కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పురుషులు స్త్రీలను ఎందుకు కొడతారు?

పురుషులు స్త్రీలను ఎందుకు కొడతారు?

పురుషులు స్త్రీలను ఎందుకు కొడతారు?

దుండగుల చేతుల్లో అనేక విధాలుగా మరణిస్తున్న స్త్రీలకంటే తమ భాగస్వామి చేతుల్లో చంపబడుతున్నవారే ఎక్కువగా ఉండవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. వివాహిత భాగస్వాములను హింసించే ధోరణిని నివారించడానికి, లెక్కలేనన్ని అధ్యయనాలు జరిగాయి. ఎటువంటి వ్యక్తి తన భార్యను కొడతాడు? అతని బాల్యం ఎలాంటిది? పరిచయాన్ని పెంచుకునేటప్పడు ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించాడా? కొట్టే వ్యక్తి చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తాడు?

దౌర్జన్యం చేసే వ్యక్తులందరూ ఒకేలా ఉండరని నిపుణులు తెలుసుకున్నారు. ఒక తరహాకు చెందిన వ్యక్తి చాలా అరుదుగా దౌర్జన్యం చేస్తాడు. అతను తన భాగస్వామిపై దాడి చేయడానికి ఆయుధాలను ఉపయోగించినట్లు దాఖలాలు లేవు. దౌర్జన్యం చేయడం అతని లక్షణం కాదు, బాహ్య పరిసరాల వలన ప్రేరేపించబడతాడనిపిస్తుంది. మరో తరహాకు చెందిన వ్యక్తి ఎప్పుడూ కొట్టడం అలవాటుగా చేసుకుంటాడు. అతని దౌర్జన్యం పెరుగుతూనే ఉంటుంది, పశ్చాత్తాపం చెందిన సూచనలు కూడా చాలా అరుదుగా కనబడతాయి.

దౌర్జన్యం చేసే వాళ్ళు భిన్న తరహాలకు చెందినవారు అన్నంత మాత్రాన, దానర్థం కొన్ని దౌర్జన్యాలు ప్రమాదకరమైనవి కావు అని కాదు. నిజానికి, శారీరకంగా జరిగే దౌర్జన్యం ఎటువంటిదైనా గాయపరుస్తుంది​—మరణానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి, ఒక వ్యక్తి చేసిన దౌర్జన్యం మరో వ్యక్తి కంటే అరుదుగా చేసినదని లేక అంత తీవ్రమైనది కాదని సమర్థించదగినది కాదు. స్పష్టంగా, “అంగీకరించతగిన” దౌర్జన్యం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ, ఒక వ్యక్తి తన జీవితాంతం ప్రేమతో చూసుకుంటానని వాగ్దానం చేసిన స్త్రీ పైనే శారీరక దౌర్జన్యం చేయడానికి కారణాలు ఏమై ఉండవచ్చు?

కుటుంబ అనుబంధం

శారీరక దౌర్జన్యం చేసేవారు, అలా దౌర్జన్యం చేసే కుటుంబాల్లోనే పెరిగారనడంలో ఆశ్చర్యమేమీ లేదు. “దౌర్జన్యం చేసే చాలామంది, ఎప్పుడూ గొడవలు జరిగే ‘యుద్ధ క్షేత్రం’ వంటి కుటుంబాల్లో పెరిగారు, పిల్లలుగా, యౌవనస్థులుగా, వాళ్ళు మానసిక, శారీరక దౌర్జన్యం ‘మామూలే’ అనే వైరభావమున్న పరిసరాల్లో పెరిగారు” అని, రెండు దశాబ్దాలపాటు వివాహిత భాగస్వాముల దౌర్జన్యాలపై అధ్యయనం చేసిన మైఖల్‌ గ్రోచ్‌ వ్రాశాడు. ఒక నిపుణురాలి ప్రకారం, అలాంటి పరిసరాల్లో పెరిగిన పిల్లవాడు, “చాలా చిన్నతనంలోనే స్త్రీలపై తృణీకార భావాన్ని తన తండ్రినుంచి అలవరచుకుంటాడు. స్త్రీని, పురుషుడు ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలని, అలా చేయడానికి వారిని బెదిరించాలని, నొప్పించాలని, కించపరచాలని ఆ అబ్బాయి నేర్చుకుంటాడు. అదే సమయంలో, తన తండ్రి మెప్పు పొందాలంటే తండ్రిలాగే ప్రవర్తించడం సరైన మార్గమనీ తెలుసుకుంటాడు.”

