కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉపాధ్యాయ వృత్తి దాని సవాళ్ళు, ప్రమాదాలు

ఉపాధ్యాయ వృత్తి దాని సవాళ్ళు, ప్రమాదాలు

ఉపాధ్యాయ వృత్తి దాని సవాళ్ళు, ప్రమాదాలు

“ఉపాధ్యాయుల నుండి ప్రజలు చాలా ఆశిస్తారు, అయినా మన పాఠశాలల్లో అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తాము చేస్తున్న కృషికి ప్రజల నుండి ప్రశంస చాలా తక్కువగా లభిస్తుంది.” ​—కెన్‌ ఎల్టిస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, ఆస్ట్రేలియా.

“అత్యంత కీలకమైన వృత్తి” ఉపాధ్యాయ వృత్తి అని చెప్పబడుతోంది. అది అనేక సవాళ్ళను ముందుంచుతుందన్నది నిజమేనని ఒప్పుకోవలసిందే​—తక్కువ జీతాలు, హీనస్థితిలో ఉన్న తరగతి గదులు; విపరీతంగా ఉన్న పేపర్‌ వర్క్‌, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం; ఉపాధ్యాయులపైన అగౌరవము, హింసాత్మక చర్యలు, తల్లిదండ్రుల ఉదాసీన వైఖరి ఇవన్నీ వారి సవాళ్ళే. ఇలాంటి సవాళ్ళను కొందరు ఉపాధ్యాయులు ఎలా అధిగమిస్తున్నారు?

తగిన గౌరవం చూపకపోవడం

న్యూయార్క్‌ సిటీలోని నలుగురు ఉపాధ్యాయులను వారి ఉద్దేశంలో ప్రధాన సవాళ్ళేమిటని మేము అడిగాము. వారు ముక్త కంఠంతో “తగిన గౌరవం చూపకపోవడమే” అని జవాబిచ్చారు.

కెన్యాలోని విలియం అభిప్రాయం ప్రకారం ఆఫ్రికాలో కూడా దాని విషయంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆయనిలా అంటున్నాడు: “పిల్లల్లో క్రమశిక్షణ నానాటికీ తగ్గిపోతోంది. నా చిన్నతనంలోనైతే [ఇప్పుడీయన 40వ పడిలో ఉన్నాడు], ఆఫ్రికా సమాజంలో ఉపాధ్యాయులు అందరికన్నా ఎక్కువ గౌరవాన్ని పొందేవారు. చిన్నా పెద్దా అందరూ ఉపాధ్యాయుణ్ణి ఆదర్శవ్యక్తిగా చూసేవారు. అలాంటి గౌరవం ఇప్పుడు తగ్గిపోయింది. పాశ్చాత్యుల సంస్కృతి యౌవనస్థులను నెమ్మదిగా ప్రభావితం చేస్తోంది, చివరికి ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాల్లోకీ ప్రాకుతోంది. నేటి చలనచిత్రాలు, వీడియోలు, సాహిత్యాలు అధికారం పట్ల గౌరవం లేకపోవడాన్ని ఏదో హీరోయిజం అన్నట్లు చిత్రిస్తున్నాయి.”

ఇటలీలో ఉపాధ్యాయుడైన జూల్యానో ఇలా క్షోభిస్తున్నాడు: “తిరుగుబాటుతనం, అవిధేయత, వ్యతిరేకించడం వంటి ధోరణులు సమాజమంతటా వేళ్ళూనుకొని ఉన్నాయి, వాటి ప్రభావం పిల్లలపై పడుతోంది.”

