కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు దైవిక కాపుదల కోసం ఎదురుచూడాలా?

క్రైస్తవులు దైవిక కాపుదల కోసం ఎదురుచూడాలా?

బైబిలు ఉద్దేశము

క్రైస్తవులు దైవిక కాపుదల కోసం ఎదురుచూడాలా?

తన ఆరాధకులను ప్రమాదంనుండి కాపాడగల దేవుని సామర్థ్యం గురించి బైబిలు తరచుగా నివేదిస్తుంది. “యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము” అని రాజైన దావీదు అన్నాడు. (కీర్తన 140:1) నేడు దౌర్జన్యాన్నీ నేరాన్నీ ప్రకృతి వైపరీత్యాలనూ ఎదుర్కొన్న దేవుని ఆరాధకుల్లో అనేకులు, మరణాన్ని లేదా గాయపడడాన్ని తృటిలో తప్పించుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తమను అద్భుతంగా కాపాడాడా అని కొందరు ఆశ్చర్యపోయారు, ప్రాముఖ్యంగా దైవభక్తిగల ప్రజలు ఘోరమైన విపత్తులను చివరకు దారుణమైన మరణాన్ని తప్పించుకోలేక వాటికి బలైపోయిన ఇతర సందర్భాలూ ఉన్నాయి కనుక వారలా అనుకున్నారు.

యెహోవా దేవుడు కొద్దిమందిని ప్రమాదం నుండి కాపాడి, ఇతరులను కాపాడకుండా ఉంటాడా? నేడు దౌర్జన్యం నుండి విపత్తుల నుండి అద్భుతంగా కాపాడబడాలని మనం ఎదురుచూడాలా?

బైబిలు వృత్తాంతాల్లో అద్భుతమైన కాపుదల

దేవుడు అద్భుతరీతిలో తన ఆరాధకుల పక్షాన కలుగజేసుకోవడాన్ని గురించిన అనేక వృత్తాంతాలు బైబిలులో ఉన్నాయి. (యెషయా 38:1-8; అపొస్తలుల కార్యములు 12:1-11; 16:25, 26) ఇతర సందర్భాల్లో యెహోవా సేవకులు విపత్తు నుండి ఎలా కాపాడబడలేదో కూడా లేఖనాలు నివేదిస్తున్నాయి. (1 రాజులు 21:1-16; అపొస్తలుల కార్యములు 12:1, 2; హెబ్రీయులు 11:35-38) కాబట్టి, యెహోవా తాను కావాలనుకున్నప్పుడు ప్రత్యేక కారణం లేదా సంకల్పం కోసం రక్షణ కల్పించాలని నిర్ణయించుకోగలడన్నది స్పష్టం. కాబట్టి, కొంతమంది క్రైస్తవులు శ్రమలనుండి కాపాడబడనప్పుడు దేవుడు తమను వదిలివేశాడన్న ముగింపుకు రాకూడదు. యెహోవా నమ్మకమైన సేవకులకు కూడా విపత్కరమైన సంఘటనలు సంభవిస్తాయన్న వాస్తవాన్ని మనము అంగీకరించాలి. ఎందుకలా?

దేవుని నమ్మకమైన సేవకులకు విపత్కరమైన సంఘటనలు ఎందుకు సంభవిస్తాయి

అందుకు గల ఒక కారణం ఏమిటంటే, మనమందరము ఆదాము హవ్వలనుండి పాపాన్నీ అపరిపూర్ణతనూ వారసత్వంగా పొందాము. కాబట్టే మనం నొప్పిని, బాధను, మరణాన్ని అనుభవించవలసి వస్తోంది. (రోమీయులు 5:12; 6:23) మరొక కారణం ఏమిటంటే, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నాం. మన కాలంలోని ప్రజలను బైబిలు, “అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు” అని వర్ణిస్తుంది. (2 తిమోతి 3:1-5) బలాత్కారాలు, కిడ్నాప్‌లు, హత్యలు, ఇతర క్రూరమైన నేరాలు విస్తృతంగా జరగడమే దానికి రుజువు.

దేవుని నమ్మకమైన సేవకులు చాలామంది దౌర్జన్యపూరితమైన ప్రజల మధ్య జీవిస్తున్నారు, పనిచేస్తున్నారు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు వీరి దౌర్జన్యానికి బలైపోతారు. మనము అననుకూలమైన సమయంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండడం వల్ల ప్రాణాపాయ స్థితిలో పడవచ్చు. అంతేకాకుండా “కాలము, అనూహ్య సంఘటనల” ప్రభావం అందరిపైనా పడుతుందని చెప్పినప్పుడు సొలొమోను వ్యక్తం చేసిన అభిప్రాయం యొక్క వాస్తవికతను మనం అనుభవిస్తాము.​—ప్రసంగి 9:11, NW.

