కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

వర్షపాత అడవులు

భారతదేశంలో వర్షపాత అడవులు కేవలం దక్షిణ రాష్ట్రమైన కేరళలోనే ఉండేవని అనుకునేవారు. కాని పర్యావరణవేత్త సౌమ్యదీప్‌ దత్తా, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లను కలుపుతూ 500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న వర్షపాత అడవిని ఇటీవల కనుగొన్నాడని డౌన్‌ టు ఎర్త్‌ అనే న్యూ ఢిల్లీ పత్రిక నివేదించింది. ఆ అడవి “చాలా అరుదుగా కనిపించే ఏనుగులు, పులి మరియు క్లౌడెడ్‌ లెపర్డ్‌, చైనీస్‌ పాంగోలిన్‌, స్లాత్‌ బేర్‌, సాంబార్‌ అనే దుప్పి, హులాక్‌ గిబ్బన్స్‌, కాలిజ్‌ ఫెసెంట్స్‌, హార్న్‌ బిల్స్‌, వుడ్‌ డక్స్‌ లాంటి జంతువులతో సహా 32 జాతుల సస్తన జంతువులు మరియు 260 జాతుల పక్షులు” వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు ఆధారంగా ఉంది. అయినప్పటికీ, అడవి ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకి వర్షపాత అడవులను ప్రమాదంలో పడేస్తుందని డౌన్‌ టు ఎర్త్‌ నివేదిస్తుంది. ఈ విధంగా అధికంగా నరకడం వల్ల వృక్షాల సంఖ్య తగ్గిపోతే, వర్షపాత అడవులు సంరక్షించబడకుండా, కేవలం వ్యవసాయ స్థలాలుగా మిగిలిపోతాయని కొంతమంది ప్రకృతివాదులు భయపడుతున్నారు. (g01 10/8)

మలేరియా మందు పని చేయడంలేదు

‘జాంబియాలో మలేరియాని నివారించేందుకు అత్యధికంగా సూచించబడే క్లోరోక్విన్‌, ఈ వ్యాధిని అరికట్టడానికి వాడే అత్యుత్తమ మందు కాదని ప్రభుత్వ ఆస్పత్రులు దాన్ని వాడడం నెమ్మదిగా ఆపుచేసి’ సమర్థవంతమైన మరో మందు వాడడం మొదలుపెట్టబోతున్నారని, టైమ్స్‌ ఆఫ్‌ జాంబియా నివేదిస్తుంది. “జాంబియాలో ప్రతి సంవత్సరం మలేరియావల్ల చనిపోయే ఐదేళ్ళలోపు పిల్లలు 25,000 మంది అయితే, వాళ్ళలో 12,000 మంది క్లోరోక్విన్‌ పనిచేయకపోవటంవల్ల మరణిస్తున్నారని” ఒక అధ్యయనం సూచించిన తర్వాత, ఆ మందుని వాడడం ఆపుచెయ్యాలని నిశ్చయించడమైంది. ఈ మార్పుని ఆఫ్రికాలోని అనేక తూర్పు, దక్షిణ దేశాలు స్వీకరించాయి. “క్లోరోక్విన్‌ 30 సంవత్సరాలకంటే ఎక్కువకాలం దేశానికి బాగా ఉపయోగపడినప్పటికీ, మలేరియాని అరికట్టడంలో అది ఇక ఏమాత్రం సమర్థవంతంగా పనిచేయడంలేదు. మలేరియా ఇప్పటికీ దేశంలోని అత్యధిక మరణాలకు కారణంగా ఉంది” అని టైమ్స్‌ అంటోంది. (g01 10/22)

ఏనుగులాంటి జ్ఞాపకశక్తా?

