కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పోలీసు సంరక్షణ ఆశలు, భయాలు

పోలీసు సంరక్షణ ఆశలు, భయాలు

పోలీసు సంరక్షణ ఆశలు, భయాలు

పంతొమ్మిదవ శతాబ్దపు తొలి భాగంలో ప్రొఫెషనల్‌ పోలీసుల కోసం చేయబడిన ప్రతిపాదనలను అనేకమంది తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సాయుధ పోలీసులు ఉండడం తమ స్వేచ్ఛకు హాని కలిగించవచ్చని వారు భయపడ్డారు. ఫ్రాన్స్‌లో జోసెఫ్‌ ఫూష ఆధ్వర్యంలోని ఫ్రెంచి పోలీసు గూఢచారుల వ్యవస్థ వంటి పోలీసు వ్యవస్థ ఏర్పడుతుందేమోనని కొంతమంది భయపడ్డారు. అయినప్పటికీ, ‘పోలీసులు లేకుండా మనం ఏమి చేయగలం?’ అని వారు తమను తాము ప్రశ్నించుకోవాల్సివచ్చింది.

లండన్‌, ప్రపంచంలో అతి పెద్ద నగరంగా అత్యంత ఐశ్వర్యవంతమైన నగరంగా మారింది; అక్కడ నేరం దినదినం అధికమవుతూ వ్యాపారాన్ని భయపెడుతోంది. స్వచ్ఛందంగా పని చేసే వాచ్‌మెన్‌ గానీ దొంగలను పట్టే వృత్తిగలవారు గానీ ప్రైవేటు సంస్థలు డబ్బు చెల్లించే బో స్ట్రీట్‌ రన్నర్‌లు గానీ ప్రజలను వారి ఆస్తులను రక్షించడంలో సఫలులు కాలేకపోతున్నారు. ఆంగ్లేయ పోలీసు: రాజకీయ, సమాజ చరిత్ర (ఆంగ్లం) అనే తన పుస్తకంలో “దినదినం పెరిగిపోతున్న నేరాలు గలాటాలు నాగరిక సమాజంలో ఉండకూడని విషయాలుగా పరిగణించబడ్డాయి” అని క్లీవ్‌ ఎమ్‌స్లే అన్నాడు. అందుకే లండన్‌ ప్రజలు ప్రొఫెషనల్‌ పోలీసుల వల్ల ప్రయోజనం ఉంటుందని ఆశించి సర్‌ రాబర్ట్‌ పీల్‌ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్‌ పోలీసు బలగాన్ని కలిగి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. * 1829 సెప్టెంబరులో యూనిఫారాలు ధరించిన కానిస్టేబుళ్ళు లండన్‌ నగరంలో గస్తీ తిరగడం ప్రారంభించారు.

వారి ఆధునిక చరిత్ర ఆరంభం నుండి పోలీసుల విషయం, ఆశకూ భయానికీ సంబంధించిన వివాదాలను అంటే, వారు భద్రతను కలిగిస్తారనే ఆశనూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారేమోననే భయాన్నీ కలిగించింది.

అమెరికా పోలీసుల ఉద్భవం

అమెరికాలో ప్రొఫెషనల్‌ పోలీసులున్న నగరాల్లో న్యూయార్క్‌ నగరం మొట్టమొదటిది. నగరంలో ఐశ్వర్యం పెరిగినట్లుగానే నేరమూ పెచ్చుపెరిగిపోయింది. 1830 కల్లా, పెన్నీ ప్రెస్‌ అని పిలువబడిన చౌకగా విక్రయించబడే దినపత్రికల్లో అచ్చయ్యే నేరం గురించిన ఘోరమైన కథలను ప్రతి కుటుంబం చదవగలిగేది. ప్రజల అసమ్మతి పెరిగిపోవడంతో న్యూయార్క్‌ నగరం 1845లో తన పోలీసు బలగాన్ని ప్రారంభించింది. న్యూయార్క్‌ ప్రజలు లండన్‌ ప్రజలు అప్పటి నుండి ఒకరి పోలీసుల పట్ల మరొకరు ఎంతో ఆకర్షించబడ్డారు.

ప్రభుత్వాధీనంలోని సాయుధ పోలీసులంటే ఆంగ్లేయులకున్న భయమే అమెరికన్లకూ కలిగింది. కానీ రెండు దేశాలూ భిన్నమైన పరిష్కార మార్గాలను రూపొందించుకున్నాయి. ఆంగ్లేయులు తమ పోలీసులకు పొడవైన టోపీ, ముదురు నీలి రంగు దుస్తులను ఎంపిక చేశారు. వారు కేవలం ఒక చిన్న దుడ్డుకఱ్ఱను మాత్రం కనబడకుండా ధరించేవారు. నేటికీ బ్రిటీష్‌ బాబీలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప తుపాకులను వెంట తీసుకువెళ్ళరు. అయితే ఒక నివేదిక “బ్రిటీష్‌ పోలీసులు కాలక్రమేణా పూర్తిగా సాయుధులయ్యే అవకాశాలు ఉన్నాయనే తలంపు అధికమవుతోంది” అని తెలియజేస్తోంది.

