కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

వివాహాలను కాపాడుకోవడం తేజరిల్లు! (ఏప్రిల్‌ - జూన్‌ 2001) సంచికలో “మేము మా వివాహాన్ని కాపాడుకోగలమా?” అన్న శీర్షికను ప్రచురించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం క్రితం నాకూ నా భార్యకూ మధ్యన సమస్యలు తలెత్తాయి. మేమిద్దరమూ, తరచూ కోపంతో గొడవలుపడే కుటుంబ నేపథ్యాల్లో పెరిగినవాళ్ళం. కాబట్టి, మేము ఒకర్నొకరం నొప్పించుకునే మాటలు అనుకునే వాళ్ళం, అలా పరిస్థితులు చేజారిపోయేవి. కానీ మేము బైబిలు సూత్రాలను ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాం. కనుక ఇప్పుడు సంతోషంగా ఉన్నాం.

ఆర్‌. ఓ., అమెరికా (g01 8/22)

ప్రేమరహిత వివాహ జీవితంలో ఇరుక్కుపోయామని భావించేవారికి సహాయపడడానికి ప్రయత్నం చేయడమే ఒక సంఘ పెద్దగా, నాకెదురయ్యే అత్యంత సవాలుతో కూడిన పరిస్థితుల్లో ఒకటి. అనేక సంవత్సరాలుగా ప్రచురణల ద్వారా మనకు కావలసినంత లేఖనాధార ఉపదేశం లభించిందనడంలో సందేహం లేదు. అయినప్పటికి అలాంటివారికి మరింత సూటిగా ఇవ్వగల సహాయం ఇందులో ఉందని ఈ సంచిక ముఖచిత్రం చూసినప్పుడే అర్థమైంది. ఈ ఆర్టికల్‌లు, నాకు ఆశాభంగం కలిగించలేదు!

ఎల్‌. ఆర్‌., అమెరికా (g01 8/22)

నా వివాహ జీవితానికి ఒక గమ్యమంటూ లేకుండా పోయింది. నేనూ మా వారూ ఒకళ్ళనొకళ్ళం ప్రేమించుకోవడం లేదనీ, ఒకళ్ళనొకళ్ళు భరించడం మాత్రమే జరుగుతోందనీ అనిపించింది. విడాకులు తీసుకోవాలని కొన్నిసార్లు నేననుకునేదాన్ని. కానీ, “మేము మా వివాహాన్ని కాపాడుకోగలమా?” అన్న ఈ ఆర్టికల్‌ల పరంపర (ఏప్రిల్‌ - జూన్‌ 2001) మూలంగా మా ప్రేమ మళ్ళీ అంకురించింది.

ఈ. ఆర్‌., స్పెయిన్‌ (g01 9/8)

నేను పెళ్ళైన ఒక క్రైస్తవురాలను. కానీ గత సంవత్సరం మా వివాహ జీవితం చాలా దుర్భరంగా ఉండేది. ఎందుకంటే, నేనూ మా వారూ ఒకరినొకరం మనస్సు బాగా నొప్పించుకునేవాళ్ళం. మా మధ్య మునుపటిలా మళ్ళీ సత్సంబంధాలు ఏర్పడడం అసాధ్యమని అనిపించింది. కానీ నేనీ ఆర్టికల్‌లను చదివినప్పుడు, ‘నిరాశపడవద్దు!’ అని యెహోవాయే నాతో చెబుతున్నట్లు అనిపించింది. ఒకప్పుడు మా మధ్య ఉండిన ఆర్ద్రమైన అనురాగం మళ్ళీ పుట్టేందుకు నా వైపు నుండి నేను కొన్ని ప్రయత్నాలు చేసేందుకు పురికొల్పబడ్డాను. దానికి ప్రతిస్పందన కూడా రావడం మొదలైంది. నేను ఈ ఆర్టికల్‌లను మళ్ళీ మళ్ళీ చదువుతుంటాను.

ఎన్‌. హెచ్‌., జపాన్‌ (g01 9/8

నేను ఇటీవలే బాప్తిస్మం పొందాను, అవిశ్వాసురాలైన నా భార్య నుండి వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నాను. నేను మా వివాహజీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో గ్రహించేందుకు మీ ఆర్టికల్‌లు నాకు చాలా సహాయపడ్డాయి. అవి సరిగ్గా సమయానికి వచ్చాయి.

డబ్ల్యు. ఎస్‌., ఆస్ట్రేలియా (g01 9/8)

మా వివాహ జీవితం సంతోషభరితంగానే ఉంది కాబట్టి, ఇతరులకు సహాయపడేందుకు ఉపయోగపడతాయన్న తలంపుతో నేను ఈ ఆర్టికల్‌లను చదవనారంభించాను. కానీ మా వివాహబంధాన్నే మరింత పటిష్ఠం చేయగల ఆచరణాత్మకమైన పాయింట్లను ఈ శీర్షిక దాని ప్రారంభం నుండే చర్చించడం మొదలుపెట్టింది.

ఎమ్‌. డి., ఇటలీ (g01 9/8)

మా సంఘంలోని ఒక క్రైస్తవ సహోదరి తనూ, అవిశ్వాసియైన తన భర్తా తరచూ ఘర్షణపడేవారమనీ, ఇప్పుడు విడిపోయామనీ నాకు చెప్పింది. కానీ కొన్నాళ్ళ తర్వాత పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయని ఆమె మళ్ళీ చెప్పింది. ఆమె ఈ ఆర్టికల్‌లను “ఎంతో ఆతురతతో చదివింది.” తమ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇవి ఆమెకు ఎంతో సహాయపడ్డాయి. ముఖ్యంగా మనస్సు విప్పి మాట్లాడుకోవడంపై చేసిన వ్యాఖ్యానాలు ఉపయోగకరంగా ఉన్నాయని ఆమె చెప్పింది. ఆమే ఆమె భర్తా ఇప్పుడు కలిసుంటున్నారు.

ఎన్‌. ఎస్‌., కెనడా (g01 9/8)

చిన్నారుల పళ్ళు తమ పిల్లల పళ్ళను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలన్న విషయాన్ని తల్లులకు బోధించే పనిని దంతవైద్యుని కార్యాలయంలో నా పనిలో భాగంగా చేస్తాను. “సుకుమారమైన పళ్లను కాపాడడం” అనే ఆర్టికల్‌ (జనవరి - మార్చి 2001) నాకెంతో సహాయం చేసింది, ఎలాగంటే, పాపాయి పళ్ళు పులుపుకు బ్యాక్టీరియా దాడికీ గురయ్యే ప్రమాదాన్ని గురించి వివరిస్తుంది. నన్ను సంప్రదించే తల్లులందరూ, ఇప్పుడు ఈ ప్రతిని పొందుతున్నారు, దాని ఫలితం చాలా అమోఘంగా ఉంది!

టీ.సి.ఎస్‌., బ్రెజీల్‌ (g01 7/8)