వన్యప్రాణులపై నిఘా
వన్యప్రాణులపై నిఘా
మీరు చేసే ప్రతీ పనిని కనిపెట్టడానికి, విశ్లేషించడానికి వీలుగా మీ వీపుకి చిన్న సైజు రేడియో ట్రాన్స్‌మీటర్ తగిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. మిస్సెస్ గిబ్సన్ అని పేరు పెట్టబడిన, తిరుగుతూ ఉండే ఆల్బట్రోస్ పక్షి అలాంటి జీవితాన్నే గడుపుతోంది. పరిశోధకులు ఉపగ్రహాలను ఉపయోగించి ఆ పక్షిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండడానికి, దానికున్న సూక్ష్మమైన ట్రాన్స్‌మీటర్ సహాయపడుతుంది. ఉపగ్రహాలు, ఆ పక్షి సందేశాలను—ఇలాంటి పరికరాలుగల ఇతర పక్షుల సందేశాలను—సేకరించి భూమికి పంపిస్తాయి. అలా లభించిన సమాచారం ఈ అద్భుతమైన పక్షుల గురించి ఆశ్చర్యకరమైన క్రొత్త వివరాలను అందించింది. ఈ వివరాలు ఈ పక్షులను కాపాడడానికి సహాయపడతాయని ఆశించబడుతుంది.
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న లా ట్రోబ్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన ఒక నివేదిక, తిరుగుతూ ఉండే ఆల్బట్రోస్ రోజుకు సగటున 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని, కొన్ని సందర్భాల్లో ఒక్కోరోజు 1,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని పరిశోధకులు కనుగొన్నారని తెలియజేస్తోంది. జీవించి ఉన్న పక్షుల్లో కెల్లా అతిపెద్ద రెక్కలవిస్తారం గల అంటే 340 సెంటీమీటర్ల రెక్కలవిస్తారం గల ఈ అద్భుతమైన పక్షులు ధనురాకారంలో జట్లు జట్లుగా సముద్రం మీదుగా 30,000 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం నెలల తరబడి ప్రయాణిస్తాయి. ఒక లేసాన్ ఆల్బట్రోస్ తన ఒక్కగానొక్క పక్షిపిల్లకు ఆహారం తీసుకు రావడానికి, హొనొలులుకి వాయవ్య దిశగా ఉన్న టెర్న్ దీవినుండి అల్యూషియన్ దీవుల వరకు—రానూ పోనూ 6,000 కిలోమీటర్ల ప్రయాణం—నాలుగుసార్లు ప్రయాణించింది అని అమెరికాలో జరిపిన అలాంటి పరిశోధనలే వెల్లడిచేశాయి.
మగ ఆల్బట్రోస్‌ల సంఖ్య కంటే ఆడ ఆల్బట్రోస్‌ల సంఖ్య మరింత త్వరగా ఎందుకు తగ్గిపోయిందన్నది కూడా ఈ హై-టెక్ పరిశోధనలు వెల్లడిచేసి ఉండవచ్చు. పొదిగే మగ పక్షులు అంటార్కిటికాకు దగ్గర్లో చేపలు పట్టడానికి ఇష్టపడితే పొదిగే ఆడ పక్షులు ఆహారం కోసం సాధారణంగా ఉత్తర దిశకు, అంటే చేపలు పట్టే లాంగ్‌లైన్ (అనేక మైళ్ళ పొడవు ఉండి ఎర తగిలించివున్న గాలాలు వరుసగా ఉండే తాళ్ళు) పడవలు ఉండే ప్రాంతానికి వెళ్తాయని వాటి పయన మార్గాలు చూపించాయి. అయితే పడవల వెనుక అమర్చివున్న ఎరను అందుకోవడానికి ఈ పక్షులు ముందుకు దూసుకుపోయి, దానికి చిక్కుకుని, ఆ తర్వాత మునిగిపోతాయి. కొన్ని పొదిగే పక్షి జాతులలో, ఆడ పక్షుల కంటే మగ పక్షుల సంఖ్య రెండింతలు ఎక్కువగా ఉంది. ఇతర ఆల్బట్రోస్ జాతులు కూడా అదే విధంగా ప్రభావితమయ్యాయి. వాస్తవానికి 1990ల మధ్య కాలంలో, సంవత్సరానికి 50,000 పక్షులు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ నీళ్ళలోని లాంగ్‌లైనర్‌ల వెనుకకు వెళ్ళి మునిగిపోవడంతో, అనేక జాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. నిజానికి, తిరుగుతూ ఉండే ఆల్బట్రోస్‌ను ఆస్ట్రేలియాలో అంతరించిపోతున్న జంతుజాతుల్లో ఒకటిగా ప్రకటించారు. ఇలాంటి వివరాలు బైటపడడం వల్ల, చేపలు పట్టే పద్ధతుల్లో మార్పులు జరిగాయి. ఈ మార్పులు తిరుగుతూ ఉండే ఆల్బట్రోస్‌ల మరణ సంఖ్యను తగ్గించాయి. అయినప్పటికీ, ఈ పక్షులు నివసించే ముఖ్యమైన ప్రాంతాల్లో వీటి సంఖ్య తగ్గుతూనే వుంది.
