కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీబ్రా ఆఫ్రికా అడవి గుర్రం

జీబ్రా ఆఫ్రికా అడవి గుర్రం

జీబ్రా ఆఫ్రికా అడవి గుర్రం

ఆఫ్రికాలోని తేజరిల్లు! రచయిత

ఆఫ్రికా పచ్చిక మైదానంలో దాదాపు వెయ్యి జీబ్రాలు స్వేచ్ఛగా పరుగెడుతున్నాయి. వాటి శక్తివంతమైన కదలికలకు అనుగుణంగా, దళసరి జూలుతో ఉన్న వాటి మెడలు ముందుకు వెనుకకు కదలుతుంటే, చారలున్న వాటి పార్శ్వభాగాలు లయబద్ధంగా కదలుతున్నాయి. ఎండిన భూమి మీద వేగంగా పరుగెడుతున్న వాటి గిట్టల చప్పుడు మైదానాల్లో ప్రతిధ్వనిస్తోంది. అవి పరుగెత్తుతుంటే, వాటి వెనక ఎర్రని ధూళి మేఘం లాగ పైగి లేస్తోంది, అది కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తోంది. అవి స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, అదుపు లేకుండా పరుగెడుతున్నాయి.

ఏదో అదృశ్య సంకేతం ఆపినట్టు, అవి పరుగు వేగం తగ్గించి, ఆ తర్వాత ఆగిపోయాయి. బలంగా, మందంగా ఉన్న తమ పళ్ళతో ఎండిపోయిన గడ్డిని పీక్కొని తింటున్నాయి. అప్పుడప్పుడు పైకి చూస్తూ, శబ్దాలను వింటూ, గాలిలో వాసనను ఆఘ్రాణిస్తూ ఆ మంద అంతా అప్రమత్తంగా ఉంది. దూరంలో ఎక్కడో సింహం గర్జించిన శబ్దం గాలి ద్వారా తమ చెవులకు సోకడంతో అవి భయపడిపోయాయి. ఆ శబ్దాన్ని అవి ఇట్టే గుర్తుపట్టగలవు. నిక్కబొడుచుకున్న చెవులతో, నోట్లో కదలకుండా వ్రేలాడుతున్న గడ్డితో, జీబ్రాలు ఆ గర్జన వినబడిన దిశవైపుకు చూశాయి. వెంటనే రాగల ప్రమాదం ఏమీ లేదని గ్రహించి, తమ మెడలు వంచుకొని మేయడం కొనసాగించాయి.

సూర్యుని వేడి తీవ్రమవుతుండగా, అవి మళ్ళీ తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఈ సారి, నీళ్ళ వాసన, అడవి గుర్రాలను ఒక నది వైపుకు లాక్కుని వెళుతుంది. ఎత్తుగా ఉన్న నది ఒడ్డున ఆగి, క్రింద గోధుమ రంగులో మెల్లగా కదలుతున్న నీటిని చూసి నిట్టూరుస్తూ ఎండిన నేలను తన్నుతూ నిలబడతాయి. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న నది నీటిలో పొంచివుండగల ప్రమాదం గురించి వాటికి తెలుసు గనుక అవి వెనకాడతాయి. కానీ వాటికి విపరీతంగా దాహం వేస్తుంది, వాటిలో కొన్ని వేరేవాటిని నెట్టుకొని ముందుకు కదలుతాయి. తలలు ముందుకు పెట్టి, ఒక్క ఊపుతో అవన్ని నది అంచుకు పరుగెడతాయి. ఒకదాని తరువాత మరొకటి అన్నీ తృప్తిగా నీళ్ళు త్రాగి, సువిశాలమైన మైదానాల్లోకి తిరిగి వెళ్ళిపోతాయి.

సాయంకాలానికల్లా ఆ మంద పొడవైన గడ్డిలో తీరిగ్గా నడుస్తోంది. అస్తమిస్తున్న సూర్యుని ముదురు ఎరుపు రంగు కాంతిలో, దక్షిణాఫ్రికాలోని మైదానపు సౌందర్యం నడుమ అవి అద్భుతంగా కనిపిస్తున్నాయి.