మాదకద్రవ్యాలు, దౌర్జన్యం

విచారకరంగా స్కూళ్ళల్లో మాదకద్రవ్యాలు విపరీతమైన సమస్యగా అయింది​—ఎంత విపరీతం అంటే, అమెరికాలోని ఉపాధ్యాయురాలు రచయిత్రి అయిన లూవాన్‌ జాన్సన్‌ ఇలా వ్రాసింది: “మాదకద్రవ్యాల దురలవాటు నివారణ అనేది, కిండర్‌గార్టెన్‌తో మొదలు ప్రతి స్కూలు విద్యా ప్రణాళికలోనూ ఉంది. [ఇటాలిక్కులు మావి.] మాదకద్రవ్యాల గురించి చాలామంది పెద్దవారికన్నా ఎక్కువగా పిల్లలకే తెలుసు.” ఆమె ఇంకా ఇలా అంటోంది: “నిస్సహాయులుగా, ఇతరుల ప్రేమను పొందనివారిగా, ఒంటరిగా విసుగ్గా భావిస్తూ లేదా అభద్రతాభావాన్ని అనుభవిస్తూ ఉన్న విద్యార్థులు మాదకద్రవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.”​—రెండు పాళ్ళు పాఠ్యగ్రంథం, ఒక పాలు ప్రేమ (ఆంగ్లం).

ఆస్ట్రేలియాలోని కెన్‌ అనే ఉపాధ్యాయుడు ఇలా అడుగుతున్నాడు: “తొమ్మిదేళ్ళ పిల్లవాడికి తల్లిదండ్రులే మాదకద్రవ్యాలను పరిచయం చేస్తే, వాడిప్పుడు వాటికి బానిస అయితే, ఇక ఉపాధ్యాయులుగా మేము వాడికి విద్య ఎలా నేర్పించేది చెప్పండి?” 30వ పడిలో ఉన్న మిఖాయేల్‌ జర్మనీలో ఒక సర్వసంగ్రహ విద్యాలయంలో బోధిస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “స్కూల్లో మాదకద్రవ్యాల కొనుగోలు, వాటి వాడకం జరుగుతున్నాయని మాకు బాగా తెలుసు; కానీ చాలా అరుదుగా వాటిని కనిపెట్టడం జరుగుతోంది.” ఆయన క్రమశిక్షణా లోపం గురించి కూడా వ్యాఖ్యానిస్తూ, అది “విద్యార్థుల్లో ఉన్న విధ్వంసకర ప్రవృత్తిలో కనబడుతోంది” అని అంటున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “బల్లలను గోడలను పాడుచేయడం, ఫర్నిచర్‌ విరగ్గొట్టడం జరుగుతోంది. నా విద్యార్థుల్లో కొందరు దుకాణాల్లో దొంగతనాలు, అలాంటివే మరితర తప్పులు చేసినందుకు పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. స్కూళ్ళలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయంటే అందులో ఆశ్చర్యం లేదు మరి!”

అమీరా మెక్సికోలోని గ్వానాహ్వాటో రాష్ట్రంలో బోధిస్తోంది. ఆమె ఇలా ఒప్పుకుంటోంది: “కుటుంబాల్లో దౌర్జన్యాలు, మాదకద్రవ్యాల ఉపయోగాలు వంటివాటివల్ల పిల్లలపై ప్రభావాలు పడడం మేము చూస్తుంటాము. పిల్లలు దుర్భాష మరితర దుర్గుణాలు ఉన్న వాతావరణంలో ఉంటారు. మరో పెద్ద సమస్య ఏమిటంటే బీదరికం. ఇక్కడ పాఠశాల విద్య ఉచితమే అయినా తల్లిదండ్రులు నోటుపుస్తకాలు, పెన్నులు, మరితర వస్తువులు కొనుక్కోవలసి ఉంటుంది. కానీ ఆహార పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.”

స్కూళ్ళల్లో తుపాకులా?

