కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పోలీసులు వారి భవిష్యత్తు ఏమిటి?

పోలీసులు వారి భవిష్యత్తు ఏమిటి?

పోలీసులు వారి భవిష్యత్తు ఏమిటి?

పోలీసులు లేకపోతే బహుశా మనల్ని అరాచకత్వమే ఏలి ఉండేది కావచ్చు. కానీ పోలీసులు ఉన్నప్పటికీ మన లోకం సురక్షితంగా ఉందా? అనేక గ్రామీణ ప్రాంతాల్లోలాగే నేడు అనేక పట్టణాల్లో కూడా భద్రత గురించిన సంకటావస్థ నెలకొంది. పోలీసులు మనల్ని మాఫియా గుంపుల నుండి, నేర ప్రవృత్తి గలవారి నుండి కాపాడతారని ఆశించవచ్చా? పోలీసులు మన వీధులను సురక్షితమైనవిగా చేయగలరని నిరీక్షించవచ్చా? నేరానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటంలో వారు గెలుపొందుతారా?

డేవిడ్‌ బేలే భవిష్యత్తు కోసం పోలీసులు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో “పోలీసులు నేరాన్ని ఆపలేరు, వాస్తవానికి వారు రాచపుండుపైన కేవలం ఒక కట్టులాంటివారు మాత్రమే . . . వారు నేరాన్ని అడ్డుకోవడానికి, సమాజాన్ని నేరం నుండి కాపాడేందుకు అంకితం చేసుకున్నప్పటికీ మనం వారిపై ఆధారపడి జీవించలేము” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వీధుల్లో గస్తీ తిరగడం, అత్యవసర పిలుపులకు ప్రతిస్పందించడం, నేరాలను పరిశోధించడం వంటి పోలీసులు చేసే మూడు ముఖ్యమైన కార్యకలాపాలు నేరాన్ని అరికట్టలేవని అధ్యయనాలు చూపించాయి. ఎందుకలా?

పోలీసుల సంఖ్యను అధికం చేసి నేరాలను అరికట్టాలనుకోవడం సాధ్యంకాని ఖరీదైన పని. నేరాలు జరగకుండా చూసేందుకు వీలైనంతగా అధికం చేస్తున్న గస్తీలను నేరస్థులు గమనిస్తున్నట్లు గానీ వాటిని పట్టించుకుంటున్నట్లు గానీ ఏమీ కనిపించడంలేదు. జరిగే నేరాలకు పోలీసులు తక్షణమే ప్రతిస్పందించడం కూడా వాటిని అంతగా అరికట్టలేదు. నేరం జరిగిన స్థలానికి ఒక నిమిషంలోపు చేరుకోగలిగితేనే తప్ప తాము నిందితుణ్ణి పట్టుకోలేమని పోలీసులు నివేదించారు. అంత వేగంగా వచ్చి తమను పట్టుకోవడం చాలా అరుదని నేరస్థులు గ్రహించినట్లనిపిస్తోంది. నేర పరిశోధన కూడా సహాయపడదు. డిటెక్టివ్‌లు నేరస్థులను పట్టుకొని జైలులో వేసినప్పటికీ అది నేరాన్ని అడ్డుకుంటున్నట్లేమీ కనిపించడంలేదు. మిగతా దేశాలకంటే అమెరికా ఎక్కువమంది నేరస్థులను జైలులో వేస్తోంది, అయినప్పటికీ అక్కడే అత్యధిక స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి; జపాన్‌లో చూస్తే జైల్లో చాలా తక్కువమందే ఉంటారు, తక్కువ నేరాలు జరిగే దేశాల్లో అది ఒకటి. ప్రత్యేకించి నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో, పొరుగువారి సంరక్షణ వంటి ప్రణాళికలు కూడా ఎక్కువ కాలం ప్రభావం చూపలేకపోయాయి. మాదక ద్రవ్యాల వ్యాపారం, దొంగతనాల వంటి నేరాలకు వ్యతిరేకంగా తీసుకున్న బలమైన, ఖచ్చితమైన చర్యలు కొంతకాలం వాటిని అణచివేశాయి, అయినా వాటి ప్రభావం ఎక్కువ కాలం ఉండదు.

“పోలీసులు నేరాన్ని ఆపలేరనే విషయం ఆలోచనాపరులకు అంత ఆశ్చర్యాన్నేమీ కలిగించదు. పోలీసుల ఆధీనంలోనే కాదు మొత్తం నేర విచారణ వ్యవస్థ ఆధీనంలోనే లేని సామాజిక పరిస్థితులు సమాజాల్లో నేరాల స్థాయిని నిర్ధారిస్తాయన్నది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే” అని భవిష్యత్తు కోసం పోలీసులు అనే పుస్తకం చెబుతోంది.