మంచికైనా, చెడుకైనా తండ్రి ప్రవర్తన పిల్లలపై గమనార్హమైన విధంగా ప్రభావం చూపుతుందని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (సామెతలు 22:6; కొలొస్సయులు 3:21) ఒక వ్యక్తి దౌర్జన్య దోషాన్ని కుటుంబ పరిసరాలు తగ్గించకపోయినా, దౌర్జన్యస్వభావపు ఆ విత్తనాలు ఎక్కడ నాటబడ్డాయో తెలుసుకోవడానికి సహాయపడతాయి.

సాంస్కృతిక ప్రభావం

కొన్ని ప్రాంతాల్లో స్త్రీని కొట్టడం అంగీకారమైనదిగా, సాధారణమైన విషయంగా కూడా పరిగణించబడుతుంది. “భార్యను కొట్టడానికి లేక శారీరకంగా భయపెట్టడానికి భర్తకు హక్కు ఉందని అనేక సమాజాల్లో చాలా దృఢమైన నమ్మకముంది” అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.

అలాంటి దౌర్జన్యం అనంగీకారంగా పరిగణించే ప్రాంతాల్లో కూడా, చాలామంది దౌర్జన్యం ఒక ప్రవర్తనా నియమావళిగా అలవర్చుకున్నారు. ఈ విషయంలో కొంతమంది వివేచనారహితమైన ఆలోచన దిగ్భ్రమ కలుగజేస్తుంది. దక్షిణాఫ్రికాకు చెందిన వీక్లీ మెయిల్‌ అండ్‌ గార్డియన్‌ అని కేప్‌ పెనిన్సులాలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, తమ భాగస్వాములపై దౌర్జన్యం చేయము అని చెప్పిన పురుషుల్లో అధిక శాతం, ఒక స్త్రీని కొట్టడం అంగీకారయోగ్యమేనని, అలాంటి ప్రవర్తన దౌర్జన్యం క్రిందికి రాదని భావించారు.

అలాంటి వక్రమైన అభిప్రాయం సాధారణంగా పసితనంలోనే ప్రారంభమవుతుందని స్పష్టమవుతోంది. ఉదాహరణకు, బ్రిటన్‌లో 11, 12 ఏండ్లున్న అబ్బాయిల్లో జరిపిన ఒక అధ్యయనం, పురుషుడు రెచ్చగొట్టబడితే స్త్రీని కొట్టడం అంగీకారయోగ్యమేనని, 75 శాతం అబ్బాయిలు భావించారని చూపింది.

దౌర్జన్యం సమర్థించతగినది కాదు

పై సంఘటనలు వివాహిత భాగస్వామి దౌర్జన్యాలను వివరించడానికి సహాయపడుతుండవచ్చు కానీ, అవి సమర్థించదగినవి కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, భాగస్వామిని కొట్టడం దేవుని దృష్టిలో ఘోరమైన పాపము. ఆయన వాక్యమైన బైబిల్లో మనమిలా చదువుతాము: ‘పురుషులు తమ సొంతశరీరములవలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.’​—ఎఫెసీయులు 5:28, 29.

