కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం

హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం

హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం

దౌర్జన్యానికి గురవుతున్న స్త్రీలకు సహాయపడడానికి ఏమి చేయవచ్చు? మొదట, వారు ఎలాంటి కష్టాన్ని అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలి. దౌర్జన్యం చేసేవారు తరచుగా, శారీరక బాధ కంటే ఎక్కువ మానసిక బాధను కలుగజేస్తారు. బాధితురాలిని పనికిరానిదానిగా, నిస్సహాయురాలిగా భావింపజేసేలా, మాటలతో బెదిరించడము, భయపెట్టడము చేస్తారు.

ప్రారంభ ఆర్టికల్‌లో చెప్పిన రొక్సానా గురించి ఆలోచించండి. కొన్నిసార్లు ఆమె భర్త, మాటలను ఆయుధాలుగా ఉపయోగించేవాడు. “ఆయన నన్ను కించపరిచే విధంగా తిట్టేవాడు” అని రొక్సానా చెబుతోంది. “‘నీకు సరైన చదువు కూడా లేదు. నేను లేకుండా నువ్వు పిల్లలను ఎలా చూడగలవు? నువ్వు సోమరిపోతువి, ఒక తల్లికి ఉండాల్సిన యోగ్యతలు నీకు లేవు. నువ్వు నన్ను వదిలేస్తే, పిల్లలను నీతో తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం అనుమతిస్తుందని అనుకుంటున్నావా?’ అని ఆయన అనేవాడు.”

రొక్సానా భర్త, డబ్బు విషయంలో ఆమెకు స్వతంత్రమివ్వకుండా అజమాయిషీ చెలాయించేవాడు. కారు ఉపయోగించడానికి ఆమెను అనుమతించేవాడు కాదు, ఆమె ఏమి చేస్తుందో తెలుసుకోవడానికి దినమంతా ఫోన్లు చేస్తుండేవాడు. ఆమె తనకు పలానిది ఇష్టమని అభిప్రాయమేదైనా తెలిపితే కోపంతో అరిచేవాడు. తత్ఫలితంగా, రొక్సానా అసలు అభిప్రాయమే తెలపకూడదని అనుకుంది.

దీన్ని బట్టి చూస్తే, వివాహిత భాగస్వామిపై దౌర్జన్యం అనేది సంక్లిష్టమైన విషయం. బాధితురాలిని ప్రోత్సహించి, సహాయపడడానికి, సానుభూతితో వినండి. సాధారణంగా, తనకు ఏమి జరుగుతోందో చెప్పడం, బాధితురాలికి చాలా కష్టంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. పరిస్థితిని తన ధోరణిలో ఎదుర్కొంటుండగా, బాధితురాలిని బలపరచడమే మీ లక్ష్యంగా ఉండాలి.

హింసింపబడుతున్న కొందరు స్త్రీలు ప్రభుత్వ సహాయాన్ని కోరే అవసరం రావచ్చు. కొన్నిసార్లు, పోలీసులు జోక్యం చేసుకునేటువంటి ఒకానొక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు తన చర్యలు ఎంత గంభీరమైనవో అత్యాచారి గ్రహించేలా చేస్తాయి. అయితే, తన నడవడి మార్చుకోవాలనే ఉద్దేశమేమైనా అత్యాచారి మనసులోవుంటే, అలాంటి క్లిష్ట పరిస్థితి తర్వాత అది కాస్తా మటుమాయం అవుతుందన్న విషయం ఒప్పుకోవాల్సిందే.

దౌర్జన్యానికి గురైన స్త్రీ తన భర్తను వదిలెయ్యాలా? బైబిలు వివాహిత బంధాలనుండి విడిపోవడాన్ని తేలిగ్గా పరిగణించడంలేదు. అదే సమయంలో, హింసింపబడుతున్న ఒక భార్య, తన ఆరోగ్యానికీ, చివరికి ప్రాణానికి కూడా అపాయం కలుగజేసే వ్యక్తితోనే ఉండాలని ఒత్తిడి కూడా చేయడంలేదు. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “భార్య భర్తను . . . ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను.” (ఇటాలిక్కులు మావి.) (1 కొరింథీయులు 7:10-16) కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో విడిపోవడాన్ని బైబిలు ఖండించడంలేదు కాబట్టి, ఇలాంటి విషయాల్లో ఒక స్త్రీ ఏమి చేయాలన్నది సొంతగా నిర్ణయించుకోవాలి. (గలతీయులు 6:5) తన భర్తను విడిచిపెట్టమని భార్యను ఎవరూ బలవంతపెట్టకూడదు, కానీ ఆమె ఆరోగ్యము, ప్రాణము, ఆధ్యాత్మికత ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా అత్యాచారియైన వ్యక్తితోనే ఉండమని కూడా ఒత్తిడి చేయకూడదు.

