గాలి వేగంతో గగన విహారం
గాలి వేగంతో గగన విహారం
కెనడాలోని తేజరిల్లు! రచయిత
“నాకు వెంటనే కొంత సన్నని పట్టు బట్ట, తాడు ఇవ్వండి, లోకాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసే ఒకదాన్ని చూపిస్తాను!”—జోసెఫ్-మీషెల్ మాంట్‌గోల్ఫియర్, 1782.
రంగు రంగుల గుమ్మటంలోకి మంట ఎగజిమ్మింది! దాంతో ఆ గుమ్మటం నెమ్మదిగా ఆకాశంలోకి ఎగిరింది. ఏడు రంగుల మేళవింపుతో ఉన్న అందమైన వస్త్రముతో చేయబడిన ఆ గుమ్మటాన్ని చూస్తేనే హృదయం ఆనందంతో నిండిపోతోంది. ఉరుకులు పరుగులతో కూడిన మన జీవితానికి కాస్త విశ్రాంతినిస్తుంది. “ఎంతో ప్రశాంతంగానూ, ఉత్తేజకరమైనదిగానూ ఉంటుంది” అని గుమ్మటంలో ఎంతోకాలంగా విహారాలు చేస్తున్న ఒక ఔత్సాహికుడు గుర్తుచేసుకొంటున్నాడు.
జోసెఫ్-మీషెల్, ఝాక్స్ ఏట్యన్ మాంట్‌గోల్ఫియర్ సోదరులు 1780ల తొలిభాగంలో విజయవంతంగా గాలిగుమ్మటాల్లో ప్రయాణించడం ప్రారంభించినప్పటి నుండి వాటిపట్ల ప్రజలు ఎంతో ఆసక్తిని పెంపొందించుకున్నారు. (క్రిందనున్న బాక్సు చూడండి.) అయితే, వేడిని చాలాసేపు తట్టుకునే బట్ట కనుగొనబడడంతోను, గుమ్మటంలోని గాలి ఉష్ణోగ్రతను పెంచడానికి నియంత్రించడానికి ఉపయోగించే ప్రొపేన్ గ్యాస్‌ని సురక్షితంగా వినియోగించే చవకైన పద్ధతి వెలుగులోకి రావడంతోను అంటే 1960లలో మాత్రమే గాలిగుమ్మటాల ప్రయాణం ఆహ్లాదానికి పాల్గొనే క్రీడగా తయారైంది.
నిశిత పరిశీలన
ఈ అందమైన గుమ్మటాన్ని నిశితంగా పరిశీలిస్తే, పైన వెడల్పుగా ఉండి క్రిందికి వచ్చే కొలది సన్నంగా ఉన్న రంగురంగుల పొడవైన బట్టలు కలిపి కుట్టారని అర్థమవుతుంది. వేడి గాలితో నింపినప్పుడు కొన్ని గుమ్మటాలు 15 మీటర్ల వెడల్పు, 25 మీటర్లకు పైగా ఎత్తు ఉంటాయి.
క్రొత్త క్రొత్త తలంపులుగల ఔత్సాహికులు తమ భిన్నత్వాన్ని వివిధ రకాలుగా వ్యక్తం చేస్తారు, విభిన్నమైన ఆకృతులు పరిమాణాలు ఉండి, జంతువుల నుండి సీసాల వరకు చివరికి సర్కస్ జోకర్ల ఆకారాల్లో కూడా గుమ్మటాలను తయారుచేసుకుంటారు. ఈ నిశ్శబ్ద గుమ్మటాలకు డిజైను ఏదైనా సరే ఎగరడంలో ఇమిడివుండే సూత్రాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి.
