అపరాధ భావాలు కలగడం పూర్తిగా తప్పా?
బైబిలు ఉద్దేశము
అపరాధ భావాలు కలగడం పూర్తిగా తప్పా?
నేడు చాలామంది అపరాధ భావాలు అవాంఛనీయమైనవని తలస్తారు. వారు, “అపరాధ భావన మనిషిలో అనియంత్రితంగా ఉన్న అతి ఘోరమైన వ్యాధి” అని జర్మనీ తత్త్వవేత్త అయిన ఫ్రీడ్రిక్ నీషె భావించినట్లే భావిస్తారు.
కానీ కొంతమంది పరిశోధకులు ఇప్పుడు వేరే నిర్ధారణలకు వస్తున్నారు. “భావావేశాలున్న, బాధ్యతగల వ్యక్తిలో అపరాధ భావన ఒక ప్రముఖమైన భాగం. అది మనస్సాక్షిలో ఒక భాగంగా పనిచేస్తుంది” అని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన చికిత్సకురాలు, రచయిత్రి అయిన సూజన్ ఫార్వర్డ్, పిహెచ్.డి. అంటోంది. అటువంటప్పుడు అన్ని రకాల అపరాధ భావాలు అవాంఛితమైనవేనా? అపరాధ భావాలు సహాయకరంగా ఉండే అవకాశాలేవైనా ఉన్నాయా?
అపరాధ భావం అంటే ఏమిటి?
మనం ప్రేమించే ఎవరి మనస్సునైనా గాయపరిచామని గ్రహించినప్పుడో, లేక మరేదైనా రీతుల్లో మన జీవితాల్లో మనమేర్పరచుకున్న ప్రమాణాలను పాటించలేకపోయామని భావించినప్పుడో మనలో అపరాధ భావం ఏర్పడుతుంది. ఒక గ్రంథం చెబుతున్నట్లుగా, “ఒక వ్యక్తి, తన వైఫల్యం వల్లనో, దండనార్హమైన తప్పు గానీ లేదా నేరం గానీ చేసినప్పుడు అపరాధియని భావిస్తాడు.” అలాంటి భావనకు సంబంధించినదే అపరాధ భావన.
హీబ్రూ లేఖనాల్లో అపరాధ భావన, ఒక ఇశ్రాయేలీయుడు దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించడంలో విఫలుడవ్వడంతో ముడిపెట్టబడింది—పూర్తి బైబిలులో లేవీయకాండము, సంఖ్యాకాండము పుస్తకాల్లోనే దాదాపు సగం సార్లు దాని ప్రస్తావన కనిపిస్తుంది. అదేవిధంగా, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అపరాధం గురించిన తలంపు దేవునికి విరుద్ధంగా చేయబడిన ఘోరమైన తప్పిదాలకు సంబంధించి వ్యక్తం చేయబడింది.
విచారకరంగా, మనం కొన్నిసార్లు అపరాధం చేయకుండానే అపరాధ భావాలను అనుభవిస్తుండవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి పరిపూర్ణతావాదిగా ఉండి తనకు తానే నిర్హేతుకమైన ప్రమాణాలను ఏర్పరచుకొని వాటికి అనుగుణంగా జీవించలేకపోయిన ప్రతీసారి ఆయనలో అనవసరంగా అపరాధ భావాలు కలుగవచ్చు. (ప్రసంగి 7:16) లేదా మనం ఏదైనా పొరపాటు లేదా తప్పిదం విషయంలో న్యాయబద్ధంగా పశ్చాత్తాపపడినా అది సిగ్గుకర భావాలుగా మారేందుకు అనుమతిస్తుండవచ్చు, చివరికి మనలను మనమే అనవసరంగా శిక్షించుకుంటుండవచ్చు. మరి, అపరాధ భావాలు చేకూర్చగల మేలు ఏమిటి?
