ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
చేప చర్మంతో చేసిన పాదరక్షలు
పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతాలలోనున్న ఒక క్రొత్త పరిశ్రమలో, మత్స్య చర్మాలనుండి బూట్లు తయారుచేయబడుతున్నాయని లీమా వార్తాపత్రిక ఎల్ కోమర్షియో నివేదిస్తుంది. చేపలు పొదిగే స్థలాలనుండి లేదా చేపల పెంపక కేంద్రాలనుండి వచ్చిన చేప చర్మాలను సహజ ద్రవాలతో శుద్ధి చేసి ఉపయోగకరమైన చర్మాలుగా తయారుచేస్తారు. ఆ తర్వాత ఆ చర్మాలకు నూనె పూసి, పసుపు, కోచినియల్ లేక ఏచియోట్ అనే సహజ మూలికలతో చేసిన చూర్ణాలతోవాటికి రంగులు వేస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మాల మీద సహజంగా ఉన్న వజ్రంలా కనబడే డిజైను పాడవకుండా ఉంటుంది. ఈ చర్మాలను “డబ్బులు పెట్టుకునే చిన్న పర్సులుగాను, చిన్న చిన్న వస్తువులు పెట్టుకునే సంచులుగాను, వాచీ బెల్టులుగాను, లేదా సెల్యులర్ ఫోన్ కవర్లుగాను కూడా తయారుచేయవచ్చు.” ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిన పారిశ్రామిక ఇంజనీరు బార్బరా లియోన్ ఇలా అంటోంది: “అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే శుద్ధి చేయడానికి క్రోమియమ్ లాంటి కృత్రిమమైన ద్రవాలు ఎన్నడు ఉపయోగించబడవు. కాబట్టి దాని వల్ల కాలుష్య సమస్యలు ఉండవు, అంతేగాక అది మత్స్య చర్మమును పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఉత్పత్తిగా చేస్తుంది.” (g02 3/8)
నవ్వు—ఇప్పటికీ అత్యుత్తమమైన మందు
“నాలుగు వారాల పాటు రోజుకు కొద్ది సమయం హాస్య కార్యక్రమాలను వినడం, కృంగుదలకు సంబంధించిన లక్షణాలను గమనార్హంగా తగ్గిస్తుందని ఇప్పుడు కనుగొనబడింది,” అని లండన్‌కి చెందిన ది ఇండిపెండెంట్ నివేదిస్తోంది. “చికిత్స కోసం హాస్యనటుల చేత రూపొందించబడిన టేపులను, వినడానికి రోజుకు 30 నిమిషాల సమయం వెచ్చించమన్న సలహాను పాటించిన రోగులలో కొందరు స్వస్థత పొందారు, మరికొందరు తమ వ్యాధి లక్షణాల తీవ్రత సగం వరకు తగ్గినట్లు తెలుసుకున్నారు.” హాస్యోక్తుల వల్ల వచ్చే నవ్వు ప్రయోజనకరంగా ఉండగలదని అమెరికాలో జరిపిన 100 కంటె ఎక్కువ పరిశోధనా అధ్యయనాలు సూచించాయి. మానసికంగా కృంగిన ప్రజలే కాకుండా, సున్నితమైన శరీర తత్వాలు, అధిక రక్తపోటు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు, అంతేకాకుండా క్యాన్సర్, కీళ్ళ వాతముతో బాధపడేవారు కూడా ఈ చికిత్సకు ప్రతిస్పందించారు. నవ్వు మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుందని ఎంతో కాలంగా మనకు తెలుసు, కానీ అది ఎలా సాధ్యమన్నది మాత్రం స్పష్టంగా అర్థమవడం లేదు. అయినప్పటికీ, మనస్తత్వ శాస్త్రజ్ఞుడు డా. ఎడ్ డంకల్‌బ్లావూ ఇలా హెచ్చరిస్తున్నారు: అవమానపరిచే, వ్యంగ్యమైన హాస్యాన్ని నివారించండి, మరీ హాస్యభరితంగా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే, తన సమస్యను సరిగ్గా పరిగణించడం లేదని రోగి భావించవచ్చు. (g02 3/8)
