అధిక రక్తపోటు నివారణ, అదుపు
అధిక రక్తపోటు నివారణ, అదుపు
బ్రెజిల్‌లోని తేజరిల్లు! రచయిత
మరీయన్ భయపడిపోయింది! ఎలాంటి హెచ్చరికా లేకుండా ఆమె ముక్కులో నుండి రక్తం ఏకధారగా కారడం మొదలయ్యింది. “నేను చనిపోబోతున్నానేమో అనుకున్నాను” అని ఆమె గుర్తుచేసుకుంటోంది. అధిక రక్తపోటు (ధమని రక్తపోటు) మూలంగా అలా ముక్కు నుండి రక్తం కారిందని ఒక డాక్టరు మరీయన్‌కు తెలియజేసింది. అప్పుడు మరీయన్ “కానీ నేను ఆరోగ్యంగానే ఉన్నానే” అంది. “ఏ రోగలక్షణాలు ఉండవు గనుక తమకు అధిక రక్తపోటు ఉందని చాలామందికి తెలీదు” అని డాక్టర్ సమాధానమిచ్చింది.
మీ రక్తపోటు మాటేమిటి? మీ ప్రస్తుత జీవన శైలి భవిష్యత్తులో మీకు అధిక రక్తపోటు కలిగించే అవకాశం ఉందా? మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు? *
రక్తనాళం గోడలపై రక్తం కలుగజేసే ఒత్తిడిని రక్తపోటు అంటారు. దీన్ని, ఉబ్బే రబ్బరు పట్టీ సహాయంతో లెక్కించవచ్చు, ఆ రబ్బరు పట్టీని జబ్బకు చుడతారు, ఇది ఒత్తిడిని రికార్డు చేసే పరికరానికి జతచేయబడి ఉంటుంది. రెండు విధాలైన లెక్కింపులను తీసుకుంటారు. ఉదాహరణకు: 120/80. మొదటి సంఖ్యను సిస్టోలిక్ రక్తపోటు అంటారు ఎందుకంటే అది గుండె కొట్టుకునేటప్పుడు ఉన్న రక్తపోటును సూచిస్తుంది, రెండవ సంఖ్యను డయాస్టోలిక్ రక్తపోటు అంటారు ఎందుకంటే అది గుండె విశ్రాంతిగా ఉన్నప్పటి రక్తపోటును సూచిస్తుంది. రక్తపోటును పాదరసం సహాయంతో మిల్లీమీటర్లలో లెక్కిస్తారు, రక్తపోటు 140/90కి పైగా ఉంటే వైద్యులు వారిని అధిక రక్తపోటు గల రోగులుగా వర్గీకరిస్తారు.
రక్తపోటు అధికమయ్యేలా చేసేదేమిటి? మీరు మీ తోటలో చెట్లకు నీళ్ళు పెడుతున్నారనుకోండి. కుళాయిని విప్పడం ద్వారా లేదా గొట్టం వ్యాసాన్ని లేక వృత్తవ్యాసాన్ని తగ్గించడం ద్వారా మీరు నీటి ఒత్తిడిని పెంచుతారు. రక్తపోటు విషయంలో కూడా అదే జరుగుతుంది: రక్త ప్రవాహపు వేగాన్ని పెంచితే లేదా రక్తనాళాల లోపలి వ్యాసాన్ని తగ్గిస్తే రక్తపోటు అధికమవుతుంది. రక్తపోటు ఎలా కలుగుతుంది? దీనిలో అనేక కారకాలు ఇమిడి ఉన్నాయి.
మీరు అదుపు చేయలేని కారకాలు
ఒక వ్యక్తి రక్తసంబంధుల్లో అధిక రక్తపోటు గలవారు ఉంటే ఆయనకు కూడా ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ద్విసంయుక్త బీజము నుండి ఏర్పడిన కవలల కన్నా ఏకసంయుక్త బీజము నుండి ఏర్పడిన కవలలకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. అధిక రక్తపోటును వంశపారంపర్యంగా సంక్రమింపజేసే అంశం యొక్క ఉనికిని ధృవీకరించగల, “ధమని రక్తపోటుకు కారణమయ్యే జన్యువులను మ్యాపింగ్ చేయడాన్ని” గురించి ఒక అధ్యయనం తెలియజేస్తోంది. అసాధారణమైన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం వయస్సుతోపాటు అధికమవుతున్నట్లూ, నల్లజాతి పురుషుల్లో ఇది ఎక్కువగా ఉంటున్నట్లూ తెలుస్తోంది.
