కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను నా గర్భస్థ శిశువును పోగొట్టుకున్నాను

నేను నా గర్భస్థ శిశువును పోగొట్టుకున్నాను

నేను నా గర్భస్థ శిశువును పోగొట్టుకున్నాను

సోమవారం, 2000, ఏప్రిల్‌ 10, ఎండకాస్తున్న వేళ ఇంటికి కావలసిన కొన్ని సరుకులను కొనడానికి బయలుదేరాను. నాకప్పుడు నాలుగో నెల, ఓపిక అంతగా లేకపోయినా, ఇంట్లో నుండి కాస్త అలా బయటికి వెళ్ళడానికి సంతోషమే అనిపించింది. ఇక బిల్లు చెల్లించడానికి వేచివున్నప్పుడైతే, నాకేదో అయిపోతున్నట్లు అనిపించింది.

నేను ఇంటికి చేరేసరికి నేను భయపడినంతా అయ్యింది. నాకు రక్తస్రావం అవుతోంది​—ఇంతకు ముందు రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పుడు అలా జరగలేదు, దానితో భయకంపితురాలినయ్యాను! నేను డాక్టర్‌కు ఫోన్‌ చేశాను, కానీ ఆ రోజుకు ఆగిపోయి, మరునాడు ఎలాగూ నాకు అపాయింట్‌మెంట్‌ ఉంది కాబట్టి అప్పుడు వస్తే సరిపోతుందని ఆయన సూచించాడు. ఆ రాత్రి మా ఇద్దరు పిల్లలను నిద్రపుచ్చక ముందు, నేనూ నా భర్తా పిల్లలూ కలిసి ప్రార్థన చేసుకుని, మాకు ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా శక్తినివ్వమని యెహోవాను వేడుకున్నాము. చివరికి నేను నిద్రలోకి జారుకున్నాను.

కానీ దాదాపు రెండు గంటల సమయంలో విపరీతమైన నొప్పి కలగడంతో నాకు మెలకువ వచ్చింది. క్రమంగా నొప్పి తగ్గింది, అయితే నేను మెల్లగా నిద్రలోకి జారుకుంటుండగా, మళ్లీ నొప్పి మొదలైంది, ఈసారి నొప్పి ఆగాగి వచ్చింది. రక్తస్రావం కూడా అధికమైంది, నాకు కంట్రాక్షన్‌లు కలుగుతున్నాయని నేను గ్రహించాను. ఇలా జరగడానికి నేనేమైనా పొరపాటు చేశానా అని వెంటనే ఆలోచించాను, కానీ నేనేదైనా పొరపాటు చేసినట్లు నాకు గుర్తు రావడం లేదు.

ఉదయం ఐదింటికల్లా నేను హాస్పిటల్‌కు వెళ్ళవలసిందేనని నాకు అర్థమైపోయింది. నేనూ నా భర్తా హాస్పిటల్‌కు చేరుకుని ఎమర్జెన్సీ రూమ్‌ సిబ్బంది సంరక్షణ క్రింద ఎంతో ఉపశమనం పొందాము, వాళ్లు ఎంతో దయా తదనుభూతీ గలవారు, మాకెంతగానో సహాయపడ్డారు. తర్వాత రెండు గంటలు గడిచాక, డాక్టరు వచ్చి మేము భయపడుతున్న విషయాన్నే చెప్పాడు: నేను నా బిడ్డను పోగొట్టుకున్నాను.

నాకు ముందే ఆ సూచనలు కనబడ్డాయి గనుక ఈ పర్యవసానానికి నేను సిద్ధంగానే ఉన్నాను, ఆ వార్తను చాలామేరకు ప్రశాంతంగానే విన్నాను. అంతేగాక, ఆ సమయమంతటిలోనూ నా భర్త నాతోనే ఉండి ఎంతో సహాయపడ్డారు. కానీ ఇప్పుడిక మేము బిడ్డ లేకుండా ఇంటికి వెళ్తాము గనుక, మా పిల్లలిద్దరికీ అంటే ఆరేళ్ళ కేట్లిన్‌కు, నాలుగేళ్ల డేవిడ్‌కు ఈ విషయాన్ని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాము.