పక్షులకు పట్టీలు వేయడం
కొన్ని నిర్దిష్టమైన పక్షి జాతులను గమనించడానికి పరిశోధకులకు సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ పరికరాలు సహాయపడుతున్నాయి, అయితే వాటికంటే తక్కువ ఖరీదు చేసే మరింత సుళువైన పద్ధతులు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఆ పద్ధతుల్లో ఒకటి పక్షులకు పట్టీలు వేయడం అంటే పక్షి కాలికి కాళ్ళగొలుసుల్లాగ ఒక చిన్న లోహపు పట్టీని గానీ ప్లాస్టిక్ పట్టీని గానీ జాగ్రత్తగా బిగించడం.
హాన్స్ క్రిస్టియన్ మార్టెన్సెన్ అనే ఒక డానిష్ స్కూలు మాష్టారు 1899లో, “తాను స్వంతంగా లోహపు పట్టీలను తయారు చేసి, వాటిమీద తన పేరూ చిరునామా వ్రాసి వాటిని 165 స్టార్లింగ్ పక్షులకు అమర్చినప్పుడు,” పక్షులకు పట్టీలు వేయడం అనే ఈ పద్ధతి సంప్రదాయక పరిశోధనా పరికరంగా తయారయ్యిందని స్మిత్‌సోనియన్ అనే పత్రిక చెబుతోంది. యూరప్‌లో రింగులు వేయడం అని పిలువబడుతున్న పక్షులకు పట్టీలు వేయడం అనే
ఈ పద్ధతిని ఈ రోజుల్లో అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్నారు, ఇది పక్షుల వ్యాప్తి గురించీ వలసపోయే విషయంలో వాటికున్న అలవాట్లు, ప్రవర్తన, సామాజిక నిర్మాణం, జనాభా పరిమాణం, జీవన సామర్థ్యం, సంతానోత్పత్తి సామర్థ్యం గురించీ విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పట్టీలు వేయడమనేది, వేటాడడం అనుమతించబడే ప్రదేశాలలో అడవి పక్షుల దీర్ఘకాల నిర్వహణ కోసం నియమాలను తయారు చేయడానికి ప్రభుత్వాలకు వీలయ్యేలా చేస్తుంది. పట్టీలు వేయడమనేది వ్యాధులకు, రసాయనిక విషాలకు పక్షులు ఎలా ప్రభావితం అవుతున్నాయో కూడా వెల్లడిచేస్తుంది. వాస్తవానికి, కొన్ని పక్షులు మెదడువాపు వ్యాధి, లైమ్ వ్యాధి వంటి మానవులకు వచ్చే వ్యాధులను కలిగి ఉండగలవు, కాబట్టి పక్షి జీవశాస్త్రం గురించిన, వాటి అలవాట్ల గురించిన సమాచారం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయకరంగా ఉండగలదు.పక్షులకు పట్టీలు వేయడం క్రూరమైనదా?
పట్టీలు వేసే పద్ధతిని ఆచరించే దేశాలలో అది నియమానుసారంగా అమలు చేయబడుతుంది, సాధారణంగా పట్టీలు వేసేవారికి లైసెన్సు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆస్ట్రేలియాలో “పట్టీలు వేసేవారికి, పక్షులను ఎలా పట్టుకోవాలో వాటితో ఎలా వ్యవహరించాలో వాటికి గాయం కాకుండా పట్టీలు ఎలా వేయాలో జాగ్రత్తగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఇలా శిక్షణను పొందడానికి సాధారణంగా రెండు సంవత్సరాలు పడుతుంది, దానికి ఎంతో అభ్యాసం అవసరం” అని ఆస్ట్రేలియన్ నేచర్ కన్సర్వేషన్ ఏజెన్సీ చెబుతుంది. ఐరోపాలో, కెనడాలో, అమెరికాలో, ఇతర దేశాలలో కూడా ఇలాంటి నియమాలు అమలులో ఉన్నాయి.
