కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం ఎందుకంత కష్టం?

నా రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం ఎందుకంత కష్టం?

యువత ఇలా అడుగుతోంది . . .

నా రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం ఎందుకంత కష్టం?

“నేను శుభ్రంగా క్రమబద్ధంగా ఉంటాను, చాలా శుభ్రంగానూ క్రమబద్ధంగానూ ఉంటాను. కానీ నేను ఇంటికి వచ్చేసరికి, నా రూమ్‌మేట్‌ కాళ్ళూ చేతులూ చాపుకుని నేలమీద కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు, చుట్టూ కాగితాలు, పాప్‌కార్న్‌ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. నేను ఇంటికి రావడానికి ముందే అక్కడ నాకు కనబడే దృశ్యాన్ని ఊహించుకోగలను, అందుకే ‘నాకు రూమ్‌కు వెళ్ళడం ఇష్టం లేదు’ అని మనస్సులో అనుకుంటాను.”​ డేవిడ్‌.

“నా రూమ్‌మేట్‌, గారాబం వల్ల మొండిగా తయారైంది. తనకు పనిమనిషి, వంటమనిషి ఉన్నారనుకున్నట్లుంది. ఎప్పుడూ పనులన్నీ తనకు ఇష్టమైన విధంగానే జరగాలని పట్టుపట్టేది.”​ రినీ. *

“అపరిచిత వ్యక్తి యొక్క వింత ప్రవర్తనలను సహించడం నేర్చుకుంటే, అది . . . సర్దుకుపోవడాన్నీ రాజీపడే కళనూ నేర్పించగలదు, కానీ అలా నేర్చుకోవడమన్నది తరచూ బాధాకరంగా ఉంటుంది” అని యు. ఎస్‌. న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌లోని ఒక ఆర్టికల్‌ చెప్పింది. ఎప్పుడైనా రూమ్‌మేట్‌తో కలిసి ఉన్నవారు ఈ విషయాన్ని అంగీకరించవచ్చు.

విద్యకయ్యే విపరీతమైన ఖర్చును తగ్గించడానికి విశ్వవిద్యాలయ విద్యార్థులు చాలామంది రూమ్‌మేట్‌తో కలిసి ఉంటారు. ఇతర యౌవనస్థులు తమ తల్లిదండ్రులనుండి స్వతంత్రంగా ఉండాలనుకుంటారు కాబట్టి రూమ్‌మేట్‌తో ఉండడం మొదలుపెడతారు. క్రైస్తవ యౌవనస్థులలో చాలామంది ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రూమ్‌మేట్‌తో కలిసి ఉండడాన్ని ఎంపిక చేసుకున్నారు. (మత్తయి 6:33) ఖర్చులను పంచుకోవడానికి ఎవరైనా తోడు ఉంటే, పూర్తికాల సువార్తికులుగా సేవ చేయడానికి అది తమకు సహాయపడుతుందని వారి ఉద్దేశం. కొన్నిసార్లు మిషనరీ జీవితంలోనూ యెహోవాసాక్షుల వివిధ బ్రాంచి కార్యాలయాల్లో చేసే సేవలోనూ రూమ్‌మేట్‌తో కలిసి ఉండాల్సి రావచ్చు. *

రూమ్‌మేట్‌లతో కలిసి జీవించిన అనేకమంది యౌవన స్త్రీ పురుషులతో తేజరిల్లు! మాట్లాడింది. రూమ్‌మేట్‌, కేవలం ఇంటి అద్దెను పంచుకునే వ్యక్తి కంటే ఎక్కువే అయ్యుండవచ్చని అంటే, కలిసి మాట్లాడుకునేలా కలిసి పనులు చేసుకునేలా సాహచర్యానికి మూలంగా కూడా ఉండవచ్చు అని అందరూ అంగీకరించారు. “మేము ఇద్దరమూ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం, సరదాగా సినిమాలు చూసేవాళ్ళం” అని లిన్‌ గుర్తు చేసుకుంటుంది. “ఒక రూమ్‌మేట్‌ మిమ్మల్ని ప్రోత్సహించగలదు కూడా. కొన్నిసార్లు మీరు జీవనోపాధి కోసం పనిచేస్తూ మీ బిల్లులన్నింటిని కట్టడానికి ప్రయత్నిస్తూ ప్రకటనా పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు ఒక రూమ్‌మేట్‌ ఉండడం ఆహ్లాదకరంగా ఉంటుంది” అని రినీ అంటోంది.