తేలికగాను దృఢంగాను ఉండే గోండోలా అనబడే బుట్ట, గుమ్మటం మూతికి సరిగ్గా క్రిందుగా తాళ్ళతో వ్రేలాడదీయబడివుంటుంది, పైలట్‌తోపాటు ప్రయాణికులు కూడా అందులోనే ఉంటారు. కొన్ని బుట్టలు అల్యూమినియంతో చేస్తారు. గోండోలాకు కాస్త పైగా చూడండి. ఇంధనాన్ని దహించే బర్నరు, రెగ్యులేటరు గుమ్మటం మూతికి కాస్త క్రిందుగా ఒక లోహపు బల్లమీద
దృఢంగా అమర్చబడివుండడం మీరు చూస్తారు. ఇంధనం ట్యాంకులు బుట్టలోనే ఉంటాయి.ఎగరడానికి సిద్ధపడండి
విమానం టేకాఫ్ అవడానికి పొడవైన రన్‌వే అవసరం. కానీ ఒక చిన్న క్రీడా మైదానమంతటి విశాల ప్రదేశం చాలు ఇది ఎగరడానికి. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా గుమ్మటం పైకి ఎగురుతున్నప్పుడు అడ్డం వచ్చేవి ఏవీ లేవని నిర్ధారించుకోవాలి. ఈ నిశ్శబ్ద విమానంలో ప్రయాణించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు బుట్టలోకి ప్రవేశించడానికి ముందే కొన్ని ప్రాథమిక చర్యలు తీసుకోవాలి.
మొదటిగా, ఖాళీ గుమ్మటాన్ని గాలివీచే దిశలో నేలపై పరుస్తారు, బుట్ట ప్రక్కనే ఉంటుంది. మోటారుతో నడిచే ఒక పెద్ద ఫ్యాన్‌తో గుమ్మటం మూతి ద్వారా దానిలోనికి గాలి నింపుతారు. ఆ తర్వాత వేడి గాలిని కూడా తిన్నగా గుమ్మటంలోకి పంపిస్తారు, అప్పుడది నిటారుగా లేచి బుట్టను కూడా నిట్టనిలువుగా ఉంచుతుంది. ఇక, చివరిసారిగా ఉపకరణాలను, ఇంధనం కనెక్షన్లు అలాగే గాలి తీసేసే తాళ్ళు కూడా బుట్టలో వ్రేలాడుతున్నాయో లేదో పరీక్ష చేస్తారు. ఇప్పుడిక పైలట్ ప్రయాణికులను తీసికొని ఎగరడానికి సిద్ధంగా ఉన్నాడు. కొందరు బెలూనిస్టులు భూమ్మీద ఉన్న ఒక బృందాన్ని నిరంతరాయంగా సంప్రదించేందుకు రేడియో ఉపకరణాలు తీసుకువెళ్తారు. రోడ్డుమీద వెళ్తున్న వాహనంలో ఉండే ఈ బృందం గుమ్మటం ఎటు వెళ్తే అటు వెళ్ళి వాళ్ళు దిగిన చోట నుండి గుమ్మటాన్ని అందులోని ప్రయాణికులను ఎక్కించుకొని వెనక్కి వస్తారు.
గాలి వేగంతో గగన విహారం
చాలామంది బెలూనిస్టులు దాదాపు 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తారు, ఆ ఎత్తులో గ్రామాల మీదుగా ప్రశాంతంగా
ఎగురుతుంటే క్రింద నేలపై ఏమి జరుగుతుందో గమనించవచ్చు. ఆ ఎత్తులోనైతే క్రిందనున్న ప్రజలు నవ్వడం, అరవడం వంటివి కూడా వినిపిస్తాయి. నేలపై నుండి చూస్తే గుమ్మటం ఎగురుతున్న దృశ్యం మనోహరంగా ఉంటుంది, బూరుగు దూది గాలిలో నెమ్మదిగా తేలుతూ వెళ్ళే దృశ్యం గుర్తుకువస్తుంది. కొందరు బెలూనిస్టులు 600 మీటర్లు అంతకు మించి కూడా అలవాటుగా ఎగురుతుంటారు. అయితే ఆక్సిజన్ తీసుకువెళ్ళకుండా 3,000 మీటర్లకు పైగా వెళ్ళడం మంచిది కాదు.—“చాలా ఎత్తులో ప్రయాణం” బాక్సు చూడండి.పైకి వెళ్ళిన తర్వాత క్రిందికి ఎలా వస్తారు? గురుత్వాకర్షణ శక్తి సహాయంతో. గాలి తీసేసే తాడు లాగి కొంత వేడి గాలిని తీయడం ద్వారా అవరోహణాన్ని నియంత్రించవచ్చు. కానీ ఒక చోటి నుండి మరో చోటికి ప్రయాణించడం వేరు. ఆ సమయంలో పైలట్ వాతావరణ పరిస్థితుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడతాడు. “దిశను వేగాన్ని గాలి నియంత్రిస్తుంది కాబట్టి ప్రతి ప్రయాణం భిన్నంగా ఉంటుంది,” అని అనుభవజ్ఞుడైన ఒక బెలూనిస్టు అంటున్నాడు. వేర్వేరు గాలి తరంగాలు వేగాన్ని దిశను మార్చగలవు. భూమికి 100 మీటర్ల ఎత్తులో గాలి ఒక దిశలోను, 200 మీటర్ల ఎత్తులో దానికి వ్యతిరేక దిశలోను వీయడం అసాధారణమేమీ కాదు.