గుంపులుగా జీవించే చారలుగల జంతువులు

జీబ్రాల దైనందిన కార్యక్రమం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఆహారం కొరకు నీళ్ళ కొరకు అవి ఎల్లప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాయి కనుక అవి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటాయి. జీబ్రాలు, విస్తరించి ఉన్న మైదానాలలో మేస్తూ, శుభ్రంగా, లావుగా కనిపిస్తాయి, చారలుగల వాటి చర్మము కండలు తిరిగిన వాటి శరీరాలపై బిగుతుగా వ్యాపించి ఉంటుంది. జీబ్రా చారలు సాటిలేనివి, కొందరు అభిప్రాయపడుతున్నట్టు, ఏ రెండు డిజైన్లు కూడా ఒకే విధంగా ఉండవు. ప్రస్ఫుటంగా కనబడే నలుపు తెలుపు చారలు, మైదానంలోని ఇతర జంతువులనుంచి వీటిని భిన్నంగా ఉంచుతాయి. అయినప్పటికీ, వాటి రూపం ఆకర్షణీయంగా ఉండి ఆఫ్రికాలో సహజంగా ఉండే వన్యజీవనానికి సరిగ్గా సరిపోతుంది.

జీబ్రాలకు ఎంతో కలిసి మెలిసి ఉండే స్వభావం ఉంటుంది. ఒక్కొక్కటి, జీవితాంతం నిలిచిపోయేంతటి బలమైన బంధాలను ఏర్పరచుకుంటుంది. ఒక పెద్ద మందలో ఎన్నో వేల జంతువులు ఉన్నప్పటికీ, ఒక మగ జీబ్రా మరియు కొన్ని ఆడ జీబ్రాలు ఉన్న అనేక చిన్న చిన్న కుటుంబాలుగా ఆ మంద విభజించబడుతుంది. వాటి స్థానాలను బట్టి సభ్యులను వేరుచేయడం ద్వారా ఈ చిన్న కుటుంబం జాగ్రత్తగా క్రమపద్ధతిని పాటిస్తుంది. ప్రాబల్యంగల ఆడ జీబ్రా కుటుంబం యొక్క ప్రయాణాలను నిర్ణయిస్తుంది. అది ముందుండి దారి చూపిస్తుంది, ఇతర ఆడ జీబ్రాలు, వాటి పిల్ల జీబ్రాలు, వరుసగా ఒకదాని తరువాత ఒకటి వాటి వాటి స్థానాలను బట్టి దాన్ని వెంబడిస్తాయి. అయినప్పటికీ, చివరికి మంద బాధ్యత వహించేది మగ జీబ్రానే. తన కుటుంబం ప్రయాణించే దిశ మార్చాలని మగ జీబ్రా అనుకుంటే, దారి చూపిస్తూ ముందు నడుస్తున్న ఆడ జీబ్రా దగ్గరికి వెళ్ళి క్రొత్త దిశ వైపుకు దాన్ని మెల్లగా తోస్తుంది.

తమ శరీరాన్ని మందలోని ఇతర సభ్యులతో మాలీసు చేయించుకోవడం జీబ్రాలకు చాలా ఇష్టం. అవి తమ భుజాలను, పార్శ్వభాగాలను, వీపులను ఒకదానికొకటి రుద్దుకోవడం, ఒకదాన్నొకటి కొరుక్కోవడం సర్వసాధారణంగా మనకు కనిపిస్తుంది. ఇలా ఒకదాన్నొకటి మాలీసు చేసుకోవడం ఆ జంతువుల మధ్య బంధాన్ని బలపరుస్తున్నట్లుంది. పిల్ల జీబ్రాలు కేవలం కొద్ది రోజుల వయసున్నప్పుడే ఇలా చేయడం మొదలుపెడతాయి. మాలీసు చేయడానికి కుటుంబంలోని మరో జీబ్రా అందుబాటులో లేకపోతే, దురదతో ఉన్న జీబ్రాలు మట్టిలో పొర్లడం ద్వారా లేక తమ శరీరాలను ఒక చెట్టుకు గానీ చెదల పుట్టకు గానీ కదలకుండా ఉన్న మరితర వస్తువుకు గానీ రుద్దుకోవడం ద్వారా ఉపశమనాన్ని పొందుతాయి.

