ఉపాధ్యాయ వృత్తి సంతృప్తి, సంతోషం
ఉపాధ్యాయ వృత్తి సంతృప్తి, సంతోషం
“నేను ఉపాధ్యాయురాలిగా కొనసాగేలా చేస్తున్నదేమిటని అడుగుతున్నారా? విద్యాబోధన చాలా కష్టంగా, నిస్సత్తువ కలిగించేదిగా ఉన్నప్పటికీ, పిల్లలు నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపించడం చూస్తుంటే, వారి పురోగతి చూస్తుంటే నేను నా వృత్తిలో కొనసాగేలా ప్రోత్సాహాన్ని పొందుతాను.”—లీమరీజ్, న్యూయార్క్ సిటీలోని ఒక ఉపాధ్యాయురాలు.
ఎన్ని సవాళ్ళు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని నిరుత్సాహాలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉపాధ్యాయులు తాము ఇష్టపూర్వకంగా ప్రవేశించిన వృత్తిలో పట్టుదలతో కొనసాగుతున్నారు. మరి వేలాదిమంది విద్యార్థులు, తమకు తగిన గుర్తింపు లభించకపోవచ్చని తెలిసినా ఉపాధ్యాయులుగా అర్హత పొందేందుకు కృషి చేయడానికి వారిని పురికొల్పేదేమిటి? వారు కొనసాగేలా చేసేదేమిటి?
ఇండియా రాజధానియైన న్యూ ఢిల్లీలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మేరీయాన్ ఇలా వివరిస్తోంది: “ఒక టీనేజర్‌కి అత్యంత కష్టభరితమైన సంవత్సరాల్లో నడిపింపునిచ్చేందుకు దోహదపడిన వ్యక్తిగా గుర్తింపును పొందడం ఎంతో సంతృప్తినిస్తుంది. యౌవనస్థులు మేము అందించే సహాయానికి ప్రతిస్పందించి, రానున్న సంవత్సరాల్లో మమ్మల్ని ప్రేమగా గుర్తుంచుకున్నప్పుడు మాకు లభించే సంతృప్తి వేరే ఏ వృత్తిలోనూ లభించదు.”
ముందటి ఆర్టికల్స్‌లో పేర్కొనబడిన ఉపాధ్యాయుడైన జూల్యానో ఇలా అంటున్నాడు: “ఫలాని విషయంలో విద్యార్థి ఆసక్తిని పురికొల్పడంలో విజయాన్ని సాధించామన్న గ్రహింపు అత్యంత సంతృప్తినిస్తుంది. ఉదాహరణకు, చరిత్రలో ఒక విషయాన్ని నేను వివరించినప్పుడు కొందరు విద్యార్థులు, ‘ఆపేయకండి, మాకింకా చెప్పండి!’ అన్నారు. మనస్ఫూర్తిగా చేయబడిన అలాంటి వ్యక్తీకరణలు స్కూల్లో నిస్తేజంగా ఉన్న ఒక పూటలో వెలుగులు నింపగలవు. ఎందుకంటే ఆ యౌవనస్థుల్లో మునుపెరగని భావోద్వేగాలను మీరు రేకెత్తించారని తెలుసుకుంటారు. ఒక విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు వారి ముఖాలు వెలిగిపోతాయి, వారి కళ్ళల్లో ఆ వెలుగులు చూసినప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతం.”
ఇటలీలో బోధిస్తున్న ఎలేనా ఇలా చెబుతోంది: “చాలా తరచుగా అనుదిన విషయాల్లో సంతృప్తి లభిస్తుందని నేను నమ్ముతాను. సాధారణంగా లభించని సంచలనాత్మక ఫలితాల కన్నా విద్యార్థులు చిన్న చిన్న విజయాలు సాధించినప్పుడే సంతృప్తి లభిస్తుంది.”
