కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

పనుల్ని వాయిదా వేయడం, ఆరోగ్యం

“పనుల్ని వాయిదా వేయడం మీ ఆరోగ్యాన్ని పాడుచేయగలదు” అని వాంకోవర్‌ సన్‌ అనే వార్తాపత్రికలో ప్రస్తావించబడిన అధ్యయనం చెబుతోంది. కెనడాలోని టొరొంటోలోని అమెరికన్‌ సైకలాజికల్‌ సొసైటీ ఇటీవల జరిపిన సమావేశంలో సమర్పించబడినట్లుగా, కెనడా యూనివర్సిటీకి చెందిన 200 మంది విద్యార్థులపై చేయబడిన అధ్యయనం, “పనుల్ని వాయిదా వేసేవారు చర్య తీసుకోవడానికి ఆలస్యం చేయడం ద్వారా తమకు తాము ఎక్కువ ఒత్తిడిని కలుగజేసుకుంటారని, ఇతరులకన్నా వీరు ఒత్తిడి సంబంధిత రుగ్మతలను ఎక్కువగా అనుభవిస్తారని కనుగొన్నది. . . . వాయిదా వేసేవారికి, పరీక్ష తేదీ దగ్గరపడుతుండగా ఒత్తిడి పెరిగిపోయింది. చీకూచింతా లేని వారి వైఖరి స్థానంలో విపరీతమైన తలనొప్పి, నడుము నొప్పి, జలుబు, నిద్రకు సంబంధించిన సమస్యలు, ఎలర్జీలు ప్రారంభమయ్యాయి. వాళ్ళు శ్వాస సంబంధ సమస్యలతోనూ ఇన్‌ఫెక్షన్‌లతోనూ మైగ్రేన్‌ తలనొప్పులతోనూ ఎక్కువగా బాధపడ్డారు.” (g02 4/8)

ఆర్కిటిక్‌ హెచ్చరిక

“భూగ్రహంలోని సున్నితమైన ఆర్కిటిక్‌లోని దాదాపు 80 శాతం ప్రాంతంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి గనుక తగ్గకపోతే, ఈ శతాబ్ద మధ్యకాలానికల్లా ఆ ప్రాంతం పూర్తిగా నాశనమవుతుంది” అని కెనడాకు చెందిన ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ వార్తాపత్రిక పేర్కొంటోంది. మానవులు సాధిస్తున్న అభివృద్ధి ఆర్కిటిక్‌ ప్రాంతమంతటిపై చూపిస్తున్న ప్రభావం అంతకంతకూ అధికమవుతుంది, దీని గురించి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం వ్యాఖ్యానిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, 1940 నుండి 1990 వరకు జరిగినట్లు అదే స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధి కొనసాగితే ఫలితాలు నాశనకరంగా ఉంటాయి. ఆర్కిటిక్‌ ప్రాంతంలోని అనేక జంతువులు వలసవెళ్ళే జంతువులు గనుక, ఈ నాశనం ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే సాధ్యత ఉంది. “ఇప్పటికే ఆర్కిటిక్‌ ప్రాంతంలోని 10 శాతం నుండి 15 శాతం వరకున్న ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి మూలంగా తీవ్రంగా ప్రభావితమైంది” అని ఆ పత్రిక చెబుతోంది. (g02 3/22)

‘మతం అంత ప్రాముఖ్యమైనది కాదు’