గుమ్మటం గాలి వేగంతో ప్రయాణిస్తుండడం మూలంగా, మీరు గాలిలో నిశ్చలంగా వేలాడుతుండగా క్రింద భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లు మీకనిపిస్తుంది. “బెలూనిస్టులు గాలి వేగంతో ఎంత ఖచ్చితంగా ప్రయాణిస్తారంటే, ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మ్యాపుని హాయిగా తెరుచుకోగలరు, అది ఎగిరిపోదు” అని స్మిత్సోనియన్ అనే పత్రిక చెబుతోంది.
పైలట్‌గా ఎగిరేందుకు అనుభవం
గాలి కదలిక కనిష్ఠ వేగంతో ఉన్నప్పుడు ప్రయాణించడం ఉత్తమం. సాధారణంగా సూర్యోదయం అయిన కొంత సేపటికి లేక సూర్యాస్తమయానికి కాస్త ముందు అలా ఉంటుంది. ఉదయాలైతే మంచిది, ఎందుకంటే అప్పుడు వాతావరణం సాధారణంగా చల్లగా ఉంటుంది, అప్పుడే గుమ్మటం పైకి వెళ్ళేందుకు ఎక్కువ శక్తి ఉంటుంది. సూర్యాస్తమయానికి కొంచెం ముందైతే త్వరగా చీకటి పడే ప్రమాదం ఉంటుంది.
పైలట్ అవడానికి కావలసిన అనుభవం చాలా ప్రాక్టీసు చేసిన తర్వాత వస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, కావలసిన దిశలో కదలుతున్న గాలిని కనుగొని దానితోపాటు పయనించడమే. అనుభవజ్ఞులైన గుమ్మటం పైలట్లు అంచెలవారీ అధిరోహణం అనే ప్రక్రియపై పట్టు సాధిస్తారు. అంటే: వారు కొంత ఎత్తుకు చేరుకుని
గుమ్మటం స్థిరంగా ఉండేలా చేస్తారు. ఆ తర్వాత, కొంతసేపు మంట రగిలించగానే వేడిగాలి గుమ్మటం చివరకు చేరుకుంటుంది, దాంతో అది ఇంకాస్త పైకి వెళ్ళి అక్కడ కొంచెం సేపు స్థిరంగా ఉంటుంది.లయబద్ధంగా మంట రగిలించడం, నిశ్చలంగా అవధానాన్ని నిలపడం చాలా ప్రాముఖ్యం, అలాగైతేనే పైలట్ బెలూన్‌పై పట్టు కోల్పోకుండా ఉంటాడు. ఏకాగ్రత కొద్దిసేపు మళ్ళినా అది అనూహ్యమైన రీతిలో దిగిపోనారంభిస్తుంది. బెలూన్ చివరి నుండి మంట రగులుతున్న చోటికి సాధారణంగా 15 నుండి 18 మీటర్ల దూరం ఉంటుందని, కాబట్టి మంట రగిలించడం వల్ల ఏర్పడే వేడికి గుమ్మటం ప్రతిస్పందించేందుకు 15 నుండి 30 క్షణాలు పట్టగలదని అప్రమత్తంగా ఉన్న పైలట్ గుర్తుంచుకొంటాడు.
