కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూకంపం యొక్క విశ్లేషణ

భూకంపం యొక్క విశ్లేషణ

భూకంపం యొక్క విశ్లేషణ

“స్థిరంగా ఉన్న ఈ భూమిపై నివసించడానికి మనం ఎంతగా అలవాటుపడిపోయామంటే, అది కంపించిందంటే ఇక మనస్సు అల్లకల్లోలమైపోతుంది.”—“ద వయొలెంట్‌ ఎర్త్‌.”

“ప్రకృతిలోని అత్యంత వినాశకరమైన, అత్యంత బలమైన శక్తులు భూకంపాలు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా పేర్కొంటోంది. ఈ వ్యాఖ్యానం అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఒక తీవ్ర భూకంపం కలిగినప్పుడు వెలువడే శక్తి తొలి ఆటంబాంబు వల్ల ఉత్పన్నమైనదాని కన్నా 10,000 రెట్లు ఎక్కువ ఉండగలదు! దీనికి తోడు మరింత భీతిగొల్పే వాస్తవమేమిటంటే, భూకంపాలు ఏ వాతావరణంలోనైనా, ఏ కాలంలోనైనా, రోజులోని ఏ సమయంలోనైనా సంభవించగలవు. శక్తివంతమైన ప్రకంపనలు ఎక్కడ సంభవించగలవనే దాని గురించి శాస్త్రజ్ఞులకు కొంత అవగాహన ఉన్నప్పటికీ, అవి ఎప్పుడు సంభవిస్తాయనేది మాత్రం వారు నిర్దిష్టంగా చెప్పలేరు.

భూ ఉపరితలం క్రింద ఉన్న రాతి పొరలు స్థానభ్రంశం చెందడం మూలంగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ విధమైన ప్రక్రియ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దాని మూలంగా కలిగే ప్రకంపనలు తరచూ భూ ఉపరితలంపై మనం గ్రహించగలిగేంత శక్తివంతంగా ఉండవు కానీ వాటిని భూకంపలేఖిని ద్వారా పసిగట్టవచ్చు, నమోదు చేయవచ్చు. * మరితర సమయాల్లో, భూ ఉపరితలం విపరీతంగా కంపించిపోయేంతగా శిలలు పగిలిపోయి స్థానభ్రంశం చెందుతాయి.

భూమి పొరల్లో కదలికలు ఎందుకు ఏర్పడుతూ ఉంటాయి? “దీనికి సంబంధించిన వివరణను ప్లేట్‌ టెక్టానిక్స్‌లో కనుగొనవచ్చు, ఇది భూవిజ్ఞానానికి సంబంధించిన ఆలోచనను పూర్తిగా మార్చివేసిన ఒక సిద్ధాంతం” అని జాతీయ భూకంప సమాచార కేంద్రం (ఎన్‌.ఇ.ఐ.సి) చెబుతోంది. “భూ ఉపరితలంలో ఏడు ప్రధాన పలకలున్నాయనీ, అవి అనేక చిన్న చిన్న పలకలుగా విభజించబడి ఉన్నాయనీ ఇప్పుడు మనకు తెలుసు. అవన్నీ ఒకదానితో ఒకటి పొందికగా కదులుతూనే ఉంటాయి, ఇవి సంవత్సరానికి 10 నుండి 130 మిల్లీమీటర్ల [ఒక అంగుళంలోని ఎనిమిదింట మూడొంతుల నుండి ఐదు అంగుళాల వరకు] వేగంతో వివిధ గతులలో కదులుతుంటాయి” అని ఎన్‌.ఇ.ఐ.సి జతచేస్తోంది. భూకంపాలు ఎక్కువగా, ఈ పలకల సరిహద్దుల్లో సన్నని బెల్టులాంటి భూభాగంలోనే సంభవిస్తుంటాయని ఎన్‌.ఇ.ఐ.సి చెబుతోంది. పెద్ద భూకంపాల్లో 90 శాతం ఈ ప్రాంతాల్లోనే సంభవించే అవకాశం ఉంది.

విస్తీర్ణత, తీవ్రత

భూకంపం ఎంత పెద్దదనేది, దాని విస్తీర్ణతను బట్టి గానీ దాని తీవ్రతను బట్టి గానీ కొలవవచ్చు. భూకంపాల విస్తీర్ణతను కొలవడానికి, 1930లలో చార్లెస్‌ రిక్టర్‌ ఒక స్కేలును రూపొందించాడు. భూకంపలేఖిని కేంద్రాల సంఖ్య పెరుగుతుండగా, రిక్టర్‌ ఆలోచన ఆధారంగా క్రొత్త స్కేళ్లు రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, మొమెంట్‌ మాగ్నిట్యూడ్‌ స్కేలు అని పిలువబడేది, కంపనాలు ప్రారంభమైన చోట వెలువడే శక్తిని కొలుస్తుంది.