ఈ విధానము యొక్క “అంత్యదినములలో,” అనేకులు “దూషకులు”గా, “అనురాగరహితులు”గా, “క్రూరులు”గా ఉంటారని బైబిలు చాలా కాలం ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-3) వివాహిత భాగస్వామిపై దౌర్జన్యం ఇంతగా వ్యాపించిందంటే, సరిగ్గా ఈ ప్రవచనం సూచిస్తున్న కాలంలోనే మనం జీవిస్తున్నామనడానికి అది మరొక సూచన మాత్రమే. కానీ శారీరక దౌర్జన్యానికి గురవుతున్న బాధితులకు సహాయంగా ఏమి చేయవచ్చు? దౌర్జన్యం చేసేవారు తమ ప్రవర్తన మార్చుకోగలరనే నిరీక్షణ ఏదైనా ఉందా? (g01 11/8)

[5వ పేజీలోని బ్లర్బ్‌]

“తన భార్యపై దౌర్జన్యం చేసిన వ్యక్తి నేరం, అపరిచితుడ్ని కొట్టిన ఒక వ్యక్తి నేరం కంటే తక్కువేమీ కాదు.”పురుషులు స్త్రీలను కొట్టినప్పుడు

[6వ పేజీలోని బాక్సు]

పురుషాధిక్యత విశ్వవ్యాప్తంగా ఉన్న ఒక సమస్య

లాటిన్‌ అమెరికా “పురుషాధిక్యత” అని అర్థమిచ్చే “మాఛిస్మో” అనే పదాన్ని ఇంగ్లీష్‌ మాట్లాడే ప్రజలకు ఇచ్చింది. అది స్త్రీలపై దబాయింపుతో కూడిన పురుషాహంకారాన్ని, అక్రమ ధోరణిని సూచిస్తుంది. కాని ఈ క్రింది నివేదికలు పురుషాధిక్యత లాటిన్‌ అమెరికాకే పరిమితం కాలేదని సూచిస్తున్నాయి.

ఈజిప్ట్‌: అలెగ్జాండ్రియాలో జరిగిన మూడు నెలల అధ్యయనం, స్త్రీలు గాయపడడానికి ప్రధానమైన కారణం ఇంట్లో జరిగే హింసే అని సూచించింది. స్థానికంగా గాయాలకు చికిత్స చేయించుకున్న మొత్తం కేసుల్లో 27.9 శాతం దానివల్లనే.​—రిస్యూమే 5 ఆఫ్‌ ద ఫోర్త్‌ వరల్డ్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ వుమెన్‌.

థాయ్‌లాండ్‌: బాంకాక్‌ నగరంలోని ఒక అతి పెద్ద శివారు ప్రాంతంలో ఉంటున్న పెళ్ళైన స్త్రీలలో 50 శాతం స్త్రీలు క్రమంగా తమ భర్తల దెబ్బలకు గురవుతున్నారు.​—పసిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వుమెన్స్‌ హెల్త్‌.

హాంగ్‌కాంగ్‌: “నా భర్త నన్ను కొడుతున్నాడని చెప్పే స్త్రీల సంఖ్య గత సంవత్సరం కంటే 40 శాతం పెరిగింది.”​—సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌, జూలై 21, 2000.

జపాన్‌: 1995 నుండి 1998 వరకు, ఆశ్రయం కోసం వెతికే స్త్రీల సంఖ్య, 4,843 నుండి 6,340కి పెరిగింది. “వారిలో దాదాపు మూడోవంతు స్త్రీలు, తమ భర్తల హింసాత్మక ప్రవర్తన భరించలేకనే ఇలా ఆశ్రయం కోసం వెతుకుతున్నామని చెప్పారు.”​—ద జపాన్‌ టైమ్స్‌, సెప్టెంబరు 10, 2000.

