ఉపాధ్యాయులు వాళ్ళు మనకెందుకు అవసరం?
ఉపాధ్యాయులు వాళ్ళు మనకెందుకు అవసరం?
“వెయ్యి రోజులు శ్రద్ధగా విద్యాభ్యాసం చేయడం కంటే, ఒక్క రోజు ఒక మహనీయుడైన ఉపాధ్యాయునితో గడపడం మిన్న.”—జపాన్ సామెత.
స్కూల్లో మిమ్మల్ని ప్రగాఢంగా ప్రభావితం చేసిన టీచర్ మీకు గుర్తున్నారా? ఒకవేళ మీరు ఇంకా విద్యార్థే అయితే మీకు అతి ప్రియమైన టీచర్ ఎవరైనా ఉన్నారా? ఉంటే, అందుకు కారణం ఏమిటి?
విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంపొందించి, నేర్చుకొనే విధానాన్ని ఆసక్తికరమైన సవాలుగా చేసేది ఒక మంచి టీచరే. ఇండియాలోని మధ్య వయస్సుగల ఒక వ్యాపారవేత్త కోల్‌కతలో తను చదువుకున్న స్కూల్లోని ఇంగ్లీషు టీచర్‌ని ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. “సస్సూన్ టీచర్‌గారి మంచి బోధనా పద్ధతులు నేను భాష పట్ల ఇష్టాన్ని పెంచుకునేలా చేయడమే కాక నాలో ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి. ఆయన అప్పుడప్పుడు నేను వ్రాసిన వ్యాసాలను తీసుకొని, వాటికి కాస్త ‘మెరుగులు దిద్ది’ వేర్వేరు పత్రికలకు దినపత్రికలకు పంపించేవారు. కొన్ని తిరుగు టపాలో వచ్చినా, కొన్ని స్వీకరించబడేవి. వార్తాపత్రికల నుండి పారితోషికాలు లభించాయి, కానీ అంతకన్నా పెద్ద ప్రయోజనం ఏమిటంటే, నేను వ్రాసినవి ముద్రణలో చూసుకోవడంతో నాలోవున్న వ్రాసే సామర్థ్యంపై నమ్మకం పెరిగింది.”
జర్మనీలోని మ్యూనిక్‌లో ఉండే మార్గిట్ 50వ పడిలో ఉంది, ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది; ఆమె ఇలా అంటోంది: “నాకు ఎంతో ఇష్టమైన ఒక టీచరు ఉన్నారు. ఆమె చాలా క్లిష్టమైన విషయాలను ఎంతో సరళంగా వివరించడంలో నిపుణురాలు. మాకేదైనా అర్థం కాకపోతే అడగమని ఆమె మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆమెలో ఏమాత్రం గర్వం ఉండేది కాదు, ఎంతో స్నేహంగా ఉండేవారు. ఆ కారణంగా ఆమె క్లాసులకు హాజరవడం మాకు ఎంతో ఇష్టంగా ఉండేది.”
ఆస్ట్రేలియాలోని పీటర్ తన లెక్కల టీచర్‌ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, “ఆయన మేము నేర్చుకొనే విషయాలు మా జీవితాల్లో ఎంత ప్రయోజనకరమో ఆచరణీయమైన ఉదాహరణలిస్తూ మేము గ్రహించేలా చేసేవారు. మేము త్రికోణమితి నేర్చుకొనేటప్పుడు ఒక బిల్డింగును తాకకుండానే, కేవలం త్రికోణమితి సూత్రాల ఆధారంగా దాని ఎత్తు కొలవడమెలాగో చూపించారు. అప్పుడు నేను, ‘ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే!’ అనుకోవడం నాకు బాగా గుర్తు.”
ఉత్తర ఇంగ్లాండులోని పాలీన్, “నాకు సంఖ్యలు గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటోందండీ” అని తన టీచర్‌కు చెప్పింది. అప్పుడాయన, “నేర్చుకోవాలనుకుంటున్నావా? అలాగైతే నేను నీకు సహాయం చేయగలను” అన్నారు. ఆ తర్వాత ఆమె ఇలా చెబుతోంది: “కొద్ది నెలలపాటు ఆయన నాపై ఎక్కువ శ్రద్ధచూపించారు, స్కూలు వేళలు అయిపోయిన తర్వాత కూడా నాకు సహాయం చేసేవారు. నేను విజయం సాధించాలని ఆయన కోరుకొంటున్నారని, నాపై శ్రద్ధ చూపిస్తున్నారని నాకు అర్థమయ్యింది. అది గ్రహించిన నేను ఇంకా కష్టపడ్డాను, చివరికి విజయం సాధించాను.”
