కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పోర్నోగ్రఫీ—కేవలం హానిరహితమైన కాలక్షేపమా?

పోర్నోగ్రఫీ—కేవలం హానిరహితమైన కాలక్షేపమా?

బైబిలు ఉద్దేశము

పోర్నోగ్రఫీ​—కేవలం హానిరహితమైన కాలక్షేపమా?

విక్టోరియన్‌ యుగానికి చెందిన పురావస్తు శాస్త్రజ్ఞులు, పొంపీలోని ప్రాచీన శిథిలాలను క్రమబద్ధంగా తవ్వడం ప్రారంభించినప్పుడు, వారు తాము వెలికి తీసిన వాటిని చూసి అమితాశ్చర్యానికి గురయ్యారు. అందమైన ఫ్రెస్కోలు (సిమెంటు పూత ఆరకముందు గోడమీద నీటిరంగులతో చిత్రించిన చిత్రాలు) మరియు కళాకృతుల మధ్య, లైంగిక చర్యలను స్పష్టంగా వివరించే అనేక నగ్న చిత్రాలు, శిల్పాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. అసహజమైన, దిగ్భ్రాంతికరమైన ఆ చిత్రాలను చూసి ఆశ్చర్యపోయిన అధికారులు వాటిని రహస్య ప్రదర్శనశాలల్లో భద్రపరిచారు. వారు, లైంగిక చర్యలను స్పష్టంగా వివరించే ఈ కళాకృతులను వర్గీకరించడానికి “వేశ్యల గురించి వ్రాయడం” అన్న అర్థంగల పోర్నియా, గ్రాఫోస్‌ అనే గ్రీకు పదాల నుండి పోర్నోగ్రఫీ అనే పదాన్ని సృష్టించారు. పుస్తకాలలో, బొమ్మలలో, శిల్పాల్లో, సినిమాల్లో లైంగిక ఉద్రేకాన్ని కలిగించాలని ఉద్దేశించబడిన శృంగార ప్రవర్తనకు సంబంధించిన వర్ణన అని పోర్నోగ్రఫీ నేడు నిర్వచించబడుతోంది.

ఈ రోజుల్లో పోర్నోగ్రఫీ విస్తృతంగా వ్యాపించివుంది, ఆధునిక సమాజంలోని అధికభాగం దాన్ని అంగీకరించినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు కేవలం అసహ్యమైన సినిమాలకు, నీచమైన రెడ్‌-లైట్‌ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పోర్నోగ్రఫీ, ఇప్పుడు అనేక సమాజాలలో సర్వసాధారణమైపోయింది. కేవలం అమెరికాలోనే పోర్నోగ్రఫీ ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయిలు కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది!

పోర్నోగ్రఫీని సమర్థించే కొందరు, అది ఉదాసీనమైన వివాహ జీవితాన్ని ఉత్సాహంతో నింపడానికి ఒక మార్గమని దాన్ని ప్రోత్సహిస్తారు. “అది చురుకైన ఊహాకల్పిత జీవితాన్ని ప్రేరేపిస్తుంది. అది లైంగిక సుఖానుభూతి పొందడానికి నిర్దేశాలను అందిస్తుంది” అని ఒక రచయిత్రి అంటుంది. లైంగిక విషయాలకు సంబంధించి దాపరికం లేకుండా ఉండడాన్ని అది ప్రోత్సహిస్తుందని ఇతరులు అంటున్నారు. రచయిత్రి వెండీ మెక్‌ఎల్‌రాయి “పోర్నోగ్రఫీ స్త్రీలకు ప్రయోజనకరమైనది” అని వాదిస్తోంది.

కానీ అందరూ ఆ విషయాన్ని అంగీకరించరు. పోర్నోగ్రఫీకి, తరచూ ఎన్నో విధాలైన హానికరమైన పర్యవసానాలతో, వైఖరులతో సంబంధం ఉంటుంది. పోర్నోగ్రఫీకీ, బలాత్కారానికీ, స్త్రీలకు వ్యతిరేకంగా జరిగే ఇతర దౌర్జన్యాలకూ మధ్య సంబంధం ఉందని కొందరు సూచిస్తున్నారు. వరుసగా ఒకే పద్ధతిలో ఎన్నో హత్యలు చేసిన అపఖ్యాతి పొందిన హంతకుడైన టెడ్‌ బెండీ, “దౌర్జన్యపూరితమైన పోర్నోగ్రఫీ పట్ల తనకు తీవ్రమైన కాంక్ష” ఉండేదని ఒప్పుకుంటున్నాడు. “ఈ పరిస్థితిని ఒక వ్యక్తి వెంటనే గుర్తించడు లేదా ఇది ఒక గంభీరమైన సమస్య అని గ్రహించడు. . . . కానీ ఈ ఆసక్తి . . . దౌర్జన్యపూరితమైన లైంగిక ప్రవృత్తిగల విషయాలవైపుకు ప్రయాణించడం ప్రారంభిస్తుంది. దౌర్జన్యపూరితమైన పోర్నోగ్రఫీ పట్ల ఆసక్తి క్రమంగా వృద్ధిచెందుతుందని నేను చాలా గట్టిగా నొక్కిచెప్పాలనుకుంటున్నాను. అది కొద్ది సమయంలో వృద్ధి చెందేది కాదు” అని అతను అంటున్నాడు.