అమెరికాలో తుపాకుల సంబంధిత సమస్య చిన్న సమస్య ఏమీ కాదని ఇటీవల ఆ దేశంలోని స్కూళ్ళల్లో జరిగిన తుపాకీ ప్రేలుళ్ళ సంఘటనలు నొక్కి చెప్పాయి. ఒక నివేదిక ఇలా చెబుతోంది: “ఈ దేశంలోని 87,125 పబ్లిక్‌ స్కూళ్ళకు ప్రతిరోజు 1,35,000 తుపాకులు తీసుకురాబడుతున్నాయని అంచనా. స్కూళ్ళలో తుపాకుల సంఖ్యను తగ్గించడానికి అధికారులు మెటల్‌ డిటెక్టర్లు, రహస్య వీడియో కెమేరాలు, తుపాకుల వాసన పసిగట్టే కుక్కలు, బీరువాలను పరిశీలించే ఉపకరణాలు, గుర్తింపు కార్డులు ఉపయోగిస్తున్నారు, స్కూలుకు బ్యాగులు తీసుకురావడం నిషేధించడం కూడా జరిగింది.” (అమెరికాలో విద్యాబోధ [ఆంగ్లం]) అలాంటి భద్రతా చర్యలను చేపట్టడం, ఇక్కడ మనం స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నామా లేకపోతే జైళ్ళ గురించా? అని ఒకరు అడిగేలా చేస్తోంది. స్కూలుకు తుపాకులు తీసుకువెళ్ళడం మూలంగా 6,000 కన్నా ఎక్కువమంది విద్యార్థులు తొలగించబడ్డారని కూడా ఆ నివేదిక తెలియజేస్తోంది.

న్యూయార్క్‌ సిటీలో ఉపాధ్యాయురాలిగా ఉన్న ఐరిస్‌ తేజరిల్లు!కు ఇలా చెప్పింది: “విద్యార్థులు స్కూళ్ళలోకి ఆయుధాలను దొంగతనంగా తీసుకువస్తున్నారు. మెటల్‌ డిటెక్టర్లు వాటిని ఆపలేకపోతున్నాయి. స్కూళ్ళలో విధ్వంసం సృష్టించడం మరో పెద్ద సమస్య.”

ఇంతటి విధ్వంసకర వాతావరణంలోనూ మనస్సాక్షితో పనిచేసే ఉపాధ్యాయులు విద్యను దాని విలువలను బోధించడానికి గట్టిగా కృషి చేస్తుంటారు. చాలామంది ఉపాధ్యాయులు డిప్రెషన్‌కి నిస్పృహకు గురవుతారంటే ఆశ్చర్యమేముంది. జర్మనీలోని థ్యురింజీయాలో ఉపాధ్యాయుల సంఘాధ్యక్షుడైన రాల్ఫ్‌ బుష్‌ ఇలా అంటున్నాడు: “జర్మనీలోని పది లక్షల ఉపాధ్యాయుల్లో దాదాపు మూడవ వంతు మంది ఒత్తిడి మూలంగా అస్వస్థతకు గురవుతారు. వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నిస్పృహకు గురవుతారు.”

పిల్లలను కనే పిల్లలు

కౌమారదశలోని వారు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం మరో పెద్ద సమస్య. అమెరికాలో విద్యాబోధ (ఆంగ్లం) అనే పుస్తక రచయిత జార్జ్‌ ఎస్‌. మారిసన్‌ ఆ దేశం గురించి ఇలా అంటున్నాడు: “దాదాపు పది లక్షల టీనేజర్లు (15 నుండి 19 ఏండ్ల వయస్సుగల అమ్మాయిల్లో 11 శాతంమంది) ప్రతి సంవత్సరం గర్భవతులవుతున్నారు.” అభివృద్ధి చెందిన దేశాలన్నింట్లో కన్నా అమెరికాలోనే టీనేజర్లలో గర్భధారణ రేటు అత్యధికంగా ఉంది.

ఈ పరిస్థితిని ఐరిస్‌ నిర్ధారిస్తోంది, ఆమె ఇలా అంటోంది: “కౌమారదశలోని వారు మాట్లాడేదల్లా సెక్స్‌, పార్టీ వీటి గురించే. అదొక వ్యసనం అయిపోయింది. ఇప్పుడైతే స్కూలు కంప్యూటర్లలో ఇంటర్నెట్‌ ఉంది. అంటే ఛాట్‌ గ్రూపులు, పోర్నోగ్రఫీ అందుబాటులో ఉన్నాయన్నమాట.” స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఉన్న ఆన్హేల్‌ ఇలా నివేదిస్తోంది: “విద్యార్థుల్లో లైంగిక విశృంఖలత్వం నేడొక జీవిత వాస్తవం. చాలా చిన్న వయస్సులోని విద్యార్థినులు గర్భవతులైన సందర్భాలు ఉన్నాయి.”

