కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు ఎందుకు చదివి వినిపించాలి?

మీ పిల్లలకు ఎందుకు చదివి వినిపించాలి?

మీ పిల్లలకు ఎందుకు చదివి వినిపించాలి?

అంతా నలిగిపోయి . . . పీనట్‌ బట్టర్‌ అంటుకొని ఉన్న ఒక పుస్తకాన్ని తీసుకుని వచ్చిన మా అమ్మాయి, నా ఒళ్ళో కూర్చుని, . . . ‘డాడీ! దీన్నెలా చదవాలో నాకు చెప్పండి’ అని అడిగింది.”—డా. క్లిఫర్డ్‌ షిమెల్స్‌, ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌.

పిల్లలు​ఎంతో వేగంగా నేర్చుకుంటారు. మూడు సంవత్సరాల్లోపు పిల్లల్లో మెదడు పెరుగుదల చాలా వేగంగా జరుగుతుందని పరిశోధనలు చూపిస్తున్నాయి. తల్లిదండ్రులుగా తాము తమ పిల్లలతో కలిసి చదువుతూ, పాటలు పాడుతూ వారితో ఆప్యాయతతో ఉండడం వంటివి పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలలో ప్రధానమైన పాత్ర వహిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, తల్లిదండ్రులందరిలో కేవలం సగం మంది మాత్రమే రెండేళ్ళ వయసు నుంచి ఎనిమిదేళ్ళ వయసులోని తమ పిల్లలకు రోజూ చదివి వినిపిస్తారు. ‘మా పిల్లలకు చదివి వినిపించడం అంత అవసరమా?’ అని మీరు అనుకోవచ్చు.

చదవడమంటే ఇష్టాన్ని కలుగజేయడం

అవును అవసరమే, అని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. “చదవడానికి కావల్సిన సామర్థ్యాన్ని పొందేందుకు సహాయపడే అతి ముఖ్యమైన పని పిల్లలకు చదివి వినిపించడమే, అది పాఠశాలకు వెళ్ళటం ప్రారంభించకముందే చేస్తే బాగుంటుంది” అని బికమింగ్‌ ఎ నేషన్‌ ఆఫ్‌ రీడర్స్‌ అనే నివేదిక చెబుతోంది.

పుస్తకంలోని కథలను చదువుతుంటే వింటున్నప్పుడు, పేజీల్లోని అక్షరాలు, మనం మాట్లాడే మాటలు ఒకేలా ఉన్నాయని పిల్లలు చిన్నప్పుడే నేర్చుకుంటారు. పుస్తకాల్లో ఉపయోగించబడే భాషతోకూడా సుపరిచితులౌతారు. చదివి వినిపించడాన్ని గురించిన ఒక పుస్తకము, “మనము పిల్లవానికి చదివి వినిపించిన ప్రతిసారి, అది ‘ఆనందకరమైనది’ అన్న సందేశాన్ని అతని మెదడుకు మనం అందజేస్తున్నాము. ఆ పిల్లవాడు పుస్తకాలను చదవడమంటే ఆనందకరమైన విషయంగా భావించేలా తయారయ్యేందుకు దోహదపడే వాణిజ్య ప్రకటన అని దాన్ని పిలవవచ్చు” అని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలపట్ల ప్రేమను కలిగించినప్పుడు, వారిలో జీవితాంతం చదువరులుగా ఉండాలనే కోరికను పెంపొందింపజేసినవారవుతారు.

తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడడం

తల్లిదండ్రులు, చదివి వినిపించడం ద్వారా, ప్రజలు, ప్రదేశాలు, వస్తువుల గురించిన పరిజ్ఞానమనే విలువైన బహుమానాన్ని తమ పిల్లలకు ఇవ్వగలరు. వారు చాలా తక్కువ ఖర్చుతో పుస్తకాల ద్వారా ప్రపంచాన్ని “చుట్టి రావచ్చు.” ఆంథోని అనే రెండేళ్ళ అబ్బాయి ఉదాహరణను పరిశీలించండి, వాడు పుట్టినప్పటి నుంచి వాడి తల్లి వాడికి చదివి వినిపిస్తోంది. ఆమె ఇలా అంటోంది: “వాడు జంతు ప్రదర్శనశాలని మొట్టమొదటిసారిగా సందర్శించినప్పుడు, వాడు తాను ముందే చూసిన వాటిని మళ్ళీ చూడడంలా ఉంది.” ముందే చూసినవాటినా? అవును, ఆంథోని జీబ్రాలను, సింహాలను, జిరాఫీలను, మరితర జంతువులను సజీవంగా మొదటిసారిగా చూస్తున్నప్పటికీ, వాటన్నింటి గురించి వాడికి ముందే తెలుసు.”