పోర్నోగ్రఫీకి సంబంధించిన సమాచారం గురించి జరుగుతున్న అంతులేని చర్చలవల్ల, అది ఇంతగా వ్యాపించి ఉండడంవల్ల, ‘ఈ విషయంలో బైబిలు ఏదైనా నడిపింపును ఇస్తుందా?’ అని మీరు ఆలోచించవచ్చు.

లైంగిక విషయాల గురించి బైబిలు దాపరికం లేకుండా మాట్లాడుతుంది

నిజానికి, బైబిలులో లైంగిక విషయాలు దాపరికం లేకుండా, సిగ్గుపడకుండా చర్చించబడ్డాయి. (ద్వితీయోపదేశకాండము 24:5; 1 కొరింథీయులు 7:3, 4) “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. . . . ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము” అని సొలొమోను అన్నాడు. (సామెతలు 5:18, 19) లైంగిక సంబంధాలను ఏ పరిమితులలో అనుభవించాలి అన్న విషయాలతో సహా లైంగిక సంబంధాల విషయమై స్పష్టమైన సలహా మరియు నడిపింపు ఇవ్వబడ్డాయి. వివాహేతర లైంగిక సంబంధాలు నిషేధించబడ్డాయి. అన్ని విధాలైన దిగజారిపోయిన లైంగిక అలవాట్లు కూడా నిషేధించబడ్డాయి.​—లేవీయకాండము 18:22, 23; 1 కొరింథీయులు 6:9; గలతీయులు 5:19.

అయితే ఈ పరిమితుల్లో కూడా నిగ్రహం, గౌరవం చూపించాలని ఆశించబడుతోంది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 13:4) పౌలు ఇచ్చిన ఈ ఉపదేశం, పోర్నోగ్రఫీ ఉద్దేశానికీ అది అందించే సందేశానికీ పూర్తి విరుద్ధంగా ఉంది.

పోర్నోగ్రఫీ లైంగిక సంబంధాన్ని వికృతం చేస్తుంది

లైంగిక సంబంధాలను, గౌరవపూర్వకమైన వివాహంలో ఒక పురుషునికీ ఒక స్త్రీకీ మధ్యవుండే అందమైన, సన్నిహితమైన ప్రేమ భావాలుగా చిత్రీకరించే బదులు పోర్నోగ్రఫీ లైంగిక సంబంధానికున్న విలువను తక్కువచేసి వికృతం చేస్తుంది. పద్ధతిలేని, సక్రమంకాని లైంగిక సంబంధం ఉత్తేజకరమైనదన్నట్లు ఎంతో కోరదగినదన్నట్లు చిత్రీకరించబడుతుంది. ఎదుటి వ్యక్తిపై ఏదో కొంత శ్రద్ధతో లేదా అస్సలు శ్రద్ధ లేకుండా వ్యక్తిగత సంతృప్తి ఉన్నతపర్చబడుతుంది.

స్త్రీలు, పురుషులు, పిల్లలు కేవలం లైంగిక సంతృప్తి కోసమే ఉనికిలో ఉన్న వస్తువులుగా చిత్రీకరించబడుతున్నారు. “అవాస్తవికమైన ఆశలను రేకెత్తిస్తూ అందమనేది ఒకరి శరీర ఆకృతిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది” అని ఒక నివేదిక చెబుతోంది. “అనామకులుగా, ఎల్లప్పుడూ అవకాశాల కోసం ఎదురుచూసేవారిగా, పురుషుల లైంగిక అవసరాలు తీర్చే ఆటబొమ్మలుగా, డబ్బు కోసం వినోదం కోసం వస్త్రాలు తీసివేసి తమ శరీరాన్ని ప్రదర్శించేవారిగా స్త్రీలను వర్ణించడం, స్త్రీలకు సమానత్వం, గౌరవం, మానవత్వం ఉందని చిత్రీకరించే అవకాశం లేకుండా చేస్తుంది” అని మరో నివేదిక చెబుతోంది.