పక్షులకు వేసే పట్టీలు వివిధ ఆకారాల్లో వివిధ పరిమాణాల్లో వివిధ రంగుల్లో వివిధ ముడిపదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి. పట్టీలు చాలావరకు అల్యూమినియమ్, ప్లాస్టిక్ వంటి తేలికైన పదార్థాలతో తయారు చేయబడతాయి. కానీ ఎక్కువ కాలం జీవించే పక్షులకు లేదా ఉప్పునీటి వాతావరణంలో జీవించే పక్షులకు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో గానీ తుప్పు పట్టని ఇతర పదార్థాలతో గానీ చేసిన పట్టీలను ఉపయోగిస్తారు. వేర్వేరు రంగుల పట్టీలను బిగించడం పక్షులను దూరం నుంచే గుర్తుపట్టడాన్ని సాధ్యం చేస్తుంది. అలా చేయడానికి ఒక పక్షికి అనేక పట్టీలు బిగించవలసి వస్తుంది. అయినా ఒకేసారి అలా బిగించేస్తే, గుర్తుపట్టడానికి ఆ పక్షిని మళ్ళీ మళ్ళీ పట్టుకుని దానికి ఒత్తిడిని కలిగించడాన్ని తగ్గించవచ్చు.
పట్టీలు వేయడానికి లేదా గుర్తులు పెట్టడానికి ఏ పద్ధతిని ఉపయోగించినప్పటికీ, పక్షులకు చికాకు కలిగించకుండా లేదా వాటి ప్రవర్తననూ శరీరాన్నీ ఆయుష్షునూ సామాజిక జీవనాన్నీ వాటి జీవశాస్త్రాన్నీ లేదా జీవించగల అవకాశాలనూ ప్రభావితం చేయకుండా ఉండేలా పరిశోధకులు జాగ్రత్తపడతారు. ఉదాహరణకు, పక్షి రెక్కలకు ప్రకాశవంతమైన రంగురంగుల టాగ్ వేయడం, ఆ పక్షి దాని శత్రువులకు మరింత స్పష్టంగా కనిపించేలా చేయగలదు లేదా ఆ పక్షి యొక్క సంపర్క సాఫల్యాన్ని అది ప్రభావితం చేయగలదు. కొన్ని జాతుల పక్షులు తమ కాళ్ళపైనే మలవిసర్జన చేసేసుకుంటాయి కాబట్టి అలాంటి పక్షులకు పట్టీలు వేయడం వాటికి ఇన్‌ఫెక్షన్ కలుగజేయవచ్చు. చల్లని ప్రాంతాలలోనైతే, పట్టీల చుట్టూ మంచు పేరుకుపోగలదు, ప్రత్యేకించి నీటికోడి వంటి పక్షులకు అది హానికరంగా ఉండగలదు. పక్షులకు గుర్తులు పెట్టడంలో ఇమిడి ఉన్న విషయాలలో ఇవి కొన్ని మాత్రమే. అయితే, ఒక పద్ధతి ప్రభావవంతంగా ఉండడానికీ అదే సమయంలో కనికరంతో కూడినదై ఉండడానికీ పక్షుల జీవశాస్త్రం గురించి వాటి ప్రవర్తన గురించి ఎంత విజ్ఞానం కలిగి ఉండవలసిన అవసరముందో ఈ విషయాలు చూపిస్తాయి.
పట్టీ లేదా టాగ్ వేయబడిన జంతువు కనిపిస్తే మీరేమి చేయాలి?
