విద్వేష విషవలయాన్ని విచ్ఛిన్నం చేయండి
విద్వేష విషవలయాన్ని విచ్ఛిన్నం చేయండి
“మీ శత్రువులను ప్రేమించుడి.”—మత్తయి 5:44.
ఎన్నో రోజులపాటు ఆ రెండు శత్రు దేశాల నాయకులు పెద్ద ఎత్తున శాంతి చర్చలు జరిపారు. శక్తివంతమైన ఒక పారిశ్రామిక దేశాధ్యక్షుడు ఆ చర్చలకు హాజరై, ఆ ఇద్దరు నాయకులను ఒక్క త్రాటిమీదికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ తనకున్న గొప్ప పలుకుబడిని, రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించాడు. కానీ వేదనతో నిండిన ఆ ప్రయత్నాల ఫలితంగా వేదన అధికమైందే తప్ప తగ్గలేదు. ఆ తర్వాత కొన్ని వారాలకే, “రెండు దశాబ్దాల్లోనే అత్యంత ఘోరమైన హింసాత్మక సంఘటనలకు” ఆ రెండు దేశాలూ పాల్పడ్డాయని న్యూస్‌వీక్ పత్రిక వర్ణించింది.
ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు జాతుల మధ్యా దేశాల మధ్యా ఉన్న ద్వేషము, శత్రుత్వ భావాలు జాతీయ నాయకులు ఎంతగా కృషి చేసినప్పటికీ అవి సమసిపోవడానికి ససేమిరా అంటున్నాయి. అజ్ఞానం, స్వవిశ్వాస పక్షపాతం, దుష్ప్రచారం వంటివి ఊతనివ్వడంతో విద్వేష వలయం వేగంగా గిర్రున తిరుగుతోంది. కానీ నేటి నాయకులు నూతన వినూత్న పరిష్కారాల కోసం వ్యర్థంగా వెదుకుతూ, చాలా పాతదే అయినప్పటికీ కొండమీది ప్రసంగంలోని అంశాలే అతి శ్రేష్ఠమైన పరిష్కార మార్గాలని గ్రహించడంలో విఫలమౌతున్నారు. ఆ ప్రసంగంలో దేవుని విధానాలకు లోబడమని యేసుక్రీస్తు తన శ్రోతలను ప్రోత్సహించాడు. ఆ సందర్భంలోనే ఆయన పైన ఉదహరించబడిన “మీ శత్రువులను ప్రేమించుడి” అనే వ్యాఖ్యానాన్ని చేశాడు. ఆ పురికొల్పు ద్వేషం దురభిమానం అనే సమస్యలకు అతి శ్రేష్ఠమైన పరిష్కారం మాత్రమే కాదు, అది మాత్రమే ఆచరణ సాధ్యమైన పరిష్కారం!
శత్రువులను ప్రేమించడమన్న తలంపును, మరీ ఆదర్శవంతమైనదని ఏమాత్రం ఆచరణయోగ్యం కాదని సంశయవాదులు కొట్టిపారేస్తారు. అయితే, ద్వేషం అనేది నేర్చుకోబడే లక్షణం అయితే, ద్వేషించకుండా ఉండడం కూడా నేర్చుకోవడం సాధ్యమన్న విషయం సహేతుకం కాదా? అలా యేసు మాటలు మానవజాతికి నిజమైన నిరీక్షణను అందిస్తున్నాయి. దీర్ఘకాలిక శత్రుభావాలు సహితం తీసి ప్రక్కనబెట్టడం సాధ్యమని ఆ మాటలు చూపిస్తున్నాయి.
