కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కోళ్ళు సర్వజనప్రియం, సర్వత్రా లభ్యం

కోళ్ళు సర్వజనప్రియం, సర్వత్రా లభ్యం

కోళ్ళు సర్వజనప్రియం, సర్వత్రా లభ్యం

కెన్యాలోని తేజరిల్లు! రచయిత

భూమిపైనున్న పక్షులన్నింట్లో బహుశ కోళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉండివుంటుంది. 1,300 కోట్లకుపైగా ఉన్నాయని అంచనాలున్నాయి! దాని మాంసాన్ని ప్రజలు ఎంతో ఇష్టపడతారు, అందుకే ప్రతి సంవత్సరం 3,314 కోట్ల కిలోలకుపైగా కోడి మాంసాన్ని ప్రజలు తింటున్నారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా కోళ్ళు ప్రతి సంవత్సరం 60,000 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాయి.

పాశ్చాత్య దేశాల్లో కోళ్ళు సమృద్ధిగా ఉన్నాయి అలాగే తక్కువ ధరకు లభిస్తాయి. కొన్ని దశాబ్దాల క్రితం, అమెరికాలో ఒక అభ్యర్థిని గెలిపిస్తే ప్రతి ఇంట్లో కోడిమాంసం ఉంటుందని ఓటర్లకు వాగ్దానం చేయబడింది. కానీ నేడు కోడి మాంసం మునుపటిలా ఖరీదైనదీ కాదు, కేవలం కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండేదీ కాదు. ఈ విశేషమైన పక్షి ఇంత విస్తృతంగా లభ్యమవుతూ ఇంత జనాదరణ ఎలా పొందింది? మరి పేద దేశాల సంగతేమిటి? ఈ విస్తృతిలో వారు కూడా పాలుపంచుకునే అవకాశముందా?

పక్షి వివరాలు

కోడి, ఆసియాలోని ఎర్ర అడవి కోడి జాతికి చెందినది. మానవుడు కోడిని సులభంగా మచ్చిక చేసుకోవచ్చని కనుగొన్నాడు. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు కోడి తన పిల్లలను రక్షించేందుకు రెక్కల క్రిందికి ఎలా చేర్చుకుంటుందో చెబుతూ దాని గురించి ప్రస్తావించాడు. (మత్తయి 23:​37; 26:​34) అటువంటి ఉపమానాన్ని ఉపయోగించడం, ప్రజలకు ఈ పక్షి బాగా తెలుసని సూచిస్తోంది. కాని కోళ్ళను, గుడ్లను వాణిజ్యపరంగా భారీఎత్తున ఉత్పత్తి చేయడమనేది 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది.

నేడు కోడిమాంసానికి జనాదరణ అత్యధికంగా ఉంది. కోట్లాది కుటుంబాలు​—⁠పట్టణాల్లోని కుటుంబాలతో సహా కోళ్ళను ఇంట్లో ఉపయోగానికీ వ్యాపారం కొరకూ పెంచుతున్నారు. నిజానికి, భిన్నమైన భౌగోళిక స్థితిగతులున్న ప్రాంతాల్లో జీవించగల కోళ్ళలాంటి ప్రాణులు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా దేశాలు తమ దేశంలోని వాతావరణ పరిస్థితులకూ, తమ అవసరాలకూ అనుకూలంగా ఉండే ప్రత్యేకమైన కోళ్ళ జాతులను అభివృద్ధి చేశారు. వాటిలో కొన్ని: ఆస్ట్రేలియాలోని ఆస్ట్రలార్ప్‌; మధ్యధరా ప్రాంతం నుండి వచ్చినప్పటికీ అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధమైన లెగ్‌హార్న్‌; అమెరికాలో పెంచబడుతున్న న్యూ హాంప్‌షైర్‌, ప్లిమత్‌ రాక్‌, రోడ్‌ ఐలాండ్‌ రెడ్‌, వ్యాన్‌డాట్‌; ఇంగ్లాండ్‌ నుంచి కార్నిష్‌, ఆర్పింగ్‌టన్‌, సస్సెక్స్‌లు.