పొగమంచు, గుండెపోటు వచ్చే అవకాశాలను అధికం చేస్తుంది
“వేసవికాలంలో కెనడాలోని నగరాలను ఊపిరాడకుండా చేసే దట్టమైన పొగమంచు రెండు గంటలలోపే గుండెపోటు వచ్చేలా చేయగలదు,” అని కెనడా వార్తాపత్రిక నేషనల్ పోస్ట్ నివేదిస్తోంది. పొగమంచులో, ముఖ్యంగా వాహనాల ద్వారా, విద్యుత్ కేంద్రాల ద్వారా, పొగ గొట్టాల ద్వారా వెలువడే సూక్ష్మమైన, కంటికి కనిపించని కాలుష్య పదార్థాలు అంటే సూక్ష్మ రేణువులు ఉంటాయి. “గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్థులు, హృద్రోగులు లేక వృద్ధులు, సూక్ష్మ రేణువులున్న తీవ్రమైన వాయు కాలుష్యంగల పరిసరాల్లో రెండు గంటల సమయం గడిపినప్పుడు వారికి గుండెపోటు వచ్చే అవకాశం 48 శాతం అధికమైంది, ఆ ప్రమాదం 24 గంటల్లో 62 శాతం పెరిగింది” అని ఆ వార్తాపత్రిక చెబుతోంది. పొగమంచు గురించి హెచ్చరించబడినప్పుడు, “ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి, ఎయిర్ కండీషనింగ్ ఉంటే మరీ మంచిది,” అని హార్వర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్‌కు చెందిన డా. మరీ మిట్టల్‌మాన్ సలహా ఇస్తున్నారు. “ఈ రేణువులు ఎంత సూక్ష్మమైనవంటే, ఇంట్లోని గాలిలోకి కూడా అవి చొరబడతాయి, కాబట్టి, ఎయిర్ కండిషనింగ్ వాటిని తొలగిస్తుంది.” (g02 3/8)
వివాహానికి ముందు కలిసి జీవించడం
“వివాహం చేసుకోకముందు కలిసి జీవించిన తల్లిదండ్రులు విడిపోయే అవకాశాలు దాదాపు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి,” అని కెనడా వార్తాపత్రిక నేషనల్ పోస్ట్ నివేదిస్తోంది. బిడ్డను కనడం తల్లిదండ్రులకు ఒకరి యెడల ఒకరికున్న నిబద్ధతకు సూచనగా ఉన్నట్లు కనుగొంటామని పరిశోధకులు ఎదురుచూశారని స్టాటిస్టిక్స్ కెనడా నిర్వహించిన అధ్యయనానికి సహరచయిత అయిన హిధర్ జూబీ అన్నది. “కానీ కలిసి జీవించడానికి సుముఖత చూపించే జంటలు, విడిపోవడానికి కూడా సుముఖత చూపిస్తారు” అని ఆమె వ్యాఖ్యానించింది. వివాహం చేసుకోవడానికి ముందు కలిసి జీవించిన తల్లిదండ్రుల్లో 25.4 శాతం మంది విడిపోతే, వివాహం చేసుకోవడానికి ముందు కలిసి జీవించని వారిలో 13.6 శాతం మంది మాత్రమే విడిపోయారని పరిశోధకులు కనుగొన్నారు. “కలిసి జీవించే ప్రజలకు అంత స్థిరమైన సంబంధాలు ఉండవు ఎందుకంటే [కలిసి జీవించడానికి] సిద్ధపడిన ప్రజలు, బహుశా వివాహ నిబద్ధతను అంత విలువైనదిగా ఎంచకపోవచ్చు” అని జూబీ అంటోంది. (g02 3/8)