అయితే, అమెరికాలో ప్రభుత్వం తన బలగాన్ని దుర్వినియోగం చేస్తుందనే భయం అమెరికా రాజ్యాంగంలో రెండవ సవరింపుకు దారి తీసింది. ఆ సవరింపు “ప్రజలు ఆయుధాలను దగ్గర ఉంచుకోవడానికీ ధరించడానికీ హక్కు”కు సంబంధించి హామీనిచ్చింది. తత్ఫలితంగా పోలీసులకు తుపాకులు అవసరమయ్యాయి. కాలక్రమేణా, అమెరికన్‌ పోలీసులు వీధుల్లో కాల్చే కాల్పులు పోలీసులు నేరస్థుల వెంటపడ్డారనే ప్రత్యేక గుర్తింపుగా వ్యాప్తి చెందింది. తుపాకులు ధరించాలనే అమెరికన్ల దృక్పథానికి మరొక కారణమేమిటంటే అమెరికాలో మొట్టమొదటి పోలీసు బలగం ఉద్భవించిన సమాజం లండన్‌ నుండి పూర్తిగా భిన్నమైనది కావడమే. న్యూయార్క్‌లో ప్రజల సంఖ్య అతివేగంగా పెరిగిపోవడం వల్ల అది అల్లకల్లోలంగా మారిపోయింది. 1861-65 వరకు జరిగిన అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత, ముఖ్యంగా యూరప్‌ నుండి కూడా ఆఫ్రొ అమెరికన్లూ వేలాదిమంది వలస రావడం జాతి హింసలకు నడిపించింది. పోలీసులు తాము కఠినమైన పద్ధతులను చేపట్టాల్సిన అవసరముందని భావించారు.

ఆ కారణంగానే, తరచూ పోలీసులు హానికరమైన ఆవశ్యకంగా పరిగణించబడ్డారు. అప్పుడప్పుడది కాస్త మోతాదు మించినా కొంతమేరకు శాంతి భద్రతలను పొందుతామనే ఆశతో ప్రజలు దాన్ని సహించారు. అయితే ప్రపంచంలోని కొన్ని భాగాల్లో ఒక విభిన్నమైన పోలీసు బలగం తయారవుతోంది.

భీతిని కలిగించే పోలీసులు

19వ శతాబ్దపు ఆరంభంలో ఆధునిక పోలీసులు వృద్ధి చెందుతున్న సమయంలో, ప్రజల్లో చాలా మట్టుకు యూరప్‌ సామ్రాజ్య పాలనలోనే నివసించారు. సాధారణంగా యూరోపియన్‌ పోలీసులు ప్రజలకు బదులుగా పాలకులనే రక్షించడానికి సంస్థీకరించబడ్డారు. మిలటరీ స్టైల్లో ఆయుధాలు ధరించే పోలీసులు తమ దేశంలో ఉండడమనే ఆలోచనను ఏ మాత్రం ఇష్టపడని బ్రిటీష్‌ కూడా ఇతర కాలనీలను అదుపులో ఉంచుకోవడానికి మిలటరీ పోలీసులను ఉపయోగించే విషయంలో సందేహించినట్లనిపిస్తుంది. పోలీసింగ్‌ ఎక్రాస్‌ ద వరల్డ్‌ అనే తన పుస్తకంలో “పోలీసుల క్రూరత్వం, అవినీతి, దౌర్జన్యం, హత్య, అధికార దుర్వినియోగం వంటివాటితో కూడిన సంఘటనలు, వలస ప్రాంతాల్లో ఉండే పోలీసుల చరిత్రలో దాదాపు ప్రతి దశాబ్దంలోనూ జరిగాయి” అని రాబ్‌ మాబీ చెబుతున్నాడు. యూరోపియన్‌ వలస సామ్రాజ్యాల ఆధీనంలో ఉన్న పోలీసు వ్యవస్థ కూడా కొన్ని ప్రయోజనాలను చేకూరుస్తుందని పేర్కొన్న తర్వాత, అదే పుస్తకం “పోలీసు వ్యవస్థ అంటే అదొక ప్రభుత్వ బలగమే కానీ ప్రజలకు సేవచేసే వ్యవస్థ కాదనే అపోహను ప్రపంచవ్యాప్తంగా కలుగజేసింది” అని చెబుతోంది.

