తేనె మధురమైన రోగనివారిణి
తేనె మధురమైన రోగనివారిణి
తేనెకు, కుళ్ళిపోకుండా చేసెడి శక్తీ ధాతువుల తాపనిరోధక శక్తీ ఉండడంవల్ల, కొంతమంది వైద్య పరిశోధకులు సంతోషపడుతున్నారు. కెనడాలోని ద గ్లోబ్ అండ్ మెయిల్ వార్తా పత్రిక ఇలా నివేదిస్తోంది: “కృత్రిమ సూక్ష్మక్రిమిహారులు, మందుల ప్రభావాన్ని ప్రతిరోధించే శక్తిగల సూక్ష్మక్రిములపై ప్రభావం చూపలేకపోతున్నాయి. అయితే తేనె, గాయాలలో ఉండే సూక్ష్మక్రిములలో కొన్నింటినైనా నాశనం చేయగలుగుతుంది.”
నయం చేసే శక్తివున్న ఏ పదార్థం తేనెలో ఉంది? దాని కోసం మనం, పూలనుంచి మకరందాన్ని సేకరించే శ్రామిక తేనెటీగ గురించి తెలుసుకుందాం. ఈ తేనెటీగ లాలాజలంలో గ్లూకోస్ ఆక్సిడేస్ ఉంటుంది. అది, మకరందంలోని గ్లూకోస్‌ను మూలపదార్థాలుగా వేరుపరచేటటువంటి కీలకమైన రసాయనిక ఆమ్లద్రవము. ఇలా మూలపదార్థాలను వేరుపరచడం వల్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఆ పదార్థం సాధారణంగా గాయాలను శుభ్రపరచడానికి, క్రిములను నిర్మూలించడానికి ఉపయోగించబడుతుంది. సాధారణంగా, గాయం మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ పూసినప్పుడు, దాని ప్రభావం కేవలం కొంతసేపు మాత్రమే ఉంటుంది; కానీ తేనె పూసినప్పుడు ప్రభావం వేరుగా ఉంటుంది. “తేనెను గాయం మీద పూసినప్పుడు, అది శరీరంలోని ద్రవాలచేత పలచగా అవుతుంది. దానివల్ల తేనెకు సహజంగా ఉండే ఆమ్లత్వము తగ్గుతుంది,” అని గ్లోబ్ రిపోర్టు నివేదిస్తోంది. ఆమ్లము తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో రసాయనిక ఆమ్లద్రవము పనిచేయడం ప్రారంభిస్తుంది. తేనెలోని చక్కెర యొక్క మూలపదార్థాలు వేరుపడడమనేది నెమ్మదిగా, ఒకే రీతిగా జరుగుతుంది. ఈ ప్రక్రియ చుట్టు ప్రక్కల ఉన్న ఆరోగ్యకరమైన ధాతువు మీద హానికరమైన ప్రభావం చూపకుండానే, సూక్ష్మక్రిములను చంపడానికి కావలసినంత మోతాదులో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తుంది.
గ్లోబ్ ప్రకారం, గాయాన్ని నయం చేసే అనేక గుణాలు తేనెకు ఉన్నాయి. “ఒక పలచని తేనె పొర, చర్మాన్ని కాపాడి, గాయం ఎండిపోకుండా చేస్తుంది. తేనె, క్రొత్త రక్తకేశనాళికలు ఏర్పడి, అవి పెరిగేటట్లు చేస్తుంది. క్రొత్త చర్మం ఏర్పడేలా చేసే కణాలు వృద్ధి అయ్యేలా చేస్తుంది.” అంతేకాకుండా, తేనెలో ఉన్న యాంటి ఆక్సిడెంట్లకు ధాతువుల తాపనిరోధక శక్తి ఉంది, అది “వాపును తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరిచి, పుండులోంచి ద్రవాలు స్రవించకుండా చేస్తుంది.”
“అయితే, తేనె ప్రతిఒక్కరికీ మందు కాదు,” అని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. ఐదు శాతం తేనెలో, బొటులిజమ్‌కు (విషపూరిత ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధి) సంబంధించిన కణాలు ఉంటాయని అంచనా వేయబడుతోంది. హెల్త్ కెనడా వారి బొటులిజమ్ రెఫరెన్స్ సర్వీస్ వంటి సంస్థలు, పెడియాట్రిక్ సొసైటీలు, ఏడాది నిండని పిల్లలకు తేనె ఇవ్వకూడదని సలహా ఇస్తున్నాయి ఎందుకంటే, “మానవ పేగులలో నివసిస్తూ ఇతర హానికరమైన సూక్ష్మక్రిములనుండి రక్షించే సూక్ష్మక్రిములను శిశువులు అప్పటికి ఇంకా వృద్ధి చేసుకొని ఉండరు.” (g02 3/8)