అయితే ఈ స్కేళ్లు, భూకంపం మూలంగా ఎంతమేరకు నష్టం జరిగిందనే దాన్ని అన్ని వేళలా వెల్లడి చేయవు. ఉత్తర బొలీవియాలో 1994 జూన్‌లో సంభవించిన భూకంపాన్ని పరిశీలించండి, దాని విస్తీర్ణత 8.2 అయినప్పుడు దాని మూలంగా కేవలం ఐదుమంది మాత్రమే మరణించినట్లు నివేదించబడింది. కానీ చైనాలోని టాంగ్‌షాన్‌లో 1976లో వచ్చిన భూకంప విస్తీర్ణత అంతకన్నా తక్కువే​—⁠8.0​—⁠అయితే దాని వల్ల వందల వేలమంది చనిపోయారు!

విస్తీర్ణతకు భిన్నంగా తీవ్రత, ప్రజలపై కట్టడాలపై పర్యావరణంపై భూకంపం చూపించే ప్రభావాలను తెలియజేస్తుంది. ఇది ఎక్కువగా, భూకంపం మానవులపై ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందనేది తెలియజేసేందుకు స్పష్టమైన కొలమానంగా పనిచేస్తుంది. ఎంతైనా, ప్రకంపనాలు వాటంతటవే ప్రజలకు సాధారణంగా హానిచేయవు. కానీ, కూలిపోయే గోడలు, పడిపోయే వస్తువులు, గ్యాసు పైపులు పగిలిపోవడం లేదా కరెంటు తీగలు తెగిపోవడం, తదితరమైనవి గాయాలకు, మరణాలకు ఎక్కువగా కారణమవుతాయి.

భూకంపాలు సంభవించబోతున్నట్లు ముందుగానే హెచ్చరికలను ఇవ్వగలగాలి అన్నది సీస్మాలజిస్టుల (భూకంప విజ్ఞాన శాస్త్రవేత్తల) లక్ష్యం. అందుకుగాను, అడ్వాన్స్‌డ్‌ సీస్మెక్‌ రీసెర్చ్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ అనే డిజిటల్‌ ప్రోగ్రామ్‌ రూపొందించబడుతోంది. ఇదీ దీనితోపాటూ ఈ ప్రోగ్రామ్‌లోని సమాచారాన్ని వివిధ ప్రాంతాల్లోనివారు త్వరగా తెలుసుకోగల అవకాశమూ అత్యధిక శక్తిగల మరిన్ని సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌లూ “భూకంపం వల్ల అత్యంత తీవ్రమైన ప్రకంపన సరిగ్గా ఎక్కడ సంభవించిందనేది దాదాపు తక్షణమే తెలుసుకోవడానికి” అధికారులకు సహాయం చేస్తాయని సి.ఎన్‌.ఎన్‌. ఇచ్చిన ఒక నివేదిక చెబుతోంది. ఇవి, భూకంపానికి ప్రభావితమైన ప్రాంతాలకు సహాయాన్ని వెంటనే పంపగలిగేలా అధికారులకు సహాయపడతాయి.

భూకంపం కోసం సిద్ధపడి ఉండడం గాయాలవ్వడాన్ని తగ్గిస్తుంది, ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా చూస్తుంది, మరి ప్రాముఖ్యంగా ప్రాణాలను కాపాడుతుంది అని స్పష్టమవుతోంది. అయినప్పటికీ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్న తలెత్తుతుంది: భూకంపం తర్వాతి పరిణామాలను తట్టుకోవడానికి ప్రజలకు సహాయం ఎలా అందజేయబడింది? (g02 3/22)

[అధస్సూచి]

^ భూకంపలేఖిని అంటే భూకంపం వచ్చినప్పుడు నేల కదలికలను కొలిచి, వాటిని నమోదు చేసే పరికరం. మొట్టమొదటి భూకంపలేఖిని 1890లో రూపొందించబడింది. నేడు ప్రపంచవ్యాప్తంగా 4,000 కన్నా ఎక్కువ భూకంపలేఖిని కేంద్రాలు నిర్వహణలో ఉన్నాయి.

[5వ పేజీలోని చార్టు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

భూకంపాలు ఎన్ని రకాలు?

రకం విస్తీర్ణత వార్షిక సగటు

తీవ్ర భూకంపం 8 ఇంకా ఎక్కువ 1

పెను భూకంపం 7-7.9 18

భారీ భూకంపం 6-6.9 120

ఓ మోస్తరు భూకంపం 5-5.9 800

చిన్న భూకంపం 4-4.9 6,200*

అల్ప భూకంపం 3-3.9 49,000*

అత్యల్ప భూకంపం <3.0 విస్తీర్ణత 2-3:

దాదాపు రోజుకు 1,000

విస్తీర్ణత 1-2:

దాదాపు రోజుకు 8,000

*అంచనా వేయబడింది.

[చిత్రసౌజన్యం]

మూలం: జాతీయ భూకంప సమాచార కేంద్రం By permission of USGS/National Earthquake Information Center, USA

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

4, 5 పేజీలలో భూకంపలేఖిని రీడింగ్‌: Figure courtesy of the Berkeley Seismological Laboratory