నిరంకుశ ప్రభుత్వాలు విప్లవాల భయంతో తమ పౌరులపై నిఘా వేయడానికి దాదాపు ఎల్లప్పుడూ రహస్య పోలీసులను ఉపయోగించాయి. అలాంటి పోలీసులు తాము దేశ విద్రోహులుగా భావించినవారిని చిత్రహింసలు పెట్టి వదిలేయడం ద్వారా లేదా చంపడం ద్వారా లేదా న్యాయస్థానానికి తీసుకువెళ్ళకుండా అరెస్టు చేయడం ద్వారా సమాచారాన్ని రాబట్టేవారు. నాజీలకు గెస్టపో ఉండేది, సోవియట్‌ యూనియన్‌కు కెజిబి, తూర్పు జర్మనీకి స్తాసీ ఉండేవి. ఆశ్చర్యకరంగా, సుమారు 1 కోటి 60 లక్షల జనాభాను అదుపు చేసేందుకు, స్తాసీ 1,00,000 మంది పోలీసులను, దాదాపు అయిదు లక్షల మంది ఇన్‌ఫార్మర్లను ఉపయోగించింది. పోలీసులు 24 గంటలూ టెలిఫోనులో జరిగే సంభాషణలను విని మొత్తం జనాభాలో మూడోవంతు భాగంపై నివేదికలు తయారుచేశారు. “స్తాసీ పోలీసులకు పరిమితులు లేవు, లజ్జా లేదు. ప్రొటస్టెంట్‌, క్యాథలిక్‌ వర్గాల ఉన్నత అధికారులతోపాటు క్రైస్తవమత పాదిరీలు అధిక సంఖ్యలో రహస్య ఇన్‌ఫార్మర్లుగా చేర్చుకోబడ్డారు. వారి కార్యాలయాలూ, క్రైస్తవ గురువు చెవిలో రహస్య పాప కార్యాలను చెప్పుకునే స్థలాలూ (కన్ఫెషన్‌ గదులు) ఎవరికీ తెలియకుండా వినడానికి తోడ్పడే పరికరాలతో నిండిపోయాయి” అని జాన్‌ కోలర్‌ తన పుస్తకం స్తాసీలో అన్నారు.

అయినా, భయోత్పాదకమైన పోలీసులు నిరంకుశ ప్రభుత్వమున్న రాజ్యాల్లో మాత్రమే కనబడరు. ఇతర పెద్ద పెద్ద నగరాల్లోని పోలీసులు అతిక్రూరమైన రీతిలో చట్టాన్ని అమలుచేసినప్పుడు, ప్రత్యేకించి అల్పసంఖ్యాక వర్గాలను గురిగా చేసుకున్నప్పుడు వారు భీతిని కలిగిస్తున్నారని నిందించబడ్డారు. లాస్‌ ఏంజెల్స్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఒక కుంభకోణంపై వ్యాఖ్యానిస్తూ ఒక వార్తాపత్రిక, ఇది “పోలీసుల దుష్ప్రవర్తనను ఒక నూతన స్థాయికి తీసుకువెళ్ళి, వారికి ముఠా పోలీసులు అనే కొత్త పేరును తెచ్చిపెట్టింది” అని పేర్కొన్నది.

ఆ కారణంగానే, ప్రభుత్వాధికారులు తమ ప్రతిష్ఠను మెరుగుపరుచుకోవడానికి పోలీసు విభాగాలు ఏమి చేయగలవు? అని అడుగుతున్నారు. తమ ప్రజాసేవ పాత్రను నొక్కి చెప్పడానికి అనేక పోలీసు బలగాలు తమ వ్యవస్థలో సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యాన్నివ్వడానికి ప్రయత్నించాయి.