బ్రెజిల్‌లోని నగరాల్లో నివసిస్తున్న నిరుపేదలైన వయోజనులపై ఇటీవల జరిపిన సర్వే, వారిలో 67 శాతం మంది తాము క్యాథలిక్‌లమని చెప్పుకుంటున్నప్పటికీ, యేసు, మరియ, చర్చి సిద్ధాంతాలపై వాస్తవంగా నమ్మకం ఉన్నట్లు చెప్పుకుంటున్నవారు కేవలం 35 శాతం మంది మాత్రమేనని వెల్లడి చేసింది. ఇంకా తక్కువమంది అంటే కేవలం 30 శాతం మంది ప్రతివారం చర్చిలో జరిగే ఆరాధనలకు హాజరవుతున్నారు. వివాహానికి ముందు లైంగిక సంబంధాలు (44 శాతం మంది), విడాకులు (59 శాతం మంది), పునర్వివాహం (63 శాతం మంది), గర్భనిరోధకాల ఉపయోగం (73 శాతం మంది) వంటివాటిని గురించిన చర్చి బోధలతో అనేకులు (బ్రాకెట్లలో ఇవ్వబడిన శాతం మంది) ఏకీభవించడం లేదని కూడా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ బ్రెజీలియన్‌ బిషప్స్‌ ఆదేశానుసారం జరిగిన సర్వే తెలియజేస్తోంది. దైవశాస్త్ర పండితుడైన సెవెరీనో వీసేంట అభిప్రాయం ప్రకారం, ప్రీస్టుల కొరత మూలంగానూ బ్రెజిల్‌ విద్యా వ్యవస్థపై తరిగిపోతున్న దాని ప్రభావం మూలంగానూ సిద్ధాంతాల నామకార్థ బోధ మూలంగానూ చర్చి తన పట్టును కోల్పోతోంది. ఆయనిలా పేర్కొంటున్నాడు: “క్యాథలిక్‌ల క్రొత్త తరానికి నైతిక విలువలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వర్తిస్తాయని బోధించబడుతోంది, ఈ తరం మతాన్ని అంత ప్రాముఖ్యమైన విషయంగా పరిగణించడం లేదు.” (g02 3/8)

కునుకు శక్తి

మధ్యాహ్నం కలిగే నిద్రమత్తుకు చక్కని చికిత్స “పది నిమిషాలు కునుకు తీయడమే” అని బ్రిటీష్‌ దేశస్థుడు, లాబరో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, నిద్రకు సంబంధించి నిపుణుడిగా పనిచేస్తున్న జిమ్‌ హార్న్‌ అభిప్రాయపడ్డాడని లండన్‌కు చెందిన ద టైమ్స్‌ నివేదిస్తోంది. హార్న్‌ ఇలా నొక్కి చెబుతున్నాడు: “మిగతా అన్ని చికిత్సల్లాంటిదే కునుకు తీయడం కూడా: బాధ కలుగుతున్నప్పుడు ఎంత త్వరగా చికిత్స పొందితే, అంత ప్రభావవంతంగా ఉంటుంది.” అమెరికాలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగస్థుల కోసం పరుపులు, రగ్గులు, దిండ్లు, ఆహ్లాదకరమైన శబ్దాలు వంటివాటితో పాటు, ప్రతి 20 నిమిషాలకు అలారమ్‌ మ్రోగించే గడియారాలు ఉన్న గదులను ఏర్పాటు చేశాయి. కానీ మీరు ఎక్కువ సేపు నిద్రపోతే​—⁠25 నిమిషాలు నిద్రపోయారనుకుందాం​—⁠మేల్కొనేటప్పటికి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ప్రొఫెసర్‌ హార్న్‌ హెచ్చరిస్తున్నాడు. “నిద్రపోవడానికి, శరీరానికి పది నిమిషాలకన్నా ఎక్కువ సమయం దొరికితే అది రాత్రి సమయమనుకోవడం మొదలుపెడుతుంది, ఇక గాఢమైన నిద్రా ప్రక్రియ ప్రారంభమవుతుంది.” (g02 3/8)