“మహిమాన్విత బేబీసిట్టర్లు”

కొందరు ఉపాధ్యాయులు చేసే మరో ఫిర్యాదు ఏమిటంటే, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లో విద్యాబోధ చేయాల్సిన తమ బాధ్యతను విస్మరిస్తారు. తమ పిల్లలకు తల్లిదండ్రులే తొలి విద్యాబోధకులుగా ఉండాలని ఉపాధ్యాయులు భావిస్తారు. మంచి మర్యాదల బోధన ఇంటి నుండే ప్రారంభమవ్వాలి. అమెరికా ఉపాధ్యాయుల సమాఖ్య అధ్యక్షురాలైన సాండ్రా ఫెల్డ్‌మన్‌, “ఉపాధ్యాయులను . . . ఇతర వృత్తుల్లోని వారిలాగా దృష్టించాలి, మహిమాన్విత బేబీసిట్టర్లుగా కాదు” అని చెబుతోంది.

తల్లిదండ్రులు తరచు స్కూళ్ళలో ఇవ్వబడే క్రమశిక్షణకు మద్దతునివ్వడంలో విఫలమవుతుంటారు. ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన లీమరీజ్‌ తేజరిల్లు!తో ఇలా అంది: “నేరాలు చేస్తున్న పిల్లల గురించి ప్రిన్సిపాల్‌కు చెప్పినప్పుడు వెనువెంటనే తల్లిదండ్రుల నుండి దాడిని ఎదుర్కోవలసి వస్తుంది!” సమస్యలు సృష్టిస్తున్న విద్యార్థులతో వ్యవహరించడం గురించి మునుపు పేర్కొనబడిన బుష్‌ ఇలా చెబుతున్నారు: “కుటుంబ వాతావరణంలో పెంపకం అనేది తగ్గిపోతోంది. మంచి, సహేతుకమైన కుటుంబ వాతావరణంలో పెంచబడిన పిల్లలు అని అత్యధికుల విషయంలో అనుకోలేకపోతున్నాము.” అర్జెంటీనాలో ఉన్న మెండోజాలోని ఎస్టేలా ఇలా చెబుతోంది: “ఉపాధ్యాయులమైన మేము విద్యార్థులంటే భయపడుతున్నాము. వాళ్ళకు తక్కువ ర్యాంకులిస్తే మాపైన రాళ్ళు విసురుతారు, లేదా మాపై దాడి చేస్తారు. మాకు కార్లుంటే వాటిని నాశనం చేస్తారు.”

చాలా దేశాల్లో ఉపాధ్యాయుల కొరత ఉందంటే ఆశ్చర్యమేమైనా ఉందా? కార్నగీ కార్పొరేషన్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ అధ్యక్షుడైన వార్టన్‌ గ్రెగోరియన్‌, “వచ్చే దశాబ్ద కాలంలో మన [అమెరికన్‌] స్కూళ్ళకు 25 లక్షల క్రొత్త ఉపాధ్యాయులు అవసరమవుతారు” అని హెచ్చరిస్తున్నాడు. పెద్ద నగరాల్లోని స్కూళ్ళు, “ఇండియా, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, యూరప్‌, మరెక్కడ నుండైనా సరే మంచి ఉపాధ్యాయుల కోసం వెదకుతున్నాయి.” అయితే, ఆ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నది స్పష్టం.

ఉపాధ్యాయుల కొరత ఎందుకుంది?