కమ్యూనిటీ పోలీసు వ్యవస్థ గురించి ఆశ

జపాన్‌లోని పొరుగువారి సంరక్షణా పద్ధతి ఇతర దేశాలను ఆకర్షించింది. జపాన్‌ పోలీసులు ఒక్కొక్క నిర్దిష్ట ప్రాంతంలో ఒక చిన్న పోలీసు స్టేషనులో, దాదాపు పండ్రెండు మంది పోలీసులతో బదిలీ పద్ధతిలో పనిచేస్తారు. చాలా కాలం నుండి జపాన్‌లో నివసిస్తున్న బ్రిటన్‌ దేశస్థుడైన నేరశాస్త్ర లెక్చరర్‌ ఫ్రాంక్‌ లైష్‌మన్‌ “కోబాన్‌ అనబడే చిన్న కార్యాలయం ద్వారా పోలీసులు అందించే స్నేహపూర్వక సేవా కార్యకలాపాల పరిధి చాలా ప్రఖ్యాతిగాంచింది. అది జపాన్‌లో చాలావరకు పేరులేని వీధుల్లోని చిరునామాల గురించి సమాచారాన్ని అందించడం; తమకు దొరికిన గొడుగుల్లో వాటి యజమానులు వచ్చి తీసుకువెళ్ళకుండా ఉండిపోయినవాటిని ఉద్యోగాలకు వెళ్తూ వర్షంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు బదులివ్వడం; త్రాగి మత్తులో ఉన్న వ్యాపారస్థులు లేదా ఆఫీసర్లు (సరరిమన్‌) చివరి రైలులో ఇంటికి చేరుకునేలా చూడడం; ‘పౌర సమస్యల’కు సలహాలివ్వడం” అని అంటున్నాడు. ఇరుగుపొరుగువారి సహకారంతో పనిచేసే పోలీసు వ్యవస్థ, జపానుకు సురక్షితమైన వీధులున్నాయనే, అసూయకలిగించే ఖ్యాతిని తెచ్చే ఒక కారకమయ్యింది.

ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పొరుగువారి సంరక్షణా పద్ధతి సమర్థవంతంగా ఉండగలదా? కొందరు నేరశాస్త్ర విద్యార్థులు దీని నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. సమాచారం అందించే విభాగంలో జరిగిన ఆధునిక పురోభివృద్ధి, పోలీసులు తాము సేవ చేస్తున్న ప్రజల నుండి ఎడమయ్యేలా చేసింది. నేడు అనేక పట్టణాల్లో పోలీసుల సేవ అంటే ప్రాముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం మాత్రమే అన్నట్లనిపిస్తుంది. అది కొన్నిసార్లు నేరాన్ని నిరోధించడంపై మొదట్లో ఉన్న గంభీరతను కోల్పోయినట్లు కనిపిస్తుంది. ఇలాంటి ధోరణికి ప్రతిక్రియగా పొరుగువారి సంరక్షణా పద్ధతి మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది.

పొరుగువారి సంరక్షణ

“ఇది నిజంగా సఫలమవుతుంది; నేరాలను తగ్గిస్తుంది. పొరుగువారి సంరక్షణ అంటే ఒకరి సంరక్షణ గురించి ఒకరు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలియజేయడమే. ఇరుగుపొరుగువారు ఒకర్నొకరు తెలుసుకునేందుకూ పేర్లను ఫోన్‌ నంబర్లను ఇచ్చిపుచ్చుకోవడానికీ నేరాలను ఎలా నిరోధించాలో తెలుసుకోవడానికీ మేము సమావేశాలను ఏర్పాటు చేస్తాం. నేను ఆ ప్రాజెక్టును బాగా ఆనందిస్తాను ఎందుకంటే అది పరిసర ప్రాంతాల్లోకి సౌభ్రాతృత్వ భావాన్ని మళ్ళీ ప్రవేశపెడుతుంది. తరచుగా, ప్రజలకు తమ పొరుగువారెవరో కూడా తెలియదు. ఈ ప్రణాళిక పరస్పర పరిచయాన్ని పెంచుతోంది కాబట్టి సఫలమవుతోంది” అని వేల్స్‌లోని డూయి అనే ఒక పోలీసు కానిస్టేబుల్‌ తన పని గురించి చెబుతున్నాడు. ఇది పోలీసులకూ ప్రజలకూ మధ్య సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది.

మరో విషయం ఏమిటంటే బాధితుల పట్ల ఎక్కువ కనికరం చూపించమని పోలీసులను ప్రోత్సహించడం. “డాక్టర్లు తమ రోగులతో మాట్లాడే వ్యవహరించే వైఖరి ఎంత ప్రాముఖ్యమైనదో పోలీసులు బాధితులతో వ్యవహరించే విధానం కూడా అంతే ప్రాముఖ్యమైనదని వారికి బోధించాలి” అని ప్రఖ్యాతిగాంచిన డచ్‌ విక్టిమాలజిస్ట్‌ యాన్‌ వాన్‌ డేక్‌ వ్రాశారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికీ గృహ సంబంధ దౌర్జన్యాన్నీ మానభంగాన్నీ నిజమైన నేరాలుగా పరిగణించడంలేదు. కానీ రాబ్‌ మాబీ “పోలీసులు గృహ సంబంధ దౌర్జన్య కేసుల్నీ మానభంగం కేసుల్నీ చేపట్టే విధానం ఇటీవలి సంవత్సరాల్లో గమనార్హమైన రీతిలో మెరుగుపడింది. అయినప్పటికీ ఇంకా చాలా మెరుగుపడాల్సివుంది” అని అంటున్నాడు. దాదాపు ప్రతీ పోలీసు బలగం మెరుగుపడాల్సిన మరొక అంశం అధికార దుర్వినియోగం.