నేలపైకి దిగడం చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రత్యేకంగా పరిమితమైన ప్రాంతంలో గాలి చాలా ఉద్ధృతంగా ఉన్నప్పుడు దిగడం చాలా అద్భుతమైన అనుభవం! అలాంటి పరిస్థితుల్లో, “నెమ్మదిగా జూలోని సింహాల బోనులోకి దిగడం కన్నా, ఎముకలు కలుక్కుమనేలా అయినా సరే వేగంగా సరైన స్థానంలో దిగడం ఉత్తమం” అని ఒక బెలూనిస్టు అంటున్నాడు. అయితే, గాలి స్థితి చక్కగా ఉంటే నెమ్మదిగా దిగడమే మంచిది.
చాలామంది రేసుల్లోను, ర్యాలీల్లోను, పండుగల్లోను పాల్గొనేందుకు, మరితరులు కేవలం ఆహ్లాదకరమైన అనుభవం కోసం, వివిధ వర్ణాలుగల గుమ్మటాల్లో ప్రయాణిస్తుండగా, గుమ్మటాల్లో ప్రయాణించడమనే ఈ వినోదక్రీడ కొనసాగుతూనే ఉంటుంది. (g02 3/8)
[14, 15వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
గుమ్మటాల ప్రయాణం తొలి చరిత్ర
ఫ్రాన్స్‌లోని ఆనోనేకు చెందిన, కాగితం తయారీదారుడైన ఒక ధనికుడి కుమారులైన జోసెఫ్-మీషెల్, ఝాక్స్ ఏట్యన్ మాంట్‌గోల్ఫియర్‌లు మొట్టమొదటి వేడిగాలి గుమ్మటాన్ని నిర్మించి ఎగిరేలా చేశారని చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. 1780ల ప్రారంభంలో జరిగిన వారి తొలి ప్రయోగాల్లో వారు పేపర్ బెలూన్లు ఉపయోగించారు; గడ్డి, ఉన్ని కాల్చడం వల్ల వచ్చిన పొగ మూలంగా అవి పైకి లేస్తున్నాయని వారు తలంచారు. కానీ వేడెక్కుతున్న గాలి, గుమ్మటాన్ని పైకి లేపుతోందని వారు త్వరలోనే గ్రహించారు.
వారు బట్టతో గుమ్మటాలను తయారుచేయడం ప్రారంభించాక పెద్ద గుమ్మటాలైతే చిన్నవాటికన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్ళగలుగుతున్నాయని గమనించారు, అవి ఎక్కువ బరువును లేపగలుగుతున్నట్లు కూడా వారు గ్రహించారు. 1783 జూన్‌లో ఆనోనేలోని కూడలినుండి వారు అప్పటి వరకు నిర్మించనంతటి పెద్ద గుమ్మటాన్ని విడిచిపెట్టారు. అది పది నిమిషాలపాటు గాలిలోకి ఎగిరి తిరిగి భూమ్మీదికి వచ్చింది.
అంతటి ఘనమైన కార్యాన్ని సాధించాక వారు మనుష్యులను తీసుకువెళ్ళే గుమ్మటాన్ని తయారుచేసే సమయం ఆసన్నమైందని నిర్ధారించుకొన్నారు. అయితే ముందుగా, 1783 సెప్టెంబరులో వర్సై వద్ద ఒక గుమ్మటంలో ఒక కోడిని, ఒక బాతును, ఒక గొఱ్ఱెను ఉంచి పైకి విడిచిపెట్టడం వేలాదిమంది తిలకించారు. ఎనిమిది నిమిషాలపాటు ప్రయాణించిన తర్వాత ఎలాంటి ప్రమాదం జరగకుండానే ఆ మూడు ప్రాణులు క్రిందికి దిగాయి. ఆ తర్వాత 1783, నవంబరు 21న మనుషులతో తొలి ప్రయాణం ప్రారంభమైంది. ఆ ఘనతను పొందడానికి పద్నాలుగవ లూయీ ఇద్దరు కులీన వంశీకులను అనుమతించేలా ఒప్పించారు. వారు డ లా మూయట్ అనే కోట నుండి తమ ప్రయాణం ప్రారంభించి, పారిస్ నగరం మీద ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించారు. దాదాపు 25 నిమిషాల తర్వాత, గుమ్మటానికి నిప్పంటుకోవడంతో వారు బలవంతంగా దిగాల్సివచ్చింది.