వాడి తల్లి ఇంకా ఇలా అంటోంది: “ఆంథోని తన జీవితపు మొదటి రెండేళ్ళలో, కేవలం పుస్తకాల ద్వారా అనేకమంది ప్రజలతో, జంతువులతో, వస్తువులతో, ఆలోచనలతో ఆహ్లాదకరమైన పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు.” అవును, చిన్నప్పటి నుండి పిల్లలకు చదివి వినిపించడం, వారు జీవిస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది.

సన్నిహిత సంబంధాన్ని నిర్మించుకోవడం

పిల్లల మనస్సు రూపుదిద్దుకొంటుండగా, వారు భవిష్యత్తులో తమ కార్యాలను ప్రభావితం చేసే మనోవైఖరులను పెంపొందించుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు, నమ్మకం, పరస్పర గౌరవం, అర్థం చేసుకునే స్వభావం ఉన్న సన్నిహిత సంబంధానికి పునాది వేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో చదివి వినిపించడము మంచి సాధనంగా పనిచేస్తుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరకు తీసుకుని వారికి చదివి వినిపించడానికి సమయం తీసుకున్నప్పుడు, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని స్పష్టము చేస్తారు. ఇప్పుడు ఎనిమిదేళ్ళున్న తన కుమారునికి చదివి వినిపించడాన్ని గూర్చి కెనడాలోని ఫీబీ ఇలా అంది: “నాతాను మాతో సన్నిహిత సంబంధము కలిగి ఉండడానికి అదెంతో సహాయపడిందని నేను, నా భర్త అనుకుంటున్నాము. వాడు మా దగ్గర దాపరికం లేకుండా ఉంటాడు, తరచుగా తన భావానుభూతులను మాతో చెబుతాడు. అది మామధ్య ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచింది.”

తన కూతురికి ఒక సంవత్సరము నిండినప్పటినుంచి అంటే కూర్చుని ఒకటి రెండు నిమిషాలు శ్రద్ధగా ఆలకించగల్గడం ప్రారంభించినప్పటినుంచి తనకు చదివి వినిపించడము అలవాటు చేసుకుంది సిండీ. అలా వెచ్చించిన సమయానికీ పడ్డ శ్రమకూ తగ్గ ఫలితం లభించిందా? సిండీ ఇలా వ్యాఖ్యానించింది: “ఇద్దరం కలిసి చదివినప్పుడుండే స్నేహపూర్వకమైన, ప్రశాంతమైన వాతావరణం, అబీగెయిల్‌ పాఠశాలలో జరిగిన సంఘటన గురించి లేక స్నేహితురాలితో ఉన్న సమస్య గురించి మాతో చెప్పడానికి సహాయపడేది. అలాంటి ప్రతిస్పందనను ఏ తల్లిదండ్రులు కోరుకోరు?” నిశ్చయంగా, చదివి వినిపించడము తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పర్చడానికి దోహదపడగలదు.

ప్రాముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్పించడం

“నేడు మన పిల్లలు, టీవీ మరితర మాధ్యమాల ద్వారా తమ మెదళ్ళలో పనికిరాని చెత్తను నింపుకుంటున్నారు కాబట్టి, మునుపటికంటే ఎక్కువగా నేడు వారికి మానసిక పోషణ అవసరం. తమ జీవితాలను సరైన దృష్టితో చూసి, విలువలకు తగ్గట్టు జీవించడానికి సహాయపడేందుకు చురుకైన ఆలోచనా శక్తి, జ్ఞానము, మానసిక స్థిరత్వము అవసరం” అని త్రీ స్టెప్స్‌ టు ఎ స్ట్రాంగ్‌ ఫ్యామిలీ అనే పుస్తకం చెబుతోంది. తల్లిదండ్రులు అనుకూలమైన ఆరోగ్యకరమైన ప్రభావాన్ని చూపే స్థానంలో ఉన్నారు.