అపరాధ భావాలు మంచివిగా ఉండవచ్చు
అపరాధ భావాలు కనీసం మూడు విధాలుగా మేలు చేయగలవు. మొదటిగా, ఆమోదయోగ్యమైన ప్రమాణాలేమిటో మనకు తెలుసని అవి మనకు గుర్తుచేస్తాయి. మన రోమీయులు 2:15) నిజానికి, అమెరికా మనస్తత్వ సమాఖ్య ప్రచురించిన ఒక పుస్తకం, అపరాధ భావాలు లేకపోవడాన్ని సమాజానికి చెరుపు చేసే ప్రవర్తనగా దృష్టిస్తోంది. భ్రష్టమైన లేదా మృతమైన మనస్సాక్షిగలవారు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించలేకపోతారు, అది చాలా ప్రమాదకరం కావచ్చు.—తీతు 1:15, 16.
మనస్సాక్షి పనిచేస్తోందని కూడా చూపిస్తాయి. (రెండవదిగా, అపరాధ భావాలతో ఉన్న మనస్సాక్షి అవాంఛనీయమైన చర్యలు చేపట్టకుండా మనల్ని ఆపగలదు. శరీరంలో వచ్చే నొప్పి, ఏదో ఆరోగ్య సమస్య ఉందని మనలను ఎలాగైతే అప్రమత్తులను చేస్తుందో, అలాగే అపరాధ భావాల మూలంగా కలిగే మానసిక వేదన మనలను నైతిక లేదా ఆధ్యాత్మిక సమస్యను గురించి అప్రమత్తులను చేస్తూ ఆ సమస్యవైపు మన అవధానాన్ని మళ్ళిస్తుంది. ఫలాని బలహీనత గురించి మనకు ఒకసారి తెలిసిన తర్వాత భవిష్యత్తులో మనలను మనము గాయపరచుకోవడం, మనం ప్రేమించేవారిని లేదా ఇతరులను గాయపరచడం తగ్గిస్తాము.—మత్తయి 7:12.
చివరిగా, అపరాధాలను ఒప్పుకోవడం ఇటు అపరాధం చేసిన వ్యక్తికి అటు దాని మూలంగా బాధలు పడిన వ్యక్తికి సహాయకరంగా ఉంటుంది. ఉదాహరణకు రాజైన దావీదు తాను చేసిన అపరాధం మూలంగా తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాడు. “నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నా యెముకలు క్షీణించినవి” అని ఆయన వ్రాశాడు. కానీ చివరికి తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొన్నప్పుడు, దావీదు ఆనందంగా ఇలా పాడగలిగాడు: “శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు.” (కీర్తన 32:3, 7) ఒక వ్యక్తి తన అపరాధాన్ని ఒప్పుకోవడం వల్ల, ఆ అపరాధం మూలంగా బాధననుభవించిన అవతలి వ్యక్తి కూడా మనశ్శాంతి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే తాను అంత బాధను కలిగించినందుకు పశ్చాత్తాపపడేంతగా ఆ అపరాధి తనను ప్రేమిస్తున్నాడన్న భావనను బాధననుభవించిన వ్యక్తిలో కలిగిస్తుంది.—2 సమూయేలు 11:2-15.
అపరాధ భావాల గురించిన సమతుల్య దృక్కోణం
అపరాధ భావాల గురించి సమతుల్య దృక్కోణం కలిగివుండాలంటే, పాపులను పాపాన్ని యేసు దృష్టించిన విధానానికి, పరిసయ్యులు దృష్టించిన విధానానికిగల స్పష్టమైన తేడాను పరిశీలించండి. లూకా 7:36-50 వచనాల్లో మనం ఒక అనైతిక స్త్రీ, యేసు భోజనం చేస్తున్న ఇంట్లోకి ప్రవేశించడం గురించి చదువుతాము. ఆమె యేసును సమీపించి, ఆయన పాదాలను తన కన్నీళ్ళతో కడిగి, ఖరీదైన అత్తరు పూస్తుంది.