చేపలను తినాలని పురుషులు ప్రోత్సహించబడుతున్నారు

చేపలను అరుదుగా తినే పురుషులకన్నా సాలమన్‌, హెర్రింగ్‌, మాకెరల్‌ వంటి క్రొవ్వుగల చేపలను ఎక్కువగా తినే పురుషులకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం రెండు నుండి మూడు రెట్లు తక్కువగా ఉంటుందని స్టాక్‌హోమ్‌లోని కారోలినిస్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 6,272 మంది పురుషులపై 30 ఏళ్ళ పాటు జరిపిన అధ్యయనం, పొగత్రాగడం వంటి ప్రమాదకారకాలను కూడా పరిగణలోకి తీసుకుంది. “[ప్రాముఖ్యంగా నూనెగల చేపలలో ఉండే] ఒమెగా-3 అని పిలువబడుతున్న క్రొవ్వు ఆమ్లాలు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తాయని స్పష్టమవుతోంది.” ఈ క్రొవ్వు ఆమ్లాలు “గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి” అని ఆ నివేదిక చెబుతోంది. కాబట్టి, “వారానికి ఒకటి లేదా రెండుసార్లు” చేపల్ని తినమని నిపుణులు ప్రజలకు సలహా ఇస్తున్నారు. (g02 4/8)

ఉపయోగంలో పెట్టబడిన కలుపుమొక్కలు

“ఐకోర్నియా, లాంటానా, పార్థీనియమ్‌ వంటి కలుపు మొక్కలకున్న మొండి గుణం నగరనిర్మాణకులను చికాకు పెడుతోంది” అని ఇండియా టుడే చెబుతోంది. కంచెలా ఉపయోగించడానికి 1941లో ఆంగ్లేయులు భారతదేశానికి తీసుకువచ్చిన లాంటానా కామారా 2,00,000 ఎకరాల కంటే ఎక్కువ భూమిని ఆక్రమించింది, దాన్ని చేతులతోనైనా రసాయనికంగానైనా జీవశాస్త్రపరంగానైనా నిర్మూలించడం దాదాపు అసాధ్యమని నిరూపించబడింది. ఈ కలుపు మొక్కకున్న విషపూరిత ప్రభావాలు ఇతర మొక్కల పెరుగుదలను నిరోధిస్తాయి, ఈ మొక్కలు స్థలాన్ని ఆక్రమించాయంటే మొత్తం గ్రామాలనే మరో స్థలానికి మార్చవలసి ఉంటుంది. అయితే, లచ్చీవాల గ్రామస్థులకు మాత్రం ఈ కలుపు మొక్క ఆర్థికంగా చాలా విలువైనదిగా నిరూపించబడింది. ఇళ్ళను, కోళ్ళగూడులను నిర్మించుకోవడానికి లాంటానా మొక్కను మట్టితో కలిపి ఉపయోగిస్తారు. కీటకాలను, క్రిములను ఎదిరించి నిలిచే ఈ కలుపు మొక్క వెలుపలి బెరడును తొలగిస్తే కలప సంబంధిత వస్తువులను చేయడానికి, బుట్టలను నేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దోమల నాశకాలను, అగరు బత్తులను తయారు చేయడానికి లాంటానా ఆకులను ఉపయోగిస్తారు. ఈ మొక్కల వేర్లను పొడిచేసి దంతక్షయ నివారణకు ఉపయోగిస్తారు. (g02 4/22)