యేసు చెప్పేది వింటున్న యూదామతస్థులైన శ్రోతల పరిస్థితిని గురించి ఆలోచించండి. శత్రువుల కోసం వాళ్ళు ఎంతో దూరం వెళ్ళాల్సిన పనిలేదు. ఆ ప్రాంతంలో రోమన్ల దండ్లు నడుములు విరిచే పన్నులు విధిస్తూ, రాజకీయాలు నడిపిస్తూ, దుశ్చర్యలకు పాల్పడుతూ, ప్రజలను అన్యాయంగా స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూనేవున్నాయి. (మత్తయి 5:39-42) అయితే కొందరు, చిన్న చిన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకోకుండా వాటిని పెరగడానికి అనుమతించినందున తమ తోటి యూదులను కూడా శత్రువులుగానే దృష్టిస్తుండవచ్చు. (మత్తయి 5:21-24) తమను గాయపరచిన, బాధపెట్టిన వ్యక్తులను తన శ్రోతలు ప్రేమించాలని యేసు నిజంగానే అపేక్షించగలడా?
“ప్రేమ” అంటే
మొట్టమొదటిగా, “ప్రేమ” అన్నప్పుడు సన్నిహిత మిత్రుల మధ్య ఉండే అనురాగం యేసు మనస్సులో లేదు. మత్తయి 5:44 లో ప్రేమ అన్న పదానికి ఉపయోగించబడిన మాట అగాపే అన్న గ్రీకు పదం నుండి వస్తుంది. ఈ మాటకు, సూత్రాలచే నిర్దేశించబడిన లేదా నడిపించబడిన ప్రేమ అని అర్థముంది. అందులో హృదయపూర్వకమైన అనురాగం ఇమిడివుండకపోవచ్చు. అలాంటి ప్రేమ నీతియుక్తమైన సూత్రాలచే నిర్దేశించబడుతుంది గనుక, అది ఇతరుల పూర్తి ప్రయోజనార్థం పనిచేసేందుకు ప్రయత్నించేలా ఒకరిని కదిలిస్తుంది, వారి ప్రవర్తనతో ఏమాత్రం ప్రమేయం ఉండదు. ఆ విధంగా అగాపే ప్రేమ వ్యక్తిగత వైషమ్యాలను అధిగమించగలదు. యేసు తనను వ్రేలాడదీసిన రోమా సైనికులపైకి శాపాలను కురిపించడానికి బదులుగా, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు” అని ప్రార్థించినప్పుడు ఆయన స్వయంగా అలాంటి ప్రేమను చూపించాడు.—లూకా 23:34.
లోకంలోని ప్రజలంతా ఒక్కుమ్మడిగా యేసు బోధలను హత్తుకుంటారనీ వారు ఒకరినొకరు ప్రేమిస్తారనీ ఆశించడం వాస్తవికమేనా? కాదు, ఎందుకంటే ఈ లోకం వినాశనంలోకి క్షణక్షణం కూరుకుపోతూనే ఉంటుందని బైబిలు సూచిస్తోంది. “దుర్జనులును వంచకులును . . . అంతకంతకు చెడిపోవుదురు” అని 2 తిమోతి 3:13 ప్రవచిస్తోంది. అయితే, వ్యక్తులు వైయక్తికంగా బైబిలు అధ్యయనం చేస్తూ నీతియుక్త సూత్రాల్లో సంపూర్ణ బోధను పొందడం ద్వారా విద్వేష వలయాన్ని విచ్ఛిన్నం చేయగలరు. ఆ విధంగా వారు, తమకు సమీపంలోనే గిర్రున తిరుగుతున్న విద్వేష సుడిగుండంలో పడిపోకుండా ఎలా పోరాడాలో నేర్చుకున్నారని నివేదిక స్పష్టంగా చూపిస్తోంది. కొన్ని నిజజీవిత అనుభవాలను పరిశీలించండి.