దౌర్జన్యం చేసేవారికి ఏదైనా నిరీక్షణ ఉందా?

వివాహిత భాగస్వామిపై దౌర్జన్యం చేయడమంటే బైబిలు సూత్రాలను ఘోరంగా అతిక్రమించినట్లే. ఎఫెసీయులు 4:29, 31 లో మనమిలా చదువుతాము: “దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి. . . . సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.”

నేను క్రీస్తును అనుకరిస్తున్నానని చెప్పుకునే ఏ భర్తైనా, తన భార్యను హింసిస్తున్నట్లైతే, నేను నా భార్యను ప్రేమిస్తున్నానని చెప్పలేడు. ఆయన తన భార్యతో అనాదరంగా ప్రవర్తిస్తే, ఆయన చేసిన వేరే మంచి పనులకు విలువ ఏముంటుంది? “కొట్టువాడు,” క్రైస్తవ సంఘంలో ప్రత్యేక ఆధిక్యతలకు అర్హుడు కాలేడు. (1 తిమోతి 3:2, 3; 1 కొరింథీయులు 13:1-3) నిజానికి, క్రైస్తవుడనని చెప్పుకునే ఎవరైనా, పదే పదే, పశ్చాత్తాప పడకుండా క్రోధం చూపిస్తే క్రైస్తవ సంఘంలోంచి బహిష్కరించబడవచ్చు.​—గలతీయులు 5:19-21; 2 యోహాను 9, 10.

దౌర్జన్యపూరిత పురుషులు తమ ప్రవర్తనను మార్చుకోగలరా? కొందరు మార్చుకున్నారు. సాధారణంగా, అత్యాచారి (1) తన ప్రవర్తన సరైనది కాదని అంగీకరించి, (2) తన ప్రవర్తన మార్చుకోవాలని కోరుకుంటూ, (3) అందుకు తగిన సహాయాన్ని అడిగితేనే తప్ప మారలేడు. అయితే ప్రవర్తనను మార్చే శక్తి బైబిలుకు ఉందని యెహోవాసాక్షులు తెలుసుకున్నారు. వారితో బైబిలు అధ్యయనం చేసే అనేకమంది ఆసక్తిగలవారు, దేవుని సంతోషపరచాలని గాఢమైన కోరికను పెంపొందించుకున్నారు. యెహోవా దేవునికి, ‘బలాత్కారాసక్తులు అసహ్యులు’ అని ఈ క్రొత్త బైబిలు విద్యార్థులు తెలుసుకున్నారు. (కీర్తన 11:5) ఒక అత్యాచారి మారాలంటే కేవలం కొట్టడం మానేయడమే కాదు. తన భార్యపట్ల పూర్తిగా ఒక క్రొత్త నడవడిని చూపించడాన్ని నేర్చుకోవాల్సిన అవసరం కూడావుంది.

ఒక వ్యక్తి దేవుని పరిజ్ఞానం పొందినప్పుడు, తన భార్యను ఒక బానిసగా కాక, ఒక ‘సహాయకురాలి’గా, తనకంటే తక్కువగా కాకుండా ‘సన్మానంతో’ చూడడం నేర్చుకుంటాడు. (ఆదికాండము 2:18; 1 పేతురు 3:7) ఆయన సానుభూతి చూపించడాన్ని, తన భార్య దృక్కోణాన్ని వినాల్సిన అవసరాన్ని కూడా నేర్చుకుంటాడు. (ఆదికాండము 21:12; ప్రసంగి 4:1) యెహోవాసాక్షులు అందించే బైబిలు అధ్యయన కార్యక్రమము అనేక దంపతులకు సహాయపడింది. క్రైస్తవ కుటుంబాల్లో దౌర్జన్యానికి, నిరంకుశత్వానికి లేక జగడాలకు తావు లేదు.​—ఎఫెసీయులు 5:25, 28, 29.