మాటల్లోనూ వ్రాతల్లోనూ తననుతాను ఎలా వ్యక్తం చేసుకోవాలో నేర్పించడానికి, పుస్తకాల్లోని సంక్లిష్ట వాక్యాలు మరియు చక్కని నిర్మాణంగల వాక్యాలు పిల్లవానికి పరిచయం చేయడం సహాయకరంగా ఉంటుంది. బేబీస్‌ నీడ్‌ బుక్స్‌ అనే పుస్తక రచయిత్రి డోరతీ బట్లర్‌ ఇలా చెబుతోంది: “ఒక వ్యక్తి యొక్క భాషా శ్రేష్ఠత మీదే, అతని ఆలోచనా నాణ్యత ఆధారపడి ఉంటుంది. నేర్చుకోవడానికి, మేధస్సుకి సంబంధించినంత మట్టుకు భాష కీలకమైన విషయంగా ఉంది.” ఇతరులతో మంచి సంబంధము కలిగి ఉండాలంటే మంచిగా సంభాషించగలగాలి.

మంచి పుస్తకాలనుండి చదవి వినిపించడం ద్వారా పిల్లల్లో నైతిక సూత్రాలను మరియు విలువలను కూడా బలపర్చవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు చదివి, తర్కించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకునే నైపుణ్యాల్ని పెంపొందించుకోవడానికి వారికి సహాయం చేస్తారు. సిండీ తన కూతురు అబీగెయిల్‌తో పాటు కలిసి చదివేటప్పుడు, కథలలో ఇవ్వబడిన పరిస్థితులకు అబీగెయిల్‌ ఎలా ప్రతిస్పందిస్తుందో జాగ్రత్తగా గమనించేది. “తల్లిదండ్రులుగా మేము తన వ్యక్తిత్వంలోని అస్పష్టమైన గుణాలను తెలుసుకొని, సరికాని ఆలోచనా వైఖరిని చిన్నతనంలోనే నివారించేందుకు సహాయపడగలుగుతున్నాము.” నిజమే, పిల్లలకు చదివి వినిపించడం మనస్సుకు హృదయానికి శిక్షణనివ్వగలదు.

చదవడాన్ని ఆహ్లాదకరంగా చేయండి

వాతావరణాన్ని శాంతంగా, మామూలుగా, ఆనందదాయకంగా ఉంచడానికి “మృదువుగా” చదవండి. ఎంత సేపు చదివి వినిపించాలో వివేచనగల తల్లిదండ్రులకు తెలుసు. “రెండేళ్ళ ఆండ్రూ, కొన్నిసార్లు బాగా అలసిపోవడంవల్ల ఎక్కువసేపు కుదురుగా కూర్చోడు. అతని మనఃస్థితికి తగ్గట్లు మేము చదివే సమయాన్ని తగ్గిస్తాము. ఆండ్రూకి చదవడంపట్ల అయిష్టతా భావాలుండకూడదన్నది మా కోరిక, అందుకే వాడి సామర్థ్యానికి మించినదాన్ని చేయమని మేము వాడిని బలవంతపెట్టము” అని లీనా అంటుంది.

చదివి వినిపించడమంటే కేవలం వినబడేట్టు చదవడమని అర్థం కాదు. ఆతృతతో కూడిన కోరికను పెంచడానికి బొమ్మల పుస్తకంలో పేజీని ఎప్పుడు తిప్పాలో తెలుసుకోండి. మృదువుగా చదవండి. స్వరభేదం మరియు భావాన్ని నొక్కి చదవడం కథకు జీవాన్ని పోయగలవు. మీ గొంతులోని మార్దవం, మీ పిల్లవానిలో భద్రతా భావాన్ని కలిగిస్తుంది.