జపాన్‌లో ఉపాధ్యాయుడిగా 32 ఏండ్ల అనుభవం ఉన్న యోషీనోరీ, “ఉపాధ్యాయ వృత్తికి మంచి ప్రేరకాలున్నాయి, అది ఆదర్శవంతమైన వృత్తి, జపాన్‌ సమాజంలో దానికి ఎంతో గౌరవాన్నిస్తారు” అంటున్నాడు. విచారకరంగా సంస్కృతులన్నింట్లోను అలాంటి పరిస్థితి లేదు. మునుపు పేర్కొనబడిన గ్రెగోరియన్‌ కూడా చెప్పేదేమిటంటే ఉపాధ్యాయులకు “వృత్తిపరమైన గౌరవం, గుర్తింపు, జీతము లభించడం లేదు. . . . [అమెరికాలోని] చాలా రాష్ట్రాల్లో, బ్యాచ్‌లర్‌ డిగ్రీ మాస్టర్‌ డిగ్రీ అవసరమయ్యే వేరే ఉద్యోగాలకన్నా ఉపాధ్యాయ వృత్తికి తక్కువ జీతాలు వస్తాయి.”

ప్రారంభంలో పేర్కొనబడిన కెన్‌ ఎల్టిస్‌ ఇలా వ్రాశాడు: “తమకన్నా చాలా తక్కువ అర్హతలు అవసరమున్న ఉద్యోగాలకు తమకన్నా చాలా ఎక్కువే జీతాలు వస్తున్నాయని ఉపాధ్యాయులు తెలుసుకొన్నప్పుడు ఏమవుతుంది? లేదా తాము పన్నెండు నెలల క్రితం విద్యాదానం చేసిన విద్యార్థులు . . . ఇప్పుడు తమకన్నా ఎక్కువ ఆర్జిస్తున్నారనీ లేదా చివరికి ఐదు సంవత్సరాల తర్వాత తాము సంపాదించబోయే దానికన్నా ఎక్కువ ఆర్జిస్తున్నారనీ తెలుసుకున్నప్పుడు? అలా తెలుసుకున్నప్పుడు ఉపాధ్యాయుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.”

విలియం ఏయర్స్‌ ఇలా వ్రాశాడు: “ఉపాధ్యాయులకు జీతాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. . . . సగటున మాకు లాయర్లు సంపాదించే దానిలో పావు వంతు వస్తుంది, అకౌంటెంట్లు సంపాదించే దానిలో సగం వస్తుంది, లారీ డ్రైవర్లు రేవు కార్మికుల సంపాదన కన్నా తక్కువ వస్తుంది. . . . ఇంత ఎక్కువగా పని చేస్తూ, ఇంత తక్కువగా ఆర్థిక సహాయం లభించే వృత్తి ఇంకోటి లేదు.” (బోధించడం​—ఒక బోధకుని ప్రయాణం) (ఆంగ్లం) ఇదే విషయంపై అమెరికాలోని మాజీ అటార్నీ జనరల్‌ జానెట్‌ రెనో 2000 నవంబరులో ఇలా అన్నారు: “మనం మనిషిని చంద్ర గ్రహానికి పంపించగలుగుతున్నాము. . . . మన క్రీడాకారులకు పెద్ద పెద్ద జీతాలిస్తున్నాము. మన ఉపాధ్యాయులకు ఎందుకు ఎక్కువ జీతాలివ్వలేము?”