ఇప్పుడు 30వ పడిలో ఉన్న యాంజీ అనే స్కాట్లాండ్ నివాసి, తన చరిత్ర మేష్టారైన గ్రేహమ్ గారిని గుర్తు చేసుకుంటోంది. “ఆయన చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉండేలా చేశారు! సంఘటనలను ఒక కథలా వివరించేవారు, ప్రతి విషయాన్ని నిజంగా ఉత్సాహంగా చెప్పేవారు. ఆయన చెబుతుంటే కళ్ళకు కట్టినట్లుగా ఉండేది.” పెద్ద వయస్సుగల హ్యూయట్ అనే తన ఫస్ట్ క్లాస్ టీచరును కూడా యాంజీ ఆప్యాయంగా గుర్తు చేసుకుంటోంది. “ఆమె ఎంతో ప్రేమగా ఉండేవారు, ఎంతో శ్రద్ధ వహించేవారు. ఒక రోజు క్లాసులో నేనొక ప్రశ్న అడగడానికి దగ్గరికి వెళ్ళాను. నన్ను ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకున్నారు. నా మీద ఆమెకు ఎంతో శ్రద్ధ ఉందని నేను తెలుసుకునేలా చేశారు.”
దక్షిణ గ్రీసులోని టిమథీ తన కృతజ్ఞతా భావాన్నిలా వ్యక్తం చేశాడు: “నాకు మా సైన్సు సార్ ఇంకా జ్ఞాపకం ఉన్నారు. నేను నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, జీవితాన్ని దృష్టించే విధానాన్ని ఆయన మార్చేశారు. ఆయన క్లాస్‌రూంలోని విద్యార్థులందరిలో సంభ్రమాశ్చర్యాలను పుట్టించేవారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, అవగాహనను వృద్ధి చేసుకోవాలని ఆయన మాలో వాటిపట్ల ప్రేమను పెంపొందింపజేశారు.”
మరో ఉదాహరణ అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసించే రామోనా. ఆమె ఇలా వ్రాస్తోంది: “హైస్కూల్లో మా టీచరుకు ఇంగ్లీషు భాషంటే ఎంతో అభిమానం. ఆమె చూపించే ఉత్సాహం మా అందరిలోకి ప్రవేశించేది! అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనవి కూడా సులభంగా ఉండేలా చేసేవారు.”
కెనడాలోని జేన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గురించి ఉత్సాహంగా మాట్లాడింది. “ఆయనకు ఆటా పాటలను నేర్పించే విషయంలో ఎన్నెన్నో తలంపులు ఉండేవి. మమ్మల్ని ఎన్నో స్థలాలకు తీసుకువెళ్ళేవారు, మాకు మంచుపైన పాదాలకు కర్రలు అమర్చుకొని జారే క్రీడను, కొలనుపై మంచు గడ్డకట్టినప్పుడు ఒక రంధ్రం చేసి అందులో చేపలు పట్టే క్రీడను పరిచయం చేశారు. మేము ఆరుబయట వేసుకొన్న చలిమంటపైన ఒక రకమైన అమెరికన్ ఇండియన్ల రొట్టెలు
కూడా చేసుకొన్నాము. సాధారణంగా ఎప్పుడూ ఇంట్లోవుండి పుస్తకాల్లో తలదూర్చుకొని ఉండే అమ్మాయినైన నాకు ఇలా బయటి లోకం చూడడం అద్భుతమైన అనుభవం!”షాంఘైలో పుట్టి హాంకాంగ్‌లో చదివిన హెలెన్ చాలా బిడియస్తురాలు. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకొంటోంది: “నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఛాన్ అనే ఉపాధ్యాయుడు మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్, పెయింటింగ్ బోధించేవారు. నేను కాస్త సన్నగా ఉండేదాన్ని, వాలీబాల్ బాస్కెట్‌బాల్ వంటివి ఆడడం నాకంతగా వచ్చేది కాదు. అయినప్పటికీ ఆయన నన్ను ఇబ్బంది పెట్టలేదు. నేను బాడ్మింటన్, మరితర క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతించేవారు, అవైతే నాకు అనుకూలంగా ఉండేవి. ఆయన నన్ను అర్థం చేసుకొని, నాపట్ల దయతో వ్యవహరించేవారు.