పోలీసులు లేకపోతే ఏమవుతుంది?

కాపలాగా పోలీసులు ఎవరూ లేకపోతే మీరెలా ప్రవర్తిస్తారు? వారు లేరు కదా అని చట్టాన్ని అతిక్రమించడానికి ప్రయత్నిస్తారా? మధ్య తరగతికీ ఉన్నత వర్గానికీ చెందిన, గౌరవనీయులుగా పేరొందిన అనేకమంది ఉద్యోగస్థులు అనిశ్చిత ప్రయోజనాల కోసం తమ పేరునూ భవిష్యత్తునూ పాడుచేయగల రహస్య నేరాలకు పాల్పడడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ‘ఆటో ఇన్సూరెన్స్‌ కంపెనీలను మోసగించడానికి కుట్ర పన్నారని 112 మందిపై నేరారోపణ చేయబడింది. వారిలో లాయర్లు, డాక్టర్లు, ఛిరోపాడిస్టులు, ఒక ఫిజికల్‌ థెరపిస్టు, ఒక ఆక్యుపంక్చరిస్టులతో పాటు పోలీసు కార్యనిర్వహణా విభాగానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నారని చెప్పబడింది’ అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవలే నివేదించింది.

ఇటీవల జరిగిన మరో అతి గొప్ప ధగా కేసు ధనవంతులైన కళా పోషకులను దిగ్భ్రమపరచింది. ఆ కేసులో ఒకప్పుడు న్యూయార్కులోని సోథ్‌బీ, లండన్‌లోని క్రిస్టీ అనే వేలం గృహాలలో పనిచేసిన మాజీ ప్రధాన కార్యనిర్వాహకులు ధరలు నిర్ధారించారని నిరూపించబడింది. జరిమానాలు, నష్టపరిహారాల క్రింద వారూ వారి వేలం గృహాలూ 843 మిలియన్ల డాలర్లకు బకాయిపడ్డారు! దీన్నిబట్టి సమాజంలోని అన్ని స్థాయిల్లోనూ డబ్బు మీది పేరాశ ప్రభావం ఉందని తెలుస్తోంది.

1997లో బ్రెజిల్‌ నగరమైన రసీఫలో పోలీసులు సమ్మె చేసినప్పుడు జరిగినదాన్ని బట్టి చూస్తే అదుపుచేసేవారు ఎవరూ లేరనగానే అనేకమంది నేరానికి ఒడిగడతారని స్పష్టమవుతోంది. వారికి ఎటువంటి మత సంబంధమైన నమ్మకాలున్నా, ఆ నమ్మకాలు వారి ప్రవర్తనపై ఎలాంటి ప్రభావమూ చూపించవు. వారు నీతి నియమాలను, సూత్రాలను చాలా తేలిగ్గా తీసుకుంటారు లేదా గాలికి వదిలేయగలరు. అల్పంగా గానీ అధికంగా గానీ అవినీతి వైపు మొగ్గు చూపుతున్న ఈ లోకంలోని అనేక దేశాల్లో పోలీసులు గెలుపొందలేని పోరాటాన్ని సాగిస్తున్నారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

మరోవైపున, కొందరు పై అధికారులను గౌరవిస్తారు కాబట్టి వారు నియమాలను పాటిస్తారు. ఉనికిలో ఉండడానికి దేవుడు అనుమతించిన అధికారులకు లోబడి ఉండమని అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు చెప్పాడు. ఎందుకంటే వారు సమాజంలో కనీసం కొంతమేరకైనా భద్రతను కాపాడతారు. అలాంటి అధికారుల గురించి ఆయన, “కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము” అని వ్రాశాడు.​—రోమీయులు 13:3-5.

మారుతున్న సామాజిక పరిస్థితులు

సామాజిక పరిస్థితులు మెరుగుపడడంలో పోలీసుల ప్రభావం కొంతమేరకు ఉందనడంలో సందేహం లేదు. పోలీసులు, వీధుల్లో మాదక ద్రవ్యాలు, దౌర్జన్యం అనేవి ఏమాత్రం లేకుండా చేసినప్పుడు ప్రజలు అలాంటి మెరుగైన సమాజపు ఖ్యాతికి తగినట్లు జీవించడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి, సమాజాన్ని తీర్చిదిద్దడమనేది ఏ పోలీసు బలగమూ చేయలేదు.