ఆధునిక శాస్త్రీయ పెంపకపు పద్ధతులు, కోళ్ళ పెంపకాన్ని వ్యవసాయ పరిశ్రమల్లోని అత్యంత ఫలవంతమైన వాటిలో ఒకటయ్యేలా చేశాయి. అమెరికాలోని వ్యవసాయదారులు మేత పెట్టే విషయంలో, వసతి కల్పించే విషయంలో జాగ్రత్తతో కూడిన క్రమబద్ధమైన పద్ధతులను, శాస్త్రీయమైన వ్యాధి నివారణా పద్ధతులను పాటిస్తారు. ఇలా భారీ ఎత్తున ఉత్పత్తి చేసే విధానాలను చాలామంది ప్రజలు క్రూరమైనవని ఖండిస్తారు. కాని అది వ్యవసాయదారులు ఈ పక్షులను పెంచడానికి ఎంతో సమర్థవంతమైన పద్ధతులను వృద్ధి చేయకుండా ఆపలేదు. ఆధునిక విధానాల వల్ల కేవలం ఒక్క వ్యక్తి 25,000 నుంచి 50,000 కోళ్ళను సహితం శ్రద్ధగా చూసుకోగలడు. పక్షులు కేవలం మూడు నెలల్లోనే అమ్మడానికి కావల్సిన బరువును చేరుకుంటాయి. *

కోడి మాంసం

ఏ హోటల్‌నైనా, రెస్టారెంట్‌నైనా, లేక దాబాలాంటి ప్రదేశాన్నైనా సందర్శించండి, మెనూలో కోడి మాంసం కనబడకపోవడమనేది చాలా అరుదు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగావున్న ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో అనేకం కోడి మాంసాన్ని ప్రత్యేక విధాల్లో అందిస్తాయి. కొన్ని సమాజాల్లో ఇప్పటికి ప్రత్యేక సందర్భాలకు కోడి మాంసాన్నే ఎన్నుకుంటారు. భారతదేశము వంటి కొన్ని దేశాల్లో ఈ పక్షి మాంసాన్ని ఆకర్షణీయమైన విధాలుగా అందించడం అధికమయ్యింది. లాల్‌ ముర్గి అనే మిరపకాయల కోడి మాంసం; కుర్గి ముర్గి అనే కోడి మాంసం; అద్రక్‌ ముర్గి అనే అల్లంతో తయారు చేసిన కోడి మాంసం వంటి వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి!

కోడి మాంసం ఇంత జనాదరణను ఎందుకు పొందింది? ఒక కారణమేమిటంటే, కోడి మాంసం ఏ విధంగా వండినా రుచికరంగా ఉంటుంది. దాన్ని ఎలా వండితే మీకిష్టం? వేపుడా, నిప్పులపై కాల్చినదా, ఉడకబెట్టినదా, బ్రెయిస్‌ చేసినదా, చారులా వండినదా? ఏ వంటల పుస్తకాన్నైనా తెరవండి, ప్రతి ముక్కను ఆస్వాదించేటట్టు కోడి మాంసాన్ని తయారుచేయడానికి ఎన్నో వంటకాలు మీకు కనబడతాయి.

కోళ్ళు చాలా దేశాలలో దొరకడం వల్ల కోడి మాంసం ఖరీదైనదేమీ కాదు. పోషకాహార నిపుణులకు కూడా ఇది ఇష్టమే ఎందుకంటే శరీరానికి ఆవశ్యకమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు దానిలో ఉన్నాయి. అయినప్పటికీ కోడి మాంసంలో క్యాలరీలు, సంతృప్త క్రొవ్వులు, మరితర క్రొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలను పోషించడం

అన్ని దేశాల్లోను పౌల్ట్రీ ఉత్పత్తులు సమృద్ధిగా లేవు. కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోసం పనిచేసే ఒక ప్రత్యేక విభాగం సమర్పించిన నివేదిక దృష్ట్యా ఆ విషయం చాలా గమనార్హమైనది. ఆ నివేదిక ఇలా అంటోంది: “2020వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభా 770 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.  . . కాని దీనిలో అధిక శాతం (95%) అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరుగుతుందని ఊహించబడుతోంది.” ఇప్పటికే దాదాపు 80 కోట్లమంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అన్న విషయాన్ని గమనిస్తే పైన చెప్పబడిన మాట తీవ్రత పెరుగుతుంది!