కెన్యాలోని అంబోసెలీ నేషనల్‌ పార్కులో పనిచేస్తున్న పరిశోధకులు, ఏనుగుల గుంపు మనుగడకున్న కారణాలలో ఒకటి, గుంపులోని ముసలి ఆడ ఏనుగు జ్ఞాపకశక్తేనని కనుగొన్నారు. “గుంపులోని పెద్ద వయస్సు ఏనుగులు, అంటే 55 సంవత్సరాలున్న ఆడ ఏనుగులు, స్నేహితులెవరో పరాయివారెవరో గుర్తుపట్టడంలో . . . 35 సంవత్సరాల వయసున్న ఏనుగులకంటే తెలివిగలవని” సైన్స్‌ న్యూస్‌ నివేదిస్తుంది. సంపర్క ధ్వనులు, లేదా లో-ఫ్రీక్వెన్సీ అరుపులని పిలవబడే వాటిని గుర్తుపెట్టుకోడం ద్వారా, పెద్ద వయస్సు ఆడ ఏనుగులు అపరిచితమైన అరుపులను గుర్తించి ఆత్మరక్షణార్థమై గుంపు కట్టేలా చేస్తాయి. “ఒక ఆడ ఏనుగు 100 ఏనుగు స్నేహితులను వాటి అరుపుల ద్వారా చక్కగా గుర్తుపడుతుందని” ఆ నివేదిక చెప్తుంది. కాబట్టి వేటగాళ్ళు ఏదైనా ఒక్క ముసలి ఆడ ఏనుగుని చంపితే, మొత్తం గుంపు పెద్ద సమాచార భాండాగారాన్ని కోల్పోయినట్టే. (g01 11/22)

తాగి సైకిలు తొక్కకండి

మద్యం సేవించి సైకిలు తొక్కడమనేది, మద్యం సేవించి కారు నడపడమంతటి ప్రమాదకరంగా ఉండగలదని న్యూ సైంటిస్ట్‌ పత్రిక నివేదిస్తుంది. “కారు నడిపేటప్పటికన్నా సైకిలు తొక్కేటప్పుడే అధిక మోతాదులో సైకోమోటారు (మనస్సు-చలన సంబంధిత) నైపుణ్యాలు మరియు శారీరక సమన్వయము అవసరం కాబట్టి మద్యం ఇంకా బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది” అని అమెరికాలోని మేరీల్యాండ్‌లో జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్వాహ్వా లీ అంటున్నాడు. లీ మరియు అతని సహోద్యోగులు సైకిలు తొక్కే 466 మందిని అధ్యయనం చేయగా, నాలుగు లేక ఐదు పెగ్గులు తీసుకున్నవారు ఇతరులకంటే 20 రెట్లు ఎక్కువ తీవ్రంగా గాయపడడానికి లేక మరణించడానికి అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు. కేవలం ఒక్క పెగ్గు తాగి సైకిలు తొక్కడం కూడా ఆరు రెట్లు ఎక్కువ ప్రమాదకరంగా ఉండగలదు. “ఇంకా ఘోరం ఏమిటంటే, సైకిలు తొక్కే వారు ఎంత ఎక్కువగా తాగితే, వారు హెల్మెట్‌ ధరించే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి” అని న్యూ సైంటిస్ట్‌ చెప్తుంది. (g01 10/22)

అరటి మొక్కలనుంచి పేపరు

అరటిపళ్ళ కోత అయిపోయిన తర్వాత, మొక్కలను పొలానికి ఎరువులాగ అక్కడే వదిలేస్తారు. కాని, నాగోయా సిటీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హిరోషీ మోరీషీమా అరటి మొక్కల బోదెలనుంచి పేపరు తయారుచేయడంలో విజయాన్ని సాధించాడని జపాన్‌ వార్తాపత్రిక ఆసాహి షింబున్‌ నివేదిస్తుంది. ఈ మొక్క పీచు “పొడుగ్గా బలంగా ఉండి, పేపరు తయారు చేయడానికి మనీలా హెంప్‌ నుండి లభించే ముడిసరుకులాగే మంచి నాణ్యత కలిగి ఉంది.” యంత్రంచే తయారుచేయబడిన అరటి మొక్క పేపరు, సాధారణంగా ప్రింటర్లలో ఉపయోగించే పేపరుకున్న నాణ్యతనే కలిగి ఉంది, అంతేకాదు రీసైకిల్‌ చేయబడిన పేపరుకంటె దృఢంగా ఉంది. “ప్రపంచవ్యాప్తంగా 123 దేశాల్లో ప్రతి సంవత్సరం 5,80,00,000 టన్నుల అరటి పళ్ళు ఉత్పత్తి చేయబడుతున్నాయి కాబట్టి, అది పేపరు తయారీకి మంచి వనరుగా కనిపిస్తోంది” అని ఆ వార్తాపత్రిక అంటుంది. (g01 10/22)

