కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్షుద్రవిద్యల్లో కాస్త ఆసక్తి చూపించడం హానికరమా?

క్షుద్రవిద్యల్లో కాస్త ఆసక్తి చూపించడం హానికరమా?

యువత ఇలా అడుగుతోంది . . .

క్షుద్రవిద్యల్లో కాస్త ఆసక్తి చూపించడం హానికరమా?

టీనేజర్లకు క్షుద్రవిద్యలంటే నిజంగా ఆసక్తి ఉంటుందా? దానికి జవాబు కనుగొనడానికి ఒక పరిశోధకుల బృందం మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోని 115 మంది విద్యార్థులను సర్వే చేశారు. సర్వేలో తేలిన విషయాలివి: సర్వే చేయబడినవారిలో సగం కంటే ఎక్కువమంది విద్యార్థులు (54 శాతం) క్షుద్రవిద్యల్లోను, అతీంద్రియశక్తుల్లోను తమకు ఆసక్తి ఉందని చెప్పారు, దాదాపు పావువంతు మంది (26 శాతం) తమకు “చాలా ఆసక్తి” ఉందని చెప్పారు.

యాంకరేజ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అలాస్కాలోని పరిశోధకులు ఇలా వ్రాస్తున్నారు: “ఇటీవలి సంవత్సరాల్లో సాతానువాదంతో కూడిన కార్యకలాపాల గురించిన . . . వ్యాసాలు, వార్తాపత్రికల్లోను, పత్రికల్లోను విపరీతంగా పెరిగిపోయాయి.” యౌవనస్థుల్లో సాతానువాదం వ్యాపించిందనడానికి గట్టి సాక్ష్యాధారాలు ఏమంతగా లేవని నిపుణులు చెబుతున్నారు. అయినా చాలామంది యౌవనస్థులు సాతానువాదంలోని క్షుద్రవిద్యల్లోని కొన్ని అంశాల్లో కేవలం పైపైనే అయినప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారనడంలో సందేహంలేదు.

కాబట్టి కొందరు యౌవనస్థులు ‘క్షుద్రవిద్యల్లో కాస్త ఆసక్తి చూపించడం హానికరమా?’ అని అడుగుతారు. జవాబుగా మొదట మనం యౌవనస్థులు క్షుద్రవిద్యలతో పరిచయం ఎలా ఏర్పరచుకుంటారో చూద్దాము.

క్షుద్రవిద్యల ఆకర్షణ

యు.ఎస్‌. న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌లోని ఒక వ్యాసం, “20 ఏండ్ల క్రితం ఊహకైనా అందనటువంటి, తలతిరిగిపోయేలా చేసేటి, కొన్నిసార్లు ఆందోళన కలిగించేలాంటి దృశ్యాలు, సమాచారము నేడు పిల్లలకు, టీనేజర్లకు అందుబాటులో ఉన్నాయి” అని చెబుతోంది. చాలామంది యౌవనస్థులు ఉత్సుకతతో క్షుద్రవిద్యలను గురించిన పుస్తకాలు పత్రికలు చదువుతున్నారు, వీడియోలు, ఇంటర్నెట్‌లో వెబ్‌ సైట్లు చూస్తున్నారు.

బిబిసి న్యూస్‌ ఆన్‌లైన్‌ ప్రకారం, మాంత్రిక విద్యలను రక్తం త్రాగే మంత్రగాళ్ళను చూపిస్తున్న ప్రజాదరణ పొందిన టీవీ కార్యక్రమాలు “పిల్లల్లో మాంత్రికవిద్యపట్ల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పబడుతోంది.” అదే విధంగా కొన్ని హెవీ మెటల్‌ మ్యూజిక్‌లలో హింసాత్మకమైన, పిశాచాలతో కూడిన ఇతివృత్తాలు ఉన్నాయి. టామ్‌ హార్పర్‌ అనే శీర్షికా రచయిత టొరొంటోలోని ద సండే స్టార్‌ అనే వార్తాపత్రికకు ఇలా వ్రాశాడు: “[సంగీత ప్రపంచంలో] జరుగుతున్న దాని విషయమై నేను చాలా గట్టిగా హెచ్చరించాల్సివస్తోంది. . . . ఇంత దిగజారిన పరిస్థితిని నేనింతకు ముందెన్నడూ చూడలేదు. పాటల్లో పిచ్చితనం, దయ్యాలు పట్టడం, పిశాచాలు, రక్తపాతము, శాపానార్థాలు, అలాగే మానభంగాలు, శరీరంపై గాట్లు పెట్టుకోవడం, హత్యలు, ఆత్మహత్యలతో సహా ప్రతి విధమైన హింసలు ఉంటున్నాయి. మరణం, వినాశనం, సర్వనాశన ప్రవచనాలు, మంచితనాన్నంతటినీ ధిక్కరించడం, హీనమైన దుష్టమైన ప్రతీదాన్ని స్వీకరించడం​—ఇవీ, వాటిలోని ఇతివృత్తాలు.”

