కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పోలీసులు ఎందుకు అవసరం?

పోలీసులు ఎందుకు అవసరం?

పోలీసులు ఎందుకు అవసరం?

పోలీసులు లేకుంటే జీవితం ఎలా ఉంటుంది? 1997లో బ్రెజిల్‌ నగరమైన రసీఫలో ఉన్న పది లక్షల మంది పౌరులను వారి మానాన వారిని వదలిపెట్టేసి 18,000 మంది పోలీసులు సమ్మె చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి?

“సముద్రతీరాన ఉన్న ఆ ముఖ్య నగరంలో కల్లోలభరితమైన అయిదు రోజుల్లో హత్యల రేటు మూడింతలు పెరిగింది. ఎనిమిది బ్యాంకులు దోచుకోబడ్డాయి. ఒక షాపింగ్‌ మాల్‌ అంతటా ముఠాలు అమానుషంగా పరుగెడుతూ, చుట్టుపక్కల్లోని ఉన్నత తరగతి ప్రజలపైకి తుపాకులు పేల్చుతూ తిరిగారు. ట్రాఫిక్‌ నియమాలను ఎవ్వరూ పాటించ లేదు . . . నేరాల కెరటం నగర హాస్పిటల్లోని మార్చురీ గది పరిమితులను పరీక్షించింది, తుపాకీ కాల్పులకు కత్తిపోట్లకు గురైన బాధితులు వరదలా వచ్చి రాష్ట్రంలోని అతిపెద్ద ఆసుపత్రి వసారాల్లోని నేల అంతా నిండిపోయారు.” అని ద వాషింగ్టన్‌ పోస్ట్‌ అనే పత్రిక నివేదించింది. “ఇలాంటి దురాక్రమణ ఇంతకు ముందెన్నడూ ఇక్కడ జరగలేదు” అని జస్టిస్‌ సెక్రటరీ అన్నట్లు నివేదించబడింది.

మనం ఎక్కడ నివసిస్తున్నా నాగరికత అనే మోసపూరిత ముసుగు క్రిందే దుష్టత్వం ఉంది. మనకు పోలీసు సంరక్షణ అవసరం. కొందరు పోలీసుల కిరాతకం, భ్రష్టత్వం, ఉదాసీనతల గురించీ అధికార దుర్వినియోగం గురించీ మనలో చాలామంది విన్నామన్నది వాస్తవమే. ఇలాంటి సంఘటనలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. కానీ పోలీసులు లేకుండా మనం ఏమి చేయగలం? పోలీసులు తరచూ తమ విలువైన సేవలను అందిస్తారన్నది నిజం కాదా? వారు ఎందుకు ఈ కెరీర్‌ను ఎంపిక చేసుకున్నారో తెలియజేయమని ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని పోలీసులను తేజరిల్లు! అడిగింది.

సమాజ సంక్షేమానికి సంఘసేవ

“ప్రజలకు సహాయం చేయడంలో నేను ఆనందిస్తాను. ఆ పనిలోని వైవిధ్యానికి నేను ఆకర్షించబడ్డాను. పోలీసు పనిలో నేరానికి సంబంధించినది కేవలం 20 నుండి 30 శాతం వరకే ఉంటుందని సాధారణంగా అందరికీ తెలియదు. ఆ పనిలో సమాజ సంక్షేమానికి చేసే సంఘసేవే ఎక్కువగా ఉంటుంది. పనిమీద గస్తీ తిరిగేటప్పుడు ఒక రోజులో సాధారణంగా ఎదురయ్యేవాటిలో ఒక హఠాత్‌మరణం, ట్రాఫిక్‌ దుర్ఘటన, ఒక నేరం, అయోమయంలో పడి సహాయం అవసరమైన ఒక వయోజనుడికి సహాయపడాల్సి రావడం వంటివి ఉంటాయి. ప్రత్యేకించి తప్పిపోయిన పిల్లవాడ్ని అతని తల్లిదండ్రులకు అప్పగించడం లేదా దౌర్జన్యానికి గురైన ఒక వ్యక్తి మానసిక ఉద్వేగాఘాతం నుండి కోలుకునేందుకు సహాయం చేయడం వంటివి చాలా తృప్తినిస్తాయి” అని ఐవన్‌ అనే ఒక బ్రిటీష్‌ పోలీసు చెప్పాడు.

