కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతీకారం తీర్చుకోవడంలో తప్పేముంది?

ప్రతీకారం తీర్చుకోవడంలో తప్పేముంది?

యువ త ఇలా అడుగుతో రది . . .

ప్రతీకారం తీర్చుకోవడంలో తప్పేముంది?

“అతడు నన్ను అవమానపరిచాడు.”​—హత్య చేసినందుకు జైల్లో ఉన్న 15 ఏండ్ల కానీల్‌.

స్కూలు డ్యాన్స్‌లో ఒక టీచర్‌ను చంపిన 14 ఏండ్ల ఆండ్రూ, తనకు టీచర్లన్నా, తన తల్లిదండ్రులన్నా అసహ్యమనీ, తనను తిరస్కరించినందువల్ల అమ్మాయిలంటే చాలా కోపమనీ చెప్పాడు.

టైమ్‌ పత్రిక, అది “ప్రాణాంతకమైన ఒక ధోరణి” అని అంది. కోపంగా ఉన్న ఒక యువకుడు దొంగచాటుగా ఒక రైఫిల్‌ను స్కూల్లోకి తెచ్చి తన తోటి విద్యార్థులపైనా, టీచర్లపైనా కాల్పులు జరిపాడు. అలాంటి విషాదకరమైన సంఘటనలను అమెరికాలో చాలా సాధారణ విషయంగా దృష్టించనారంభించారు కాబట్టే, ఒక టీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌ ఈ ధోరణిని, “దౌర్జన్యపు వెల్లువ” అని పేర్కొంది.

ఒక విధంగా చూస్తే, స్కూల్లో కాల్పులు జరగడం చాలా తక్కువే. అయినప్పటికీ, కొందరు యువకులు నిజానికి ఎంత కోపోద్రిక్తులయ్యారో, ఇటీవల ఉద్రేకంలో జరిగిన నేరాలు వెల్లడిచేస్తున్నాయి. అంతగా ఉద్రేకపడడానికి కారణమేమై ఉండవచ్చు? వీరిలోని కొందరు యువకులు అధికారంలో ఉన్నవారి చేతుల్లో అన్యాయానికి లేదా వారి అధికార దుర్వినియోగానికి గురై ఉండవచ్చని రుజువులు చూపిస్తున్నాయి. మరికొందరు, తోటివారిచేత తరచుగా టీజింగ్‌కు గురవడం వల్ల ఆగ్రహించారని స్పష్టమవుతోంది. 12 ఏండ్లున్న ఒక అబ్బాయి, తాను లావుగా ఉన్నందువల్ల తనను గేలి చేస్తున్న తోటి విద్యార్థిని కాల్చి, తనను తాను కాల్చుకున్నాడు.

చాలామంది యువకులు అలాంటి తీవ్రమైన క్రూరకృత్యానికి ఒడిగట్టాలని అస్సలు ఏ మాత్రం ఆలోచించకపోవచ్చని ఒప్పుకోవాల్సిందే. కానీ, జాతి విద్వేషానికి, వేధింపుకు లేక క్రూరమైన టీజింగ్‌కు మీరు గురైనప్పడు, మీ మనసులో కలిగే బాధాకరమైన భావాలతో పోరాడడం అంత సులభం కాదు. తన స్కూలు రోజులను జ్ఞాపకం చేసుకుంటూ బెన్‌ ఇలా అంటున్నాడు: “నా వయస్సు పిల్లల్లోని చాలామంది కంటే నేను ఎప్పుడూ పొట్టిగానే ఉండేవాడిని. నాది బోడిగుండు కావడం వలన, పిల్లలందరూ నన్ను తరచుగా టీజ్‌ చేస్తూ తలమీద మొట్టేవారు. అది నాకు బాగా కోపం తెప్పించేది. నేను సహాయం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేయడంవల్ల పరిస్థితి మరింత విషమించింది. దాంతో నాకు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది! వాళ్ళలో ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ కాల్చేసేవాడినే, కానీ నాకు రైఫిల్‌ అందుబాటులో లేనందువల్ల బ్రతికిపోయారు” అని బెన్‌ చెప్పాడు.