“సాధారణంగా ఉపాధ్యాయులకు జీతాలు తక్కువగా ఉంటున్నాయి. నేనన్ని సంవత్సరాలు చదివినా, ఈ న్యూయార్క్‌ సిటీలో, పెద్ద నగరాల్లో సాధారణంగా ఉండే ఒత్తిళ్ళకు తోడు, నా వార్షిక వేతనం చాలా తక్కువగా ఉంటోంది” అంటోంది లీమరీజ్‌. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఉపాధ్యాయురాలిగా ఉన్న వలెంటీనా ఇలా అంటోంది: “జీతానికి సంబంధించినంత వరకు ఉపాధ్యాయ వృత్తి కృతఘ్నతకు గురయ్యే వృత్తి. జీతపు రాళ్ళు ఎప్పుడూ అత్యల్ప వేతనం దిగువనే ఉన్నాయి.” అర్జెంటీనాలో ఉన్న ఛబూట్‌లోని మార్లీన్‌ అదే విధంగా భావిస్తోంది: “తక్కువ జీతాల మూలంగా రెండు మూడు చోట్ల పనిచేయాల్సి వస్తుంది, ఒక చోటి నుండి మరో చోటికి పరుగెత్తాల్సివస్తుంది. దీని మూలంగా మా పనిలో నాణ్యత తగ్గిపోతోంది.” కెన్యాలోని నైరోబీలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆర్థర్‌ తేజరిల్లు!తో ఇలా అన్నాడు: “ఆర్థిక రంగం క్షీణిస్తుండగా ఉపాధ్యాయుడిగా నా జీవితం కష్టతరమవుతోంది. నా సహోద్యోగుల్లో చాలామంది ఏకీభవిస్తున్నట్లుగా, తక్కువ జీతాలు మా వృత్తిలోకి ప్రవేశించకుండా ప్రజల్ని అన్ని సమయాల్లోనూ నిరుత్సాహపరిచాయి.”

న్యూయార్క్‌ సిటీలో ఉపాధ్యాయుడిగా ఉన్న డయానా, ఉపాధ్యాయుల సమయాన్ని ఎంతగానో తినేసే విపరీతమైన పేపర్‌ వర్క్‌ గురించి ఫిర్యాదు చేస్తోంది. సాధారణంగా చేయబడే ఒక ఫిర్యాదేమిటంటే: “ఎప్పుడు చూసినా వ్రాత పనే, అది పనికిరాని వ్రాత పని​—అదీ రోజంతాను.”

సరిపడేంత మంది ఉపాధ్యాయులు లేరు, విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారు

జర్మనీలో ఉన్న డూయీరెన్‌లోని బెర్టోల్ట్‌ నిత్యమూ వినిపించే ఫిర్యాదును వ్యక్తపరిచింది: “తరగతులు మరీ పెద్దగా ఉంటున్నాయి! కొన్నింట్లో 34 మంది విద్యార్థులుంటారు. అంటే సమస్యలనుభవిస్తున్న విద్యార్థుల పట్ల మేము శ్రద్ధ వహించలేమనే. వారిని పట్టించుకోవడం కుదరదు. ఒక్కొక్కరి అవసరాలు నిర్లక్ష్యానికి గురవుతాయి.”

ఇంతకు ముందు పేర్కొనబడిన లీమరీజ్‌ ఇలా వివరిస్తోంది: “ఏమీ పట్టించుకోని తల్లిదండ్రులకు తోడు గత సంవత్సరం నేననుభవించిన అతి పెద్ద సమస్య ఏమిటంటే నా క్లాసులో 35 మంది పిల్లలున్నారు. ఆరేళ్ళ వయస్సుగల ఆ 35 మంది పిల్లలతో వ్యవహరించడం గురించి ఒక్కసారి ఆలోచించండి!”

ఐరిస్‌ ఇలా చెబుతోంది: “ఇక్కడ న్యూయార్క్‌లో ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది, ప్రాముఖ్యంగా గణితము, సైన్సు సబ్జెక్టుల్లో. వారికి వేరే చోట్ల ఇంకా మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అందుకనే సిటీలో చాలామంది విదేశీ ఉపాధ్యాయులు ఉన్నారు.”