అలాంటి మ్యూజిక్‌ వినడం నిజంగా వినాశకర ప్రవర్తనకు కారణమవుతుందా? కారణమవుతుందనే అనిపిస్తోంది. కనీసం ఈ సందర్భంలో అనిపిస్తోంది: అమెరికాలోని 14 ఏళ్ళ ఒక పిల్లవాడు తన తల్లిని కత్తితో పొడిచి చంపి తర్వాత తనను తాను చంపుకున్నాడు. అతని గదిలోని గోడల నిండా హెవీ మెటల్‌ రాక్‌ సంగీతకారుల పోస్టర్లు ఉన్నాయి. ఆ తర్వాత అతని తండ్రి ఇలా విజ్ఞప్తి చేశాడు: “తమ పిల్లలు ఎలాంటి మ్యూజిక్‌ వింటున్నారో గమనించమని తల్లిదండ్రులకు చెప్పండి.” కొడుకు తన తల్లిని చంపడానికి ఒక వారం రోజుల క్రితం, “రక్తం గురించీ, తల్లిని చంపడం గురించీ” చెబుతున్న ఒక రాక్‌ మ్యూజిక్‌ పాట పాడుతూ ఉన్నాడని తండ్రి చెప్పాడు.

రోల్‌ ప్లేయింగ్‌ గేమ్స్‌ అనేవి కూడా ఉన్నాయి, వీటిలో పాల్గొనేవారు మాంత్రికుల పాత్రలు మరితర క్షుద్రశక్తుల పాత్రలు ధరించే అవకాశం ఉంటుంది. వీటిలో చాలామట్టుకు పిశాచాల హింసాత్మక సంఘటనలతో నిండివుంటాయి. *

మీడియాస్కోప్‌ అనే పరిశోధక సంస్థ ఇలా నివేదిస్తోంది: “హెవీ మెటల్‌ మ్యూజిక్‌ని ఎక్కువగా కోరుకోవడమనేది, సమాజానికి దూరమవడం, మాదకద్రవ్యాలను ఉపయోగించడం, మానసిక వ్యాధులు రావడం, ఆత్మహత్యలకు దారితీసే కారణాలు పెరగడం, . . . లేదా కౌమారదశలో ప్రమాదాలను కొనితెచ్చుకునే ప్రవృత్తి పెరగడం వంటివాటిని సూచిస్తుంది గాని, అలాంటి ప్రవర్తనలకు అది కారణం కాదని అధ్యయనాలు ఇప్పుడు చూపిస్తున్నాయి. ఆ సమస్యలతో ఇప్పటికే పోరాడుతున్న టీనేజర్లు, హెవీ మెటల్‌ మ్యూజిక్‌లోని పాటలు తమ బాధలను వ్యక్తం చేస్తున్నందున దానిపట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉందని అంచనావేయబడుతోంది.”

సాతానువాదపు మ్యూజిక్‌ వినడంలోని ప్రమాదాల గురించి పరిశోధకులందరూ ఏకీభవించకపోవచ్చు. కానీ హింసను లేదా స్వనాశనాన్ని నొక్కిచెప్పే వీడియోలు, మ్యూజిక్‌, లేదా గేమ్‌లు క్రమంగా వినడం చూడడం ఆడడం మనలను భ్రష్టుపట్టించకుండా ఉంటుందా? అయితే క్షుద్రవిద్యల్లో కాస్త ఆసక్తి చూపించడం క్రైస్తవులకు అంతకన్నా గొప్ప ప్రమాదకరమవుతుంది.