జీవన పోరాటం

జీబ్రాల జీవితం ప్రమాదాలతో నిండి ఉంటుంది. సింహాలు, వేట కుక్కలు, సివంగులు, చిరుతపులులు, మొసళ్ళు అన్నీ కూడా 250 కిలోల బరువు ఉండే జంతువును మంచి ఆహారంగా దృష్టిస్తాయి. ఒక జీబ్రా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు, కానీ కొన్నిసార్లు హఠాత్తుగా, రహస్యంగా వచ్చే శత్రువులకు పట్టుబడిపోతుంది. సింహాలు పొంచివుంటాయి, మొసళ్ళు బురద నీటి క్రింద నక్కి ఉంటాయి, చిరుతపులులు చీకటిముసుగులో వేచి ఉంటాయి.

జీబ్రాల ఆత్మరక్షణ, వాటి చురుకుదనంపైనా మరియు మంద సభ్యులంతా కలిసి తీసికొనే చర్యపైనా ఆధారపడి ఉంటుంది. జీబ్రాలలో అధిక శాతం రాత్రి వేళ నిద్రపోయినప్పటికీ, కొన్ని మాత్రం మెలకువగా ఉండి జాగ్రత్తగా వింటూ, కాపలా కాస్తూ ఉంటాయి. సమీపిస్తున్న శత్రువును ఒకవేళ జీబ్రా చూస్తే, అది మొత్తం మందను అప్రమత్తం చేయడానికి సకిలిస్తుంది. మందలోని ఒక జీబ్రా వ్యాధిగ్రస్థమై, లేక వయసు మళ్ళిన ముసలిదై వేగంగా పరుగెత్తలేకపోతే, మిగతా జీబ్రాలు కావాలనే నెమ్మదిగా పరిగెడతాయి లేక మెల్లగా వస్తున్న ఆ జంతువు కూడా మళ్ళీ మందను చేరుకునే వరకూ ఆగుతాయి. ప్రమాదం వచ్చినప్పుడు, మగ జీబ్రా నిర్భయంగా శత్రువుకూ ఆడ జీబ్రాలకూ మధ్య నిలబడి, మంద తప్పించుకొని పారిపోవడానికి సమయం లభించేలా శత్రువును కొరుకుతూ, తన్నుతూ ఉంటుంది.

ఇలాంటి కుటుంబ ఐక్యతను, ఆఫ్రికాలోని సెరంగెటీ మైదానంలో జరిగిన ఒక గమనార్హమైన సంఘటన చక్కగా తెలియజేస్తుంది. జంతుశాస్త్రజ్ఞుడైన హ్యుకో వాన్‌లావిక్‌ ఆ సంఘటనను స్వయంగా వీక్షించాడు. కొన్ని వేటకుక్కలు, ఒక మంద జీబ్రాలను ఎలా తరమడం మొదలుపెట్టాయో చెబుతూ, ఆ కుక్కలు ఒక ఆడ జీబ్రాను, చిన్న జీబ్రాను, మరియు ఒక సంవత్సరం వయస్సుగల పిల్ల జీబ్రాను మందనుండి వేరుచేశాయని ఆయన చెప్పాడు. మందలోని మిగతా జీబ్రాలు ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగా, తల్లి, ఏడాది వయస్సుకల పిల్ల జీబ్రా ధైర్యంగా కుక్కలను ఎదిరించి పోరాడాయి. కుక్కలు మరింత ఎక్కువగా దాడిచేయడం మొదలుపెట్టడంతో ఆడ జీబ్రా, ఏడాది వయసుగల పిల్ల జీబ్రా అలసిపోనారంభించాయి. వాటి మరణం తథ్యం అనిపించింది. ఆ ఆశారహితమైన పరిస్థితిని గుర్తుచేసికొంటూ వాన్‌లావిక్‌ ఇలా అన్నాడు: “హఠాత్తుగా భూమి కంపిస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాను, పది జీబ్రాలు వేగంగా పరుగెత్తుకు రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను. క్షణం తరువాత ఈ మంద తల్లిని దాని రెండు పిల్ల జీబ్రాలను దగ్గరగా చుట్టుముట్టాయి, ఆ తరువాత తల్లి, దాని పిల్లలతో పాటు మొత్తం గుంపంతా కలిసి, ఆ పది జీబ్రాలు ఏ దిశనుండైతే వచ్చాయో ఆ దిశ వైపుకు పరుగెత్తుకుంటూ పోయాయి. కుక్కలు ఆ మందను దాదాపు 50 మీటర్ల దూరం వరకు వెంటాడాయి, కానీ మందలోనికి చొరబడడం సాధ్యపడనందువల్ల తమ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి.”