“అదేవిధంగా పెయింటింగ్‌లో కూడా—నాకు వస్తువులను మనుషులను చిత్రించడం ఏమాత్రమూ వచ్చేది కాదు. అందుకని డిజైనులు చిత్రించమని ఆయన చెప్పారు, వాటిలో నేను భలే నైపుణ్యం చూపేదాన్ని. ఇతర విద్యార్థుల కన్నా నేను చిన్నదాన్ని కావడంతో అదే తరగతిలో మరో సంవత్సరం ఉండేందుకు ఆయన నన్ను ఒప్పించారు. అది నా స్కూలు జీవితంలో ఒక మలుపురాయి. నేను నమ్మకాన్ని పెంచుకున్నాను, పురోగతి సాధించాను. నేనాయనకు సర్వదా కృతజ్ఞురాలిని.”
ఎలాంటి టీచర్లు అత్యంత ప్రభావాన్ని చూపిస్తారు? బోధించడం—ఒక బోధకుని ప్రయాణం (ఆంగ్లం) అనే పుస్తకంలో విలియం ఏయర్స్ ఇలా జవాబిస్తున్నాడు: “మంచిగా బోధించాలంటే అన్నింటికీ మించి ఆలోచనాపూర్వకమైన, శ్రద్ధగల బోధకుడు, విద్యార్థుల జీవితాలకు అంకితమైన బోధకుడు అవసరం. . . . మంచిగా బోధించడానికి ఏవో కొన్ని టెక్నిక్కులు లేదా స్టైళ్ళు, పథకాలు లేదా చర్యలు ఉంటే సరిపోదు. . . . బోధన ప్రాథమికంగా ప్రేమకు సంబంధించిన విషయం.” మరి, విజయవంతమైన ఉపాధ్యాయుడు/రాలు ఎవరు? ఆయనిలా అంటున్నాడు: “మీ హృదయాన్ని స్పృశించిన, మిమ్మల్ని అర్థం చేసుకొన్న, లేదా ఒక వ్యక్తిగా మీపట్ల శ్రద్ధ చూపించిన ఉపాధ్యాయుడు, సంగీతమైనా లెక్కలైనా లాటిన్‌భాషైనా గాలిపటాలైనా సరే ఆయా విషయాల పట్ల ఆయనకున్న ప్రగాఢమైన తృష్ణ మిమ్మల్ని నిజంగా ప్రేరేపించి, పురికొల్పితే అతడే విజయవంతుడైన ఉపాధ్యాయుడు.”
అనేకమంది ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి కూడా కృతజ్ఞతలు పొందారనడంలో, అవాంతరాలు ఎదురైనా పిల్లలకు బోధిస్తూ కొనసాగమని ప్రోత్సహించబడ్డారనడంలో సందేహం లేదు. ఆ వ్యక్తీకరణల వెనుక సామాన్యంగా కనిపించేవేమిటంటే, విద్యార్థి పట్ల ఉపాధ్యాయులు కనపరిచే నిజమైన ఆసక్తి, వాత్సల్యము.
నిజమే, ఉపాధ్యాయులందరూ అలా సానుకూల చర్యలు తీసుకోరు. అయితే, తాము విద్యార్థుల కోసం చేయగలదాన్ని పరిమితం చేసే ఒత్తిళ్ళు కూడా ఉపాధ్యాయులకు అనేకం ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. ఇది ఈ ప్రశ్న తలెత్తేందుకు నడిపిస్తుంది: అలాంటప్పుడు అంత కష్టతరమైన వృత్తిలోకి ప్రజలు ఎందుకు అడుగుపెడతారు? (g02 3/8)
[4వ పేజీలోని చిత్రం]
“బోధన ప్రాథమికంగా ప్రేమకు సంబంధించిన విషయం”