స్టీఫన్‌ గతంలో అమెరికాలో పోలీసుగా పని చేశాడు. “ప్రజలు మద్దతు కోసం మీ దగ్గరకు యథార్థంగా వచ్చినప్పుడు, గొప్ప సహాయం చేయడానికి ఒక పోలీసుగా మీకు సామర్థ్యం, సమయం రెండూ ఉంటాయి. నన్ను ఈ ఉద్యోగంలోకి లాగింది అదే విషయం. ప్రజలకు సహాయం చేయడానికీ వారి కష్టాలను మోయడానికీ నేను అందుబాటులో ఉండాలని కోరుకున్నాను. నేను ప్రజలను నేరం నుండి కాపాడేందుకు కనీసం కొంతవరకైనా సహాయం చేశానని భావిస్తున్నాను. నేను అయిదు సంవత్సరాల్లో 1,000 కంటే ఎక్కువ మందిని అరెస్టు చేశాను. కానీ తప్పిపోయిన పిల్లలను కనుగొనడం, అల్జీమర్‌ వ్యాధి వలన దారి తప్పిపోయిన రోగులకు సహాయం చేయడం, దొంగిలించబడిన వాహనాలను దొరకబట్టడం వంటివన్నీ తృప్తినిస్తాయి. వీటితోపాటు అనుమానితులను పట్టుకోవడం కోసం వారి వెంటపడి వారిని తరమడంలో ఉద్వేగం కూడా ఉంటుంది” అని ఆయన అంటున్నాడు.

“ప్రజల అత్యవసర పరిస్థితుల్లో వారికి సహాయం చేయాలని నేను కోరుకున్నాను. నా చిన్నప్పటి నుండే పోలీసులంటే అభిమానం ఉండేది, ఎందుకంటే వారు ప్రజల్ని ప్రమాదాల నుండి కాపాడతారు. నా కెరీర్‌ ప్రారంభంలో, ప్రభుత్వ కార్యాలయాలున్న ఒక సిటీ సెంటర్లో కాలి నడక గస్తీలకు నేను ఇన్‌చార్జిగా ఉండేవాడిని. మేము దాదాపు ప్రతిరోజూ రాజకీయ ధర్నాలకు సంబంధించిన విషయాల్లో చర్య తీసుకోవాల్సి వచ్చేది. పరిస్థితులు ఉగ్రరూపం దాల్చకుండా కాపాడడం నా బాధ్యత. ధర్నా జరుపుతున్నవారి నాయకులతో నేను స్నేహపూర్వకంగా సహేతుకంగా ఉంటే, అనేకమంది గాయపడడానికి కారణమయ్యే గొడవలను ఆపవచ్చని నేను గ్రహించాను, అది నాకు ఎంతో సంతృప్తి కలిగించేది” అని బొలీవియాలోని రోబర్టో అనే ఒక పోలీసు అంటున్నాడు.

పోలీసులు అందించే సేవల పరిధి చాలా విస్తృతమైనది. చెట్టుమీది పిల్లిని కాపాడడం నుండి తీవ్రవాదుల నుండీ బ్యాంకు దోచుకున్నవారి నుండీ బందీలను విడిపించడం వంటి పరిస్థితులవరకు వారు చేపట్టారు. అయితే, ఆధునిక పోలీసు బలగాలు ఆరంభమైనప్పటి నుండి వారు ఆశలకూ భయాలకూ రెండింటికీ కేంద్రమయ్యారు. ఎందుకు అనే విషయాన్ని తర్వాతి ఆర్టికల్‌ తెలియజేస్తుంది. (g02 7/8)

[2, 3వ పేజీలోని చిత్రాలు]

2, 3 పేజీల్లో: చైనాలోని చెంగ్‌డులో ట్రాఫిక్‌ను నిర్దేశిస్తూ; గ్రీసులో జరిగిన కల్లోలంలో పోలీసు; దక్షిణ ఆఫ్రికాలోని పోలీసులు

[చిత్రసౌజన్యం]

Linda Enger/Index Stock Photography

[3వ పేజీలోని చిత్రం]

బ్రెజిల్‌లోనున్న సాల్వడార్‌లో 2001 జూలై నెలలో పోలీసులు సమ్మె చేసినప్పుడు కొల్లగొట్టబడిన దుకాణం

[చిత్రసౌజన్యం]

Manu Dias/Agência A Tarde

[4వ పేజీలోని చిత్రం]

స్టీఫన్‌, అమెరికా

[4వ పేజీలోని చిత్రం]

రోబర్టో, బొలీవియా