కొన్నిసార్లు, పట్టీలు వేసిన అధికార సంఘాన్ని లేదా యజమానిని కలుసుకోవడానికి వీలుగా పట్టీల మీదా టాగ్‌ల మీదా టెలిఫోన్ నెంబరు లేదా చిరునామా వ్రాయబడి ఉంటుంది. * అప్పుడు మీరు ఆ టాగ్ ఎక్కడ ఎప్పుడు లభించిందో, బహుశా ఇతర వివరాలు యజమానికి తెలియజేయవచ్చు. ఉదాహరణకు ఒక చేప విషయంలోనైతే, ఆ చేపకు టాగ్ వేసి వదిలిపెట్టినప్పటి నుండి అది ఎంత దూరం ఎంత వేగంతో ప్రయాణించిందన్న విషయాన్ని అలా లభించిన వివరాలను బట్టే ఒక జీవశాస్త్రజ్ఞుడు అంచనా వేయగలుగుతాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు చేసే పని వల్ల, టాగ్‌లు పట్టీలు దొరికినప్పుడు వాటిగురించి తెలియజేసే శ్రద్ధగల ప్రజల వల్ల వన్యప్రాణుల గురించి అద్భుతమైన వివరాలు సమకూర్చబడుతున్నాయి. ఉదాహరణకు, సాండ్ పైపర్ కుటుంబానికి చెందిన రెడ్ నాట్ అనే పక్షి విషయమే తీసుకోండి. ఆ పక్షి 100 నుండి 200 గ్రాముల బరువు ఉంటుంది. కొన్ని రెడ్ నాట్‌లు ప్రతి సంవత్సరం సుదూర ఉత్తర కెనడా నుండి దక్షిణ అమెరికా చివరి వరకూ ప్రయాణించి మళ్ళీ తిరిగి వస్తాయని ఇప్పుడు పరిశోధకులకు తెలుసు. అవి ప్రయాణించే దూరం దాదాపు 30,000 కిలోమీటర్లు!
వయస్సు పెద్దదే అయినప్పటికీ ఆరోగ్యంగా ఉన్న ఒక రెడ్ నాట్‌కు ఉన్న పట్టీ, ఆ పక్షి ఇలా 15 సంవత్సరాలపాటు ప్రయాణించి ఉండవచ్చని వెల్లడిచేసింది. అవును ఈ చిన్న పక్షి 4,00,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉండవచ్చు, అంటే భూమి నుండి చంద్రుని వరకు ఉన్న సగటు దూరం కంటే ఎక్కువ దూరం అన్నమాట! గమనార్హమైన ఈ చిన్న పక్షిని తన అరచేతిలో కూర్చోపెట్టుకుని ప్రకృతి రచయిత స్కాట్ విడెన్సల్ ఇలా అన్నాడు: “ఈ సువిశాల ప్రపంచాన్ని ఐక్యపరచే ఈ పక్షులను బట్టి భక్తిపూర్వకమైన భయంతో గౌరవంతో తల ఊపడం తప్ప నేనేమీ చేయలేను.” నిజమే, భూమి మీద ఉన్న అనేక ప్రాణుల గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, “ఆకాశమును భూమిని . . . దానిలోని సర్వమును సృజించిన” యెహోవా దేవునిమీద అంత ఎక్కువ భక్తిపూర్వకమైన భయంతో గౌరవంతో మనం నింపబడతాము.—కీర్తన 146:5, 6. (g02 3/22)
[అధస్సూచి]
^ వాటిమీద ఉన్న వివరాలు చదవలేనంతగా పట్టీలు లేదా టాగ్‌లు పాతవైపోవచ్చు. అయితే ఎచ్చింగ్ పద్ధతిని ఉపయోగించి అదృశ్యంగా ఉన్నట్టు అనిపించే ఈ వివరాలను కూడా తరచూ చదవడం సాధ్యమవుతుంది. అమెరికాలో పక్షులకు పట్టీలు వేసే లేబొరేటరీ ప్రతి సంవత్సరం ఇలాంటి వందలాది పట్టీలను చదువుతుంది.
[27వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
గుర్తులుపెట్టే, గమనించే వివిధ పద్ధతులు
పరిశోధన కోసం పక్షులకే కాకుండా అనేక ఇతర జంతువులకు కూడా గుర్తులు పెట్టబడతాయి. గుర్తులు పెట్టడానికి ఉపయోగించే పద్ధతులు, విజ్ఞానశాస్త్రం సాధించాలనుకునే లక్ష్యాలపైనే కాకుండా జంతువుల శారీరక స్వభావంపైన, వాటి అలవాట్లపైన కూడా ఆధారపడి ఉంటాయి. కాళ్ళకు వేసే పట్టీలనే కాకుండా పరిశోధకులు జెండాలు, బేనర్లు, టాగ్‌లు, పెయింట్లు, పచ్చబొట్లు, రంగులు, బ్రాండ్లు, కాలర్లు, రేడియో ట్రాకింగ్ పరికరాలు, మైక్రో కంప్యూటర్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ బాణాలు (కోడ్ చేయబడిన టాగ్‌లు వాటికి జతచేయబడి ఉంటాయి) వంటి పరికరాలనూ కాలివేళ్ళను, చెవిని, తోకను క్లిప్ చేయడం లాంటి అనేకమైన ఇతర పద్ధతులనూ ఉపయోగిస్తారు. ఈ పద్ధతుల్లో కొన్నింటికి ఖర్చు చాలా తక్కువ. ఇతర పరికరాలు మరింత ఖరీదైనవి, సీల్‌లకున్న నీటిలోకి దూకే అలవాట్ల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగించే కామ్కార్డర్‌తో పాటు ఉన్న సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ పరికరం 6,90,000 రూపాయిల ఖరీదు ఉంటుంది.