ప్రేమించడం నేర్చుకున్నారు
13 ఏండ్ల వయస్సులో హోసే ఒక ఉగ్రవాద గ్రూపులో సభ్యుడిగా గెరిల్లా యుద్ధాల్లో పాల్గొన్నాడు. * తన చుట్టూ చూస్తున్న అన్యాయాలకు ఫలాని వ్యక్తులు బాధ్యులని చెప్పడంతో వారిని ద్వేషించడం ఆయనకు నేర్పించబడింది. సాధ్యమైతే వారిని నిర్మూలించాలనన్నదే ఆయన లక్ష్యంగా మారింది. తన తోటివారు అనేకమంది మృత్యు కోరల్లో చిక్కుకోవడం చూసి హోసేలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి, ప్రతీకారం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నాడు. ఆయన చేతిబాంబులు తయారుచేస్తూ, ‘ఎందుకిన్ని బాధలు? దేవుడంటూ ఉంటే అసలెందుకు పట్టించుకోడు?’ అని తనను తాను ప్రశ్నించుకునేవాడు. ఆయనకు ఏమీ అంతు చిక్కక అనేకసార్లు ఏడ్చాడు, క్రుంగిపోయాడు.
హోసేకు చివరికి స్థానిక యెహోవాసాక్షుల సంఘంతో పరిచయం ఏర్పడింది. తను హాజరైన మొదటి సంఘ కూటమిలో ఆయన అక్కడి ప్రేమపూర్వక వాతావరణాన్ని వెంటనే గుర్తించాడు. అందరూ ఆయనను ప్రేమతో స్నేహపూర్వకంగా పలకరించారు. అటు తర్వాత “దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు?” అన్న విషయంపై జరిగిన చర్చలో, సరిగ్గా తన మదిలో మెదులుతుండే ప్రశ్నలకు జవాబులు లభించాయి. *
కొంతకాలానికి బైబిలు పరిజ్ఞానం, హోసే తన జీవితంలోను తన ఆలోచనా విధానంలోను మార్పులు చేసుకునేందుకు నడిపించింది. “ప్రేమ లేని వాడు మరణమందు 1 యోహాను 3:14, 15.
నిలిచియున్నాడు. . . . ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండ[దు]” అని ఆయన నేర్చుకున్నాడు.—అయితే, ఉగ్రవాదులైన సహచరులతో తన సంబంధాలను తెంచుకోవడం ఆయనకు ఒక సవాలుగా మారింది. ఆయన యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్ళిన ప్రతీసారి ఆయనను ఎవరో ఒకరు వెంబడించేవారు. హోసేలో అలాంటి మార్పును తీసుకువచ్చినదేమిటో అర్థం చేసుకోవడానికి ఆయన పూర్వపు సహచరుల్లో కొందరు కొన్ని కూటాలకు కూడా హాజరయ్యారు. ఆయన విద్రోహిగా మారలేదని, తమకు ఎలాంటి ప్రమాదమూ తీసుకురాడని వారికి నమ్మకం కుదిరిన తర్వాత వారిక ఆయనను వెంబడించడం మానేశారు. 17 ఏండ్ల వయస్సులో హోసే యెహోవాసాక్షిగా బాప్తిస్మం పొందాడు. ఆయన త్వరలోనే పూర్తికాలం ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రజలను చంపడం ఎలాగో పథకాలు వేసే బదులు ఆయనిప్పుడు ప్రజల దగ్గరికి ప్రేమా నిరీక్షణల సందేశాన్ని తీసుకువెళ్తున్నాడు!
జాతిపరమైన ప్రతిబంధకాలను కూల్చివేయడం
వివిధ జాతులకు చెందిన ప్రజలు తమను విభజిస్తున్న విద్వేష ప్రతిబంధకాలను కూల్చివేయగలరా? ఇంగ్లాండులోని లండన్‌లో అంహరిక్ భాష మాట్లాడే యెహోవాసాక్షుల ఒక గ్రూపును పరిశీలించండి. ఆ గ్రూపులో 35 మంది ఉన్నారు—20 మంది ఇతియోపియన్లు, 15 మంది ఎరిట్రియన్లు. ఆఫ్రికాలో ఎరిట్రియన్లు ఇతియోపియన్లు ఇటీవలనే ఘోరమైన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ వారు శాంతియుతంగా, ఐక్యతతో ఆరాధిస్తారు.