దానికి విరుద్ధంగా, ప్రేమ “అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు” అని పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 13:5) ‘తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమించాలనీ’ వారిని ‘సన్మానించాలనీ’ స్త్రీలను కేవలం లైంగిక సంతృప్తినిచ్చే వస్తువులుగా దృష్టించకూడదనీ బైబిలు పురుషులకు ఉపదేశిస్తుంది. (ఎఫెసీయులు 5:28; 1 పేతురు 3:7) ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ, లైంగిక కోరికలను రేకెత్తించే ఇతరుల చిత్రాలను క్రమంగా చూస్తుంటే, ఆ వ్యక్తి నిజంగా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నట్లేనా? ఆ వ్యక్తి నిజంగా గౌరవాన్నీ మర్యాదనూ చూపిస్తున్నాడా? పోర్నోగ్రఫీ, ఒక వ్యక్తిలో ప్రేమకు బదులు తనపైనే అవధానాన్ని కేంద్రీకరించుకునే స్వార్థపూరితమైన కోరికలను పెంపొందింపజేస్తుంది.

పోర్నోగ్రఫీకి సంబంధించి పరిగణలోకి తీసుకోవలసిన విషయం మరొకటి ఉంది. ఒక వ్యక్తిని ఉత్తేజపరిచే అన్ని తప్పుడు ప్రేరేపణల్లాగే, ఇది మొదట్లో ఎంతో ఉత్తేజపరిచేదిగా ఉన్నప్పటికీ త్వరలోనే సాధారణమైనదిగా మామూలుగా తయారవుతుంది. “[పోర్నోగ్రఫీని చూసేవారికి] కొంతకాలానికి మరింత వివరణాత్మకమైన, మరింత దిగజారిపోయిన సమాచారం అవసరమౌతుంది . . . నిజమైన ప్రేమను వ్యక్తపరచే తమ [స్వంత] సామర్థ్యాన్ని తక్కువ చేసుకుంటూ . . . వారు తమ భాగస్వాములను మరింత అసహ్యమైన లైంగిక కార్యాలు చేయడానికి ఒత్తిడి చేయవచ్చు” అని ఒక రచయిత అంటున్నాడు. అది కేవలం హానిరహితమైన కాలక్షేపమని మీకు అనిపిస్తుందా? అయితే పోర్నోగ్రఫీని నివారించడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం కూడా ఉంది.

బైబిలు, కామోద్రేకము

లైంగికపరమైన ఊహాకల్పనలను కలిగివుండడంలో తప్పేమీ లేదనీ అది ప్రమాదకరం కాదనీ నేడు చాలామంది భావిస్తున్నప్పటికీ బైబిలు దానితో ఏకీభవించడం లేదు. మనం మన మనస్సుల్లో నింపుకునే దానికీ, మనం ప్రవర్తించే విధానానికీ మధ్య సహజసిద్ధమైన సంబంధం ఉందని అది స్పష్టంగా వివరిస్తుంది. “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును . . . కనును” అని క్రైస్తవ శిష్యుడైన యాకోబు సూచిస్తున్నాడు. (యాకోబు 1:14, 15) “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని యేసు అన్నాడు.​—మత్తయి 5:28.

యాకోబు మరియు యేసు సూచిస్తున్నట్లు, మానవులు తమ మనస్సులోని కోరికల ప్రేరణ ప్రకారం ప్రవర్తిస్తారు. ఆ కోరికలను అలానే అభివృద్ధి చేసి పెంచుకున్నట్లైతే, కొంతకాలానికి అవి తీవ్ర వాంఛలుగా తయారవుతాయి. తీవ్ర వాంఛలను నివారించడం చాలా కష్టం, అవి చివరకు ఒక వ్యక్తి చర్య తీసుకునేలా ఒత్తిడి చేస్తాయి. కాబట్టి మనం మన మనస్సుల్లో నింపుకునే విషయాలు, మనం చివరకు ఎలా ప్రవర్తిస్తాము అన్నదానిపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపగలవు.

లైంగికపరమైన ఊహాకల్పనలు, మనం దేవుణ్ణి ఆరాధించే విషయంపై నేరుగా ప్రభావం చూపవచ్చు. అందుకే, “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి” అని పౌలు వ్రాశాడు.​—కొలొస్సయులు 3:5.