పోలీసుల అవినీతి గురించిన భయం

పోలీసుల ద్వారా కాపాడబడతామని భావించడం కొన్నిసార్లు వట్టి అమాయకత్వమే అనిపిస్తుంది, ప్రత్యేకించి పోలీసుల అవినీతి గురించి వార్తలు వ్యాప్తి చెందినప్పుడు. అలాంటి నివేదికలు పోలీసు చరిత్ర ఆరంభం నుండే ఉన్నాయి. 1855వ సంవత్సరాన్ని సూచిస్తూ ఎన్‌వైపిడి​—⁠ఎ సిటీ అండ్‌ ఇట్స్‌ పోలీస్‌ అనే పుస్తకం, “అనేకమంది న్యూయార్క్‌ నివాసుల మనస్సుల్లో, హంతకులనూ పోలీసులనూ గుర్తుపట్టడం కష్టమవుతోందనే భావం ముద్రించుకుపోయింది” అని వర్ణించింది. డంకన్‌ గ్రీన్‌ వ్రాసిన ఫేసెస్‌ ఆఫ్‌ లాటిన్‌ అమెరికా అనే పుస్తకం, పోలీసు వ్యవస్థ “అవినీతితో, అసమర్థతతో, మానవ హక్కులను అణగద్రొక్కేవారితో నిండిపోయిందని చాలామంది నమ్ముతున్నారు” అని నివేదిస్తోంది. 14,000 మంది పటిష్ఠమైన లాటిన్‌ అమెరికన్‌ పోలీసులకు ముఖ్యాధికారి “నెలకు 5,000 రూపాయల కంటే తక్కువ సంపాదించే ఒక పోలీసు నుండి మీరు ఏమి ఆశించగలరు? ఆయనకు ఎవరైనా లంచం ఇవ్వజూపితే ఆయనేం చేస్తాడు?” అని అన్నాడు.

అవినీతి అనే సమస్య ఎంత గంభీరమైనది? దానికి సమాధానం మీరు ఎవరిని ఆ ప్రశ్న అడుగుతున్నారన్న దానిపై ఆధారపడివుంటుంది. ఉత్తర అమెరికాలో 1,00,000 జనాభావున్న ఒక పట్టణంలో సంవత్సరాలపాటు గస్తీ తిరిగిన ఒక పోలీసు “కొందరు పోలీసుల్లో నిజాయితీ లేదనడం వాస్తవమే, కానీ అధిక శాతం మంది పోలీసులు నిజాయితీ గలవారే. దాన్ని నేను స్పష్టంగా చూశాను” అని జవాబిస్తున్నాడు. మరోవైపున, వేరొక దేశంలో 26 సంవత్సరాల అనుభవంగల ఒక నేర పరిశోధకుడు “అవినీతి అనేది దాదాపు విశ్వవ్యాప్తంగా ఉందనే నేను భావిస్తాను. పోలీసుల్లో నిజాయితీ అన్నది చాలా తక్కువ. ఒక పోలీసు కొల్లగొట్టబడిన ఒక ఇంటిని పరిశోధించేటప్పుడు డబ్బు దొరికితే దాన్ని బహుశా ఆయనే తీసుకుంటాడు. దొంగిలించబడిన విలువైన వస్తువులేవైనా ఆయన కనుగొంటే వాటిలో కొన్నింటిని ఆయన తన కోసం ఉంచుకుంటాడు” అని జవాబిస్తున్నాడు. కొందరు పోలీసులు ఎందుకు అవినీతిపరులవుతారు?

కొందరు ఎన్నో ఉన్నత ప్రమాణాలతో ప్రారంభిస్తారు కానీ తర్వాత్తర్వాత అవినీతిపరులైన తోటివారి ప్రభావానికీ తమ చుట్టుప్రక్కల్లోని నేర ప్రపంచపు దిగజారిపోయిన ప్రమాణాల ప్రభావానికీ లొంగిపోతారు. వాట్‌ కాప్స్‌ నో అనే పుస్తకం చికాగోలో గస్తీ తిరిగే పోలీసు “పోలీసులకు దుష్టత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. వారి చుట్టూ అదే వ్యాపించి ఉంటుంది. వారు దాన్ని ముట్టుకుంటారు . . . రుచి చూస్తారు . . . వాసన చూస్తారు . . . వింటారు . . . వారు దానితో వ్యవహరించాల్సిందే” అని అన్నట్లు చెబుతోంది. దుర్నీతితో అలాంటి సంబంధం సులభంగానే ప్రతికూల ప్రభావాన్ని చూపించగలిగే అవకాశముంది.

పోలీసులు అమూల్యమైన సేవలను అందిస్తున్నప్పటికీ, అది ఆదర్శనీయమైనది కాదు. ఏదైనా మంచిదాని కోసం మనం ఎదురుచూడవచ్చా?

(g02 7/8)

[అధస్సూచి]

^ బ్రిటీష్‌ పోలీసులు వారి సంస్థాపకుడైన సర్‌ రాబర్ట్‌ (బాబీ) పీల్‌ పేరు మీద బాబీస్‌ అని పేరు గాంచారు.

[8, 9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

“బ్రిటీష్‌ బాబీలు అద్భుతమైనవాళ్ళు కదా?”

ప్రొఫెషనల్‌ పోలీసుల వైభవాన్ని అనుభవించగలిగిన వారిలో బ్రిటీష్‌ దేశస్థులు మొట్టమొదటివారు. వారు చాలా చురుగ్గా నడిచిన సమర్థవంతమైన తమ గుర్రపు బగ్గీ విధానం మాదిరి తమ సమాజం చక్కగా సంస్థీకరించబడాలని కోరుకున్నారు. 1829లో హోమ్‌ సెక్రటరీ సర్‌ రాబర్ట్‌ (బాబీ) పీల్‌, స్కాట్‌లాండ్‌ యార్డ్‌లో హెడ్‌ క్వార్టర్స్‌ సదుపాయాలతో లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులను ఆమోదించమని పార్లమెంట్‌ను ఒప్పించాడు. త్రాగుబోతుతనానికీ వీధుల్లో జరిగే జూదాలకూ వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం వల్ల వారు మొదట్లో అంతగా పేరుపొందలేదు కానీ కాలక్రమేణా బాబీలు ప్రజల అభిమానులైపోయారు.

1851లో లండన్‌లోని అత్యంత పెద్ద ఎగ్జిబిషన్‌కు వచ్చి బ్రిటీష్‌ పారిశ్రామిక విభాగం సాధించిన విజయాలను చూసి ఆనందించమని ప్రపంచాన్ని లండన్‌ సగర్వంగా ఆహ్వానించింది. అతిథులు క్రమబద్ధమైన వీధులను చూసి, త్రాగుబోతులూ వేశ్యలూ జులాయిగా తిరిగేవాళ్ళూ లేకపోవడం చూసి అబ్బురపడ్డారు. సమర్థవంతులైన పోలీసులు జనసమూహాలకు మార్గనిర్దేశాన్నిచ్చారు, తమ బ్యాగులను మోసుకువెళ్ళడంలో సందర్శకులకు సహాయపడ్డారు, రోడ్లు దాటడానికి ప్రజలకు సహాయపడ్డారు, చివరికి వృద్ధ స్త్రీలను టాక్సీవరకు ఎత్తుకొని కూడా తీసుకువెళ్ళారు. బ్రిటీష్‌ ప్రజలతోపాటు విదేశీ పర్యాటకుల నోట కూడా “బ్రిటీష్‌ బాబీలు అద్భుతమైనవాళ్ళు కదా?” అనే మాటలు వినిపించడం ఆశ్చర్యమేమీ కాదు.

నేరాన్ని నిరోధించడంలో వాళ్ళు చాలా సమర్థవంతులుగా కనిపించడంవల్ల, ప్రొఫెషనల్‌ నేరమనేది దాదాపు ఏమాత్రం లేకుండా నిర్మూలమయ్యే ఒక కాలం వస్తుందని ఛెస్టర్‌లోని చీఫ్‌ కానిస్టేబుల్‌ ఒకాయన 1873లో ఊహించుకున్నాడు! అంబులెన్సులను, అగ్నిమాపక దళాలను కూడా పోలీసులు వ్యవస్థీకరించడం ఆరంభించారు. వాళ్ళు పేదలకు బూట్లూ, బట్టలూ అందజేసే ఛారిటీలను కూడా నిర్వర్తించారు. కుర్రవాళ్ళ కోసం కొందరు క్లబ్బులను, విహారయాత్రలను, హాలీడే హోమ్‌లను వ్యవస్థీకరించారు.