ఒక ఇతియోపియా సాక్షికి ఆయన కుటుంబ సభ్యులు, ‘ఎరిట్రియన్లను ఎన్నడూ నమ్మవద్దు!’ అని చెప్పారు. కానీ ఆయన తన తోటి ఎరిట్రియా క్రైస్తవులను నమ్మడం మాత్రమే కాదు వారిని బ్రదర్, సిస్టర్ అని కూడా పిలుస్తాడు! ఈ ఎరిట్రియన్లు సాధారణంగా టైగ్రీన్య మాట్లాడేవారే అయినప్పటికీ వారు తమ ఇతియోపియా సహోదరులతో కలిసి బైబిలును అధ్యయనం చేయగలిగేలా వారి భాషైన అంహరిక్ నేర్చుకోవాలనుకున్నారు. “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ”గా దైవిక ప్రేమ ఎంత బలమైనదన్న దానికి ఎంత అద్భుతమైన రుజువు!—కొలొస్సయులు 3:14.
గతం గతః
కానీ ఎవరైనా అమానుష చర్యలకు గురైతే అప్పుడేమిటి? తనను హింసించిన వారిపట్ల శత్రుభావాలను కలిగివుండడం సహజం కాదా? జర్మనీలోని మాన్‌ఫ్రేట్ అనే ఒక సాక్షి విషయం ఆలోచించండి. ఆయన కేవలం యెహోవాసాక్షి అయినందుకే తన జీవితంలో ఆరు సంవత్సరాలు ఒక కమ్యూనిస్టు జైల్లో గడిపాడు. ఆయన తనను అణగద్రొక్కిన వారిపట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడా లేక పగ తీర్చుకోవాలని అనుకున్నాడా? “లేదు” అని ఆయన జవాబిచ్చాడు. జర్మన్ వార్తాపత్రిక జార్‌బ్రూకా ట్సైటుంగ్ ప్రకారం మాన్‌ఫ్రేట్ ఇలా రోమీయులు 12:17, 18.
వివరించాడు: “అన్యాయం తలపెట్టడం, లేదా అన్యాయానికి ప్రతిగా మరో అన్యాయం చేయడం . . . ఒక వలయాన్ని సృష్టిస్తుంది, ఈ వలయంలో మళ్ళీ మళ్ళీ క్రొత్త అన్యాయాలు సంభవిస్తుంటాయి.” మాన్‌ఫ్రేట్ స్పష్టంగా ఈ బైబిలు మాటలను అన్వయించుకున్నాడు: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; . . . శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”—ద్వేషం లేని లోకం!
ఈ విషయంలో తాము పరిపూర్ణులమని యెహోవాసాక్షులు చెప్పుకోరు. పాత శత్రుత్వ భావాలను, పాత ద్వేషాలను ప్రక్కన పెట్టడం సులువు కాదని వారు తరచు కనుగొంటారు. అందుకు ఒక వ్యక్తి తన జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడానికి క్రమమైన రీతిలో గట్టి కృషి చేయడం అవసరమౌతుంది. కానీ మొత్తంగా చూస్తే విద్వేష వలయాన్ని విచ్ఛిన్నం చేయడంలో బైబిలుకున్న శక్తికి యెహోవాసాక్షులు సజీవ సాక్ష్యంగా ఉన్నారు. జాత్యహంకారపు, స్వవిశ్వాస పక్షపాతపు సంకెళ్ళను విచ్ఛిన్నం చేయడానికి సాక్షులు గృహ బైబిలు అధ్యయన కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం వేలాదిమందికి సహాయం చేస్తున్నారు. * (“ద్వేషాన్ని నిర్మూలించడానికి బైబిలు సలహా సహాయం చేస్తుంది” అనే బాక్సు చూడండి.) ఈ విజయం, ద్వేషాన్నీ దాని కారకాలనూ త్వరలోనే నిర్మూలించడంలో సహాయపడే ప్రపంచవ్యాప్త బైబిలు విద్యా కార్యక్రమ ఫలితాలకు ముంగుర్తుగా ఉంది. భవిష్యత్తులోని ఈ విద్యా కార్యక్రమం దేవుని రాజ్య, అంటే భూగోళవ్యాప్త ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది. పరలోక ప్రార్థనలో యేసు “నీ రాజ్యము వచ్చుగాక” అన్నప్పుడు ఆయన ఆ రాజ్యం కోసమే ప్రార్థించమని మనకు నేర్పించాడు.—మత్తయి 6:9, 10.