30వ పడిలో ఉన్న ఆస్ట్రేలియా నివాసి కాన్నీ ఇలా అంటోంది: “విద్యాబోధలో చక్కని అనుబంధాన్ని పెంపొందించుకున్న విద్యార్థి కొంత సమయం వెచ్చించి, మీరు సల్పిన కృషికి కృతజ్ఞతగా మీకొక ఉత్తరం వ్రాసినప్పుడు మీకు ఎంతో సంతృప్తి లభిస్తుంది.”
అర్జెంటీనాలోని మెండోజాకు చెందిన ఆస్కార్ అదే భావాలను వ్యక్తం చేస్తున్నారు: “నా విద్యార్థులు వీధిలోనో లేక మరెక్కడైనా కలిసినప్పుడు నేను వారికి బోధించిన విషయాల కోసం కృతజ్ఞతను వ్యక్తం చేసినప్పుడు నేను చేసినది వ్యర్థం కాలేదన్న తృప్తి నాకు లభిస్తుంది.” స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు చెందిన ఆన్హేల్ ఇలా అంటోంది: “నా జీవితంలో కొంత భాగం అద్భుతమైనదీ కష్టతరమైనదీ అయిన ఈ వృత్తికి అంకితం చేసుకున్న నాకు అత్యంత సంతృప్తినిచ్చేదేమంటే, నేను బోధించిన పిల్లలు, కొంతవరకు నా కృషి ఫలితంగా నీతిపరులుగా ఎదగడం చూడడమేననడంలో సందేహం లేదు.”
ప్రారంభంలో వ్యాఖ్యానించిన లీమరీజ్ ఇలా అంటోంది: “ఉపాధ్యాయులు ఒక ప్రత్యేక తరహా వ్యక్తులని నేను నిజంగా భావిస్తాను. ఇంతటి గొప్ప బాధ్యతను చేపట్టినందుకు మేము కాస్త విభిన్న తరహా వ్యక్తులము కూడా. కానీ మీరు పది మంది పిల్లలపైనైనా లేక ఒక్క పిల్లవాడిపైనైనా ప్రభావాన్ని చూపించగలిగినప్పుడు మీరు మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినట్లే, అంతకన్నా గొప్ప భావన మరొకటి లేదు. అప్పుడు మీరు ఆనందంగా మీ వృత్తిని కొనసాగించగలరు.”
మీరు మీ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పారా?
మీరు విద్యార్థి అయినా తల్లిదండ్రులైనా, వెచ్చించిన సమయం, చేసిన కృషి, చూపిన ఆసక్తి విషయమై ఎవరైనా ఉపాధ్యాయుడు/రాలికి కృతజ్ఞతలు చెప్పారా? లేదా కనీసం థాంక్యూ కార్డు గానీ ఉత్తరం గానీ వ్రాశారా? కెన్యాలోని నైరోబీకి చెందిన ఆర్థర్ ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు: “ఉపాధ్యాయులు కూడా ప్రశంసించబడినప్పుడే వర్ధిల్లుతారు. ప్రభుత్వము, తల్లిదండ్రులు, విద్యార్థులు వారందించిన సేవలకు వారిని ఘనపరచాలి.”
రచయిత మరియు ఉపాధ్యాయురాలైన లూవాన్ జాన్సన్ ఇలా వ్రాసింది: “ఉపాధ్యాయుల గురించి నాకు ఒక్క చెడు నివేదిక వస్తే, వంద మంచి నివేదికలు వస్తాయి. చెడ్డ ఉపాధ్యాయుల కన్నా మంచి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారన్న నా నమ్మకాన్ని అది నిర్ధారిస్తుంది.” ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది నిజంగా ఒక ప్రైవేటు డిటెక్టివ్‌ని సంప్రదించి “తమ చిన్ననాటి ఉపాధ్యాయులు ఇప్పుడెక్కడున్నారో వెదకిపెట్టమని కోరతారు. తమ ఉపాధ్యాయులను కనుగొని వారికి కృతజ్ఞతలు తెలపాలని విద్యార్థులు కోరుకొంటున్నారు.”