కొత్త పోలీసులపై తీసుకున్న క్రమశిక్షణా చర్యల్లో అవినీతికి, క్రూరత్వానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. కానీ అత్యధికులు సాధ్యమైనంత తక్కువ బలగంతో శాంతిని కాపాడడాన్ని గర్వకారణంగా భావించారు. 1853లో లాంక్‌షైర్‌లోనున్న వైగన్‌లోని పోలీసులు గనుల్లో పనిచేసే కార్మికుల సమ్మె కారణంగా ఒక గొడవను ఎదుర్కోవాల్సివచ్చింది. కేవలం పదిమందికి ఇన్‌చార్జ్‌గా ఉన్న ధైర్యవంతుడైన ఒక సార్జంట్‌, ఆ గని యజమాని తుపాకులను ఉపయోగించడానికి దృఢంగా నిరాకరించాడు. అప్పట్లో వృద్ధి చెందిన వైఖరిని, హెక్టర్‌ మాక్‌లాయిడ్‌ తన తండ్రిలాగే తానూ పోలీసు వృత్తిని చేపట్టినప్పుడు 1886లో ఆయనకు అందిన ఒక ఉత్తరం చక్కగా వర్ణిస్తుంది. ది ఇంగ్లీష్‌ పోలీస్‌ అనే పుస్తకంలో పేర్కొన్నట్లుగా ఆ ఉత్తరంలో “మీరు కఠినంగా ఉంటే ప్రజల సానుభూతిని కోల్పోతారు . . . నేను ప్రజలను మొదటి స్థానంలో ఉంచుతాను ఎందుకంటే మీరు సమాజానికి సేవకులు, కొంతకాలం వరకు మీరు వారి మధ్య ఉన్నారు కాబట్టి వారితోపాటు మీ పై ఆఫీసరును కూడా సంతోషపెట్టడం మీ కర్తవ్యం” అని ఉంది.

లండన్‌ నగర పోలీసు ఉద్యోగం నుండి రిటైరయిన హేడెన్‌ అనే ఇన్‌స్పెక్టర్‌ “ఎల్లప్పుడూ నిగ్రహంతో ప్రవర్తించమని మాకు బోధించబడింది, ఎందుకంటే విజయవంతంగా కాపలా కాయాలంటే సమాజ మద్దతు ఉండాలి. మా చిట్ట చివరి ఆశ్రయం మా వద్ద ఉండే చిన్న దుడ్డుకర్ర మాత్రమే, అత్యధికమంది పోలీసులు తమ కెరీర్‌ మొత్తంలో దాన్ని ఉపయోగించనేలేదు” అని అంటున్నాడు. టీవీలో 21 సంవత్సరాలపాటు కొనసాగిన ఒక ప్రఖ్యాతిగాంచిన సీరియల్‌ కూడా బ్రిటీష్‌ బాబీల గురించి సానుకూలమైన కీర్తిని చేకూర్చింది, ఆ సీరియల్‌ నిజాయితీగా ఉంటూ తను బీటువేసే ప్రాంతంలోని ప్రతి ఒక్కరితో పరిచయం ఉన్న ఒక పోలీసు కథ, దాని పేరు డిక్సొన్‌ ఆఫ్‌ డాక్‌ గ్రీన్‌. అది బహుశా ఆ విధంగా ప్రవర్తించాలని పోలీసులను ప్రోత్సహించి ఉండవచ్చు, అయితే అది బ్రిటన్‌ ప్రజలు పోలీసులను ఇష్టపడేలా ప్రోత్సహించిందన్నది మాత్రం నిజం.

1960లలో బ్రిటన్‌లోని వైఖరులు మారిపోయాయి, దేశమంటే గర్వించే వైఖరి స్థానంలో అధికారాన్ని ప్రశ్నించే వైఖరి చోటుచేసుకుంది. 1970లలో పోలీసుల అవినీతి, జాతి ద్వేషాల గురించిన నివేదికలు వారి ప్రతిష్ఠను బుగ్గిపాలు చేశాయి, పొరుగువారి సంరక్షణా పద్ధతి ద్వారా ప్రజాదరణ పొందాలని ఎంత ప్రయత్నించినా అవన్నీ వృధా అయ్యాయి. జాతివివక్షత చూపిస్తున్నారు, దోషనిరూపణ చేయడానికి సాక్ష్యాలను కూడగట్టుకుంటున్నారు వంటి అనేక అపనిందలకు గురైన తర్వాత, ఈ మధ్యే పోలీసులు తమ ప్రవర్తనను ఇంకా మెరుగుపరుచుకోవడానికి యథార్థ ప్రయత్నాలు చేశారు.

[చిత్రసౌజన్యం]

పై ఫోటో: http://www.constabulary.com

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

న్యూయార్క్‌లో అద్భుతమా?