బ్రిటన్‌: “బ్రిటన్‌ అంతటా ప్రతి ఆరు సెకన్లకు ఒక ఇంటిలో ఒకరు రేప్‌కు, దెబ్బలకు, లేదా కత్తిపోట్లకు గురవుతున్నారు.” స్కాట్‌లాండ్‌ యార్డ్‌ నివేదిక ప్రకారం, “ఇంట్లో హింసలకు గురవుతున్నవారినుండి పోలీసులకు ప్రతిరోజు 1,300 ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి​—సంవత్సరానికి 5,70,000 కంటే ఎక్కువ. వాటిలో ఎనభై ఒక్క శాతం, మగవారి చేత దాడి చేయబడుతున్న స్త్రీ బాధితులవే.”​—ద టైమ్స్‌, అక్టోబరు 25, 2000.

పెరూ: పోలీసులకు ఫిర్యాదు చేసిన నేరాల్లో డెభ్భై శాతం, భర్తలు కొడుతున్న స్త్రీలవే.​—పసిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వుమెన్స్‌ హెల్త్‌.

రష్యా: “ఇంట్లో జరిగే దాడుల్లో ఒక సంవత్సరంలో, 14,500 రష్యన్‌ స్త్రీలు వారి భర్తల చేత చంపబడ్డారు, 56,400 మంది స్త్రీలు అంగ వికలులవుతున్నారు లేదా తీవ్రంగా గాయపడుతున్నారు.”​—ద గార్డియన్‌.

చైనా: “ఇది ఒక క్రొత్త సమస్య. ఇది చాలా వేగంగా పెరిగిపోతోంది, ప్రత్యేకంగా నగర ప్రాంతాల్లో” అని జింగ్లున్‌ ఫ్యామిలీ సెంటర్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ చెన్‌ యియూన్‌ అన్నారు. “ఇంట్లోని గొడవలను పొరుగువారి ప్రభావం ఏ మాత్రం అదుపు చేయలేకపోతోంది.”​—ద గార్డియన్‌.

నికరాగ్వా: “నికరాగ్వాలో స్త్రీలపై దౌర్జన్యం అత్యధికమైపోతోంది. కేవలం గత సంవత్సరంలోనే ఇంట్లో జరిగిన ఏదో ఒక విధమైన గొడవల్లో 52 శాతం నికరాగ్వా స్త్రీలు వారి భర్తల చేతుల్లో హింసలకు గురయ్యారు అని ఒక సర్వే ప్రకటించింది.”​—బిబిసి న్యూస్‌.

[7వ పేజీలోని బాక్సు]

ప్రమాద సూచికలు

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలాండ్‌లో రిచర్డ్‌ జె. జెల్స్‌ నిర్వహణలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఇంట్లో జరిగే శారీరక, మానసిక అక్రమాలకు ప్రమాద సూచికలు ఇవి:

1.ఇదివరకే సంసార గొడవల్లో పాల్గొన్న వ్యక్తి.

2.నిరుద్యోగి.

3.సంవత్సరానికి ఒక్కసారైనా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను ఉపయోగించే వ్యక్తి.

4.ఇంటిలో ఉన్నప్పుడు, తండ్రి తల్లిని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి.

5.పెళ్ళి కాకుండానే కలిసి జీవిస్తున్న జంట.

6.ఉద్యోగము చేస్తున్నట్లయితే, తక్కువ జీతం ఉన్న వ్యక్తి.

7.హై స్కూలు పాసవని వ్యక్తి.

8.పద్దెనిమిది నుండి ముఫ్పై ఏండ్ల మధ్య వయస్కుడు.

9.పిల్లలపై అత్యాచారం చేసే తల్లి లేక తండ్రి లేక ఇద్దరూ ఉంటున్న ఇంటిలోని వ్యక్తి.

10.అతి నిమ్న స్థాయిలో ఉన్న ఆదాయం.

11.స్త్రీ పురుషులిద్దరూ భిన్నమైన సంస్కృతికి చెందినవారు.

[7వ పేజీలోని చిత్రం]

కుటుంబ సంబంధ గొడవలు పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి