కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు ఎంతవరకు సహిస్తాడు?

దేవుడు ఎంతవరకు సహిస్తాడు?

బైబిలు ఉద్దేశము

దేవుడు ఎంతవరకు సహిస్తాడు?

‘దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛయించినవాడైనను, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించాడు.’​—రోమీయులు 9:22.

చరిత్రంతటిలో దేవుడు ఎంతో చెడుతనాన్ని, విపరీతమైన దుర్మార్గాన్ని సహించాడు. 3000 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, యోబు ఇలా విలపించాడు: “దుర్మార్గులు చాలాకాలం బతుకుతారెందుకు? వారు ముసలివాళ్ళవ్వటం, విజయం పొందటం ఎందుకు? దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం చూస్తారు. దుర్మార్గులు వారి మనుమలు, మనుమరాండ్రను చూసేంతవరకు బతుకుతారు. వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం లేదు. దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు తన దండం ఉపయోగించడు.” (యోబు 21:7-9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) న్యాయాన్ని ప్రేమించే యిర్మీయా ప్రవక్తలాంటి ఇతరులు కూడా, చెడు ప్రజలపై దేవుడు సహనం చూపిస్తున్నట్లుందని తమ వ్యాకులతను వ్యక్తం చేశారు.​—యిర్మీయా 12:1, 2.

మీకేమనిపిస్తుంది? దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం వల్ల మీరు దిగ్భ్రమ చెందుతున్నారా? దేవుడు త్వరగా చర్య తీసుకుని, వెంటనే దుష్ట ప్రజలందరినీ నాశనం చేయాలి అని కొన్నిసార్లు మీకు అనిపిస్తుందా? దేవుని సహనానికున్న పరిమితులను గురించి, అలా సహించడానికి గల కారణాల గురించి బైబిలు ఏమి చెబుతోందో పరిశీలించండి.

దేవుడు ఎందుకు సహిస్తున్నాడు?

మొదట, మనమిలా ప్రశ్నించుకోవాలి: అత్యున్నతమైన నీతి ప్రమాణాలు గల దేవుడు, అసలు చెడుతనాన్ని ఎందుకు సహిస్తున్నాడు? (ద్వితీయోపదేశకాండము 32:4; హబక్కూకు 1:13) అంటే ఆయన దుష్టత్వాన్ని చూసీ చూడనట్లు ఊరుకుంటాడని దీనర్థమా? ఎంత మాత్రము కాదు! ఈ దృష్టాంతాన్ని గమనించండి: ప్రాథమిక పారిశుద్ధ్య సూత్రాలను అతిక్రమిస్తూ, రోగులను తీవ్రమైన బాధలకు గురిచేస్తున్న ఒక సర్జన్‌ ఉన్నాడని ఊహించుకోండి. ఆయన హాస్పిటల్లో పనిచేస్తున్నట్లైతే, అలాంటి సర్జన్‌ను తీసివేయడానికి హాస్పిటల్‌ వెంటనే చర్య తీసుకోదా? కానీ కొన్ని పరిస్థితుల్లో అసాధారణమైన సహనం చూపించాల్సిన అవసరం రావచ్చు. ఉదాహరణకు, బహుశా యుద్ధక్షేత్రంలోని ఒకానొక అత్యవసర పరిస్థితిలో, ప్రమాదకర స్థితుల్లో పాతకాలపు పరికరాలతో ఒక సర్జన్‌ పని చేస్తుంటే, సాధారణంగా నాసి రకముగా పరిగణించబడే పరికరాలను, శస్త్రచికిత్స ఉపకరణాలను ఉపయోగించి పనిచేస్తున్నా సహించవలసిన అవసరం రాదా?

అదే విధంగా, అసలు ఏ మాత్రం అంగీకరించతగని అనేక విషయాలను దేవుడు నేడు ఓపికతో సహిస్తున్నాడు. ఆయన దుష్టత్వాన్ని ద్వేషిస్తున్నప్పటికీ, తాత్కాలికంగా కొనసాగనిస్తున్నాడు. ఆయన అలా అనుమతించడానికి మంచి కారణాలే ఉన్నాయి. ఒక కారణమేమిటంటే, సాతాను ఏదెను తోటలో లేవదీసిన అత్యంత ప్రాముఖ్యమైన వివాదాలు మళ్ళీ తలెత్తకుండా శాశ్వతంగా పరిష్కరించడానికి సమయం ఉంటుంది. ఈ వివాదాలు, దేవుని పరిపాలనా విధానం సరైనదా, కాదా, ఆయనకు పరిపాలించే హక్కు ఉందా, లేదా అనే విషయాలతో ముడివడి ఉన్నాయి. అంతే కాకుండా, చెడుతనంపట్ల ఆయన చూపించే సహనం, చెడుతనంలో మునిగి ఉన్నవారు మారడానికి సమయాన్ని అవకాశాన్ని కూడా ఇస్తుంది.