తమను బాధపెట్టినవారిని తిరిగి బాధపెట్టాలని ప్రయత్నిస్తున్న యువతను మీరెలా దృష్టిస్తారు? ఒకవేళ మీరే అనుచితమైన ప్రవర్తనకు గురయితే ఏమి చేస్తారు? జవాబు కోసం, దేవుని వాక్యం ఏమి చెబుతుందో పరిశీలించండి.

ఆత్మ నిగ్రహము​—బలానికి సూచన!

అనుచితమైన ప్రవర్తన, అన్యాయము కొత్త విషయాలేమీ కావు. ఒక బైబిలు రచయిత ఈ సలహా ఇచ్చాడు: ‘కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము [“ఉద్రేకపడకుము,” NW] అది కీడుకే కారణము.’ (కీర్తన 37:8) కోపోద్రేకము చాలా తరచుగా ఆత్మ నిగ్రహం కోల్పోయేలా చేసి, పర్యవసానాల గురించి ఆలోచించకుండా కోపాన్ని వ్యక్తం చేసేలా చేస్తుంది. ఒక వ్యక్తి ‘ఉద్రేకపడితే’ అనుకోని రీతిలో విపరీతమైన కోపం వెళ్ళగ్రక్కబడుతుంది! దాని పరిణామం ఎలా ఉండవచ్చు?

బైబిల్లో కయీను, హేబెలుల ఉదాహరణను గమనించండి. తన తమ్ముడిపై “కయీనుకు మిక్కిలి కోపము వచ్చిం[ది],” తత్పర్యవసానంగా, “వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.” (ఆదికాండము 4:5, 8) అదుపులేని కోపోద్రేకానికి మరొక ఉదాహరణ సౌలు రాజు. యువ దావీదు విజయంపై ఈర్ష్యతో, సౌలు దావీదుపైనే కాకుండా, తన సొంత కుమారుడు యోనాతానుమీద కూడా ఈటెను విసిరాడు!​—1 సమూయేలు 18:11; 19:10; 20:30-34.

నిజమే, కొన్ని సమయాల్లో కోపగించుకోవడం న్యాయమైనదే. అయినప్పటికీ, అదుపుల్లేని న్యాయమైన కోపం కూడా, దుష్ఫలితాలకే దారి తీయగలదు. ఉదాహరణకు, తమ చెల్లెలు దీనాపై, షెకెము అత్యాచారము చేశాడని తెలుసుకొన్నప్పుడు, షిమ్యోను, లేవిలు అతనిపై కోపగించుకోవడము న్యాయమైనదే. కానీ వారు ప్రశాంతంగా ఉండడానికి బదులు ఆవేశంతో పెట్రేగిపోయారు. “వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా?” అని వాళ్ళు తర్వాత అన్న మాటల్లో అది తెలుస్తోంది. (ఆదికాండము 34:31) ఎప్పుడైతే వారి ఆవేశం వారిని కోపోద్రిక్తులను చేసిందో, వారు “తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ,” షెకెము నివసిస్తున్న “ఊరిమీద పడి ప్రతి పురుషుని చంపిరి.” వారి ఆవేశం ఇతరులకు వ్యాపించేదిగా ఉండింది, ఆ కారణంగానే మిగతా “యాకోబు కుమారులు” కూడా ఆ హత్యాకాండలో పాల్గొన్నారు. (ఆదికాండము 34:25-27) సంవత్సరాల తర్వాత కూడా, షిమ్యోను, లేవిల తండ్రి యాకోబు, వారి అదుపులేని కోపాన్ని శపించాడు.​—ఆదికాండము 49:5-7.

దీన్నుండి మనం ఒక ముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాం: అదుపులేని కోపం బలానికి కాదు బలహీనతకు సూచన. సామెతలు 16:32 ఇలా వ్యక్తం చేస్తోంది: “పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు.” (ఇటాలిక్కులు మావి.)