కుటుంబాన్ని పెంచిపోషించడం

ఆడ జీబ్రా, క్రొత్తగా పుట్టిన పిల్ల జీబ్రాను జాగ్రత్తగా చూసుకుంటుంది, మొదట్లో మందలోని ఇతర సభ్యులనుంచి కూడా దాన్ని దూరంగా ఉంచుతుంది. ఇలా ఆ రెండు కలిసి విడిగా గడిపే కాలంలో, పిల్ల జీబ్రా దాని తల్లితో సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ చిన్న జీబ్రా, తన తల్లికి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన నలుపు తెలుపు చారల డిజైనును గుర్తుపెట్టుకుంటుంది. ఆ తరువాత అది తన తల్లి అరుపును, వాసనను, చారల డిజైనును గుర్తుపడుతుంది, మరే ఇతర ఆడ జీబ్రాను ఆ పిల్ల జీబ్రా స్వీకరించదు.

తల్లిదండ్రులకున్న విశిష్టమైన నలుపు తెలుపు చారలు వాటి పిల్ల జీబ్రాలకు పుట్టుకతోనే ఉండవు. వాటి చారలు ఎరుపు-గోధుమ మిశ్రిత రంగులో ఉండి, వయస్సు పెరుగుతున్న కొద్ది అవి నల్లగా మారతాయి. పెద్ద మందలో ఉన్న వివిధ కుటుంబ భాగాలలోని పిల్ల జీబ్రాలన్నీ ఆడుకోవడానికి కలుసుకుంటాయి. అవి ఒకదానితో ఒకటి పోటిపడతాయి, తరుముకుంటాయి, ఒకదానినొకటి తన్నుకుంటూ పెద్ద జంతువుల మధ్యనుంచి పరుగెత్తుతాయి, కొన్నిసార్లు పెద్ద జంతువులు కూడా వాటితోపాటు కలిసి ఆడతాయి. పిల్ల జీబ్రాలు సన్నగా ఉన్న తమ కాళ్ళతో గంతులు వేస్తూ, పక్షులను, ఇతర చిన్న చిన్న జంతువులను తరుముతూ ఆడుకుంటాయి. చిన్న జీబ్రాలు, సన్నని పొడవాటి కాళ్ళతో, పెద్ద పెద్ద నల్లని కళ్ళతో, నిగనిగలాడే మెత్తని జూలుతో ఉండే అందమైన చిన్న జంతువులు, అవి చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి.

అందమైన వన్యప్రాణి

నేడు కూడా ఆఫ్రికాలోని బంగారు వన్నెగల సువిశాలమైన మైదానాలలో పెద్ద పెద్ద మందల జీబ్రాలు విచ్చలవిడిగా, స్వేచ్ఛగా పరుగెత్తడాన్ని చూడవచ్చు. అదెంతో ఆకర్షణీయమైన దృశ్యం.

అసాధారణమైన నలుపు తెలుపు చారల డిజైనుతో, కుటుంబంలో ఒకదానిపట్ల మరొకటి ఎంతో విశ్వాసంగా ఉంటూ ఏ నిర్భందమూ లేకుండా స్వేచ్ఛా ప్రవృత్తికల్గి ఉండే జీబ్రా గాఢానుభూతిని కలిగించే అద్భుతమైన ప్రాణి కాదని ఎవరంటారు? అలాంటి జంతువును గురించి నేర్చుకోవడం, వెయ్యి సంవత్సరాల క్రితం వేయబడిన ఈ ప్రశ్నకు జవాబిస్తుంది: ‘అడవిగాడిదను [“చారల గుర్రాన్ని,” NW] స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు?’ (యోబు 39:5) దానికి జవాబు స్పష్టంగా ఉంది. సమస్త జీవుల రూపనిర్మాణకుడైన యెహోవా దేవుడే. (g02 1/22)

[18వ పేజీలోని బాక్సు]

జీబ్రాకు చారలు ఎందుకు వుంటాయి?

జీబ్రాకు చారలు ఎందుకుంటాయన్న విషయాన్ని వివరించడం, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవారికి కష్టంగా ఉంటుంది. ఇతర జంతువులను భయపెట్టడానికి అవి ఉపయోగపడవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ, సింహాలు, మరితర పెద్ద క్రూర జంతువులు జీబ్రా చారలను బట్టి ఏ మాత్రం భయపడవని స్పష్టమవుతోంది.