పాసివ్ ఇంటెగ్రేటెడ్ ట్రాన్స్‌పాండర్ అని పిలవబడే ఎలక్ట్రానిక్ పరికరాన్ని అనస్థీషియా ఇవ్వబడిన జంతువు చర్మంలోకి లేదా శరీరంలోకి జొప్పించి, ఆ తర్వాత మరో ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగించి జంతువులోపల వున్న పరికరం తెలియజేసే వివరాలను బయటినుంచి చదవవచ్చు. బ్లూఫిన్ ట్యూనా చేపను అధ్యయనం చేయడానికి శాస్త్రజ్ఞులు ఆర్కైవల్ టాగ్ లేదా స్మార్ట్ టాగ్ అని పిలువబడే చిన్న కంప్యూటర్‌ను ఆ చేపలోకి జొప్పిస్తారు. ఈ కంప్యూటర్‌లోని మైక్రోచిప్స్, దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఉష్ణోగ్రత, లోతు, వెలుగు తీవ్రత, సమయం గురించిన సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తాయి. చేపనుండి ఆ టాగ్‌ను తిరిగి తీసుకున్నప్పుడు అది ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తుంది. ప్రతిరోజు తీసుకున్న వెలుగుకు సంబంధించిన రీడింగ్‌లతో సమయానికి సంబంధించిన సమాచారాన్ని పోల్చితే ఆ ట్యూనా చేప ఎక్కడెక్కడికి ప్రయాణించిందో కూడా తెలుసుకోవచ్చు.
పాముల నిర్దిష్టమైన పొలుసులను క్లిప్ చేయడం ద్వారా, తాబేళ్ళ బాహ్య కవచాలకు గంట్లు పెట్టడం ద్వారా, బల్లుల కాలివేళ్ళను క్లిప్ చేయడం ద్వారా, మొసళ్ళ తోకనుంచి స్క్యూట్‌లను (గట్టిగా ఉండే పలకలను) తీసివేయడం ద్వారా లేదా వాటి కాలివేళ్ళను క్లిప్ చేయడం ద్వారా గుర్తులు పెట్టవచ్చు. కొన్ని జంతువులు కేవలం తీసిన ఫోటోలను బట్టి గుర్తుపట్టగలిగేలా సహజంగానే భిన్నంగా కనిపిస్తాయి.
[చిత్రాలు]
నల్ల ఎలుగుబంటికి చెవిటాగ్ వేయడం; డామ్సల్ చేపకు ఉన్న స్పాగెట్టీటాగ్; మొసళ్ళపై ఉన్న తోకటాగ్‌లు
ఉపగ్రహ ట్రాన్స్‌మీటర్ కలిగివున్న పెరెగ్రైన్ ఫాల్కన్
అంతర్గత టెలిమెట్రీ పరికరం అమర్చబడిన రెయిన్‌బో చేప
[చిత్రసౌజన్యం]
ఎలుగుబంటి: © Glenn Oliver/Visuals Unlimited; డామ్సల్ చేప: Dr. James P. McVey, NOAA Sea Grant Program; మొసలి: Copyright © 2001 by Kent A. Vliet; 2, 27 పేజీల్లో ఉన్న ఫాల్కన్: Photo by National Park Service; చేపను పట్టుకొనివున్న మనుష్యులు: © Bill Banaszewski/Visuals Unlimited
[25వ పేజీలోని చిత్రం]
షార్ప్ షిన్డ్ డేగకు పట్టీ వేయడం
[చిత్రసౌజన్యం]
© Jane McAlonan/Visuals Unlimited