పోలీసుల అవసరమే ఉండనంతగా చట్టాన్ని గౌరవించే ప్రజలతో నిండి ఉండే ఒక సమాజాన్ని మీరు ఊహించుకోగలరా? పరస్పరం సహాయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటూ సహాయం కోసం పోలీసులను ఎవ్వరూ ఏ మాత్రం సంప్రదించవలసిన అవసరం ఉండని ఒక లోకాన్ని మీరు ఊహించుకోగలరా? బహుశా అది కేవలం ఊహ మాత్రమే అని మీకనిపించవచ్చు. కానీ “ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్య[మే]” అని పలికిన యేసు మాటల సందర్భం వేరే అయినప్పటికీ అవి నిస్సందేహంగా దీనికి వర్తిస్తాయి.​—మత్తయి 19:26.

బైబిలు భవిష్యత్తులోని ఒక కాలం గురించి వర్ణిస్తోంది, ఆ కాలంలో సర్వ మానవాళి యెహోవా దేవుడు స్థాపించిన ప్రభుత్వానికి లోబడి ఉంటుంది. “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును.” (దానియేలు 2:44) యథార్థ ప్రజలందరికీ దేవుని ప్రేమ మార్గం గురించి బోధించడం ద్వారా ఈ నూతన ప్రభుత్వం నేరాన్ని ఉద్భవింపజేసే సమాజ పరిస్థితులను మార్చివేస్తుంది. అప్పుడు “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెషయా 11:9) యెహోవా రాజుగా నియమించిన యేసుక్రీస్తుకు అన్ని రకాల నేరాలను అరికట్టే సామర్థ్యం ఉంది. “కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు; నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును.”​—యెషయా 11:3, 4.

అక్కడ నేరస్థులూ ఉండరు, నేరాలూ ఉండవు. పోలీసుల అవసరం అంతకంటే ఉండదు. ప్రతి ఒక్కరూ ‘ఎవరి భయములేకుండ తమ ద్రాక్షచెట్టు క్రిందను తమ అంజూరపు చెట్టు క్రిందను కూర్చుంటారు.’ (మీకా 4:4) బైబిలులో వర్ణించబడిన ఆ “క్రొత్త భూమి”లో మీరు కూడా ఒక భాగమవ్వాలనుకుంటే, దేవుడు తన వాక్యంలో ఏమని వాగ్దానం చేశాడో దాని గురించి పరిశోధించడానికి ఇదే సరైన సమయం.​—2 పేతురు 3:13. (g02 7/8)

[12వ పేజీలోని బ్లర్బ్‌]

పోలీసుల అవసరం ఉండనంతగా చట్టాన్ని గౌరవించే ప్రజలతో ఉండే ఒక సమాజాన్ని మీరు ఊహించుకోగలరా?

[12వ పేజీలోని బ్లర్బ్‌]

అక్కడ నేరస్థులూ ఉండరు, నేరాలూ ఉండవు

[11వ పేజీలోని బాక్సు/చిత్రం]

పోలీసులు వర్సెస్‌ ఉగ్రవాదులు

ప్రజలను కాపాడే విషయంలో హైజాకర్లు, కిడ్నాపర్లు, ఉగ్రవాదులు పోలీసుల ఎదుట అతి క్లిష్టమైన సవాళ్ళను ఉంచుతారని సెప్టెంబరు 11, 2001న న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డి.సి. నగరాల్లో జరిగిన సంఘటనలు నిరూపించాయి. నిలిపివున్న విమానాన్ని చాలా వేగంగా స్వాధీనం చేసుకోగలిగే శిక్షణను ప్రపంచంలోని అనేక భాగాల్లో ఉన్న పోలీసు స్పెషల్‌ స్క్వాడ్‌లు పొందాయి. వాళ్ళు ఆశ్చర్యకరమైన రీతుల్లో బిల్డింగుల్లోకి ప్రవేశించే నైపుణ్యాలను అంటే ఇంటి పైకప్పునుండి తాళ్ళ సాయంతో దిగడం, కిటికీల్లోంచి దూకడం, తాత్కాలికంగా స్పృహ తప్పించే బాంబులను, భాష్పవాయువు బాంబులను విసరడం వంటి నైపుణ్యాలను కూడా నేర్చుకున్నారు. అలాంటి శిక్షణ పొందిన పోలీసులు ఉగ్రవాదులను విభ్రాంతికి గురిచేసి, వారి ఆధీనంలో ఉన్నవారిని అతి తక్కువ ప్రమాదాలతో కాపాడడంలో తరచూ విజయం సాధించారు.

[చిత్రసౌజన్యం]

James R. Tourtellotte/U.S. Customs Service

[12వ పేజీలోని చిత్రం]

దేవుని నూతన లోకంలో ఏ మాత్రం అవసరం లేని వస్తువులు