దానికి తోడు, క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తారు గనుక వారు హింసించబడతారని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు” అని ఆయన అన్నాడు. (2 తిమోతి 3:12) ఇటీవలి సంవత్సరాలలో చాలా దేశాలలో ఇది నిజమని నిరూపించబడింది.

కాబట్టి దైవభయంగల ప్రజలు దౌర్జన్యం, నేరం, ప్రకృతి వైపరీత్యాలు లేదా అనుకోకుండా సంభవించే మరణాల వల్ల కలిగే ప్రభావాలనుండి మినహాయించబడరు. తన ప్రజలు విపత్తును అనుభవించకుండానే తమ జీవితాలను గడిపేలా యెహోవా వారి చుట్టూ కంచె వేస్తాడన్న వాదనను సాతాను ఉపయోగించాలని చూశాడు. (యోబు 1:9, 10) కానీ అది నిజం కాదు. అయితే, యెహోవా తన ప్రజలను ఒకానొక పరిస్థితి నుండి అద్భుతంగా విడిపించకపోయినప్పటికీ వారికి కాపుదలనిస్తాడని మనము నిశ్చయత కలిగి ఉండవచ్చు.

యెహోవా నేడు తన ప్రజలను ఎలా కాపాడతాడు

యెహోవా తన వాక్యము ద్వారా తన ప్రజలకు కాపుదలనిచ్చే నడిపింపును వారికిస్తాడు. ఆధ్యాత్మికత, బైబిలు జ్ఞానము మనకు మంచి వివేచననూ స్వస్థబుద్ధినీ ఇస్తాయి, అనవసరమైన పొరపాట్లు చేయకుండా జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకునేలా మనకు సహాయం చేస్తాయి. (కీర్తన 38:4; సామెతలు 3:21; 22:3) ఉదాహరణకు లైంగిక నైతికత, దురాశ, కోపం, దౌర్జన్యాల విషయంలో బైబిలు ఇచ్చే ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం వల్ల క్రైస్తవులు అనేక విపత్తులనుండి కాపాడబడ్డారు. అంతేకాకుండా, చెడ్డ ప్రజలతో సన్నిహిత సహవాసం లేనట్లైతే మనము విపత్తు సంభవించే ప్రదేశంలో​—ఉండకూడని సమయాన ఉండకూడని ప్రదేశంలో​—ఉండే అవకాశం తగ్గుతుంది. (కీర్తన 26:4, 5; సామెతలు 4:14) బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవించేవారు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని కలిగివుంటారు, తత్ఫలితంగా వారికి మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుంది.

దేవుడు చెడు జరగడానికి అనుమతించినప్పటికీ వాటిని తట్టుకోవడానికి వీలుగా తన ఆరాధకులకు అవసరమైన బలాన్ని ఆయన ఇస్తాడని తెలుసుకోవడం మనకు ఎంతో ఓదార్పునిస్తుంది. “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును” అని అపొస్తలుడైన పౌలు మనకు హామీ ఇస్తున్నాడు. (1 కొరింథీయులు 10:13) మనము విపత్తులను సహించడానికి సహాయపడేందుకు “బలాధిక్యము” ఇవ్వబడుతుందని కూడా బైబిలు వాగ్దానం చేస్తోంది.​—2 కొరింథీయులు 4:7.

దేవుడు తన చిత్త ప్రకారమే చేస్తాడు

ప్రమాదం సంభవించే ప్రతి సందర్భంలోనూ దేవుడు తమను అద్భుతంగా కాపాడతాడని క్రైస్తవులు ఎదురుచూడాలా? అలా ఎదురుచూడడాన్ని బైబిలు నివేదిక సమర్థించడం లేదు.

నిజమే, తన సేవకులలో ఎవరి పక్షానైనా సూటిగా కలుగజేసుకోవాలని యెహోవా దేవుడు ఎంపిక చేసుకోగలడు. దేవుడు జోక్యం చేసుకోవడంవల్లే తాను ప్రమాదం నుండి తప్పించుకున్నానని ఎవరైనా నమ్ముతుంటే, ఆ వ్యక్తిని విమర్శించకూడదు. కానీ, జోక్యం చేసుకోకూడదని యెహోవా ఎంపికచేసుకున్నప్పుడు మాత్రం దాన్ని ఆయనఆగ్రహానికి సూచనగా ఎప్పుడూ భావించకూడదు.

మనము ఎటువంటి శ్రమను లేదా పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ, ఆ పరిస్థితిని తీసివేయడం ద్వారా గానీ దాన్ని సహించడానికి మనకు బలాన్ని ఇవ్వడం ద్వారా గానీ మనం మరణిస్తే తన నూతన లోకంలో నిత్యజీవానికి మనల్ని పునరుత్థానం చేయడం ద్వారా గానీ యెహోవా తన నమ్మకమైన ఆరాధకులకు దైవిక కాపుదలను అనుగ్రహిస్తాడని మనం నమ్మకం కలిగివుండవచ్చు.​—కీర్తన 37:10, 11, 29; యోహాను 5:28, 29. (g02 4/8)