ఆ పరలోక ప్రభుత్వ పర్యవేక్షణలో, “లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును” అని బైబిలు వాగ్దానం చేస్తోంది. (యెషయా 11:9; 54:13) అప్పుడు, తరచు ఎత్తిచెప్పబడే యెషయా ప్రవక్త మాటలు భూవ్యాప్తంగా నెరవేరతాయి: “[దేవుడు] మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (యెషయా 2:4) ఆ విధంగా దేవుడు తానుగా విద్వేషమనే విష వలయాన్ని ఇక మరెన్నడూ ఉండకుండా సంపూర్ణంగా తుత్తునియలు చేస్తాడు.(g01 8/8)
[అధస్సూచీలు]
^ ఆయన అసలు పేరు కాదు.
^ యెహోవాసాక్షులచే ప్రచురించబడిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలో “దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు?” అనే 8వ అధ్యాయాన్ని చూడండి.
^ యెహోవాసాక్షులను స్థానికంగా సంప్రదించినా, లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాసినా ఒక ఉచిత గృహ బైబిలు అధ్యయనం మీకు ఏర్పాటు చేయబడుతుంది.
[11వ పేజీలోని బాక్సు]
ద్వేషాన్ని నిర్మూలించడానికి బైబిలు సలహా సహాయం చేస్తుంది
● “మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?” (యాకోబు 4:1) స్వార్థపరమైన కోరికలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటే మనం ఇతరులతో సంఘర్షణలను సాధారణంగా నివారించగలము.
● “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.” (ఫిలిప్పీయులు 2:4) ఇతరుల ప్రయోజనాలను మన ప్రయోజనాలకన్నా ముందుంచడం అనవసరమైన సంఘర్షణలను నివారించడానికి మరో మార్గం.
● “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము అది కీడుకే కారణము.” (కీర్తన 37:8) వినాశకరమైన ప్రవృత్తులను మనం అదుపులో పెట్టుకోగలము, పెట్టుకోవాలి.
● ‘యావద్భూమిమీద కాపురముండుటకు [దేవుడు] యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టిం[చాడు].’ (అపొస్తలుల కార్యములు 17:24, 26) ఇతర జాతి ప్రజలకన్నా ఉన్నతులం అని భావించడం నిర్హేతుకం, ఎందుకంటే మనందరం ఒకే మానవ కుటుంబ సభ్యులం.
● “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచు[డి].” (ఫిలిప్పీయులు 2:3) ఇతరులను చిన్నచూపు చూడడం తప్పు—ఎందుకంటే తరచు మనలో లేని మంచి లక్షణాలు సామర్థ్యాలు ఇతరుల్లో ఉంటాయి. మంచి అంతటిపైనా ఏ ఒక్క జాతికి గాని సంస్కృతికి గాని గుత్తాధిపత్యం ఏమీ లేదు.
● “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:10) జాతితో సంస్కృతితో నిమిత్తం లేకుండా ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండడం, వారికి సహాయం చేయడానికి చొరవ తీసుకోవడం చాలు, అది మాట్లాడకుండా చేసే అగాధాలను పూడ్చేయగలదు, అపార్థాల్ని నిర్మూలించగలదు.
[8, 9వ పేజీలోని చిత్రాలు]
ఇతియోపియా ఎరిట్రియా సాక్షులు కలిసి శాంతిపూర్వకంగా ఆరాధిస్తున్నారు
[10వ పేజీలోని చిత్రం]
ఒకప్పుడు కమ్యూనిస్టు జైలులో ఉన్న మాన్‌ఫ్రేట్ ద్వేషానికి లొంగిపోవడానికి నిరాకరించాడు
[10వ పేజీలోని చిత్రం]
ప్రజలను విభజించే ప్రతిబంధకాలను కూల్చివేయడానికి బైబిలు సహాయం చేయగలదు