అయినప్పటికీ, ఒక రూమ్‌మేట్‌తో​—ప్రత్యేకించి ముందు పరిచయంలేని వ్యక్తితో​—కలిసి ఉండడం గొప్ప సవాలుగా ఉండగలదు. కాలేజీ వాతావరణం గురించి యు. ఎస్‌. న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ ఇలా వ్యాఖ్యానించింది: “ఒకరితో ఒకరు చక్కగా సర్దుకుపోయే వారిని రూమ్‌మేట్‌లుగా నియమించడానికి చాలా స్కూళ్ళు ఎంతో కృషి చేసినప్పటికీ అసంతృప్తికరమైన ఫలితాలు సర్వసాధారణమే.” నిజమే, కాలేజీ రూమ్‌మేట్‌ల మధ్య జరిగే వివాదాలు దౌర్జన్యానికి దారితీసేంత తీవ్రతరం కావడం కూడా జరిగింది! విద్యార్థులు తమ రూమ్‌మేట్‌ల మీద తమకున్న కోపాన్నంతటినీ బహిరంగంగా వ్యక్తపర్చడాన్ని అనుమతించే ఇంటర్నెట్‌ వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం తరచూ ఎందుకంత కష్టంగా ఉంటుంది?

అపరిచిత వ్యక్తితో కలిసి ఉండడం

“అపరిచిత వ్యక్తితో కలిసి ఉండడం ప్రారంభించడమనేది ఆసక్తికరమైన అనుభవం, అతను ఎలా ఉంటాడన్నది మీకు అస్సలు తెలియదు” అని మార్క్‌ అంటున్నాడు. నిజమే మీ ఇష్టాయిష్టాలతో ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలు ఏదో కొంత మాత్రమే కలిస్తే లేదా అస్సలు కలవకపోతే, ఆ వ్యక్తితో కలిసి ఉండడం చాలా కష్టమవ్వగలదు. నిజమే క్రైస్తవుల ఇష్టాయిష్టాలు చాలామట్టుకు ఒక్కలాగే ఉండాలి, వారు మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉండాలి. అయితే డేవిడ్‌ ఇలా అంగీకరిస్తున్నాడు: “రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం గురించి నాకు చాలా భయాలుండేవి.”

అయితే, డేవిడ్‌ రూమ్‌మేట్‌ కూడా పట్టణం నుండి వచ్చిన వ్యక్తే. కానీ రూమ్‌మేట్‌లందరికీ ఒకరితో ఒకరికి అంత బాగా పొసగదు. మార్క్‌ ఇలా అంటున్నాడు: “నా మొదటి రూమ్‌మేట్‌ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. మీరు వేరే వ్యక్తితో ఒకే గదిలో ఉంటున్నప్పుడు, మీరు తప్పక మాట్లాడవలసి ఉంటుంది. కానీ అతను నాతో మాట్లాడేవాడు కాదు. అది నాకు చిరాకు కలిగించేది.”

వేర్వేరు నేపథ్యాలనుండి రావడం అనేది మరితర ఒత్తిళ్ళనూ సమస్యలనూ తీసుకురావచ్చు. లిన్‌ ఇలా అంటుంది: “మీరు మొదటిసారిగా వేరుగా ఉండడం మొదలుపెట్టినప్పుడు, పనులన్నీ మీకు ఇష్టమైన రీతిలోనే చేయాలనుకుంటారు, కానీ ఇతరులను కూడా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉందని మీరు త్వరలోనే గ్రహిస్తారు.” నిజమే, సురక్షితమైన ఆశ్రయదుర్గం లాంటి మీ ఇంటినుండి వచ్చిన మీకు, వేరే వ్యక్తులు విషయాలను ఎంత భిన్నంగా దృష్టిస్తారో తెలుసుకోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.

విభిన్న నేపథ్యాలు, భిన్న వైఖరులు

ఒకరు తమ తల్లిదండ్రులనుండి శిక్షణ పొందడం మీదా, పొందకపోవడం మీదా ఎంతో ఆధారపడి ఉంటుంది. (సామెతలు 22:6) యౌవనస్థుడైన ఫెర్నాండో ఇలా చెబుతున్నాడు: “నేను చాలా శుభ్రంగా ఉంటాను, నా రూమ్‌మేట్‌ మాత్రం చాలా మురికివాడు. ఉదాహరణకు క్లోసెట్‌నే తీసుకోండి: బట్టలన్నీ అస్తవ్యస్తంగా అన్నిచోట్లా పడేయ్యడం అతనికి ఇష్టం. నాకు అన్నీ చక్కగా హేంగర్లకు తగిలించి పెట్టుకోవడం ఇష్టం.” కొన్నిసార్లు జీవన ప్రమాణాల్లోని తేడాలు చాలా విపరీతంగా ఉంటాయి.