ఉపాధ్యాయ వృత్తి చాలా కష్టతరమైన వృత్తి అనడంలో సందేహం లేదు. మరి ఉపాధ్యాయులకు ప్రేరణనిచ్చేదేమిటి? వాళ్ళు ఎందుకు పట్టుదలగా ముందుకు సాగుతారు? ఈ ప్రశ్నలను మా చివరి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది. (g02 3/8)

[9వ పేజీలోని బ్లర్బ్‌]

అమెరికాలోని స్కూళ్ళకు ప్రతి రోజు 1,35,000 తుపాకులు తీసుకురాబడుతున్నాయని అంచనా

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఉపాధ్యాయులుగా విజయాన్ని సాధించాలంటే

మంచి ఉపాధ్యాయులను మీరెలా నిర్వచిస్తారు? నేర్చుకొన్న విషయాలను అప్పజెప్పించుకొని పరీక్షల్లో పాసయ్యేలా పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే వ్యక్తా. లేక ప్రశ్నలు వేయడం, ఆలోచించడం, తర్కించడం నేర్పించే వ్యక్తా? పిల్లవాడు మంచి పౌరుడయ్యేలా తీర్చిదిద్దేదెవరు?

“సుదీర్ఘమైన సంక్లిష్టమైన జీవన ప్రయాణంలో విద్యార్థులకు భాగస్వాములం అని ఉపాధ్యాయులుగా మనం గుర్తించినప్పుడు, మానవులుగా వారికి లభించాల్సిన గౌరవమర్యాదలు వారికివ్వడం ప్రారంభించినప్పుడు, అప్పుడు మనం యోగ్యులమైన ఉపాధ్యాయులమయ్యే దిశలో పయనిస్తాము. ఎంత సులభమో చూడండి​—అంతేకాదు, అంత కష్టమూను.”—బోధించడం—ఒక బోధకుని ప్రయాణం.

ఒక మంచి ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను గుర్తిస్తాడు, దాన్ని అభివృద్ధి చెందేలా వర్ధిల్లేలా ఎలా చేయాలో అతనికి తెలుసు. విలియం ఏయర్స్‌ ఇలా అంటున్నాడు: “మనం ఇంతకన్నా మంచి పద్ధతిని కనిపెట్టాలి, పిల్లల బలాలకు, అనుభవాలకు, నైపుణ్యాలకు, సామర్థ్యాలకు సానపెట్టే పద్ధతిని కనిపెట్టాలి . . . నాకు ఒక అమెరికన్‌ ఆదివాసి తల్లి తన ఐదేళ్ళ కొడుకుపై స్కూల్లో ‘మంద బుద్ధి’ అని ఒక ముద్ర పడడం మూలంగా చేసిన విజ్ఞప్తి గుర్తుకు వస్తోంది: ‘విండ్‌ వుల్ఫ్‌కు నలభైకి పైగా పక్షుల పేర్లు, వలస విధానాలు తెలుసు. సంపూర్ణ సమతుల్యత ఉన్న గ్రద్ద తోకలో పదమూడు ఈకలుంటాయని వాడికి తెలుసు. వాడికిప్పుడు కావల్సిందేమిటంటే వాడి ప్రతిభను గుర్తించే ఒక ఉపాధ్యాయుడు.’”

ప్రతి విద్యార్థిలోని పూర్తి నైపుణ్యాలను రాబట్టడానికి ఉపాధ్యాయులు, వారిలో ఆసక్తిని కలిగించేదేమిటో లేదా వారిని ప్రేరేపించేదేమిటో, వారు ఫలాని విధంగా ప్రవర్తించేందుకు కారణాలేమిటో కనుక్కోవాలి. అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు పిల్లలను ప్రేమించాలి.

[చిత్రసౌజన్యం]

United Nations/Photo by Saw Lwin

[11వ పేజీలోని బాక్సు]

విద్యాభ్యాసం ఎప్పుడూ సరదాగానే ఉండాలా?