మీరు అదుపుచేసుకోగల కారకాలు
మీరు తినే తిండిని గమనించండి! కొంతమందిలో ప్రాముఖ్యంగా మధుమేహ వ్యాధి గలవారిలో, అధిక రక్తపోటు తీవ్రంగా ఉన్నవారిలో, పెద్ద వయస్సువారిలో, కొంతమంది నల్లవారిలో ఉప్పు (సోడియం) రక్తపోటును పెంచగలదు. రక్తప్రవాహంలోని అదనపు క్రొవ్వు పదార్థం రక్త నాళాల లోపలి గోడలపై కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేసి (ఎథిరోస్‌క్లిరోసిస్), వాటి లోపలి వ్యాసాన్ని తగ్గించివేసి రక్తపోటును అధికం చేస్తుంది. ఉండవలసిన బరువు కన్నా 30 శాతం అధికంగా ఉన్న
ప్రజలకు అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొటాషియం, కాల్షియం అధికంగా తీసుకుంటే రక్తపోటును తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.పొగత్రాగడం ఎథిరోస్‌క్లిరోసిస్, మధుమేహ వ్యాధి, గుండె పోటు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదాన్ని అధికం చేస్తుంది. కాబట్టి, అధిక రక్తపోటు గల ఒక వ్యక్తి పొగత్రాగడం చాలా ప్రమాదకరం, ఇది గుండె జబ్బులకు దారి తీయగలదు. రుజువులు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ, కాఫీ, టీ, కోలా పానీయాలలో ఉండే కెఫీన్ అలాగే భావోద్వేగ, శారీరక ఒత్తిడి కూడా అధిక రక్తపోటును పెంచగలవు. అంతేగాక, మత్తు పానీయాలను అధికంగా గానీ దీర్ఘకాలంగా గానీ తీసుకోవడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం రక్తపోటును పెంచగలవని శాస్త్రజ్ఞులకు తెలుసు.
ఆరోగ్యకరమైన జీవన విధానం
అనుకూల చర్య తీసుకోకుండా అధిక రక్తపోటు వచ్చే వరకు ఆగడం పొరపాటు. చిన్న వయస్సు నుండే ఆరోగ్యకరమైన జీవన విధానం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఇప్పుడు శ్రద్ధ తీసుకోవడం భవిష్యత్తులో మెరుగైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది.
ధమనుల రక్తపోటును తగ్గించడానికి దోహదపడే, జీవన విధానంలో చేసుకోవలసిన మార్పులేమిటో ధమనుల అధిక రక్తపోటుపై బ్రెజిల్ వైద్యుల మూడవ ఒప్పందం నిర్వచించింది. ఆ మార్పులు అధిక లేదా సాధారణ రక్తపోటు ఉన్న ప్రజలకు సహాయకరమైన నిర్దేశకాలుగా పనిచేస్తాయి.
స్థూలకాయులు సమతుల్యతగల తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటూ ఒక మోస్తరు వ్యాయామ కార్యక్రమాన్ని క్రమంగా అనుసరించాలనీ, త్వరితంగా బరువు తగ్గడాన్ని వాగ్దానం చేసే “అద్భుతమైన” ఆహారం తీసుకోవడాన్ని నివారించాలనీ పరిశోధకులు సిఫారసు చేస్తున్నారు. రోజంతటిలో కేవలం ఆరు గ్రాములు లేదా ఒక టీస్పూను కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని వారు సూచించారు. * అంటే, వంటకాలలో ఉప్పు తగ్గించడం, అలాగే డబ్బాల్లో దొరికే ఆహారాన్ని, నిల్వచేయబడే మంసాహారాలను (సలామీ, హామ్, సాసేజ్, మరితరమైనవి), పొగబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడాన్ని తగ్గించడమని అర్థం. భోజనం చేసేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకోవడాన్ని నివారించడం ద్వారా, ప్యాక్ చేసిన ఆహారాలైతే వాటిలో ఎంత ఉప్పు ఉపయోగించబడిందో తెలుసుకోవడానికి వాటి పైనున్న కవరు చూడడం ద్వారా కూడా ఉప్పు వినిమయాన్ని తగ్గించవచ్చు.
బ్రెజిల్ ఒప్పందం, పొటాషియం వినిమయాన్ని అధికం చేయడాన్ని కూడా సూచిస్తోంది ఎందుకంటే పొటాషియం “రక్తపోటుపై వ్యతిరేక ప్రభావం” చూపించగలదు. కాబట్టి, ఆరోగ్యకరమైన *
ఆహారంలో “సోడియం తక్కువగా ఉండే, పొటాషియం ఎక్కువగా ఉండే” బీన్స్, పచ్చని కూరగాయలు, అరటి పండ్లు, పుచ్చకాయలు, క్యారెట్లు, బీట్‌రూట్లు, టమోటాలు, నారింజ పండ్లు భాగమై ఉండాలి. మద్యం తగుమాత్రమే తీసుకోవడం ప్రాముఖ్యం. రక్తపోటు గల పురుషులు రోజుకు 30 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువ మద్యం తీసుకోకూడదనీ, స్త్రీలు గానీ తక్కువ బరువున్న వారు గానీ అయితే 15 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువ మద్యం తీసుకోకూడదని కొందరు పరిశోధకులు సూచిస్తున్నారు.క్రమంగా వ్యాయామం చేయడం రక్తపోటును తగ్గించిందనీ తద్వారా ధమనుల రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గిందనీ బ్రెజిల్ ఒప్పందం నిర్ధారించింది. నడవడం, సైకిలు త్రొక్కడం, ఈత కొట్టడం వంటి తగుమాత్రపు ఎరోబిక్ వ్యాయామాలు వారానికి మూడు నుండి ఐదు సార్లు, 30 నుండి 45 నిమిషాలపాటు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. * మరింత ఆరోగ్యకరమైన జీవన విధానంతో సంబంధం ఉన్న ఇతర కారకాలు—పొగత్రాగడాన్ని మానుకోవడం, రక్తంలోని క్రొవ్వు పదార్థాలను (కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్‌లు), మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం, కాల్షియం మెగ్నీషియం తగినంత తీసుకోవడం, శారీరక భావోద్వేగ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం. శ్వాస అవరోధాల్ని పోగొట్టే ద్రవాలు, సోడియం ఎక్కువగా ఉన్న ఎసిడిటీని తగ్గించే మందులు, ఆకలిని పెంచే లేదా తగ్గించే పదార్థాలు, మైగ్రేన్ కోసం ఉపయోగించే కెఫీన్ ఉండే నొప్పి నివారిణీల వంటి కొన్ని మందులు రక్తపోటును అధికం చేయగలవు.
