకు మూలాలేమిటో మనం అర్థం చేసుకోవాలి. ద్వేష భావాలు మానవ జన్యువుల్లో నాటబడివున్నాయా? అలాంటి ప్రవృత్తి నేర్చుకోబడుతుందా? విద్వేష విషవలయాన్ని విచ్ఛిన్నం చేయడం సాధ్యమేనా?(g01 8/8)
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Kemal Jufri/Sipa Press