ఉపాధ్యాయుడైన విలియం ఏయర్స్‌ బోధనా పద్ధతులకు సంబంధించి ఉన్న పది తప్పుడు తలంపుల పట్టికను తయారుచేశాడు. వాటిలో ఒకటి: “మంచి ఉపాధ్యాయులు విద్యాభ్యాసం సరదాగా ఉండేలా చేస్తారు.” ఆయనింకా ఇలా చెబుతున్నాడు: “సరదాగా ఉండడం అవధానాన్ని ప్రక్కకు మళ్ళిస్తుంది, వినోదకరంగా ఉంటుంది. సర్కస్‌ జోకర్లు సరదాగా ఉంటారు. జోకులు సరదాకి, కాలక్షేపానికి పనికివస్తాయి. విద్యాభ్యాసం ఆలోచింపజేయగలదు, ఆశ్చర్యాన్ని కలిగించగలదు, గలిబిలికి గురిచేయగలదు, తరచు గాఢమైన ఆహ్లాదాన్నివ్వగలదు. నేర్చుకోవడం సరదాగా ఉంటే మంచిదే. కానీ అది సరదాగా ఉండాల్సిన అవసరం లేదు.” ఆయనింకా ఇలా అంటున్నాడు: “విద్యాబోధ చేయడానికి విస్తృత విషయపరిజ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యం, వివేచన, అవగాహన అవసరం​—అన్నింటికీ మించి అందుకు ఆలోచనాపూర్వకంగా ఉండాల్సిన, శ్రద్ధచూపే వ్యక్తిగా ఉండాల్సిన అవసరం ఉంది.”—బోధించడం​—ఒక బోధకుని ప్రయాణం.

జపాన్‌లో ఉన్న నాగోయా సిటీకి చెందిన సూమీయో తన విద్యార్థుల్లో ఈ సమస్య ఉన్నట్లు గ్రహించాడు: “చాలామంది హైస్కూలు విద్యార్థులకు కేవలం సరదాగా కాలక్షేపం చేయడం పైనా, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేని పనులు చేయడంపైనా తప్ప ఇంక దేనిమీదా ఆసక్తి ఉన్నట్లు కనిపించదు.”

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో విద్యార్థి సలహాదారుగా ఉన్న రోజా ఇలా అంటోంది: “విద్యార్థుల్లో సాధారణంగా ఉండే వైఖరి ఏమిటంటే, విద్యాభ్యాసం బోరు కొట్టించే పని. ఉపాధ్యాయులు బోరు కొట్టిస్తారు. ప్రతీదీ సరదాగా ఉండాలని వాళ్ళనుకుంటారు. విద్యాభ్యాసానికి ఎంత కృషి చేస్తే అంతే ప్రయోజనాలు లభిస్తాయని వారు గుర్తించలేకపోతారు.”

ఎప్పుడూ సరదాగా ఉండాలనుకోవడం మూలంగా కృషి సల్పడానికి త్యాగాలు చేయడానికి యౌవనస్థులకు కష్టమవుతోంది. పైన పేర్కొన్న సూమీయో ఇలా అన్నాడు: “విషయం ఏమిటంటే, వాళ్ళు దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచించలేరు. తామిప్పుడు దేని కోసమైనా కష్టించి పనిచేస్తే, కృషికి తగ్గ ఫలితం భవిష్యత్తులో లభిస్తుందని తలంచే హైస్కూలు విద్యార్థులు చాలా తక్కువమంది ఉన్నారు.”

[7వ పేజీలోని చిత్రం]

డయానా, అమెరికా

[8వ పేజీలోని చిత్రం]

“స్కూల్లో మాదక ద్రవ్యాల కొనుగోలు, వాటి వాడకం జరుగుతున్నాయని మాకు బాగా తెలుసు; కానీ చాలా అరుదుగా వాటిని కనిపెట్టడం జరుగుతుంది.”​—మిఖాయేల్‌, జర్మనీ

[8, 9వ పేజీలోని చిత్రం]

‘కుటుంబాల్లో దౌర్జన్యాలు, మాదక ద్రవ్యాల ఉపయోగాలు వంటివి జరుగుతున్నాయి.’​అమీరా, మెక్సికో

[9వ పేజీలోని చిత్రం]

“ఉపాధ్యాయులను . . . ఇతర వృత్తుల్లోని వారిలాగా దృష్టించాలి, మహిమాన్విత బేబీసిట్టర్లుగా కాదు.”​—సాండ్రా ఫెల్డ్‌మన్‌, అమెరికా ఉపాధ్యాయుల సమాఖ్య అధ్యక్షురాలు