‘దేవుని వాక్యము సజీవమైనది బలముగలది.’ (హెబ్రీయులు 4:12) అందుకే, బైబిల్లో ఉన్న జ్ఞానము దంపతులు ఎదుర్కొనే సమస్యలను పరిశీలించడానికి వాటితో వ్యవహరించడానికి కావలసిన ప్రోత్సాహాన్ని పొందడానికి వారికి సహాయపడుతుంది. అంతేగాక, విధేయులైన మానవాళిపై యెహోవా యొక్క పరలోక రాజు పరిపాలించేటప్పుడు అత్యాచారమే లేని ఒక లోకాన్ని ఖచ్చితంగా చూస్తామనే ఓదార్పునిచ్చే నిరీక్షణ కూడా బైబిల్లో ఉంది. బైబిలు ఇలా చెబుతోంది: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును.”​—కీర్తన 72:12, 14. (g01 11/8)

[12వ పేజీలోని బ్లర్బ్‌]

క్రైస్తవ కుటుంబాల్లో దౌర్జన్యానికి, నిరంకుశత్వానికి లేక జగడాలకు తావు లేదు

[8వ పేజీలోని బాక్సు]

అపోహల సవరణ

దౌర్జన్యానికి గురవుతున్న భార్యలే తమ భర్తల ప్రవర్తనకు బాధ్యులు.

దౌర్జన్యం చేసేవారు చాలామంది తమ చర్యలకు తామే బాధ్యులమని ఒప్పుకోరు. తమ భార్యలు తమను రెచ్చగొడతారని వాళ్ళు చెబుతారు. కొందరు కుటుంబ స్నేహితులు కూడా, అతని భార్యతో వ్యవహరించడం చాలా కష్టం, అందుకే అప్పుడప్పుడు ఆమె భర్త కోపంతో అదుపు తప్పడంలో ఆశ్చర్యమేమీలేదు అని భావిస్తారు. కానీ ఇది బాధితురాలిని నిందిస్తూ, దౌర్జన్యం చేస్తున్న వ్యక్తిని సమర్థిస్తున్నట్లు అవుతుంది. నిజానికి, హింసలనుభవిస్తున్న భార్యలు తరచుగా తమ భర్తలను శాంతపరచడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తారు. అంతే కాకుండా, ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తన భాగస్వామిని కొట్టడం సమర్థనీయం కాదు. దౌర్జన్యం చేసే వ్యక్తి​—మానసిక స్థూలచిత్రణం (ఆంగ్లం) పుస్తకం ఇలా తెలియజేస్తోంది: “భార్యలను కొడుతున్నందుకు, కోర్టుల ద్వారా మానసిక చికిత్స కోసం పంపించబడిన భర్తలకు, కొట్టడం ఒక అలవాటుగా మారింది. అందుకే వాళ్ళు కొట్టడాన్ని కోపంనుండి, క్రుంగుదలనుండి విముక్తి కలిగించేదిగా, ఘర్షణలను అదుపుచేసి, పరిష్కరించే ఒక మార్గంగా, ఒత్తిడిని తగ్గించేదానిగా ఉపయోగిస్తారు . . . వాళ్ళు తమలో ఏదో లోపముందని లేక ఆ దౌర్జన్యానికి తామే బాధ్యులమని ఏ మాత్రం అంగీకరించరు.”

త్రాగడం మూలంగానే ఒక వ్యక్తి తన భార్యను కొడతాడు.