అత్యంత ఖచ్చితమైన గడియారం

అమెరికాకు చెందిన ఒక శాస్త్రజ్ఞుల బృందం, “సమయానికి సంబంధించి విజ్ఞాన శాస్త్రంలో సాధారణంగా ఉపయోగించే అత్యంత స్వల్ప ప్రమాణమైన ఒక ఫెమ్టోసెకండ్‌ను ఖచ్చితంగా తెలియజేసే పాదరసం-అయాన్‌ గడియారాన్ని” రూపొందించిందని లండన్‌కు చెందిన ద టైమ్స్‌ నివేదిస్తుంది. ఇది “ప్రపంచవ్యాప్తంగా సమయానికి ప్రమాణం అయిన కో-ఆర్డినేటెడ్‌ యూనివర్సల్‌ టైమ్‌ (యు.టి.సి.) కోసం ఉపయోగించబడే పరమాణు గడియారాల కన్నా దాదాపు 1,000 రెట్లు ఎక్కువ ఖచ్చితమైనదిగా ఉన్నట్లు” చెప్పబడుతోంది. పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్త స్కాట్‌ డిడమ్స్‌ ఇలా వివరిస్తున్నాడు: “విశ్వాన్ని గురించి మరింత క్షుణ్ణమైన అవగాహనను పొందడానికి ప్రాథమిక భౌతికశాస్త్రంలో ఇది వెంటనే ఉపయోగపడగలదు.” కొంతకాలానికి టెలిఫోన్‌ నెట్‌వర్క్‌లు, నావిగేషన్‌ శాటిలైట్‌లు కూడా ప్రయోజనం పొందుతాయి. సమయాన్ని చూపించే ఈ పరికరం “ప్రపంచంలోకెల్లా అత్యంత ఖచ్చితమైన గడియారం” అని డిడమ్స్‌ అంటున్నప్పటికీ, దాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని కూడా ఆయన అంటున్నాడు. (g02 4/22)

యువత డైటింగ్‌

ఇటీవల 12 నుండి 18 ఏళ్ళ వయస్సుగల కెనడాకు చెందిన 1,739 మంది అమ్మాయిలపై జరిపిన సర్వే, 27 శాతం మందిలో భోజనం చేసే విషయంలో అవకతవకలకు సంబంధించిన రోగలక్షణాలు ఉన్నట్లు వెల్లడి చేసిందని గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ అనే వార్తాపత్రిక చెబుతోంది. ఈ సర్వేలో నగరాల్లోను పట్టణాల్లోను గ్రామాల్లోను నివసిస్తున్న అమ్మాయిలు పాల్గొన్నారు. తినడానికి సంబంధించిన వైఖరిని, శరీరాకృతిని గురించిన అసంతృప్తిని పరిశీలించే ఒక ప్రశ్నాపత్రాన్ని వారు పూర్తి చేశారు. బరువు తగ్గడానికి పన్నెండేళ్ళ లేతప్రాయంలోని అమ్మాయిలు కూడా అతిగా తిని ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుంటున్నారనీ డైట్‌ పిల్స్‌, లాక్సేటివ్స్‌, డ్యూరెటిక్స్‌ వంటివాటిని ఉపయోగిస్తున్నారనీ అందులోని డేటా వెల్లడి చేసింది. టొరొంటో యూనివర్సిటీ హెల్త్‌ నెట్‌వర్క్‌కు చెందిన పరిశోధక శాస్త్రవేత్త అయిన జెన్నిఫర్‌ జోన్స్‌ అభిప్రాయం ప్రకారం, ప్రాముఖ్యంగా అమ్మాయిలు “ఆహార వ్యాయామాల పట్ల సరైన దృక్పథాలను ఏర్పరచుకోవలసిన అవసరం ఉంది. వారు తమ శరీరం గురించీ, తాము వ్యాపార ప్రకటనా బోర్డులపైనా పత్రికల్లోనూ రాక్‌ వీడియోల్లోనూ చూసే శరీరాలు సహజమైనవి కావనీ తెలుసుకోవలసిన అవసరం ఉంది.” గ్లోబ్‌ ఇంకా ఇలా జతచేస్తోంది, “యుక్తవయస్సులో క్రొవ్వు పదార్థాలు పెరగడం సర్వసాధారణమనీ సహజమైన పెరుగుదలకు అది ఆవశ్యకమనీ చాలామంది యువతులకు తెలియదు.” (g02 4/22)