ఈ చారలు లైంగికాకర్షణను కలిగించడానికి సహకరిస్తాయని కొందరు సూచించారు. అయితే, అది నిజం కాదనిపిస్తుంది ఎందుకంటే అన్ని జీబ్రాలకూ చారలు ఒకే విధంగా ఉంటాయి, ఆడ జీబ్రాలకుగానీ మగ జీబ్రాలకుగానీ చారలు వేర్వేరుగా ఉండవు.

ఆఫ్రికాలో అధిక ఉష్ణోగ్రతగల సూర్యుని వేడి తీవ్రతను తగ్గించడానికే నలుపు, తెలుపు చారలు ఆవిర్భవించాయని మరో సిద్ధాంతం. కానీ, ఇతర జంతువులకు చారలు ఎందుకు లేవు?

శత్రువులను తప్పుదారి పట్టించడానికి వీలుగా ఉండేందుకే జీబ్రాలకు చారలు ఉన్నాయని ప్రస్తుతం ఒక సిద్ధాంతం వాడుకలో ఉంది. ఆఫ్రికా మైదానాలలో అధికంగా ఉండే వేడి, దూరంనుంచి ఒకేదాన్ని చూడ్డానికి కష్టమయ్యేటట్లు చేస్తూ జీబ్రా రూపాన్ని మార్చేసి, స్పష్టంగా కనిపించకుండా చేస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కానీ ఇలా దూరం నుంచి స్పష్టంగా కనబడకపోవడం అనేది పెద్ద లాభకరంగా ఉండదు, ఎందుకంటే జీబ్రాలకు ప్రధాన శత్రువులైన సింహాలు, దగ్గర నుండే దాడి చేస్తాయి.

సింహాలకు విడి విడి జంతువుల మీద తమ దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యము ఉంటుంది. కానీ, జీబ్రాలు ఒక గుంపుగా పరిగెడుతుండగా చారలుగల వాటి శరీరాలు, సింహాలకుండే ఆ సామర్థ్యాన్ని తగ్గిస్తూ వాటిని తికమకపెడతాయి. అయినప్పటికీ, వాస్తవికంగా చూస్తే, సింహాలు వేరే జంతువులను ఎంత నేర్పుతో ఎంత విజయవంతంగా వేటాడతాయో, అంతే నేర్పుతో అంతే విజయవంతంగా జీబ్రాలను కూడా వేటాడతాయని వన్యప్రాణులకు సంబంధించిన అధ్యయనాలు చూపిస్తున్నాయి.

జీబ్రాకున్న చారలు కొన్నిసార్లు ఆ జంతువుకు అననుకూలంగా కూడా పరిణమించగలవన్న విషయం ఈ ప్రశ్నకు మరింత గందరగోళాన్ని జతచేస్తుంది. రాత్రివేళలో, వెన్నెల కాంతితో నిండివున్న మైదానాలలో జీబ్రాకున్న నలుపు తెలుపు చారల డిజైను, శరీరమంతా ఒకే రంగును కలిగివున్న ఇతర జంతువులకంటే అది స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. సాధారణంగా సింహాలు రాత్రివేళే వేటాడుతాయి కనుక ఈ చారలు జీబ్రాకు హానినే కలుగజేస్తాయి.

అసలు, జీబ్రాకు చారలు ఎక్కడినుంచి వచ్చాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి కీలకాన్ని ఈ సరళమైన వాక్యంలో కనుగొనవచ్చు: ‘యెహోవా హస్తము వీటిని కలుగజేసెను.’ (యోబు 12:⁠9) అవును, సృష్టికర్తే ఈ భూమిమీదున్న ప్రాణులనన్నింటినీ వాటి జీవానికి అద్భుతమైన రీతిలో దోహదపడే విశిష్టమైన గుణాలతోను, లక్షణాలతోను రూపకల్పన చేశాడు. అలా చేయడానికి కల కారణాలను మానవుడు బహుశా పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. జీవులలో ఉన్న అద్భుతమైన రూపకల్పన ఇంకొక ఉద్దేశాన్ని కూడా నెరవేరుస్తుంది. అది మానవుల హృదయాలకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని తెస్తుంది. నిజమే, సృష్టిలోని అందం ఎంతో కాలం ముందు దావీదు భావించినట్లే భావించడానికి నేడు అనేకులను కదిలించింది. ఆయన ఇలా వ్రాశాడు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.”​—కీర్తన 104:24.