మేము మా పిల్లలకేం చెప్తాం?

ఏదో జరిగింది అనుకొని మా పిల్లలు నిద్రపోయారు, కానీ వారి తమ్ముడు లేదా చెల్లి చనిపోయినట్లు మేము వారికెలా చెప్పడం? మేము దాపరికం లేకుండా విషయమంతా పిల్లలకు చెప్పాలని నిర్ణయించుకున్నాము. మా అమ్మ, చిన్నపాప మాతోపాటు ఇంటికి రావడంలేదని పిల్లలకు చెప్పేసి, మాకీ విషయంలో ఎంతో సహాయం చేసింది. మేము తిరిగి రాగానే, వాళ్ళు మా దగ్గరికి పరుగెత్తుకొని వచ్చి, కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. వాళ్ళు వేసిన మొదటి ప్రశ్న, “పాప బాగుందా?” నేను జవాబివ్వలేకపోయాను, కానీ నా భర్త మమ్మల్నందరినీ చేతులతో చుట్టేసి, “పాప చనిపోయింది” అన్నారు. మేమందరం ఒకరినొకరం పట్టుకుని ఏడ్చేశాము, మేము ఓదార్పు పొందడానికి అదెంతో సహాయపడింది.

అయితే మా పిల్లల తర్వాతి ప్రతిస్పందనలకు మేమంతగా సిద్ధపడలేదు. ఉదాహరణకు నాకు గర్భస్రావం అయిన దాదాపు రెండు వారాలకు, ఒక వృద్ధ సాక్షి చనిపోయినట్లు యెహోవాసాక్షుల స్థానిక సంఘంలో ప్రకటించారు, ఆయన మా కుటుంబానికి ఎంతో సన్నిహిత స్నేహితుడు. నాలుగేళ్ళ డేవిడ్‌ వెక్కి వెక్కి ఏడ్చాడు, వాడ్ని ఊరుకోబెట్టడం మావల్ల కాలేదు, ఇక నా భర్త వాడ్ని బయటికి తీసుకువెళ్లారు. కాస్త నెమ్మదించాక, తన స్నేహితుడు ఎందుకు చనిపోయాడని డేవిడ్‌ అడిగాడు. చిన్నపాప ఎందుకు చనిపోయిందని కూడా వాడు అడిగాడు. ఆ తర్వాత వాడు, “మీరు కూడా చనిపోబోతున్నారా?” అని వాళ్ళ నాన్నను అడిగాడు. యెహోవా దేవుడు సాతానును నాశనం చేసి, “పరిస్థితులను చక్కబెట్టడం” ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదో కూడా వాడు తెలుసుకోవాలనుకున్నాడు. వాస్తవానికి, వాడి చిన్ని మనస్సులో ఎంతటి అలజడి చెలరేగుతోందో తెలుసుకుని మేము ఆశ్చర్యపోయాము.

కేట్లిన్‌ కూడా ఎన్నో ప్రశ్నలు వేసింది. అది తన బొమ్మలతో ఆడుకునేటప్పుడు, ఒక బొమ్మకు ఆరోగ్యం బాగాలేనట్లు, వేరే బొమ్మలన్నీ నర్సులుగానో కుటుంబ సభ్యులుగానో మారినట్లు ఆడుకునేది. అది ఒక అట్టపెట్టిని హాస్పిటల్‌లాగా తయారుచేసి, అప్పుడప్పుడూ తన బొమ్మల్లో ఒక బొమ్మ చనిపోయినట్లు నటించేది. మా పిల్లల ప్రశ్నలూ వాళ్ళ ఆటలూ మేము వాళ్ళకు జీవితం గురించి ముఖ్యమైన పాఠాలు బోధించడానికీ, శ్రమలను సహించడానికి బైబిలు మనకెలా సహాయం చేయగలదో బోధించడానికీ మాకు అనేక అవకాశాలను ఇచ్చింది. అన్ని రకాలైన బాధా వేదనలు, చివరికి మరణం కూడా లేని సుందరమైన పరదైసుగా ఈ భూమిని మార్చాలన్న దేవుని సంకల్పం గురించి కూడా మేము వాళ్ళకు గుర్తు చేసేవాళ్ళం.​—ప్రకటన 21:3, 4.

నేను ఆ నష్టాన్ని ఎలా తట్టుకున్నాను?

నేను హాస్పిటల్‌ నుండి మొదటిసారి ఇంటికి తిరిగి వచ్చాక భావరహితంగా, స్తబ్ధుగా తయారయ్యాను. నా చుట్టూ చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, కానీ ఎక్కడ నుండి మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఇలాంటి అనుభవాన్నే పొందిన కొంతమంది స్నేహితురాళ్ళను నేను నా ఇంటికి ఆహ్వానించాను, వాళ్ళు నన్ను ఎంతో ఓదార్చారు. ప్రియమైన ఒక స్నేహితురాలు మాకు పువ్వులు పంపించి, మా పిల్లల్ని మధ్యాహ్నం తనతో తీసుకువెళ్తానని అడిగింది. ఆమె చూపించిన వాత్సల్యపూరితమైన శ్రద్ధకు, ఆచరణాత్మకమైన సహాయానికి నేను కృతజ్ఞురాలిని!

మా కుటుంబ ఫోటోలన్నీ ఆల్బమ్స్‌లో పెట్టాను. పుట్టబోయే బిడ్డ కోసం తీసుకున్న బట్టలను చూసి వాటిని చేతుల్లోకి తీసుకున్నాను, నేను బిడ్డను పోగొట్టుకున్నాననడానికి మిగిలివున్న ఏకైక రుజువు అదే. అనేక వారాలపాటు భావోద్వేగపరంగా నేనెన్నో తీవ్రమైన మార్పులకు గురయ్యాను. మా కుటుంబమూ స్నేహితులూ ఎంత సహాయకరంగా ఉన్నా కొన్ని రోజులు నేను ఏడవకుండా ఉండలేకపోయేదాన్ని. మరి కొన్నిసార్లయితే, నాకు పిచ్చెక్కుతుందేమో అనిపించేది. గర్భిణులుగా ఉన్న స్నేహితురాళ్ళ మధ్య ఉండడం మరీ కష్టంగా ఉండేది. ఇంతకు ముందు, గర్భస్రావం అంటే స్త్రీ జీవితంలో అది కేవలం చాలా చిన్న విషయం మాత్రమే, అంటే అంత ఎక్కువ సమస్యలు లేకుండానే దాన్ని తట్టుకోవచ్చు అనుకునేదాన్ని. నేనెంత పొరబడ్డాను! *

ప్రేమ​—శ్రేష్ఠమైన చికిత్స

కాలం కొంతవరకు నా గాయాన్ని మాన్పింది, కానీ దానికన్నా ఎక్కువ ప్రభావం చూపించిన చికిత్స, నా భర్తా తోటి క్రైస్తవులూ చూపించిన ప్రేమే. ఒక సాక్షి వంట చేసి మా ఇంటికి తీసుకు వచ్చింది. ఒక సంఘ పెద్దా ఆయన భార్యా పువ్వులు, ఒక చక్కని గ్రీటింగ్‌ కార్డు తీసుకుని వచ్చి ఆ సాయంత్రం మాతో గడిపారు. వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో మాకు బాగా తెలుసు, అయినా వాళ్ళు చూపించిన శ్రద్ధ మా హృదయాలను కదిలించింది. ఇతర స్నేహితులనేకులు కార్డులు, పువ్వులు పంపించారు. “మేము మీ గురించి ఆలోచిస్తున్నాము” అనే పదాలే మాకు ఎంతో ఊరటనిచ్చాయి! సంఘంలోని ఒక సభ్యురాలు ఇలా వ్రాసింది: “మనం జీవాన్ని యెహోవా దృష్టించినట్లుగా ఎంతో అమూల్యమైనదిగా దృష్టిస్తాము. ఒక పక్షి ఎప్పుడు నేలకొరుగుతుందో ఆయనకు తెలిస్తే, ఒక పిండం ఎప్పుడు పడిపోతుందో కూడా ఆయనకు ఖచ్చితంగా తెలుసు.” నా బంధువు ఒకామె ఇలా వ్రాసింది: “జన్మించడం, జీవించడం గురించిన అద్భుతాన్ని బట్టి మనం నిజానికి ఆశ్చర్యపోతాము, ఆ విధానం సరిగ్గా పనిచేయనప్పుడూ మనం అంతే ఆశ్చర్యపోతాము.”

కొన్ని వారాల తర్వాత, రాజ్యమందిరంలో ఉన్నప్పుడు నాకు బాగా ఏడుపొచ్చింది, కూటం ప్రారంభమవుతుండగా ఇక నేను బయటికి వచ్చేయవలసి వచ్చింది. నేను కన్నీళ్ళతో వెళ్ళిపోవడం గమనించిన ఇద్దరు ప్రియ స్నేహితురాళ్ళు నాతోపాటు కారులో కూర్చుని, నా చెయ్యి పట్టుకుని నేను నవ్వేలా చేశారు. కొద్దిసేపట్లో ముగ్గురం కలిసి మళ్ళీ లోపలికి వచ్చాము. ‘సహోదరునికంటె ఎక్కువగా హత్తివుండే’ స్నేహితులు ఉండడం నిజంగా ఎంత ఆనందకరం!​—సామెతలు 18:24.

నాకు గర్భస్రావమయ్యిందన్న వార్త ఇతరులకు చేరింది, తోటి సాక్షులు ఎంతోమంది అదే అనుభవాన్ని పొందారని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. ముందు నాకు అంతగా పరిచయం లేని వారు కూడా ప్రత్యేకమైన ఓదార్పును, ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగారు. తగిన సమయంలో వారు నాకిచ్చిన ప్రేమపూర్వకమైన మద్దతు బైబిలులోని ఈ సామెతను నాకు గుర్తుచేసింది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”​—సామెతలు 17:17.

దేవుని వాక్యం నుండి ఓదార్పు

నాకు గర్భస్రావమైన వారానికి క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ వచ్చింది. ఒక సాయంత్రం మేము యేసు చివరి దినాలను గురించిన బైబిలు వృత్తాంతాలను చదువుతుండగా, హఠాత్తుగా నాకిలా అనిపించింది: ‘బిడ్డను కోల్పోవడం వల్ల కలిగే బాధ యెహోవాకు తెలుసు. ఆయన కూడా తన సొంత కుమారుడ్ని పోగొట్టుకున్నాడు!’ యెహోవా మన పరలోకపు తండ్రి గనుక, ఆయన తన సేవకులను​—మగవారినైనా ఆడవారినైనా​—ఎంతగా అర్థం చేసుకుంటాడో, వారిపట్ల ఎంత తదనుభూతి కలిగివుంటాడో నేను కొన్నిసార్లు మరచిపోతుంటాను. ఆ క్షణంలో నాకు ఎంతో ఉపశమనం కలిగింది. అప్పుడు నేను, మునుపెన్నటికన్నా కూడా యెహోవాకు ఎంతో సన్నిహితమైనట్లు భావించాను.

బైబిలు ఆధారిత సాహిత్యాల నుండి ప్రాముఖ్యంగా ప్రియమైన వారు మరణిస్తే కలిగే లోటును ఎలా తాళుకోవాలో చర్చించిన కావలికోట, తేజరిల్లు! పత్రికల గత సంచికల నుండి కూడా నేనెంతో ప్రోత్సాహాన్ని పొందాను. ఉదాహరణకు, తేజరిల్లు! (ఆంగ్లం), ఆగస్టు 8, 1987 సంచికలోని “బిడ్డను కోల్పోవడం వల్ల కలిగే బాధను ఎదుర్కోవడం” అనే దానిపై ఉన్న ఆర్టికల్స్‌, అలాగే మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . అనే బ్రోషుర్‌ ఎంతో సహాయకరంగా ఉన్నాయి. *

వేదన ఇక ఉండదు

రోజులు గడుస్తుండగా, నేను అపరాధ భావాలు లేకుండా నవ్వగలిగినప్పుడూ, పోగొట్టుకున్న బిడ్డ వైపుకు సంభాషణ మరలకుండా సంభాషించగలిగినప్పుడూ, నేను కోలుకుంటున్నానని నాకు అర్థమైంది. అయినా కూడా, అప్పుడప్పుడూ అంటే నాకు గర్భస్రావం జరిగిందని తెలియని స్నేహితులను కలిసినప్పుడో పుట్టిన బిడ్డతో ఎవరైనా మా రాజ్యమందిరంలో కనిపించినప్పుడో నేను మానసిక సంక్షోభానికి గురయ్యేదాన్ని.

ఒకరోజు ఉదయం దుఃఖకరమైన పరిస్థితులు గడిచిపోయాయని భావిస్తూ నేను నిద్ర మేల్కొన్నాను. నేను ఇంకా కళ్ళు తెరవకముందే, నేను కోలుకున్నానన్న భావన నాకు కలిగింది, ఎన్నో నెలలపాటు నాకు అలాంటి ప్రశాంతత, నెమ్మది కలగలేదు. అయినా, నేను బిడ్డను పోగొట్టుకున్న ఒక సంవత్సరానికి గర్భవతినైనప్పుడు మళ్ళీ గర్భస్రావం అవుతుందేమోననే ఆలోచనలు తలెత్తాయి. సంతోషకరంగా, నేను 2001 అక్టోబరులో ఆరోగ్యవంతమైన బాబుకు జన్మనిచ్చాను.

ఇప్పటికీ నేను పోగొట్టుకున్న బిడ్డ గురించి దుఃఖిస్తాను. అయినా, ఈ ఉదంతమంతా జీవంపట్ల, నా కుటుంబం పట్ల, నా తోటి క్రైస్తవుల పట్ల మనకు ఓదార్పునిచ్చే దేవునిపట్ల నాకున్న మెప్పుదలను అధికం చేసింది. దేవుడు మన పిల్లల్ని తీసుకోడు గానీ “కాలము, అనూహ్య సంఘటనల” ప్రభావం మూలంగానే ఇవన్నీ మనకు జరుగుతాయనే కఠోర సత్యాన్ని కూడా ఈ అనుభవం నాకు నొక్కి తెలియజేసింది.​—ప్రసంగి 9:11, NW.

దేవుడు గర్భస్రావం వల్ల కలిగే శారీరక, మానసిక వేదనలతోపాటు సమస్త విలాపాన్ని, దుఃఖాన్ని, బాధను నిర్మూలించే సమయం కోసం నేనెంతగా ఎదురుచూస్తున్నానో! (యెషయా 65:17-23) అప్పుడు, విధేయతగల మానవులందరూ ఇలా చెప్పగలుగుతారు: “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”​—1 కొరింథీయులు 15:55; యెషయా 25:8.​— ఉచిత వ్యాసం.(g02 3/22)

[అధస్సూచీలు]

^ గర్భస్రావానికి ప్రతిస్పందించే విధానం ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటుందని పరిశోధన చూపిస్తోంది. కొంతమంది అయోమయంలో పడిపోతారు, మరి కొందరు నిరుత్సాహపడతారు, ఇంకొందరు చెప్పలేనంత దుఃఖాన్ని అనుభవిస్తారు. గర్భస్రావం వంటి గంభీరమైన నష్టాలకు దుఃఖం అతి సహజమైన ప్రతిస్పందననీ, దుఃఖనివారణ పొందే ప్రక్రియలో అదొక భాగమనీ పరిశోధకులు చెబుతారు.

^ యెహోవాసాక్షులు ప్రచురించినది.

[21వ పేజీలోని బాక్సు]

గర్భస్రావాలు సంభవించడం, వాటికి కారణాలు

“గర్భం ధరించినట్లు నిర్ధారించబడిన వారిలో 15 నుండి 20 శాతం గర్భాలు గర్భస్రావంతో ముగుస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. “అయితే నెల తప్పిన (ఫలదీకరణ చెందిన) మొదటి రెండు వారాల్లో అంటే తాము గర్భంతో ఉన్నామని కూడా తెలియక ముందే స్త్రీలకు గర్భస్రావాలు అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.” మరో రెఫరెన్సు, “80 శాతం కన్నా” ఎక్కువ “గర్భస్రావాలు, గర్భధారణ జరిగిన మొదటి 12 వారాల్లోనే అవుతాయని” పేర్కొంటోంది, వాటిలో కనీసం సగం, పిండం యొక్క క్రోమోజోమ్‌ల లోపాల వల్ల అవుతాయని తలంచబడుతోంది. ఈ లోపాలు తల్లి లేదా తండ్రి యొక్క క్రోమోజోమ్‌లలోని లోపాల వల్ల ఏర్పడ్డవి కాదు.