మీకు ధమనుల అధిక రక్తపోటు ఉంటే, మీ ఆహారం గురించి, అలవాట్ల గురించి, మీ వ్యక్తిగత అవసరాలకు సంబంధించి తగినరీతిలో సలహా ఇవ్వగలిగేది ఖచ్చితంగా మీ వైద్యుడే. అయితే మీ పరిస్థితి ఏదైనప్పటికీ చిన్న వయస్సు నుండే ఆరోగ్యదాయకమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులకే గాక కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడూ ప్రయోజనకరమైనదే. ఈ ఆర్టికల్ ప్రారంభంలో ప్రస్తావించబడిన మరీయన్ తన జీవన విధానాన్ని మార్చుకోవలసి వచ్చింది. ప్రస్తుతం ఆమె మందులు వాడుతోంది, ఆమెకు ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతోంది. మీ విషయమేమిటి? ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ, ‘నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వారెవరు’ అనని సమయం కోసం ఎదురుచూస్తూ ఉండగా, మీ రక్తపోటును అదుపులో ఉంచుకోండి!—యెషయా 33:24. (g02 4/8)
[అధస్సూచీలు]
^ ఇది వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవలసిన విషయమని గుర్తిస్తూ, తేజరిల్లు! ఏ విధమైన చికిత్సను సిఫారసు చేయడంలేదు.
^ ధమనుల అధిక రక్తపోటుతో గానీ గుండె, కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో గానీ బాధపడుతుంటే లేదా ఇతర మందులు తీసుకుంటుంటే మీరు ప్రతి రోజు సోడియం, పొటాషియం ఎంతెంత పరిమాణంలో తీసుకోవాలనేదాని గురించి మీ వైద్యుడ్ని సంప్రదించండి.
^ ముప్ఫై మిల్లీలీటర్ల మద్యం, 60 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ పానీయాలకు (విస్కీ, ఓడ్కా, మరితరమైనవి), 240 మిల్లీలీటర్ల వైన్‌కు, లేదా 720 మిల్లీలీటర్ల బీర్‌కు సమానం.
^ మీరు ఎంత మేరకు వ్యాయామం చేయడం అవసరం అనే దాని గురించి మీ వైద్యునితో చర్చించండి.
[16వ పేజీలోని బాక్సు]
అధిక రక్తపోటును ఎదుర్కోవడం
1. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడగల చర్యలు
• శరీర బరువును తగ్గించుకోండి
• ఉప్పు తినడం తగ్గించండి
• పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోండి
• మద్యపానీయాలు తగ్గించండి
• క్రమంగా వ్యాయామం చేయండి
2. రక్త పోటును అదుపు చేసుకోవడానికి సహాయపడగల ఇతర చర్యలు
• కాల్షియం, మెగ్నీషియం ఉండే ఆహారపదార్థాలు
• పీచు ఎక్కువగా ఉండే శాఖాహార భోజనం
• ఒత్తిడికి చికిత్స
3. సంబంధిత చర్యలు
• పొగత్రాగడం మానండి
• కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోండి
• మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోండి
• రక్తపోటును పెంచగల మందులను వాడకండి
[చిత్రసౌజన్యం]
ధమనుల అధిక రక్తపోటుపై బ్రెజిల్ వైద్యుల మూడవ ఒప్పందం నుండి తీసుకోబడ్డాయి—Revista Brasileira de Clínica & Terapêutica.
[17వ పేజీలోని చిత్రాలు]
క్రమంగా వ్యాయామం చేయడం, ఆరోగ్యదాయకమైన ఆహారం తీసుకోవడం అధిక రక్తపోటును నివారించడానికీ అదుపులో ఉంచుకోవడానికీ సహాయం చేస్తాయి