అయినప్పటికీ, ఆకలితో ఉన్న జనాభాకి భోజనం కల్పించడంలోను, పెంపకందారులకు అవసరమైన ఆదాయాన్ని కల్పించడంలోను కోళ్ళు ముఖ్యమైన పాత్ర వహించగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాని సమస్యేమిటంటే పెద్ద ఎత్తున కోళ్ళ పెంపకమనేది పేదవారికి ఒక సవాలే. పేద దేశాలలో కోళ్ళను సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో లేక ఇంటి వెనక పెరట్లలో పెంచుతారు. ఇటువంటి దేశాలలో కోళ్ళకు మంచి పరిసరాల్లో వసతి కల్పించడమనేది అరుదుగా జరుగుతుంది. అవి రోజంతా బైట తిరిగి, ఆహారం వెతుక్కోవడానికి వదిలెయ్యబడతాయి, రాత్రికి ఇంటికి చేరుకుని చెట్లమీద లేక ఇనుప పంజరాలలో నిద్రిస్తాయి.

ఇలా పెంచబడ్డ కోళ్ళు చనిపోతాయనడంలో ఆశ్చర్యం లేదు​—⁠కొన్ని భయంకరమైన కొక్కెర వ్యాధితో మరణిస్తే, మరికొన్ని ఇతర జంతువుల మూలంగా మనుషుల మూలంగా చనిపోతాయి. చాలామంది పెంపకందారులకు తమ కోళ్ళకు మంచి ఆహారం పెట్టడానికి, మంచి వసతి కల్పించడానికి, వ్యాధులనుండి కాపాడడానికి ఏమి చేయాలో తెలీదు, అందుకు కావాల్సిన డబ్బు కూడా ఉండదు. ఆ కారణంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెంపకందారులకు శిక్షణనివ్వడానికి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఉదాహరణకు, అమెరికా ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఇటీవలే “పౌల్ట్రీ ఉత్పత్తులను అధికం చేయడం ద్వారా ఆఫ్రికాలోని పేద గ్రామీణ ప్రజలకు సహాయం చేయడానికి” ఐదేళ్ళ పథకాన్ని ప్రారంభించింది.

ఇలాంటి మంచి ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను తెస్తాయో వేచి చూడవలసి ఉంది. అధిక శాతం భూనివాసులకి కేవలం ఒకే ఒక్క మాంసపు ముక్క కూడా ఏదో విలాసవంతులు మాత్రమే ఆస్వాదించే ఆహారంగా కనిపిస్తుందన్న వాస్తవాన్ని ధనిక దేశాల ప్రజలు ఆలోచించాలి. అలాంటి వారికి ‘ప్రతి ఇంటిలోను కోడి మాంసం’ ఉండడమనేది ఆశించినా నెరవేరని కలలాగే ఉంటుంది. (g01 10/8)

[అధస్సూచి]

^ కోళ్ళను గుడ్ల కొరకు పెంచినప్పటికీ, అమెరికాలో 90 శాతం కోళ్ళను మాంసం కొరకే పెంచుతారు.

[25వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

పచ్చి మాంసము విషయంలో జాగ్రత్తగా ఉండండి

పచ్చి మాంసం హానికరమైనవిగా మారగల సాల్మొనెల్లా బాక్టీరియా వంటి క్రిములను కలిగి ఉండగలదు, కాబట్టి దాన్ని వండేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ చేతులను, కొయ్యడానికి ఉపయోగించే బల్లను, కత్తిపీటను, పౌల్ట్రీ కత్తులను, మాంసాన్ని కొయ్యడానికి ముందూ కోసిన తర్వాతా వేడి సబ్బు నీటిలో కడగండి. సాధ్యమైతే వేడి నీటిలో కడగగలిగే ఛాపింగ్‌ బోర్డును, కేవలం మాంసం కోయడానికి మాత్రమే వేరుగా ఒక ఛాపింగ్‌ బోర్డును ఉపయోగించడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టిన మాంసాన్ని వండడానికి ముందు పూర్తిగా మెత్తబడనివ్వండి.​—⁠ద కుక్స్‌ కిచెన్‌ బైబిల్‌

[23వ పేజీలోని చిత్రాలు]

కోళ్ళలో కొన్ని రకాలు: వైట్‌ లెగ్‌హార్న్‌, తెల్ల అడవి కోడి, ఆర్పింగ్‌టన్‌, పోలిష్‌, చుక్కల సస్సెక్స్‌

[చిత్రసౌజన్యం]

వైట్‌ లెగ్‌హార్న్‌ తప్ప మిగతావి: © Barry Koffler/www.feathersite.com

[24వ పేజీలోని చిత్రాలు]

పౌల్ట్రీ ఉత్పత్తులను పెంచడానికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పెంపకందారులకు సహాయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

[24వ పేజీలోని చిత్రం]

అమెరికాలో 90 శాతం కోళ్ళను మాంసం కొరకే పెంచుతారు