మతసంబంధమైన దోపిడి

“శాసనాన్ని బలపరచినప్పటికీ యూరప్‌లో మతసంబంధమైన వస్తువులను దొంగిలించి, వర్తకం చేయటం తగ్గడంలేదు” అని ఫ్రెంచి క్యాథలిక్‌ వార్తాపత్రిక లా క్రవా వ్యాఖ్యానిస్తుంది. దొంగిలించిన వస్తువులలో సిలువలు, ఫర్నీచరు, బంగారు వెండి వస్తువులు, విగ్రహాలు, వర్ణచిత్రాలు, చివరికి బలిపీఠాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల సమితి ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో చెక్‌ రిపబ్లిక్‌లో 30,000 నుండి 40,000 వస్తువుల వరకు దొంగిలించబడ్డాయి, ఇటలీలో 88,000 వస్తువులకుపైగా దొంగిలించబడ్డాయి. ఫ్రాన్సు 87 ప్రధాన చర్చీలను కలిగి ఉన్నందువల్ల దొంగలకది ముఖ్యమైన లక్ష్యస్థానంగా ఉంది. 1907 నుండి 1996 వరకు “చారిత్రక స్మారకచిహ్నాలు”గా పరిగణించబడ్డ 2,000 వస్తువులు ఫ్రాన్సులోని మత సంస్థలనుంచి దొంగిలించబడ్డాయి. వాటిలో 10 శాతం కన్నా తక్కువ వస్తువులు మాత్రమే తిరిగి లభించాయి. చర్చీలలోకి సులభంగా ప్రవేశించవచ్చు, పైగా భద్రత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి దోపిడీలను నిరోధించడం చాలా కష్టం. (g01 12/8)

పాల ఉత్పత్తిలో ప్రపంచాధిపత్యం

ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక పాలను ఉత్పత్తి చేసేది భారతదేశమేనని ద హిందుస్తాన్‌ టైమ్స్‌ నివేదిస్తుంది. “[అమెరికాలోని వాషింగ్‌టన్‌ డి.సి.లో ఉన్న] పర్యావరణ సంబంధమైన వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భారతదేశంలోని పాల ఉత్పత్తి ఉద్యమాన్ని మెచ్చుకుంది” అని ఆ నివేదిక చెప్తుంది. “1994 నుండి భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులలో పాలు ప్రధాన ఉత్పత్తిగా మారింది. 1997లో, భారతదేశం అమెరికాను మించిపోయి ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారిగా మారింది.” “గమనార్హమైన విషయమేమంటే​—⁠పశువుల మేతకొరకు ధాన్యానికి బదులు పంట కోత తర్వాత మిగిలిన కాడలను గడ్డిని ఉపయోగించి వారు ఆ విజయాన్ని సాధించారు. భారతదేశం, మనుష్యులు తినే ధాన్యాన్ని పశువులకు మళ్ళించక్కరలేకుండానే మాంసకృత్తుల సరఫరాని అధికం చేయగలిగింది” అని వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యక్షుడైన లెస్టర్‌ బ్రౌన్‌ అన్నాడు. (g01 12/22)