దోమల ఉచ్చు

క్రిమిసంహారకాలను ఉపయోగించకుండానే దోమలను నాశనం చేయడానికి సింగపూర్‌లోని ఒక కంపెనీ ఒక పరికరాన్ని ఉత్పత్తి చేస్తోంది. అది 38 సెంటీ మీటర్ల ఎత్తుగల నల్లని ప్లాస్టిక్‌ డబ్బా, ఇది “దాదాపు మానవ శరీరంలాగే ఉష్ణోగ్రతను, కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను ఉత్పన్నం చేస్తుంది” అని లండన్‌కు చెందిన ది ఎకానమిస్ట్‌ నివేదిస్తోంది. శరీర ఉష్ణోగ్రతను, శ్వాస నుండి వెలువడే కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను పసిగట్టి దానివైపుకు వెళ్ళడం ద్వారా దోమలు తమ ఎరను కనుగొంటాయి, కాబట్టి ఈ పరికరం “దోమలు తమకు విందు దొరకబోతోందని తలంచేలా వాటిని మోసగిస్తుంది.” ఈ డబ్బాను విద్యుచ్ఛక్తితో వేడి చేస్తారు, అది ఒక చిన్న కార్టిరిడ్జ్‌ ద్వారా కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. జిగేల్‌ జిగేల్‌మంటున్న కాంతి దోమను ఆ డబ్బాకున్న రంధ్రంలోకి ఆకర్షిస్తుంది. తర్వాత ఒక ఫ్యాను, క్రిందవున్న నీటిలోకి దాన్ని నెట్టుతుంది, అక్కడది మునిగిపోతుంది. ఈ పరికరం ఒక్క రాత్రిలో 1,200 దోమలను పట్టుకోగలదు, మలేరియాకు కారణమయ్యే రాత్రిపూట సంచరించే ఎనాఫిలిస్‌ దోమలను, పచ్చజ్వరానికీ డెంగ్యూ జ్వరానికీ కారణమయ్యే పగటిపూట సంచరించే ఏడస్‌ దోమలను అరికట్టడానికి ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరికరం వల్ల మరో ప్రయోజనమేమిటంటే అది సీతాకోక చిలుకల వంటి నిరపాయకరమైన కీటకాలను నాశనం చేయదు. (g02 4/8)

బియ్యపు ఊక చెట్లను కాపాడుతుంది

ఉత్తర పెరూలోని ఇటుకల ఫ్యాక్టరీలలో ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించబడుతున్న బియ్యపు ఊక, వంట చెరకు కోసం కారోబ్‌ చెట్లు నరికివేయబడకుండా, అవి అంతరించిపోకుండా సహాయపడుతుందని పెరూ వార్తాపత్రిక ఎల్‌ కొమెరికో నివేదిస్తోంది. 21 మంది ఇటుకల తయారీదారులు వ్యవసాయ వ్యర్థ పదార్థమైన బియ్యపు ఊకను ఉపయోగించినప్పుడు, కార్బన్‌-డై-ఆక్సైడ్‌ తక్కువగా వెలువడింది. అంతేగాక, ఇటుకల బట్టీ గోడలకు ఇసుక, బంకమట్టి, బెల్లం పాకంల మిశ్రమంతో తాపడం చేయడం వల్ల ఇటుకల బట్టీల సామర్థ్యం 15 శాతం అధికమైంది, ఈ మిశ్రమం ఇన్సులేషన్‌ను మెరుగుపరచి, తద్వారా వేడి నష్టమవ్వడాన్ని తగ్గిస్తుంది. ఇటుకల పటుత్వాన్ని పెంచడానికి బియ్యపు ఊక బూడిదను ఇటుకల తయారీలో ఉపయోగించడం గురించి కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. “బియ్యపు ఊకను ఇలా ఉపయోగించడం కాలుష్యాన్ని, వ్యర్థపదార్ధాల నిల్వల సమస్యల్ని కూడా తగ్గిస్తుంది” అని ఎల్‌ కొమెరికో చెబుతోంది. (g02 4/8)