పోలీసులు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తే ఫలితాలు గమనార్హంగా ఉండే అవకాశముంది. న్యూయార్క్‌ నగరం చాలాకాలం వరకు అతి ప్రమాదకరమైన నగరంగా పరిగణించబడింది, 1980వ దశకం చివరికల్లా క్రమశిక్షణలేని పోలీసులకు పరిస్థితి చేజారిపోతున్నట్లే అనిపించింది. ఆర్థిక సంక్షోభం వల్ల నగర పాలక ప్రభుత్వం పోలీసుల వేతనాలను స్తంభింపచేయడమేకాక వారి సంఖ్యనూ తగ్గించివేసింది. మాదకద్రవ్యాల పంపిణీదారులు విస్తరించుకుపోవడంతో నగరంలో హింస వెల్లువలా ఉవ్వెత్తున లేచింది. నగర వాసులు తుపాకుల పేలుడు శబ్దాల మధ్యనే నిద్రకుపక్రమించేవారు. 1991లో పెద్ద పెద్ద జాతి కలహాలు సంభవించాయి. దానికి పోలీసులు తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక విప్లవాత్మకమైన ప్రదర్శనను స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు.

అయితే ఒక కొత్త పోలీసు ఉన్నతాధికారి తన పోలీసు ఆఫీసర్లను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చి, ఒక్కొక్క ప్రాంతంలోని పోలీసులను క్రమంగా కలుసుకుంటూ వారు చేస్తున్న వ్యూహరచనలను పరిశీలించడం ప్రారంభించాడు. జేమ్స్‌ లార్డ్‌నర్‌, థామస్‌ రెపెట్టొలు ఎన్‌వైపిడి అనే తమ పుస్తకంలో “డిటెక్టివ్‌ల అధినేత గానీ నార్కొటిక్స్‌ బ్యూరో అధినేత గానీ ఎలాంటి వారంటే ప్రాంతీయ అధికారులు వారి గురించి పేపర్లలో చదవడమే తప్ప వారిని స్వయంగా కలవడం చాలా అరుదు. ఇప్పుడైతే వారందరూ కలిసి ఒక్కచోటే చేరి గంటల తరబడి చర్చిస్తున్నారు” అని వివరించారు. నేరాల సంఖ్య తగ్గిపోనారంభించింది. ఒక నివేదిక ప్రకారం, హత్యలు 1993లో 2,000 కాగా 1998లో 633కు తగ్గాయి, గత 35 సంవత్సరాల్లోనూ అతి తక్కువ సంఖ్య అదే. న్యూయార్క్‌ ప్రజలు ఒక అద్భుతం గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. అధికారుల అవధానానికి వచ్చిన నేరాలు గత ఎనిమిది సంవత్సరాల్లో 64 శాతం తగ్గాయి.

ఈ అభివృద్ధి ఎలా సాధ్యమైంది? కాంప్‌స్టాట్‌ పద్ధతి​—⁠“కంప్యూటర్‌ ద్వారా నేరాలను పసిగట్టే పద్ధతి, ఆ పద్ధతిలో ప్రతివారం ప్రాంతాలవారీగా ఒక్కొక్క ప్రాంతంలోని నేరాల గణాంకవివరాలను పరిశీలిస్తూ సమస్యలు ఉత్పన్నమైన వెంటనే గుర్తించి చర్య తీసుకోబడుతుంది.”​—⁠ఆ విజయానికి ఒక కీలకం అని జనవరి 1, 2002 నాటి ద న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక సూచిస్తోంది. మాజీ పోలీసు కమీషనర్‌ బెర్నార్డ్‌ కెరిక్‌, “నేరం జరుగుతున్నచోటును గుర్తించి అది ఎందుకు జరుగుతుందో పరిశీలించిన తర్వాత అక్కడికి పోలీసు బలగాలను పంపించి ఆయా ప్రాంతాలు పర్యవేక్షణలో ఉండేలా చూసేవాళ్ళం. ఆ విధంగా నేరాలను అరికట్టవచ్చు” అని వ్యాఖ్యానించారు.

[7వ పేజీలోని చిత్రం]

జపాన్‌లోని పోలీసు స్టేషను

[7వ పేజీలోని చిత్రం]

హాంగ్‌కాంగ్‌లో ట్రాఫిక్‌ పోలీసు

[8, 9వ పేజీలోని చిత్రం]

ఇంగ్లీష్‌ సాకర్‌ పోటీలో జనసమూహాన్ని అదుపు చేయడం

[9వ పేజీలోని చిత్రం]

పోలీసు విధి నిర్వహణలో ఆక్సిడెంట్ల బాధితులకు సహాయం చేయడం కూడా ఉంది