కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూకంపాలు, బైబిలు ప్రవచనం, మీరు

భూకంపాలు, బైబిలు ప్రవచనం, మీరు

భూకంపాలు, బైబిలు ప్రవచనం, మీరు

ఈలోకం “యుగసమాప్తి”లోకి ప్రవేశించిందనడానికి నిదర్శనాన్నిచ్చే సంఘటనల గురించి, పరిస్థితుల గురించి యేసు తన మరణానికి ముందు ప్రవచించాడు. తెగుళ్ళు, కరవులు, మహా యుద్ధాలు ఆ కాలానికి గుర్తుగా ఉంటాయని ఆయన అన్నాడు. “అక్కడక్కడ” సంభవించే “గొప్ప భూకంపముల” గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. (మత్తయి 24:3, 8; లూకా 21:10, 11) యేసు మన దినాలను ఉద్దేశించే మాట్లాడాడా?

కాదని చాలామంది అంటారు. ఇటీవలి దశాబ్దాల్లో భూకంపాల సంఖ్య చెప్పుకోదగినంతగా ఏమీ పెరగలేదని వారు నొక్కి చెప్తారు. వాస్తవానికి, అమెరికాలోని జాతీయ భూకంప సమాచార కేంద్రం, 7.0 లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణత గల భూకంపాలు 20వ శతాబ్దమంతటిలోనూ “దాదాపు ఎడతెరిపి లేకుండా” సంభవించాయని నివేదిస్తోంది. *

అయితే, యేసు ప్రవచనం నెరవేరడానికి భూకంపాల సంఖ్యలో గానీ శక్తిలో గానీ పెరుగుదల ఉండవలసిన అవసరం లేదని గమనించండి. యేసు చెప్పిందేమిటంటే, ఒక స్థలం తర్వాత మరో స్థలంలో భూకంపాలు సంభవిస్తాయి. అంతేగాక, ఈ సంఘటనలు “వేదనలకు ప్రారంభము”ను సూచిస్తాయని ఆయన అన్నాడు. (మత్తయి 24:8) వేదన అనేది, భూకంపాల సంఖ్యతో లేదా రిక్టర్‌ స్కేలుపై కనిపించే ప్రమాణంతో కాదుగానీ భూకంపాలు ప్రజలపై చూపించే ప్రభావంతో కొలవబడుతుంది.

భూకంపాలు నిజంగానే మన కాలంలో చాలా వేదనను కలిగించాయి. వాస్తవానికి, 20వ శతాబ్దంలో ఈ విపత్తుల మూలంగా లక్షలాదిమంది మరణించారు లేదా నిరాశ్రయులయ్యారు. ఈ మరణాల్లో అనేకం నివారించడం, సాధ్యమయ్యేదేనని నిపుణులు అంటున్నారు. “వర్ధమాన దేశాల్లో, విస్తరిస్తున్న నగరాల అవసరాలను తీర్చడానికి తక్కువ ఖర్చుతో త్వరగా నిర్మించబడే ఇళ్ళకున్న డిమాండే, భవన నిర్మాణ నియమాల కన్నా అగ్రస్థానాన్ని తీసుకుంటోంది” అని బిబిసి న్యూస్‌ నివేదిస్తోంది. ఇటీవల సంభవించిన రెండు దుర్ఘటనల గురించి వ్యాఖ్యానిస్తూ, నగరాల్లో జరిగే విపత్తులకు సంబంధించిన నిపుణుడైన బెన్‌ విస్నర్‌ ఇలా అంటున్నాడు: “ఈ ప్రజల మరణానికి కారణం భూకంపాలు కాదు. మానవ పొరపాటు, ఉదాసీనత, అవినీతి, దురాశల సమ్మేళనమే.”

అవును, కొన్నిసార్లు భూకంపం సంభవించినప్పుడు ఎక్కువ మరణాలకు దారితీసేవి మానవుల స్వార్థము, నిర్లక్ష్యమే. ఆసక్తికరంగా, ఈ లక్షణాలు ఈ విధానపు “అంత్య దినాలను” గురించి తెలియజేస్తున్న బైబిల్లోని మరో ప్రవచనంలో నొక్కిచెప్పబడ్డాయి. అప్పుడు, ప్రజలు “స్వార్థపరులు, డబ్బు ప్రియులు” మరియు “కఠిన హృదయులు” అయ్యుంటారని బైబిలు చెబుతోంది. (2 తిమోతి 3:1-5, ది ఆంప్లిఫైడ్‌ బైబిల్‌) ఈ విధానాంతాన్ని గురించి యేసు చెప్పినవాటితోపాటు ఈ ప్రవచనం, గొప్ప భూకంపాలతో సహా ప్రస్తుతం ఉన్న బాధా వేదనలకు కారణమైన వాటన్నిటి నుండి మానవజాతికి దేవుడు ఉపశమనం తీసుకువచ్చే సమయం సమీపిస్తోందనడానికి స్పష్టమైన నిదర్శనాన్ని ఇస్తుంది.​—కీర్తన 37:11.

బైబిలు ఆధారిత ఈ నిరీక్షణను గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులను సంప్రదించండి లేదా 5వ పేజీలోని సముచితమైన చిరునామాకు వ్రాయండి. (g02 3/22)

[అధస్సూచి]

^ భూకంపాల సంఖ్యలో పెరుగుదలను గురించిన ఏ నివేదికలకైనా కారణం, కేవలం భూకంపాలను మరింత ఎక్కువగా పసిగట్టడానికి దోహదపడే సాంకేతికతలో అభివృద్ధి మాత్రమేనని కొందరు అంటారు.