భక్తిపరుడైన ఆ పరిసయ్యుడు ఈ స్త్రీ తన హోదాకు తగని స్త్రీగా, పట్టించుకోవలసిన అవసరం లేనిదానిగా దృష్టించాడు. ఆయన తనలో తాను ఇలా అనుకున్నాడు: ‘ఈయన [యేసు] ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు.’ (లూకా 7:39) యేసు వెంటనే ఆయన ఆలోచనను సరిదిద్దాడు. “నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను” అని యేసు అన్నాడు. నిస్సందేహంగా ఆ దయగల మాటలు ఆమెను ప్రోత్సహించి, ఆమె హృదయాన్ని తేలికపరచివుంటాయి.—లూకా 7:46, 47.
యేసు లైంగిక అనైతికతను ఏ విధంగానూ మన్నించడం లేదు. బదులుగా, దేవునికి సేవచేయడంలో ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేరణో గర్విష్ఠి అయిన పరిసయ్యుడికి బోధిస్తున్నాడు. (మత్తయి 22:36-40) ఆ స్త్రీ తన జీవితంలోని లైంగిక అనైతికత విషయంలో అపరాధ భావాలను కలిగివుండడం సరైనదే. అయితే ఇప్పుడు ఆమె పశ్చాత్తాపపడిందని స్పష్టంగా కనిపిస్తోంది, ఎందుకంటే ఆమె ఏడ్చింది, తన మునుపటి ప్రవర్తనను సమర్థించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు, అంతేకాదు యేసును బహిరంగంగా ఘనపరచడానికి క్రియాశీలక చర్యలు తీసికొంది. దీనంతటినీ చూసిన యేసు, “నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని” ఆమెతో చెప్పాడు.—లూకా 7:50.
మరోవైపు చూస్తే ఆ పరిసయ్యుడు పాపాత్మురాలిగానే ఆమెను దృష్టించసాగాడు. బహుశ ఆయన, దేవునికి లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత ఉందన్న గ్రహింపును ఆమెలో పెంపొందించడానికి ప్రయత్నిస్తూ ఆమె సిగ్గుపడేలా చేయడానికి ప్రయత్నించివుంటాడు. కానీ ఇతరులు ఎలా ప్రవర్తించాలని మనం అనుకుంటామో అలా ప్రవర్తించకపోతే వాళ్ళలో అపరాధ భావాలు కలిగేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం ప్రేమరహితమవుతుంది, చివరికి దాని మూలంగా విరుద్ధ ఫలితాలు కలుగుతాయి. (2 కొరింథీయులు 9:7) యేసును అనుకరించడం ద్వారా—సరైన మాదిరి కనపరచడం ద్వారా, ఇతరులను నిజాయితీగా మెచ్చుకోవడం ద్వారా, కొన్నిసార్లు గద్దింపు సలహాలు అవసరమైనప్పటికీ వారిలో నమ్మకాన్ని వ్యక్తం చేయడం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయి.—మత్తయి 11:28-30; రోమీయులు 12:10; ఎఫెసీయులు 4:29.
కాబట్టి, మనమేదైనా తప్పు చేసినప్పుడు అపరాధ భావాలు కలగడం మంచిదే, అవి అవసరం కూడా. సామెతలు 14:9, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం ఇలా చెబుతోంది: “మూఢులు అపరాధం గురించి పరిహాసంగా మాట్లాడతారు.” అపరాధ భావంతో ఉన్న మనస్సాక్షి మనం పాపం ఒప్పుకొనేలా, ఇతర అవసరమైన చర్యలు తీసికొనేలా చేయగలదు, చేయాలి కూడా. అయితే మనం యెహోవా సేవచేసేందుకు ప్రాథమిక కారణం ఎల్లప్పుడూ అపరాధ భావం కాకూడదు, కానీ ప్రేమే కారణమై ఉండాలి. (యోబు 1:9-11; 2:4, 5) దీన్ని మనస్సులో పెట్టుకొని మంచి ప్రజలను ప్రోత్సహించినప్పుడు, వారికి నూతనోత్తేజాన్ని కలిగించినప్పుడు వారు తమకు సాధ్యమైనంతా చేస్తారని బైబిలు మనకు హామీ ఇస్తోంది. అంతకన్నా ప్రాముఖ్యంగా వారలా చేయడంలో ఆనందిస్తారు. (g02 3/8)