క్షుద్రవిద్యల విషయంలో దేవుని దృక్కోణం

1 కొరింథీయులు 10:20 వ వచనంలో అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ఇలా హెచ్చరించాడు: “మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు.” ఈ దయ్యాలు ఎవరు, దయ్యాలతో వ్యవహరించడం ఎందుకు అంత ప్రమాదకరము? సరళంగా చెప్పాలంటే, దయ్యాలు అపవాదియైన సాతానును అనుసరించాలని నిశ్చయించుకొన్న మాజీ దేవదూతలే. సాతాను అంటే “వ్యతిరేకించేవాడు” అనీ, అపవాది అంటే “కొండెములు చెప్పేవాడు” అనీ అర్థము. బైబిలు చెబుతున్నదాని ప్రకారం దేవుని కుమారుడైన ఈ మాజీ దేవదూత, దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేయడం ద్వారా తనను తాను వ్యతిరేకించేవాడిగాను, కొండెములు చెప్పేవాడిగాను చేసుకొన్నాడు. కొంతకాలానికి, వాడు ఇతర దేవదూతలు తనతోపాటు తిరుగుబాటులో చేరేందుకు ప్రలోభపెట్టాడు. ఆ విధంగా వాళ్ళందరూ దయ్యాలయ్యారు.​—ఆదికాండము 3:1-15; 6:1-4; యూదా 6.

యేసు సాతానును “ఈ లోకాధికారి” అని పిలిచాడు. (యోహాను 12:31) సాతాను వాని దయ్యాలు త్వరలో జరగబోయే తమ నాశనం విషయమై “బహు క్రోధము” గలవారై ఉన్నారు. (ప్రకటన 12:9-12) దయ్యాలతో పాలివారైనవారు అవి హానికరమైనవని తెలిసికోవడంలో ఆశ్చర్యం లేదు. సురినామ్‌లో అభిచారాన్ని అభ్యసిస్తున్న కుటుంబంలో పెరిగిన ఒక స్త్రీ దయ్యాలు “తమ వశంలోకి రావడానికి ఇష్టపడనివారిని ఎలా హింసలు పెడుతూ ఆనందిస్తాయో” ప్రత్యక్షంగా చూసింది. * కాబట్టి ఈ క్రూరమైన ఆత్మ ప్రాణులతో ఏ విధంగా పాల్గొన్నా ఎంతో ప్రమాదకరమైన విషయం!

ఈ కారణంగా, తన ప్రాచీన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు అన్ని విధాల క్షుద్రవిద్యలను విసర్జించమని ఆజ్ఞాపించాడు. “వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు” అని ద్వితీయోపదేశకాండము 18:10-12 హెచ్చరిస్తోంది. అదే విధంగా “మాంత్రికులు” దేవుని చేతిలో నాశనమవుతారని క్రైస్తవులు హెచ్చరించబడ్డారు. (ప్రకటన 21:8) క్షుద్రవిద్యల్లో కాస్త ఆసక్తి చూపించడాన్ని కూడా దేవుడు ఖండిస్తున్నాడు. “అపవిత్రమైనదానిని ముట్టకుడని” బైబిలు ఆజ్ఞాపిస్తోంది.​—2 కొరింథీయులు 6:16-18.

క్షుద్రవిద్యల నుండి దూరంగా వెళ్ళడం

మీరు క్షుద్రవిద్యల్లో కాస్త ఆసక్తి చూపించే పొరపాటు చేశారా? అలాగైతే మొదటి శతాబ్దంలోని ఎఫెసు నగరంలో ఏమి జరిగిందో ఒక్కసారి పరిశీలించండి. అక్కడ చాలామంది “మాంత్రిక విద్య అభ్యసించినవారు” ఉన్నారు. కానీ కొందరు అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ సహాయంతో చేసిన శక్తివంతమైన కార్యాలచే ప్రభావితమయ్యారు. దాని ఫలితమేమిటి? “మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబది వేల వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.”​—అపొస్తలుల కార్యములు 19:11-20.