ఒక వ్యక్తి విద్యాభ్యాసానికి ఉపాధ్యాయులు ఆవశ్యకమైన పునాది వేస్తారు. విఖ్యాత విశ్వవిద్యాలయాల్లోని అత్యుత్తమ ప్రొఫెసర్లు కూడా తమలో విద్య, పరిజ్ఞానం, అవగాహనల పట్ల తృష్ణను పెంచేందుకు ప్రేరేపించేందుకు సమయాన్ని వెచ్చించి కృషి చేసిన ఉపాధ్యాయులకు ఋణపడివున్నారు. నైరోబీలోని ఆర్థర్ ఇలా అంటున్నాడు: “ప్రభుత్వ రంగంలోను ప్రైవేటు రంగంలోను ఉన్న అగ్రస్థాయి ప్రణాళికా నిర్మాతలందరూ తమ జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఒక ఉపాధ్యాయుడిచేత బోధించబడినవారే.”
మనలో జిజ్ఞాసను రేకెత్తించి, మన మనస్సులను హృదయాలను ప్రేరేపించి, పరిజ్ఞాన సముపార్జనా దాహాన్ని, అవగాహనా దాహాన్ని తీర్చుకోవడమెలాగో నేర్పించిన ఆ స్త్రీ పురుషులకు మనమెంత కృతజ్ఞులమై ఉండాలి!
అత్యంత గొప్ప విద్యావేత్త అయిన యెహోవా దేవునికి మనమింకెంత కృతజ్ఞులమై ఉండాలి, ఆయన, సామెతలు 2:1-6 వచనాల్లోని ఈ మాటలను ప్రేరేపించి వ్రాయించాడు: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.”
ఆలోచనను రేకెత్తించే ఆ వచనాల్లో ‘ఇలా చేసిన యెడల’ అనే షరతు ఎన్నిసార్లు వచ్చిందో గమనించండి. ఒక్కసారి ఊహించండి, మనమా సవాలును స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటే మనకు ‘దేవుని గూర్చిన విజ్ఞానము లభిస్తుంది’! అది నిశ్చయంగా అన్ని విద్యల్లోకెల్లా శ్రేష్ఠమైనది. (g02 3/8)
[13వ పేజీలోని బాక్సు]
సంతోషభరితురాలైన ఒక తల్లి
న్యూయార్క్ సిటీలోని ఒక ఉపాధ్యాయునికి ఈ క్రింది ఉత్తరం వచ్చింది:
“మీరు మా పిల్లల విషయంలో చేసిన సహాయానికి నేను హృదయపూర్వకంగా, ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చూపిన శ్రద్ధ, కనబరచిన దయ, ఉపయోగించిన ప్రజ్ఞ, పిల్లలు తమ ప్రతిభను పూర్తిగా వ్యక్తం చేసేందుకు సహాయపడ్డాయి, మీరు లేకపోయుంటే అది జరిగేది కాదని నాకు బాగా తెలుసు. నా పిల్లల విషయంలో నేను గర్వించేలా చేశారు మీరు—ఈ అనుభవాన్ని నేనెన్నడూ మరచిపోను. ఇట్లు, ఎస్. బి.”
మీరు ప్రోత్సాహాన్నందించగల ఉపాధ్యాయులు ఎవరైనా మీకు తెలుసా?
[12వ పేజీలోని చిత్రం]
“ఒక విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు వారి ముఖాలు వెలిగిపోతాయి, వారి కళ్ళల్లో ఆ వెలుగులు చూసినప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతం.”—జూల్యానో, ఇటలీ
[13వ పేజీలోని చిత్రాలు]
“విద్యార్థి కొంత సమయం వెచ్చించి, . . . కృతజ్ఞతగా మీకొక ఉత్తరం వ్రాసినప్పుడు ఎంతో సంతృప్తి లభిస్తుంది.”—కాన్నీ, ఆస్ట్రేలియా