రినీ ఇలా గుర్తుచేసుకుంటుంది: “నాకు ఒక రూమ్‌మేట్‌ ఉండేది, ఆమె పడకగది అక్షరాలా చెత్తకుప్పలా ఉండేది! భోజనం చేసిన తర్వాత టేబుల్‌ తుడవకుండా వదిలేసే రూమ్‌మేట్లు, రెండు మూడు రోజులైనా గిన్నెలు తోమకుండా అలాగే సింక్‌లో ఉంచేసే రూమ్‌మేట్లు కూడా నాకు ఉండేవారు.” అవును, ఇంటిపని విషయానికి వచ్చేసరికి, కొంతమంది రూమ్‌మేట్‌లు “ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును” అని సామెతలు 26:14 వ వచనంలో చెప్పబడిన మాటలకు తగినట్లే ఉంటారు.

మరోవైపు దానికి పూర్తి విరుద్ధంగా, అతి శుభ్రతను పాటించే వ్యక్తితో కలిసి ఉండడం కూడా కష్టమే. లీ అనే ఒక యౌవన స్త్రీ ఒక రూమ్‌మేట్‌ గురించి ఇలా చెబుతుంది: “ఆమె ఉద్దేశం ప్రకారం గంట గంటకూ శుభ్రం చేయవలసిందే. నేనేమీ అశుభ్రంగా ఉండను, కానీ కొన్నిసార్లు పుస్తకాలు వంటివి మంచం మీద వదిలేస్తుంటానంతే. ఆ మాత్రం దానికే పరిస్థితిని చక్కబెట్టాలని ఆమె అనుకునేది.”

వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా రూమ్‌మేట్‌లకు తమ సొంత అభిప్రాయాలు ఉండవచ్చు. మార్క్‌ ఇలా వివరిస్తున్నాడు: “నా రూమ్‌మేట్‌ చివరి నిమిషంలో నిద్ర లేచేవాడు. అతను సింక్‌ దగ్గరికి పరిగెత్తి, తన జుట్టుమీద కొన్ని నీళ్ళు చల్లుకుని, బైటికి వెళ్ళిపోయేవాడు.”

నేపథ్యాలలోనూ వ్యక్తిత్వాలలోనూ ఉన్న తేడాలు మనము ఎంపిక చేసుకునే వినోదాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. “మా ఇద్దరికీ ఒకే రకమైన సంగీతం ఇష్టం ఉండదు” అని మార్క్‌ తన రూమ్‌మేట్‌ గురించి చెబుతున్నాడు. అయితే, ఎక్కడైతే పరస్పర గౌరవం ఉంటుందో అక్కడ ఇలాంటి తేడాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు, రూమ్‌మేట్‌లు ఇద్దరూ కూడా తమ అభిరుచులను విశాలపర్చుకోవడానికి బహుశా అది సహాయం చేయవచ్చు. కానీ సర్వసాధారణంగా ఇలాంటి తేడాలు వివాదాలకు దారితీస్తాయి. “నాకు స్పానిష్‌ సంగీతం ఇష్టం, కానీ నా రూమ్‌మేట్‌ ఎప్పుడూ దాన్ని విమర్శిస్తూనే ఉంటాడు” అని ఫెర్నాండో చెబుతున్నాడు.

టెలిఫోన్‌​—ఒక సమస్య

టెలిఫోన్‌ను ఉపయోగించడం, వివాదాలకు దారితీసే కారణాల్లోకెల్లా అతిపెద్ద కారణం కావచ్చు. “నాకు పడుకోవడమంటే ఇష్టం. కానీ నా రూమ్‌మేట్‌ చాలాసేపటి వరకు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాడు. కాసేపటికి అది విసుగు పుట్టిస్తుంది” అని మార్క్‌ చెబుతున్నాడు. లిన్‌ కూడా ఇలా గుర్తుచేసుకుంటుంది: “కొన్నిసార్లు నా రూమ్‌మేట్‌ స్నేహితులు తెల్లవారు ఝామున మూడు గంటలకు గానీ నాలుగు గంటలకు గానీ ఫోన్‌ చేసేవారు. ఆమె రూమ్‌లో లేకపోతే, ఫోన్‌ రిసీవ్‌ చేసుకోవడానికి నేను లేవవలసి వచ్చేది.” ఈ సమస్యకు పరిష్కారం? “మా ఇద్దరికీ రెండు వేర్వేరు ఫోన్‌లు ఉండేలా చూసుకున్నాము.”

కానీ యౌవనస్థులందరూ ఫోన్‌ను సొంతంగా కొనుక్కోలేకపోవచ్చు, కొందరు తప్పనిసరిగా ఒకే ఫోన్‌ను ఉపయోగించుకోవలసిన పరిస్థితి ఉండవచ్చు. ఇది కొన్ని ఉద్రిక్తమైన పరిస్థితులకు దారితీయవచ్చు. రినీ ఇలా గుర్తుచేసుకుంటోంది: “నా రూమ్‌మేట్‌లలో ఒకరికి బోయ్‌ఫ్రెండ్‌ ఉండేవాడు, ఆమె తరచూ గంటల తరబడి అతనితో ఫోన్‌లో మాట్లాడేది. ఒకనెల ఫోన్‌ బిల్లు 4000 రూపాయిలు వచ్చింది. బిల్లును అందరం కలిసి కట్టాలని ముందే నిర్ణయించుకున్నాం కాబట్టి, ఈసారి కూడా మేము అందులో భాగం పంచుకోవాలని ఆమె ఆశించింది.”

ఫోన్‌ను ఉపయోగించడానికి అవకాశం దొరికే విషయం కూడా ఒక పెద్ద సమస్య కావచ్చు. “నేను నాకంటే పెద్దావిడతో ఒక రూమ్‌లో ఉండేదాన్ని, మాకు ఒకటే ఫోన్‌ ఉండేది. నాకు చాలామంది స్నేహితులు ఉండేవారు కాబట్టి ఎప్పుడూ నేనే ఫోన్‌ను ఉపయోగించేదాన్ని. ఆమె ఎప్పుడూ ఏమీ అనేది కాదు. తాను ఫోన్‌ ఉపయోగించాలనుకుంటే నాకు చెప్తుందిలే అని నేను అనుకున్నాను. కానీ నేను ఆమె అవసరాలను లక్ష్యపెట్టలేదని ఇప్పుడు గ్రహించాను” అని రినీ గర్తుచేసుకుంటుంది.

ఏకాంతం లేకపోవడం

“అందరికీ కొంత ఏకాంతం కావాలి. కొన్నిసార్లు అసలు ఏమీ చేయకుండా ఊరికే రిలాక్స్‌ అవ్వాలనిపిస్తుంది” అని డేవిడ్‌ అంటున్నాడు. కానీ మీరు ఇంకెవరితోనైనా మీ రూమ్‌ను పంచుకుంటుంటే ఏకాంత సమయం దొరకడం ఒక సవాలుగా ఉండవచ్చు. “నాకు కొన్నిసార్లు ఏకాంతంగా ఉండాలంటే ఇష్టం” అని మార్క్‌ అంగీకరిస్తున్నాడు. “కాబట్టి, నాకు అత్యంత కష్టమైన విషయం ఏమిటంటే ఏకాంతం లేకపోవడమే. నాకూ నా రూమ్‌మేట్‌కూ ఒకే షెడ్యూల్‌ ఉండేది. కాబట్టి ఏకాంతం దొరకడం చాలా కష్టమయ్యేది” అని ఆయన అంటున్నాడు.

యేసుక్రీస్తుకు కూడా కొన్నిసార్లు ఏకాంతం అవసరమైంది. (మత్తయి 14:13) రూమ్‌మేట్‌ ఉండగా చదువుకోవడం, అధ్యయనం చేయడం, ధ్యానించడం అసాధ్యం కాకపోయినప్పటికీ కొంచెం కష్టం కాబట్టి అది విసుగు కలిగించేదిగా ఉండవచ్చు. “ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కాబట్టి, అధ్యయనం చేయడం కష్టం. అతను తన స్నేహితులను రూమ్‌కు పిలుస్తాడు, ఫోన్‌లో మాట్లాడుతుంటాడు, టీవీ చూస్తుంటాడు లేదా రేడియో వింటుంటాడు” అని మార్క్‌ చెబుతున్నాడు.

రూమ్‌మేట్‌లతో సర్దుకుపోయి జీవించడం సవాలుదాయకమే అయినప్పటికీ, వేలాదిమంది యౌవనస్థులు దానిలో విజయం సాధించారు. ఈ సిరీస్‌లోని తర్వాతి ఆర్టికల్‌లు, ఒకే రూమ్‌లో ఇతరులతో కలిసి ఉండడానికి కొన్ని ఆచరణాత్మకమైన విధానాలను చర్చిస్తాయి. (g02 4/22)

[అధస్సూచీలు]

^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ ఈ ఉపదేశం యౌవనస్థులను ఉద్దేశించి ఇవ్వబడుతున్నప్పటికీ, భర్త గానీ భార్య గానీ చనిపోవడం వంటి, మారిన పరిస్థితుల వల్ల రూమ్‌మేట్‌తో కలిసి జీవించవలసి వచ్చే పెద్దవారికి కూడా ఈ సమాచారం సహాయకరంగా ఉండగలదు.

[12, 13వ పేజీలోని చిత్రం]

సంగీతం విషయంలో వేర్వేరు అభిరుచులు ఉండడం సవాలును ముందుంచగలదు

[14వ పేజీలోని చిత్రం]

ఇతరుల అవసరాలను లక్ష్యపెట్టకపోవడం కూడా సమస్యలను సృష్టించగలదు