ఇది మనకు ఏమి చెబుతోంది? ఒక వ్యక్తి దయ్యాల చేతిలోనుండి తప్పించుకోవాలనుకుంటే ఆయన లేదా ఆమె సాతాను ఆరాధనతో సంబంధం ఉన్న ప్రతి వస్తువును నాశనం చేయాలి! ఇందులో, అన్ని పుస్తకాలు, పత్రికలు, పోస్టర్లు, కామిక్‌ పుస్తకాలు, వీడియోలు, తావీజులు, ఇంటర్నెట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకొన్న దయ్యాల సంబంధిత సమాచారము ఉన్నాయి. (ద్వితీయోపదేశకాండము 7:25, 26) క్రిస్టల్‌ బాల్స్‌, ఊజా బోర్డులు వంటి అభిచారంలో ఉపయోగించే అవకాశం ఉన్న ప్రతి వస్తువును పారేయండి. అలాగే సాతానుకు సంబంధించిన ఇతివృత్తాలున్న మ్యూజిక్‌ లేదా వీడియోలను కూడా ఉంచుకోకండి.

అంత సాహసపూరిత చర్యలు తీసుకోవడానికి ధైర్యం, కృతనిశ్చయం అవసరం. కానీ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. జీన్‌ * అనే ఒక క్రైస్తవ స్త్రీ నిరపాయకరమైనదిగా కనిపించిన ఒక కంప్యూటర్‌ గేమ్‌ కొన్నది. గేమ్‌లో వేర్వేరు స్థాయిల్లోకి వెళ్తుండగా అభిచార సంబంధిత అంశాలు అందులో ఉన్నాయని ఆమె గ్రహించింది. త్వరలోనే ఆమెకు హింసాపూరితమైన పీడ కలలు రావడం ప్రారంభమైంది. “ఒకరోజు అర్థరాత్రి నేను నిద్రలేచి ఆ గేమ్‌ ఉన్న సీడీలను నాశనం చేసేశాను” అంటుంది జీన్‌. దాని ఫలితం? “ఇక అప్పటి నుండి నాకు ఎలాంటి సమస్యలు రాలేదు.”

స్వేచ్ఛ పొందడానికి మీరు నిజమైన కృత నిశ్చయాన్ని ప్రదర్శించినప్పుడు మీరు విజయం సాధిస్తారు. అపవాది తనను ఆరాధించమని యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినప్పుడు యేసు ప్రదర్శించిన స్థిరనిశ్చయాన్ని గుర్తు చేసుకోండి. ‘యేసు వానితో​—సాతానా, పొమ్ము​—ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోయాడు.’​—మత్తయి 4:8-11.

ఒంటరిగా పోరాడకండి

క్రైస్తవులమైన మనమందరం ‘ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము’ అని అపొస్తలుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. (ఎఫెసీయులు 6:12) కానీ సాతానుతోను వాని దయ్యాలతోను ఒంటరిగా పోరాడడానికి ప్రయత్నించకండి. దైవభయంగల తల్లిదండ్రుల సహాయాన్ని, స్థానిక క్రైస్తవ సంఘంలోని పెద్దల సహాయాన్ని పొందండి. మీరు చేస్తున్న పనులు ఒప్పుకోవడం ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ దాని మూలంగా మీకు ఎంతో అవసరమైన మద్దతును పొందగలరు.​—యాకోబు 5:14, 15.

బైబిలు ఇలా చెబుతోందని కూడా గుర్తుంచుకోండి: “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:7, 8) అవును, మీకు యెహోవా దేవుని మద్దతు ఉంది! మీరు క్షుద్రవిద్యల ఉరి నుండి తప్పించుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. (g02 1/22)

[అధస్సూచీలు]

^ తేజరిల్లు! సెప్టెంబరు 8, 1999, సంచికలో “యువత ఇలా అడుగుతోంది . . . రోల్‌-ప్లేయింగ్‌ గేమ్స్‌లో ప్రమాదం ఏమైనా ఉందా?” అనే ఆర్టికల్‌ చూడండి.

^ యెహోవాసాక్షులు ప్రచురిస్తున్న దీని సహపత్రికయైన కావలికోట, సెప్టెంబరు 1, 1987 (ఆంగ్లం), సంచికలోని “అభిచార పట్టునుంచి తప్పించుకోవడం” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరు మార్చబడింది.

[24వ పేజీలోని చిత్రం]

సాతాను ఆరాధనతో సంబంధం ఉన్న ప్రతి వస్తువును పారేయండి

[24వ పేజీలోని చిత్రం]

అభిచారమును పెంపొందింపజేసే వెబ్‌ సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి