కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిశుద్ధ పేతురు చేప

పరిశుద్ధ పేతురు చేప

పరిశుద్ధ పేతురు చేప

ఇజ్రాయిల్‌లో గలిలయ సముద్ర తీరాన్నున్న ఒక రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు, దాని మెనూలో “పరిశుద్ధ పేతురు చేప” (“St. Peter’s fish”) అని ఉండడం చూసి మీకు జిజ్ఞాస కలగవచ్చు. అందరూ, ప్రాముఖ్యంగా పర్యాటకులు ఎంతో ఇష్టపడే వంటకాల్లో ఇది ఒకటని వెయిటర్‌ మీకు చెబుతుండవచ్చు. దీన్ని తాజాగా వేపుడు చేసినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అయితే దీన్ని అపొస్తలుడైన పేతురుకు ఎందుకు ముడిపెట్టారు?

బైబిలులో మత్తయి 17:​24-27 వచనాల్లో వర్ణించబడిన ఒక సంఘటన ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది. గలిలయ సముద్ర తీరాన ఉన్న కపెర్నహూము పట్టణాన్ని సందర్శిస్తున్నప్పుడు, యేసు మందిరపు పన్ను కట్టాడా అని పేతురును అడిగినట్లు మనం అక్కడ చదువుతాము. తాను దేవుని కుమారుడు కాబట్టి అలాంటి పన్ను కట్టవలసిన బాధ్యత తనకు లేదని ఆ తర్వాత యేసు వివరించాడు. కానీ ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా ఉండడానికి, ఆయన పేతురును సముద్రానికి వెళ్ళి గాలము వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకొని, దాని నోట్లో దొరికే షెకెలును పన్నుగా కట్టమని చెప్పాడు.

బైబిలులో నమోదు చేయబడిన ఈ సంఘటన నుండి “పరిశుద్ధ పేతురు చేప” అనే పేరు తీసుకోబడింది. కానీ పేతురు ఏ చేపను పట్టుకున్నాడు?

చేపలు సమృద్ధిగా ఉన్న సముద్రం

గలిలయ సముద్రంలో దాదాపు 20 రకాల చేపలున్నాయి, వాటిలో కేవలం 10 రకాలు మాత్రమే పేతురు పట్టిన చేప అయ్యుండే అవకాశం ఉందని తలంచబడుతుంది. ఈ పది రకాల చేపలు వాణిజ్యపరంగా మూడు ముఖ్యమైన గుంపులుగా విభజించబడ్డాయి.

వీటిలో అతిపెద్ద గుంపు మష్ట్‌ అని పిలువబడుతుంది, అరబ్బీ భాషలో ఆ పేరుకు “దువ్వెన” అని అర్థం, ఈ గుంపులోని అయిదు రకాల చేపలకు దువ్వెనలాంటి రెక్క ఉంటుంది. మష్ట్‌లోని ఒక రకం చేప దాదాపు 45 సెంటీమీటర్ల పొడవు ఉండి దాదాపు రెండు కిలోల బరువు ఉంటుంది.

రెండవ గుంపు కిన్నెరెతు (గలిలయ సముద్రం) సార్డీన్‌ చేప, ఇది చిన్న హెరింగ్‌ చేపను పోలి ఉంటుంది. సార్డీన్‌ చేపల కాలంలో, ప్రతి రాత్రి ఎన్నో టన్నుల చేపల్ని పట్టుకుంటారు, ప్రతి సంవత్సరం దాదాపు వెయ్యి టన్నుల చేపలను పట్టుకుంటారు. ఈ సార్డీన్‌లను ఊరవేయడం ద్వారా భద్రపరచడం పూర్వకాలం నుండీ జరుగుతోంది.

మూడవ గుంపు బీనీ, దీన్ని బార్బెల్‌ అని కూడా పిలుస్తారు. ఈ గుంపులోని మూడు రకాల చేపలకు నోటి చివర్ల మీసాలు ఉంటాయి, కాబట్టి దాని సెమిటిక్‌ పేరు బీనీ, దానికి “జుట్టు” అని అర్థం. ఇది ఆల్చిప్పలను, నత్తలను, చిన్న చేపలను తింటుంది. పొడవాటి తలవున్న బార్బెల్‌ దాదాపు 75 సెంటీమీటర్ల పొడవు ఉండి, ఏడు కిలోలకు పైగా బరువుంటుంది. బార్బెల్‌ చేపల్లో మాంసం బాగా ఉంటుంది, ఈ చేప యూదామత సబ్బాతులలో, పండుగలలో పేరొందిన వంటకం.

ప్రాముఖ్యమైన ఈ మూడు వాణిజ్యపరమైన గుంపుల్లో చేర్చబడనిది క్యాట్‌ఫిష్‌. ఈ చేప గలిలయ సముద్రపు చేపలన్నింటిలోకెల్లా పెద్దది. ఇది 1.2 మీటర్ల వరకూ పొడవు ఉండి, దాదాపు 11 కిలోల బరువు ఉంటుంది. కానీ క్యాట్‌ఫిష్‌కి పొలుసు ఉండదు, కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం అది అపవిత్రమైనది. (లేవీయకాండము 11:​9-12) కాబట్టి దాన్ని యూదులు తినరు, పేతురు పట్టుకున్న చేప అది అయ్యుండకపోవచ్చు.

పేతురు ఏ చేపను పట్టుకున్నాడు?

మష్ట్‌ చేప సాధారణంగా “పరిశుద్ధ పేతురు చేప” అని అంగీకరించబడుతుంది, అది ఆ పేరుతోనే గలిలయ సముద్రం దగ్గరున్న రెస్టారెంట్‌లలో వడ్డించబడుతోంది. వేరే చేపలతో పోల్చి చూస్తే దీనికి చిన్న ముళ్ళు కొన్ని మాత్రమే ఉండడం వల్ల దీన్ని వండడం, తినడం చాలా సులభం. అయితే నిజానికి పేతురు పట్టుకున్న చేప ఇదేనా?

గలిలయ సముద్ర తీరాన 50 సంవత్సరాలకు పైగా జీవించిన జాలరి మెండల్‌ నూన్‌, స్థానిక చేపల గురించి బాగా తెలిసిన గౌరవనీయుడైన వ్యక్తి. ఆయన ఇలా అంటున్నాడు: “మష్ట్‌ కేవలం సూక్ష్మజీవులనే తింటుంది, వేరే ఆహారం దాన్ని ఆకర్షించదు. కాబట్టి దాన్ని గాలం వేసి కాకుండా వల వేసి మాత్రమే పట్టుకుంటారు.” అలాంటప్పుడు పేతురు పట్టిన చేప ఇది అయ్యుండకపోవచ్చు. పేతురు పట్టుకున్నది సార్డీన్‌ కూడా అయ్యుండకపోవచ్చు, ఎందుకంటే పరిశుద్ధ పేతురు చేపగా అర్హత పొందడానికి అది చాలా చాలా చిన్న చేప.

ఇక మిగిలిందల్లా బార్బెల్‌ మాత్రమే. “పరిశుద్ధ పేతురు చేప” అని పిలవబడడానికి దీన్నే కొందరు ఉత్తమమైన ఎంపికగా పరిగణిస్తారు. నూన్‌ ఇలా అంటున్నాడు: “(గలిలయ సముద్రపు) జాలరులు ఎన్నెన్నో సంవత్సరాలుగా, నీటిలోపల ఉన్న ఇతర చిన్న జీవులను చంపి తినే చేపలైన బార్బెల్‌లను పట్టుకోవడానికి సార్డీన్‌ చేపలను ఎరలుగా ఉపయోగిస్తున్నారు. పేతురు ఖచ్చితంగా బార్బెల్‌నే పట్టుకుని వుంటాడు” అని ఆయన నిర్ధారిస్తున్నాడు.

మరి “పరిశుద్ధ పేతురు చేప”గా మష్ట్‌ను ఎందుకు వడ్డిస్తారు? నూన్‌ ఇలా సమాధానమిస్తున్నాడు: “ఇలా పేరు మార్చి గందరగోళం సృష్టించడానికి ఒకే ఒక కారణం ఉండవచ్చు. అది టూరిజమ్‌కి లాభకరమైనది! . . . దూరప్రాంతాలనుండి యాత్రికులు రావడం మొదలుపెట్టినప్పుడు, పూర్వం చెరువు ప్రక్కన ఉన్న భోజనశాలల్లో అందించబడుతున్న మష్ట్‌కు “పరిశుద్ధ పేతురు చేప” అని పేరు పెట్టడం వ్యాపారం జోరుగా సాగడానికి కారణమవుతుందని నిస్సందేహంగా అనిపించి ఉండవచ్చు. అందరికీ ఇష్టమైన చేప, సులభంగా వండేందుకు వీలయ్యే చేప ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షించిన ఆ పేరును సంపాదించుకుంది!”

పేతురు ఏ చేపను పట్టుకున్నాడన్నది మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, మీకు “పరిశుద్ధ పేతురు చేప” అని ఏ చేప వడ్డించబడినప్పటికీ అది తప్పకుండా రుచిగానే ఉంటుంది. (g02 2/22)

[19వ పేజీలోని చిత్రం]

“మష్ట్‌”

[19వ పేజీలోని చిత్రం]

బార్బెల్‌

[19వ పేజీలోని చిత్రసౌజన్యం]

Garo Nalbandian