తేనెతెట్టెలో యావజ్జీవ కారాగార శిక్ష
“ఆఫ్రికా తేనెటీగలు, అవాంఛిత అతిథులతో వ్యవహరించడానికి, విపరీతమైనదే అయినా చాలా ప్రభావవంతమైన పద్ధతిని కనిపెట్టాయి,” అని న్యూ సైంటిస్ట్ పత్రిక అంటోంది. “అవి ఆ అతిధులను తమ తెట్టెలోని కారాగార గదులలో బంధించివేస్తాయి. ఈ విధంగా శిక్షించే పద్ధతి పరాన్నజీవులను వాటి పరిధుల్లో ఉంచడమే గాక, అవసరమైతే కాలనీ తప్పించుకొని పోవడానికి కూడా సమయాన్నిస్తుంది.” పరిశోధకులు “తేనెటీగ పరిమాణంలో సగం పరిమాణం ఉండే ఏథీనా ట్యూమీడా అనే ఒక కీటకం నుండి దక్షిణాఫ్రికాలోని తేనెటీగలు తమను తాము ఎలా రక్షించుకుంటాయో అధ్యయనం చేశారు.” పరిశోధకులలో ఒకరైన పీటర్ న్యూమాన్, ఆ కీటకాన్ని “యుద్ధ శకటంలా దృఢంగా ఉంటుంది” అని వర్ణిస్తున్నాడు. కాబట్టి, తేనెటీగల రక్షణకు ఉన్న ఒకే ఒక్క మార్గం ఏమిటంటే, ఆ కీటకాన్ని ఖైదు చేయడమే. “కొన్ని తేనెటీగలు చెరసాలను నిర్మిస్తుండగా, ఇతర తేనెటీగలు కీటకాలు తప్పించుకొని పోకుండా అవిరామంగా కావలి కాస్తుంటాయి,” అని న్యూమాన్ వివరిస్తున్నాడు. ఇలా కట్టడానికి ముడిసరుకు, తేనెటీగలు సేకరించే చెట్ల జిగురు, నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నాలుగు రోజుల వరకు పడుతుంది. ఉత్తర అమెరికా తేనెటీగలలో యూరపు తేనెటీగలలో, ఇలాంటి ప్రవర్తన ఉండదు. కాబట్టి, దాదాపు ఐదు సంవత్సరాల క్రితం పొరపాటున అమెరికాలోకి ప్రవేశపెట్టబడిన ఈ కీటకం ఒక తెట్టెపై దాడి చేసిందంటే, ఇక ఆ తెట్టె “నాశనమైనట్టే.” (g02 2/22)
జంతువులు కాలుష్యాన్ని పసిగడతాయి
వాయు, భూ కాలుష్యాలను కొలవడానికి వానపాములే సరైన ప్రాణులని జంతు శాస్త్రజ్ఞుడు స్టీవ్ హాప్కిన్ వాదిస్తున్నాడు. సమృద్ధిగా ఉండి, సులభంగా లభించే ఈ తక్కువ స్థాయికి చెందిన ప్రాణులు సంక్లిష్టమైన కృత్రిమ ఉపకరణాలకంటే మెరుగ్గా పనిచేస్తాయి. నీటి నాణ్యతను కొలవడానికి సాధారణ నత్త ఉపయోగించబడుతుంది. నత్తల మానిటర్ అనే ఒక సాధనం రైన్, డానుబే నదులలోని కాలుష్యాన్ని కొలవడంలో ఇప్పటికే సమర్థవంతమైనదిగా నిరూపించబడింది, ఆ సాధనం అది ఒక బక్కెట్ సైజులో ఉంటుంది, దానిలో సజీవంగా ఉన్న ఎనిమిది నత్తలు ఉంటాయి. “నీటిలో ఒక నిర్దిష్ట కాలుష్య పదార్థం ఎక్కువ అవ్వడం మొదలైతే నత్తలు వెంటనే దాన్ని పసిగడతాయి,” అని ఆ ఉపకరణాన్ని రూపొందించిన కీస్ క్రామర్ అన్నాడు. నత్తలు తమ చిప్పలను మూసుకోవడం ద్వారా వేలాది వేర్వేరు రసాయనిక మలినాలకు ప్రతిస్పందిస్తాయి, అవి అలా మూసుకున్నప్పుడు నత్త మానిటర్‌లోని అలారమ్ మోగుతుంది. ఇలాంటి మానిటర్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, జీవాల మీద కాలుష్యము చూపే ప్రభావాన్ని అవి కొలుస్తాయని స్పెయిన్ యొక్క ఎల్ పాయెస్ నివేదిస్తుంది. (g02 2/22)