ప్రతీకారము తెలివితక్కువ పని

అందుకే లేఖనాలు ఈ సలహాను ఇస్తున్నాయి: ‘కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. . . . మీకు మీరే పగతీర్చుకొనకం[డి].’ (రోమీయులు 12:17, 19) ప్రతీకారమనేది, శారీరక హింసైనా లేక కేవలం క్రూరమైన మాటలైనా సరే, అది భక్తిరహితమైన పనే. అంతేకాక, అలా ప్రతీకారము తీర్చుకోవడం నిరుపయోగకరమైనది, అవివేకమైనది. ఎందుకంటే, హింస సాధారణంగా మరింత హింసకు దారి తీస్తుంది. (మత్తయి 26:52) అంతేగాక, క్రూరమైన మాటలు తరచుగా మరిన్ని క్రూరమైన మాటలనే రప్పిస్తాయి. కోపం అన్ని సందర్భాల్లో సమర్థించబడదన్న విషయం కూడా గుర్తుంచుకోండి. ఉదాహరణకు, మీ మనస్సు నొప్పించిన వ్యక్తికి, మీమీద శత్రుత్వముందని మీకు నిజంగా తెలుసా? ఆ వ్యక్తి కేవలం అనాలోచితంగా లేక పరిణతి లేనందువల్లే మిమ్మల్ని నొప్పించాడా? ఒకవేళ అందులో దురుద్దేశమున్నా, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రతీకారమే మార్గమా?

ప్రసంగి 7:21, 22 లోని బైబిలు మాటలను గమనించండి: “నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము. నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది గదా.” నిజమే, మీ గురించి ప్రజలు చెడుగా మాట్లాడడం మీకు సంతోషకరమైన విషయం కాదు. కాని, అది జీవిత వాస్తవమని బైబిలు అంగీకరిస్తోంది. బహుశా మీరు కూడా ఇతరుల గురించి ఏమైనా అనుండవచ్చు, ఆ తర్వాత అలా అనకుండా ఉంటే బాగుండేది అని మీకు అనిపించడం నిజం కాదా? మరి అలాంటప్పుడు మీ గురించి ఎవరైనా నిర్దయగా మాట్లాడినందుకు మీరు అతిగా ఎందుకు ప్రతిస్పందించాలి? టీజింగ్‌తో వ్యవహరించే ఉత్తమమైన మార్గమేమిటంటే, దాన్ని పట్టించుకోకుండా ఉండడమే.

అదే విధంగా, మీతో అనుచితంగా వ్యవహరించారని అనిపించినప్పుడు, అతిగా స్పందించడం కూడా వివేకవంతమైన పని కాదు. డేవిడ్‌ అనే టీనేజర్‌, కొందరు తోటి క్రైస్తవులతో కలిసి బాస్కెట్‌బాల్‌ ఆడుకుంటున్నప్పుడు ఏమి జరిగిందో జ్ఞాపకం చేసుకుంటూ, “అవతలి టీము వాళ్ళెవరో నన్ను బంతితో కొట్టారు” అని అన్నాడు. అది ద్వేషపూరిత చర్యగా భావించిన డేవిడ్‌, ప్రతిచర్యగా తను కూడా బంతిని అవతలి ఆటగాడి మీదికి విసిరాడు. “నాకు నిజంగా కోపమొచ్చింది” అని డేవిడ్‌ ఒప్పుకుంటున్నాడు. కాని పరిస్థితి చేజారకముందే, డేవిడ్‌ యెహోవాకు ప్రార్థించాడు. ఆయన స్వగతంలో ఇలా అనుకున్నాడు, ‘నేనేం చేస్తున్నాను, ఒక క్రైస్తవ సహోదరునితో కొట్లాడాలనుకుంటున్నానా?’ ఆ తర్వాత, ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు.

అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు మాదిరిని గుర్తు చేసుకోవడం సహాయకరంగా ఉంటుంది. ‘ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపలేదు.’ (1 పేతురు 2:23) అవును, ఒత్తిడికి గురైనప్పుడు, ప్రతిస్పందించడానికి బదులుగా, దేవునికి ప్రార్థించి ఆత్మ నిగ్రహాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని వేడుకోండి. ఆయన “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను” ఉదారంగా ‘అనుగ్రహిస్తాడు.’ (లూకా 11:13) ఎవరైనా మీ మనస్సును నొప్పించినప్పుడు, ప్రతీకారం తీర్చుకోవడానికి బదులుగా, ఆ విషయం గురించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం మంచిది. (మత్తయి 5:23, 24) లేక స్కూల్లో రౌడీగా తిరుగుతున్న ఒక వ్యక్తి నిరంతరం అల్లరి చేస్తూ మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నట్లైతే, హింసాత్మక చర్యలతో ఎదుర్కోకండి. బదులుగా, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆచరణాత్మకమైన చర్యలను తీసుకోవాలి. *