ఇక్కడ పౌలు లైంగిక కోరికలను ధనాపేక్షతో జతచేస్తున్నాడు. ఒక వ్యక్తికి తనది కాని దానిపై ఉండే అమితమైన కోరికే ధనాపేక్ష. * ధనాపేక్ష ఒకవిధమైన విగ్రహారాధన. ఎందుకు? ఎందుకంటే ధనాపేక్షగల వ్యక్తి తను కోరుకునే దాన్ని అన్నింటికంటే ముందుంచుతాడు, దేవునికంటే కూడా ప్రథమంగా ఎంచుతాడు. పోర్నోగ్రఫీ ఒక వ్యక్తిలో తన దగ్గర లేనిదానికోసం కామోద్రేకాన్ని ప్రేరేపిస్తుంది. “మీరు మరో వ్యక్తి లైంగిక జీవితాన్ని కోరుకుంటారు. . . . మీరు ఆలోచించేదల్లా మీకు లేని ఆ లైంగిక జీవితంపట్ల మీకున్న కోరికను గురించే. . . . మనం వాంఛించేదాన్నే మనం ఆరాధిస్తాము” అని ఒక మతసంబంధమైన రచయిత అంటున్నాడు.

పోర్నోగ్రఫీ భ్రష్టుపట్టిస్తుంది

‘యే యోగ్యతయైనను ఉండినయెడల ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి’ అని బైబిలు ఉద్బోధిస్తుంది. (ఫిలిప్పీయులు 4:8) తన మనస్సును పోర్నోగ్రఫీతో నింపుకునే వ్యక్తి పౌలు ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నాడు. అది అశ్లీలమైనది ఎందుకంటే అతి సన్నిహితమయిన, ఆంతరంగిక చర్యలను సిగ్గులేకుండా ప్రజల ఎదుట ప్రదర్శిస్తుంది. అది అసహ్యకరమైనది ఎందుకంటే అది ప్రజల విలువను తగ్గించివేసి వారిలో మానవత్వం లేకుండా చేస్తుంది. అది ప్రేమరహితమైనది ఎందుకంటే అది వాత్సల్యాన్ని గానీ శ్రద్ధను గానీ ప్రోత్సహించదు. అది కేవలం స్వార్థపూరితమైన కామోద్రేకాన్ని ప్రోత్సహిస్తుంది.

పోర్నోగ్రఫీ అనైతికమైన, అశ్లీలమైన కార్యాలను నిరాటంకంగా వర్ణించడం ద్వారా ‘కీడుపట్ల ద్వేషాన్ని’ పెంపొందించుకోవడానికి ఒక క్రైస్తవుడు చేసే కృషిని బలహీనపరుస్తుంది లేదా నాశనం చేస్తుంది. (ఆమోసు 5:15) అది పాపం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. . . . పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు” అని పౌలు ఎఫెసీయులకు ఇచ్చిన ప్రోత్సాహానికి అది పూర్తి విరుద్ధంగా ఉంది.​—ఎఫెసీయులు 5:3, 4.

పోర్నోగ్రఫీ ఖచ్చితంగా హానిరహితమైనది కాదు. అది క్రూరమైనది, భ్రష్టుపట్టిస్తుంది. అది సహజసిద్ధమైన లైంగిక సన్నిహితత్వాన్ని, లైంగిక అవయవాలను లైంగిక కార్యాలను చూసి సంతృప్తిని పొందే అలవాటుగా మార్చివేసి సంబంధాలను నాశనం చేస్తుంది. అలాంటి సంతృప్తిని పొందే వ్యక్తి మనస్సును, ఆధ్యాత్మికతను విషపూరితం చేస్తుంది. స్వార్థపూరితమైన దురాశతో కూడిన వైఖరులను ప్రోత్సహిస్తుంది, ఇతరులను కేవలం తమ కామోద్రేకాన్ని తీర్చుకోవడానికి పనికివచ్చే వస్తువులుగా దృష్టించడాన్ని నేర్పిస్తుంది. మంచి చేయడానికి, నిర్మలమైన మనస్సాక్షిని కలిగివుండడానికి ఒక వ్యక్తి చేసే కృషిని క్షీణింపజేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఒక వ్యక్తికి దేవునితో ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని ఆటంకపర్చగలదు లేదా నాశనం చేయగలదు. (ఎఫెసీయులు 4:17-19) నిజమే, పోర్నోగ్రఫీ నిరోధించవలసిన ఒక మహమ్మారి. (g02 7/8)

[అధస్సూచి]

^ పౌలు ఇక్కడ సహజమైన లైంగిక కోరికల గురించి​—ఒకరి వివాహ భాగస్వామితో సాధారణమైన లైంగిక సన్నిహితత్వం కలిగివుండాలన్న కోరిక గురించి మాట్లాడడం లేదు.

[20వ పేజీలోని చిత్రం]

ఒక పురుషునికి స్త్రీ గురించి, స్త్రీకి పురుషుని గురించి ఉండే దృక్కోణాన్ని పోర్నోగ్రఫీ వికృతం చేస్తుంది