తల్లి ఆరోగ్యం కూడా గర్భస్రావమవ్వడానికి కారణం కావచ్చు. హార్మోను సంబంధిత లోపాలు, వ్యాధి నిరోధక వ్యవస్థలోని లోపాలు, ఇన్ఫెక్షన్‌లు, తల్లి గర్భాశయ ద్వారములో గానీ గర్భాశయములో గానీ ఏర్పడే లోపాలు కారణాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధి (సరైన విధంగా అదుపు చేయకపోతే), అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక రోగాలు కూడా ఇందుకు కారణం కావచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాయామం చేయడం మూలంగానో బరువైన వస్తువులను ఎత్తడం మూలంగానో లైంగిక సంబంధాల మూలంగానో గర్భస్రావాలు కానవసరం లేదు. పడిపోవడం, చిన్న దెబ్బతగలడం, హఠాత్తుగా భయపడడం గర్భస్రావం అయ్యేలా చేస్తాయన్నది సరికాదు. ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా తెలియజేస్తోంది: “మీ సొంత ప్రాణానికి ముప్పు తెచ్చేటంతటి తీవ్రమైన గాయం కాకపోతే, సాధారణంగా అది పిండానికి కూడా హాని చేయదు.” గర్భాశయ నిర్మాణం సృష్టికర్త జ్ఞానవంతుడనీ, ప్రేమగలవాడనీ ఎంత చక్కని సాక్ష్యమిస్తోందో కదా!​—కీర్తన 139:13, 14.

[23వ పేజీలోని బాక్సు/చిత్రం]

కుటుంబం, స్నేహితులు ఎలా సహాయం చేయవచ్చు?

కుటుంబంలోని ఒక సభ్యురాలికి గానీ ఒక స్నేహితురాలికి గానీ గర్భస్రావమైనప్పుడు సరిగ్గా ఏమి చెప్పాలి, ఏమి చెయ్యాలి అనేవి తెలుసుకోవడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అలాంటి నష్టానికి ప్రజలు వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తారు, కాబట్టి ఓదార్పునూ సహాయాన్నీ అందించడానికి ఏ ఒక్క సూత్రమూ లేదు. అయితే ఈ క్రింది సూచనలను పరిశీలించండి. *

సహాయం చేయడానికి మీరు చేయగల ఆచరణాత్మకమైన పనులు:

మిగతా పిల్లలను చూసుకోవడానికి ముందుకెళ్ళండి.

ఆ కుటుంబం కోసం వంట చేసి తీసుకువెళ్లండి.

తండ్రికి కూడా తోడుగా ఉండండి. ఒక తండ్రి చెబుతున్నట్లుగా, “ఈ పరిస్థితిలో ఉండే తండ్రుల కోసం సాధారణంగా ఎక్కువ కార్డులను తయారుచేయరు.”

చెప్పడానికి సహాయకరమైన విషయాలు:

“మీకు గర్భస్రావమైందని విని చాలా బాధపడ్డాను.”

ఈ చిన్న చిన్న మాటలే ఎంతో ఓదార్పునిచ్చి, ఇంకా ఓదార్పుకరమైన మాటలు పలకడానికి మనకు అవకాశాన్నిస్తాయి.

“ఏడ్వడం తప్పేమీ కాదు.”

గర్భస్రావమైన మొదటి వారాల్లో లేదా నెలలు గడిచిపోయిన తర్వాత కూడా సాధారణంగా కన్నీళ్ళు ఉబికి వస్తూనే ఉంటాయి. తన భావాలను బయటపెట్టినందుకు మీరు ఆమెనేమీ తక్కువగా చూడరని ఆమెకు ధైర్యాన్నివ్వాలి.

“మీరెలా ఉన్నారో తెలుసుకోవడానికి నేను వచ్చేవారం మళ్ళీ ఫోన్‌ చెయ్యనా?”