మీ పిల్లవాడు చురుగ్గా పాల్గొన్నప్పుడే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మధ్య మధ్యలో ఆగి, ఒక్కముక్కలో కాకుండా వివరించి సమాధానము చెప్పవలసివచ్చే ప్రశ్నలను అడగండి. మీ పిల్లవాడు సమాధానమిచ్చినప్పుడు, అదొక్కటే కాకుండా వేరే సమాధానాలుండే అవకాశం ఉందని సూచించండి.

పుస్తకాలను జాగ్రత్తగా ఎంచుకోండి

అతి ప్రాముఖ్యమైన విషయమేమిటంటే మంచి పుస్తకాలను ఎన్నుకోవడం. అలా ఎన్నుకోవడానికి ముందు కొంత పని చేయాల్సివుంటుంది. పుస్తకాలను ఎన్నుకొనే ముందు వాటిని జాగ్రత్తగా పరిశీలించి, జ్ఞానయుక్తమైన లేక పాఠం నేర్పే సందేశం ఉన్న పుస్తకాలను, మంచి నైతిక సూత్రాలున్న కథల పుస్తకాలను ఎంచుకోండి. ముఖచిత్రాన్ని, ఆ పుస్తకంలోని బొమ్మల్ని, రచనా శైలిని గమనించండి. తల్లిదండ్రులకూ, పిల్లలకూ ఆసక్తికరంగా ఉండే పుస్తకాలను ఎంచుకోండి. తరచూ పిల్లలు ఒకే కథను మళ్ళీమళ్ళీ చదవమని అడుగుతారు.

ప్రత్యేకంగా నా బైబిలు కథల పుస్తకం * అనే పుస్తకాన్ని చదివి వినిపించడంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది తల్లిదండ్రులు ఆనందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చదవడానికి అనుకూలంగా అది రూపొందించబడింది. అది పిల్లలు మంచి చదువరులయ్యేందుకు సహాయము చేయడమే కాక బైబిలు మీద వారి ఆసక్తిని పెంచుతుంది.

తమ పిల్లలకు చదివి వినిపించే తల్లిదండ్రులు వారిలో జీవితాంతం అర్థవంతమైన ఫలితాలను తీసుకువచ్చేలా మంచి చదివే అలవాట్లను పెంపొందింపజేస్తారు. “జెన్నిఫర్‌ పాఠశాలకి వెళ్ళకముందే చదవడము, వ్రాయడము నేర్చుకుని చదవడమంటే ఇష్టాన్ని పెంచుకోవడమే కాకుండా, అంతకంటె ముఖ్యంగా మన గొప్ప సృష్టికర్త అయిన యెహోవాపట్ల ప్రేమను పెంపొందించుకుంది. తను తీసుకునే నిర్ణయాలన్నింటిలో నడిపింపు కోసం దేవుని వాక్యమైన బైబిలు మీద ఆధారపడడం నేర్చుకుంది” అని తన కూతురి గురించి జోన్‌ చెబుతోంది. నిజమే మీ అమ్మాయికి లేదా అబ్బాయికి మీరు ఏమి నేర్చుకోవడంలో సహాయపడ్డారు అన్నదానికంటే ఎవరిని ప్రేమించేందుకు సహాయపడ్డారన్నది ముఖ్యము. (g01 11/22)

[అధస్సూచి]

^ యెహోవాసాక్షులచే ప్రచురించబడింది.

[28వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీ పిల్లవానికి చదివి వినిపించేటప్పుడు

• శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభించండి.

• చదవడం అలవాటయ్యేందుకు మీ పిల్లవానికి సమయాన్ని ఇవ్వండి.

• మీరు, మీ పిల్లవాడు ఇష్టపడే కథలను చదవండి.

• మీకు ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా, హృదయపూర్వకంగా చదవండి.

• ప్రశ్నలు అడగడం ద్వారా మీ పిల్లలు కూడా పాల్గొనేలా చేయండి.

[27వ పేజీలోని చిత్రసౌజన్యం]

Wildlife Conservation Society’s Bronx Zooలో తీసిన ఫొటో