కోపోద్రేకాన్ని వదిలేసిన ఒక యువతి

చాలామంది యౌవనులు బైబిల్లోని ఈ సూత్రాలను పాటించి మంచి ఫలితాలను పొందారు. ఉదాహరణకు, కాథరిన్‌ తన చిన్న వయస్సులోనే దత్తతకు ఇవ్వబడింది. “నా కన్నతల్లి నన్నెందుకు వదిలిపెట్టిందో అర్థం కాని నాకు బాగా ఆవేశం కలిగేది. ఆ ఆవేశాన్ని నన్ను దత్తత తీసుకున్న అమ్మమీద చూపించేదాన్ని. ప్రతీ చిన్న కారణానికి కూడా నేను ఆమె మనస్సు నొప్పించడం ద్వారా, నా కన్న తల్లి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నానని అనుకునేదాన్ని. అలా నేను ఆమెను తిడుతూ, నేలను తన్నుతూ, పిచ్చి కోపంతో నా ఆవేశాన్ని వెళ్ళగక్కేదాన్ని. తలుపులను విసురుగా వేయడం నాకు ప్రియమైన పని. ‘నువ్వంటే నాకు అసహ్యం!’ అని కూడా అనేదాన్ని​—ఇవన్నీ కోపం కారణంగానే చేసేదాన్ని. గతాన్ని వెనక్కి తిరిగి చూస్తే, నేనలా చేశానంటే నమ్మశక్యం కాదు” అని ఆమె చెబుతోంది.

తన కోపాన్ని అదుపు చేసుకోవడానికి కాథరిన్‌కు ఏమి సహాయపడింది? తను ఇలా జవాబిస్తోంది: “బైబిలు చదవడం! ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే మన మనోభావాల గురించి యెహోవాకు తెలుసు.” ఆమె, ఆమె కుటుంబము కలిసి తేజరిల్లు! నుండి, తమ కుటుంబ పరిస్థితులకు అనువర్తించే ఆర్టికల్‌లు చదివి కూడా కాథరిన్‌ ఓదార్పును పొందింది. * “మేమందరము కలిసి కూర్చొని, ఒకరి భావానుభూతులను మరొకరు అర్థం చేసుకోగలిగాం” అని ఆమె గుర్తు చేసుకుంటోంది.

మీరు కూడా కోపోద్రేక భావాలను అదుపు చేసుకోవడాన్ని నేర్చుకోవచ్చు. టీజింగ్‌కు, వేధింపులకు, లేక అనుచితమైన ప్రవర్తనకు గురైనప్పుడు, కీర్తన 4:4 (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌)లోని బైబిలు మాటలను గుర్తు తెచ్చుకోండి: “కోపంగా ఉండండి. కాని పాపం చేయవద్దు.” (ఇటాలిక్కులు మావి.) వినాశకరమైన కోపోద్రేకానికి లోనవకుండా ఆ మాటలు మీకు సహాయపడతాయి. (g01 10/22)

[అధస్సూచీలు]

^ అన్యాయంగా ప్రవర్తిస్తున్న టీచర్లతో, పోకిరీ విద్యార్థులతో, వేధించేవారితో వ్యవహరించడానికి ఆచరణాత్మకమైన సలహా కోసం, ఫిబ్రవరి 8, 1984; ఆగస్టు 22, 1985; ఆగస్టు 8, 1989 తేజరిల్లు! (ఆంగ్లం) సంచికల్లోని “యువత ఇలా అడుగుతోంది . . .” శీర్షికను చూడండి.

^దత్తత​—దానిలోని సంతోషాలు, సవాళ్ళు” అనే శీర్షికగల సీరీస్‌ను, తేజరిల్లు! మే 8, 1996 (ఆంగ్లం) సంచికలో చూడండి.

[15వ పేజీలోని చిత్రం]

టీజింగ్‌తో వ్యవహరించడానికి దాన్ని పట్టించుకోకుండా ఉండడమే తరచూ ఉత్తమమైన మార్గం