బైబిలు అనువాదంలో క్రొత్త రికార్డు
“ప్రస్తుతం బైబిలు, సంపూర్ణంగా లేక కొంత భాగంగా, 2,261 భాషలలో లభ్యమవుతోంది. అంటే పన్నెండు నెలల క్రితం లభించిన దానికంటే అదనంగా 28 భాషలలో లభ్యమవుతుంది,” అని బ్రిటన్స్ బైబిల్ సొసైటీ నివేదిస్తోంది. “[బైబిలు] దాని సంపూర్ణ రూపంలో ఇప్పుడు 383 భాషలలో లభ్యమవుతోంది. అంటే గత సంవత్సరం కంటే 13 భాషలు పెరిగాయి.” పాత నిబంధన, క్రొత్త నిబంధన అని కూడా పిలువబడే హీబ్రూ, గ్రీకు లేఖనాల పూర్తి సంపుటాలు ఇప్పుడు 987 భాషలలో లభ్యమవుతున్నాయి. (g02 2/22)
అభిజ్ఞాత సమ్మతి తిరిగి ధృవీకరించబడింది
రోగి తన అభిజ్ఞాత సమ్మతిని తెలియజేయకముందే అంటే వివరాలన్నీ తెలిసికొని పూర్తి గ్రహింపుతో తీసికొనే నిర్ణయాన్ని తెలియజేయకముందే రక్తమార్పిడులు చేయకూడదని, ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 1991 జనవరిలో మొదటి శాసనాన్ని చేసి, పది సంవత్సరాలకు మళ్ళీ దాన్ని ధృవీకరించింది. 2001, జనవరి 25న చేయబడిన, గెజెట్టా ఉఫిశ్యాలే డెల్లా రిపబ్లికా ఇటాలీయానా (ఇటాలియన్ రిపబ్లిక్ ఆధికారిక వార్తాపత్రిక)లో ప్రచురించబడిన ఆ శాసనం ఇలా తెలియజేస్తోంది: “రక్తాన్ని లేక రక్తసమ్మిళితాలను ఎక్కించడం మరియు/లేక రక్త ఉత్పత్తులను ఉపయోగించడం అనేది పూర్తిగా ప్రమాదరహితమైనది కాదని తెలియజేసిన తర్వాత, ఆ చికిత్స పొందే వ్యక్తి వాటికి తన అంగీకారాన్ని గానీ, అనంగీకారాన్ని గానీ వ్రాతపూర్వకంగా తెలియజేయాలి.” (g02 3/22)
ఆన్-లైన్ సమాధి సేవ
ఇప్పుడు ఒక ఆన్-లైన్ సేవ, సైబర్‌స్పేస్‌లో వాస్తవికమైన సమాధులను సందర్శించడాన్ని సాధ్యపరుస్తుంది అని ద జపాన్ టైమ్స్ నివేదిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా బంధువులు, స్నేహితులు చనిపోయిన వారికి తమ నివాళులు అర్పించవచ్చు. చనిపోయిన వ్యక్తి ఫోటో, ఆయన జీవిత వివరాలతోపాటు, సమాధి శిలాఫలకపు ఆకారం కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. సందర్శకులు తమ సందేశాలను విడిచిపెట్టి వెళ్ళడానికి కొంత స్థలం కేటాయించబడుతుంది. బౌద్ధమత సందర్శకుల కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు ఉంది, కేవలం మౌస్‌ను ఒక్కసారి నొక్కడం ద్వారా వాస్తవికమైన సమాధి దగ్గర పళ్ళూ పువ్వులూ అగరొత్తులూ మరియు మద్యపానీయాలు పెట్టవచ్చు. ఆన్-లైన్ మెమోరియల్ సర్వీసెస్ ఫర్మ్‌కు అధ్యక్షుడైన టాడాషీ వాటానాబె చెబుతున్నదాని ప్రకారం, “సమాధులను తరచుగా సందర్శించలేని వ్యక్తులకు అంటే ఇంటికి దూరంగా విదేశాలలో జీవించే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉందని కొందరు అంటున్నారు.” (g02 3/22)