నిజమే, కొందరు త్రాగి ఉన్నప్పడు మరింత క్రూరంగా ప్రవర్తిస్తారు. కాని అందుకు మద్యమే కారణమని చెప్పడం సహేతుకమేనా? “మత్తుగా ఉండడం వలన కొట్టే వ్యక్తికి, తన ప్రవర్తనకు కారణం తను కాదు అని తప్పును నెట్టివేయడానికి ఒక సాకు దొరుకుతోంది” అని కె. జె. విల్సన్‌ గృహంలోనే హింస మొదలైనప్పుడు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో వ్రాసింది. ఆమె ఇంకా ఇలా కొనసాగించింది: “మత్తులో ఉన్న వ్యక్తిచేతుల్లో, ఒక వ్యక్తి గాయపడినప్పుడు, త్రాగి ఉన్నాడు కదా సర్దుకుపోవాలి అని మన సమాజం దృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ కారణంగా, అక్రమానికి గురైన స్త్రీ తన భాగస్వామిని దౌర్జన్యం చేసేవాడిగా కాకుండా అతన్ని కేవలం మితిమీరి తాగేవాడిగా లేక త్రాగుబోతుగా దృష్టిస్తుంది.” అలాంటి ఆలోచన, “మగవాడు కేవలం త్రాగడం మానేస్తే, దౌర్జన్యం ఉండదు” అనే తప్పుడు నమ్మకాన్ని స్త్రీకి కలిగిస్తుందని విల్సన్‌ సూచిస్తోంది.

నేడు, అనేకమంది పరిశోధకులు త్రాగడాన్ని, కొట్టడాన్ని విభిన్నమైన సమస్యలుగా పరిగణిస్తున్నారు. ఏది ఏమైనా, మత్తు పదార్థాలకు అలవాటైన మగవాళ్ళలో చాలామంది తమ భాగస్వాములను కొట్టరు. పురుషులు స్త్రీలను కొట్టినప్పుడు (ఆంగ్లం) అనే పుస్తక రచయితలు ఇలా పేర్కొన్నారు: “హింసింపబడుతున్న స్త్రీలు దౌర్జన్యం వల్లనే అదుపులో ఉంటూ, భయం కలిగి, లోబడి ఉంటున్నారు. అందుకే ఈ కొట్టే అలవాటు విజయవంతంగా కొనసాగుతోంది. . . . కొట్టే వ్యక్తికి మద్యము, మాదకద్రవ్యాల దురలవాట్లు జీవన శైలిలో భాగం. కాని అవే దౌర్జన్యానికి కారణమవుతున్నాయని భావించడం పొరపాటు.”

దౌర్జన్యం చేసేవారు అందరితో అక్రమంగా ప్రవర్తిస్తారు.

దౌర్జన్యం చేసే వ్యక్తి తరచుగా ఇతరులతో ప్రియమైన స్నేహితుడిగా కూడా ఉండగలడు. ఆయన పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగివుంటాడు. ఆ కారణంగానే కుటుంబ మిత్రులకు, ఆ వ్యక్తి చేసే దౌర్జన్య కథనాలు అపనమ్మకంగా ఉంటాయి. అయినప్పటికీ, భార్యను కొట్టే వ్యక్తి, తన భార్యపై అధికారం చెలాయించడానికి క్రూరత్వాన్ని ఒక మార్గంగా ఎన్నుకుంటాడన్నది నిజం.

దుష్ప్రవర్తనకు గురైనప్పుడు స్త్రీలు అడ్డు చెప్పరు.

బహుశా, తప్పించుకోవడానికి ఎలాంటి మార్గంలేని స్త్రీ నిస్సహాయ పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం వలన అలాంటి ఆలోచన పుడుతుంది. దెబ్బలకు గురైన ఒక భార్యకు, ఒకటి లేక రెండు వారాలపాటు ఆశ్రయమిచ్చే స్నేహితులుండవచ్చు, కానీ ఆ తర్వాత ఆమె ఏమి చేస్తుంది? ఉద్యోగం వెతుక్కోవడం, ఇంటి అద్దె కట్టడం, పిల్లలను చూసుకోవడం ఇవన్నీ ఆమెను కృంగదీసే విషయాలు. పిల్లలను తీసుకువెళ్ళడానికి చట్టం సమ్మతించకపోవచ్చు. కొందరు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు, కాని వెతకి పట్టుకొని, బలాత్కారంగా లేక బలవంతపెట్టి పిల్లలనుండి విడదీయబడ్డారు. ఇవేవీ అర్థం చేసుకోలేని స్నేహితులు, అలాంటి స్త్రీలు దుష్ప్రవర్తనకు గురైనప్పుడు అడ్డు చెప్పరు అని అపార్థం చేసుకుంటారు.