కుళాయి నీళ్ళకు బాటిల్‌లో అమ్మే నీళ్ళకు మధ్య పోటి

“బాటిల్‌లో అమ్మే నీళ్ళకు ఎంత ప్రజాదరణ ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా 700 కంటె ఎక్కువ రకాల బ్రాండులు ఉత్పత్తి చేయబడుతున్నాయి” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తుంది. కాని, “చాలా సందర్భాల్లో ఖరీదైన బాటిల్‌లో అమ్మే నీళ్ళకు, కుళాయిలో వచ్చే నీళ్ళకు మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఆ బాటిల్‌ మాత్రమే.” ప్రపంచవ్యాప్త ప్రకృతి నిధి (డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్‌) సూచించినట్టు, “బాటిల్‌ నీరు 1,000 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయినప్పటికీ అనేక దేశాల్లో కుళాయి నీటికంటే అవి సురక్షితంగా కాని ఆరోగ్యకరంగా కాని ఉండకపోవచ్చు.” కుళాయి నీళ్ళ వాడకం డబ్బును ఆదా చేయటమే కాకుండా పర్యావరణానికి కూడా తోడ్పడుతుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం 15 లక్షల టన్నుల ప్లాస్టిక్‌, నీళ్ళ బాటిల్స్‌ తయారుచేయడానికి ఉపయోగించబడుతుంది, అంతేకాక “బాటిల్స్‌ తయారుచేసేటప్పుడు, ఆ తర్వాత వాటిని నాశనం చేసేటప్పుడు వదలబడే విషరసాయనాలు వాతావరణ మార్పుకు కారణమయ్యే వాయువులను వదలగలవు.” డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్‌ ఇంటర్‌నేషనల్‌ యొక్క తాజా నీటి కార్యక్రమ అధ్యక్షుడు డా. బిక్షమ్‌ గుజ్జా ప్రకారం, “యూరప్‌లోను అమెరికాలోను బాటిల్‌ నీటి పరిశ్రమను క్రమబద్ధీకరించే ప్రమాణాలకన్నా కుళాయి నీటి సరఫరాను క్రమబద్ధీకరించటానికే ఎక్కువ ప్రమాణాలున్నాయి.” (g01 12/8)

అశ్లీల చిత్రాల వ్యాపారం

“ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బేస్‌బాల్‌ మూడింటిని కలిపినా, దానికంటె అశ్లీల చిత్రాల వ్యాపారమే పెద్దది. ఒక సంవత్సరంలో అమెరికాలోని ప్రజలు సినిమా టిక్కెట్లకన్నా, కళా రంగాలన్నింటిని కలిపితే వాటికన్నా అశ్లీల చిత్రాలకే ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారు,” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌ నివేదిస్తుంది. “అశ్లీల నెట్‌వర్క్‌లు, కేబుల్‌ మరియు ఉపగ్రహం ద్వారా డబ్బు చెల్లించి చూసే చిత్రాలు, ఇంటర్‌నెట్‌ వెబ్‌సైట్లు, హోటళ్ళలోని సినిమాలు, ఫోన్‌ సెక్స్‌, సెక్స్‌ని ఉద్రేకించే వస్తువులు, పత్రికల ద్వారా ప్రతి సంవత్సరం అమెరికాలో అశ్లీల వ్యాపారం 1,000 కోట్లనుంచి 1,400 కోట్ల డాలర్ల వరకు గడిస్తుంది.” ఆ ఆర్టికల్‌ ఇంకా ఇలా అంటుంది: “సంవత్సరానికి 60 కోట్ల డాలర్లు గడిస్తున్న బ్రాడ్‌వే థియేటర్‌ పరిశ్రమ లాంటి ప్రధాన పరిశ్రమల ముందు అశ్లీల వ్యాపారం ఏదో చిన్న సైడ్‌ షోగా ఇక ఎంతమాత్రం లేదు. 1,000 కోట్ల డాలర్లు గడిస్తున్న అశ్లీల వ్యాపారమే ఇప్పుడు ప్రధాన పరిశ్రమగా ఏర్పడిపోయింది.” ఉదాహరణకు, గత సంవత్సరం హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ 400 చిత్రాలను విడుదల చేస్తే, అశ్లీల పరిశ్రమ 11,000 “పెద్దలకు మాత్రమే” వీడియోలను విడుదల చేసింది. అయినా తాను వాటిని చూస్తున్నట్లు ఏ అమెరికన్‌ కూడా ఒప్పుకోడు. “అశ్లీల వ్యాపారం లాంటి వ్యాపారమే లేదు. అశ్లీల చిత్రాల్ని ఎవరూ చూడరు, కానీ ఆ పరిశ్రమ మాత్రం ఎన్నడూ మూతబడదు. ఇలాంటి మాయా పరిశ్రమ మరోటి లేదు” అని టైమ్స్‌ అంటోంది (g01 12/8)