ఈలోగా పారిస్‌లోని అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఆవిష్కరణపై ఆసక్తి చూపించింది. ఛార్లెస్, ఎమ్.ఎన్. రాబర్ట్ అనే ఇద్దరు తెలివైన మెకానిక్కుల సహకారంతో, ఆ కాలంలోని ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ ఝాక్స్ షార్ల్ మొట్టమొదటి హైడ్రోజన్ వాయువుతో కూడిన గుమ్మటాన్ని నిర్మించి 1783, ఆగస్టు 27న ప్రయోగించాడు. అది 45 నిమిషాలపాటు దాదాపు 24 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించింది, అది షార్లీయర్ అని పిలువబడింది. ఈ రకమైన గుమ్మటం నేటికీ చెప్పాలంటే దాని తొలి రూపంలోనే ఉపయోగించబడుతోంది.
[17వ పేజీలోని బాక్సు]
చాలా ఎత్తులో ప్రయాణం
ఆంగ్లేయుడైన హెన్రీ కాక్స్‌వెల్ చాలా ఎత్తులో ప్రయాణించగలిగే తొలి పైలట్ అయ్యాడు. 1862 సెప్టెంబరులో బ్రిటీష్ వాతావరణశాస్త్ర సంస్థకు చెందిన జేమ్స్ గ్లైషర్ తాను చాలా ఎత్తులో జరిపే వైజ్ఞానిక పరిశీలనలు చేయడానికి తనను తీసుకువెళ్ళమని కాక్స్‌వెల్‌ను నియమించాడు. వారు ఎలాంటి ఆక్సిజన్ ఉపకరణాలు లేకుండానే తొమ్మిది కిలోమీటర్లకంటే ఎత్తుకి చేరుకున్నారు!
8,000 మీటర్లకంటే ఎత్తుకి చేరుకున్నాక ఆక్సిజన్ తక్కువగా ఉన్న చల్లని గాలిలో ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో క్రిందికి దిగడానికి కాక్స్‌వెల్ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే, గుమ్మటం అనేకసార్లు చుట్టూ తిరగడంతో గాలి తీసేసే వాల్వును లాగే తాడు మెలితిరిగిపోయింది. ఇక కాక్స్‌వెల్ ఆ మెలిక తీయడానికి రిగ్గింగ్ లోపలికి ఎక్కాల్సివచ్చింది. అప్పటికే గ్లైషర్ స్పృహ తప్పిపోయాడు, ఇక చలికి కాక్స్‌వెల్ చేతులకు పక్షవాతం రావడం మూలంగా తన పళ్ళతో తాడు లాగాల్సివచ్చింది. ఎట్టకేలకు గుమ్మటం దిగనారంభించింది.
కొంతసేపటికి ఇద్దరూ గుమ్మటం దిగే వేగాన్ని తగ్గించగలిగేంతగా తేరుకున్నారు. వాళ్ళిద్దరూ దాదాపు 10,000 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళారు, అది దాదాపు వందేళ్ళకుపైగానే రికార్డుగా ఉండిపోయింది. ఆ ప్రయాణం ఎలాంటి ఆక్సిజన్ సరఫరా లేకుండా, సరైన సంరక్షక దుస్తులు లేకుండా, అంత ఎత్తులో ఉండే వాతావరణ స్థితిగతుల గురించి ఎలాంటి అవగాహనా లేకుండా చేశారు కాబట్టి, తెరచి ఉన్న బుట్టలో వారు చేసిన ప్రయాణం వైమానిక రంగంలో అత్యంత ఘనమైన కార్యంగా ఉంది.
[15వ పేజీలోని చిత్రం]
గాలి నింపుతుండగా గుమ్మటం లోపలిభాగం
[15వ పేజీలోని చిత్రం]
పైకి లేపడానికీ ప్రయాణించడానికీ వేడెక్కిన గాలిని గుమ్మటం లోపలికి పంపిస్తారు
[16వ పేజీలోని చిత్రం]
చిత్రవిచిత్రమైన గుమ్మటాల ఆకారాలు