పరిమళ ద్రవ్యాలు యుగయుగాలుగా
పరిమళ ద్రవ్యాలు యుగయుగాలుగా
మెక్సికోలోని తేజరిల్లు! రచయిత
పరిమళ ద్రవ్యానికి ప్రాచీన చరిత్ర ఉంది. మతసంబంధమైన ఆచారాలలో ఉపయోగించే ధూపం కొరకు చెట్ల జిగురునుండి స్వేదన ప్రక్రియ ద్వారా, పరిమళ ద్రవ్యాన్ని తయారుచేసే ప్రాచీన పద్ధతి ప్రారంభమైందని తలంచబడుతుంది. ఐగుప్తు పరిమళ ద్రవ్యాలను ఉపయోగించినట్లు తొలి రికార్డు ఉంది. టుటన్‌ఖమెన్ ఫరో సమాధి తెరచినప్పుడు, పరిమళ ద్రవ్యంతో నిండివున్న 3,000 కంటే ఎక్కువ జాడీలు కనుగొనబడ్డాయి. 30 శతాబ్దాలకంటే ఎక్కువ కాలం తరువాత కూడా వాటిలోని సువాసన కొంతమేరకు అలాగే ఉంది!
సామాన్య శకానికి పదిహేను వందల సంవత్సరాల ముందు, ఇశ్రాయేలు యాజకులు ఉపయోగించాల్సిన ప్రతిష్ఠాభిషేక తైలము తయారుచేయడానికి దేవుడు ఇచ్చిన వివరాలలో ‘శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు’ కూడా ఉన్నాయి. (నిర్గమకాండము 30:22-33, ఈజీ-టు-రీడ్ వర్షన్) హెబ్రీయులు, సౌందర్యపోషణ కోసం, వైద్యపరమైన ఉపయోగాల కోసం పరిమళ లేపనాలను వాడేవారు, అలాగే సమాధి చేయవలసిన మృతకళేబరాలను సిద్ధంచేయడానికి కూడా ఉపయోగించేవారు, అవి క్రిమిసంహారకాలుగా, దుర్గంధ నివారకాలుగా పనిచేసేవనడంలో సందేహం లేదు. ఉదాహరణకు, యేసు శరీరానికి పూయడానికి స్త్రీలు సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలములు సమాధి దగ్గరకు తీసికొని వెళ్ళారు. (లూకా 23:56; 24:1) ఇశ్రాయేలీయుల గృహాలలో, అతిథి కాళ్ళకు పరిమళ తైలాన్ని పూయడం ఆతిథ్యంగా భావించబడేది.—లూకా 7:37-46.
మొదటి శతాబ్దంలో, రోమా సామ్రాజ్యం సంవత్సరానికి 2,800 టన్నుల సాంబ్రాణిని, 550 టన్నుల బోళమును ఉపయోగించేదని ఒక నివేదిక చెబుతోంది. బాల యేసు వద్దకు ఇటువంటి సుగంధ పదార్థాలు కానుకలుగా తీసుకువెళ్ళబడ్డాయి. (మత్తయి 2:1, 10) సా.శ. 54వ సంవత్సరంలో రోమా చక్రవర్తి నీరో, ఒక విందును పరిమళభరితం చేయడానికి 46,00,000 రూపాయలకు సమానమైన మొత్తాన్ని ఖర్చుపెట్టాడని చెప్పబడుతోంది. ఆయన భోజనశాలల్లో పైకి కనిపించకుండా ఉంచబడిన గొట్టాల ద్వారా పన్నీరు అతిథుల మీద చిరుజల్లులుగా జల్లబడేది. సా.శ. ఏడవ శతాబ్దం నుంచి, చైనీయులు పరిమళమున్న పొడుల చిన్న పొట్లాలు, ఇతర పరిమళ ద్రవ్యాలు ఉపయోగించడం ప్రారంభించారు. మధ్య యుగాలలో, పరిమళ ద్రవ్యాలు ప్రత్యేకించి గులాబి పరిమళ ద్రవ్యాలు ఇస్లాం సంస్కృతిలో వాడబడేవి.
పదిహేడవ శతాబ్దంలో ఫ్రాన్సులో పరిమళ ద్రవ్యాలు తయారుచేసే పరిశ్రమ ఎంత చక్కగా స్థిరపడిందంటే, పదిహేనవ లూయి చక్రవర్తి ఆస్థానం, పరిమళాలు వెదజల్లే ఆస్థానం అని పిలువబడేది. సుగంధ ద్రవ్యాలు కేవలం చర్మానికే కాకుండా, బట్టలకు, చేతితొడుగులకు, విసనకర్రలకు మరియు ఫర్నిచర్‌కు కూడా పూయబడేవి.
18వ శతాబ్దంలో కనుగొనబడిన కొలోన్ సెంటును స్నానపు నీటిలో ఉపయోగించేవారు, ద్రాక్షారసంలో కలిపేవారు, నోటి శుభ్రత కోసం చెక్కర ముద్దతో పాటు కలిపి తినేవారు, అలాగే వైద్యపరంగా ఎనీమా ఇవ్వడానికీ పుండ్లమీద వేసి కట్టడానికీ ఉపయోగించేవారు. 19వ శతాబ్దంలో కృత్రిమ పరిమళ ద్రవ్యాల తయారి ఆరంభమైంది. దాని ఫలితంగా, వైద్యపరంగా ఉపయోగించడానికి అనువుకాని పరిమళ ద్రవ్యాల వ్యాపారం కూడా ప్రారంభమయ్యింది. ఈనాడు పరిమళ ద్రవ్యాల పరిశ్రమ అనేక కోట్ల డాలర్ల వ్యాపారం. *(g02 2/8)
[అధస్సూచి]
^ పరిమళాలకు మన శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందన్న విషయం గురించి ఆగస్టు 8, 2000 (ఆంగ్లం) సంచికలో చర్చించడింది.
[22వ పేజీలోని చిత్రం]
ఈజిప్టు, సా.శ.పూ. 14వ శతాబ్దం, టుటన్‌ఖమెన్ సమాధిలోని పరిమళ ద్రవ్యపు జాడీ
[చిత్రసౌజన్యం]
Werner Forman/Egyptian Museum, Cairo, Egypt/Art Resource, NY
[22వ పేజీలోని చిత్రం]
గ్రీస్, సా.శ.పూ. 5వ శతాబ్దం
[చిత్రసౌజన్యం]
Musée du Louvre, Paris
[22వ పేజీలోని చిత్రం]
ఫ్రాన్స్, సా.శ. 18వ శతాబ్దం
[చిత్రసౌజన్యం]
Avec lʹaimable autorisation du Musée de la Parfumerie Fragonard, Paris
[22వ పేజీలోని చిత్రం]
ఆధునిక పరిమళ ద్రవ్యపు సీసా