బాధపడుతున్న వారికి మొదట్లో సానుభూతి అధికంగా చూపించబడుతుంది, కానీ సమయం గడుస్తుండగా, వాళ్ళు ఇంకా బాధను అనుభవిస్తున్నప్పటికీ, ఇతరులు తమను మరచిపోయారని వాళ్ళు భావించవచ్చు. మీరు ఇంకా మద్దతునిస్తున్నారని వాళ్ళు తెలుసుకోవడం మంచిది. అనేక వారాలపాటు లేదా నెలలపాటు మళ్ళీ మళ్ళీ బాధ కలుగుతూనే ఉంటుంది. మరోసారి గర్భం ధరించి బిడ్డను కన్న తర్వాత కూడా ఆ భావాలు కలగవచ్చు.

“నిజానికి ఏమి చెప్పాలో నాకు తెలియడం లేదు.”

ఏమీ చెప్పకుండా ఉండడం కంటే అలా చెప్పడం మంచిది. మీ యథార్థతా, మీరు అక్కడ ఉన్నారన్న వాస్తవమూ మీకున్న శ్రద్ధను చూపిస్తాయి.

చెప్పకూడనివి:

“మళ్ళీ మరో బిడ్డను కనవచ్చులే.”

అది నిజమే అయినప్పటికీ, అది తదనుభూతి లేకపోవడాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులు ఏదో ఒక బిడ్డ అయితే చాలు అనుకోలేదు, కానీ వాళ్ళు  బిడ్డనే కావాలనుకున్నారు. మరో బిడ్డను కనడం గురించి ఆలోచించడానికి ముందు, తాము పోగొట్టుకున్న బిడ్డ గురించి దుఃఖించడం అవసరమవ్వవచ్చు.

“బహుశా ఆ బిడ్డలో ఏదైనా లోపం ఉందేమో.”

వాస్తవం అదే అయినా, అది ఓదార్పునివ్వదు. తల్లి తన మనస్సులో, తాను ఆరోగ్యవంతమైన బిడ్డను గర్భంలో కలిగివున్నట్లే భావిస్తుంది.

“కనీసం మీకు ఆ బిడ్డతో నిజంగా పరిచయం లేదు. ఇంకాస్త సమయం గడిచిన తర్వాత జరిగివుంటే మరీ ఘోరంగా ఉండేది.”

చాలామంది స్త్రీలు తమ గర్భస్థ శిశువులతో చాలా ముందు నుండే అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. కాబట్టి, బిడ్డ చనిపోయినప్పుడు సాధారణంగా దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖం, బిడ్డ గురించి తల్లికి “తెలిసినంతగా” మరెవరికీ తెలియదనే వాస్తవాన్ని చూపిస్తుంది.

“కనీసం మీకు వేరే పిల్లలు ఉన్నారు.”

దుఃఖిస్తున్న తల్లిదండ్రులకు ఇలా చెప్పడం, ఒక కాలు పోగొట్టుకున్న వ్యక్తితో “కనీసం మీకు మరో కాలు ఉంది” అని చెప్పడంతో సమానమే.

అత్యంత శ్రద్ధగల, అత్యంత యథార్థవంతులైన ప్రజలు కూడా అప్పుడప్పుడూ తప్పుగా మాట్లాడతారని అంగీకరించవలసిందే. (యాకోబు 3:2) కాబట్టి మంచి ఉద్దేశంతోనే అయినా కలగాపులగంగా మాట్లాడే వారిపట్ల, గర్భస్రావమైన వివేచనగల స్త్రీలు క్రైస్తవ ప్రేమను చూపించి, మనస్సులో ఏ కోపమూ ఉంచుకోకూడదనుకుంటారు.​—కొలొస్సయులు 3:13.

[అధస్సూచి]

^ న్యూజీలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌లోని మిస్‌కారేజ్‌ సపోర్ట్‌ గ్రూప్‌ సిద్ధం చేసిన ఎ గైడ్‌ టు కోపింగ్‌ విత్‌ మిస్‌కారేజ్‌ నుండి తీసుకోబడ్డాయి.