కరుణ, సహనం చూపించే దేవుడు

మన తొలి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో సాతానుతో కలిశారు. న్యాయసమ్మతంగా, దేవుడు వారిని అప్పుడే, అక్కడే నాశనం చేయగలిగేవాడే. బదులుగా ఆయన వారు పిల్లలను కనడానికి ప్రేమపూర్వకంగా అనుమతించి, తాను కరుణ, సహనం గల దేవుడని నిరూపించుకున్నాడు. కానీ ఆ పిల్లలూ, వాళ్ళనుండి పుట్టిన మొత్తం మానవ కుటుంబం, పాపభరితులుగా జన్మించారు.​—రోమీయులు 5:12; 8:20-22.

మానవుడ్ని అతని దుఃఖస్థితి నుండి రక్షించాలని దేవుడు సంకల్పించాడు. (ఆదికాండము 3:15) అయితే, ఆదాము ద్వారా సంక్రమించిన అపరిపూర్ణత మనపై ఎలా ప్రభావం చూపగలదో ఆయన అర్థం చేసుకోగలడు కాబట్టే, మనం రక్షించబడేంతవరకు ఆయన ఎంతో ఓపికను, కరుణను చూపిస్తున్నాడు. (కీర్తన 51:5; 103:13) ఆయన ‘దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు.’​—కీర్తన 86:5, 15; యెషయా 55:6, 7.

దేవుని సహనానికి పరిమితులు

అయితే, దేవుడు చెడుతనాన్ని ఇలాగే ఎల్లకాలం కొనసాగనిస్తే, అది ప్రేమరహితమూ, నిర్హేతుకమే అవుతుంది. తన పిల్లల్లో ఒకరు బుద్ధిపూర్వకంగా, మొండిగా ఇతర కుటుంబ సభ్యులకు తీవ్రమైన బాధ కలిగిస్తుంటే, ప్రేమగల ఏ తండ్రి కూడా అతని చెడుతనాన్ని ఎల్లకాలం సహించడు. కాబట్టి, పాపం విషయంలో దేవుని సహనం, ఆయన ఇతర లక్షణాలైన ప్రేమ, జ్ఞానము, న్యాయముల ద్వారా ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటుంది. (నిర్గమకాండము 34:6, 7) ఆయన దీర్ఘశాంతము వెనుకనున్న సంకల్పం నెరవేరడం తడవు, దుష్టత్వంపట్ల ఆయన చూపించే సహనానికి తెరపడుతుంది.​—రోమీయులు 9:22.

అపొస్తలుడైన పౌలు దాన్ని స్పష్టంగా సూచించాడు. “ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను” అని ఒక సందర్భంలో అన్నాడు. (అపొస్తలుల కార్యములు 14:16) మరొక సందర్భంలో “ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా” ఎలా ఉన్నాడో పౌలు మాట్లాడాడు. ఆయనింకా ఇలా అన్నాడు, ‘ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు [దేవుడు] ఆజ్ఞాపించుచున్నాడు.’ ఎందుకు? “ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు.”​—అపొస్తలుల కార్యములు 17:30, 31.

దేవుని సహనం నుండి ఇప్పుడే ప్రయోజనం పొందండి

అలాగని, దేవుని నియమాలను నిర్లక్ష్యం చేసి తర్వాత తను చేసిన వాటి పర్యవసానాలనుండి తప్పించుకోవడానికి దేవుడ్ని క్షమించమని అడగవచ్చులే అని మాత్రం ఎవ్వరూ అనుకోకూడదు. (యెహోషువ 24:19) అలా చేయవచ్చని ప్రాచీన ఇశ్రాయేలీయుల్లో చాలామంది అనుకున్నారు. వాళ్ళు మారలేదు. దేవుడు చూపిన సహనాన్ని, ఓపికను వాళ్ళు వ్యర్థము చేసుకున్నారు. దేవుడు వారి చెడుతనాన్ని ఎల్లకాలం సహించలేదు.​—యెషయా 1:16-20.

ఒక వ్యక్తి దేవుని అంతిమ తీర్పును తప్పించుకోవాలంటే, తప్పకుండా “మారుమనస్సు” పొందాలి. అంటే తన అపరిపూర్ణతను, పాప స్థితిని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ఒప్పుకొని, చెడుతనంనుండి హృదయపూర్వకంగా తొలగిపోవాలి. (అపొస్తలుల కార్యములు 3:19-21) అప్పుడు, క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవా దేవుడు మనల్ని క్షమిస్తాడు. (అపొస్తలుల కార్యములు 2:38; ఎఫెసీయులు 1:4-7) దేవుడు తన నియమిత సమయంలో, ఆదాము పాపము వలన కలిగిన దుఃఖకరమైన ఫలితాలేవీ లేకుండా చేస్తాడు. అప్పుడు, ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ ఉంటుంది. అందులో “నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను” ఆయన ఇకపై సహించడు. (ప్రకటన 21:1-5; రోమీయులు 9:22) దేవుని సహనం అసాధారణమైనదే అయినా, పరిమితులు లేనిది కాదు, అలాంటి సహనం వలన ఎంతటి అద్భుతమైన ఫలితమో కదా! (g01 10/8)

[17వ పేజీలోని చిత్రం]

ఆదాము హవ్వలు పిల్లలు కనడానికి దేవుడు అనుమతించాడు