ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
ఆహారం కోసం ఎలుకలు మనుష్యుల పోటీ
ఆస్ట్రేలియన్ కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సి.ఎస్.ఐ.ఆర్.ఓ) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒక మానవ శిశువు జన్మించినప్పుడు పది ఎలుక పిల్లలు జన్మిస్తున్నాయి. అంటే ప్రతీరోజు 3,60,000 క్రొత్త శిశువులు పోషించబడాలి, కానీ క్రొత్తగా జన్మించిన 36,00,000 ఎలుక పిల్లలకు కూడా ఆహారం కావాలి. ఉదాహరణకు ఇండోనేషియాలో దాదాపు 23 కోట్లమంది ఉన్నారు, వారిలో 60 శాతం మంది తమ దైనందిన కార్యక్రమాలకు అవసరమైన శక్తిని సంపాదించుకోవడం కోసం బియ్యం మీద ఆధారపడతారు. అయితే, ఆ దేశంలో ప్రతి సంవత్సరం వరి పంటలో 15 శాతాన్ని ఎలుకలే తింటాయి. “అంటే రెండు కోట్లకంటే ఎక్కువమంది ఇండోనేషియా ప్రజలను ఒక సంవత్సరంపాటు పోషించడానికి సరిపడే బియ్యాన్ని ఎలుకలే ఆరగిస్తున్నాయి,” అని సి.ఎస్.ఐ.ఆర్.ఓ శాస్త్రజ్ఞుడైన డా. గ్రాంట్ సింగిల్‌టన్ చెబుతున్నారు.
(g02 6/22)
నూనెను ఇష్టపడే ఏనుగులు
భారతదేశానికి ఈశాన్య దిశలో ఉన్న డిగ్‌బోయిలోని ఏనుగులకు నూనంటే ప్రియం. “ఏనుగులు నూనె బావుల వద్ద స్వేచ్ఛగా తిరుగుతూ, నూనె బావులనుండి నూనెను శుద్ధిచేసే స్థలాలకు తీసుకుని వెళ్ళే పైప్‌లైన్ల ప్రధాన వాల్వ్‌లను తరచూ తెరుస్తుంటాయి” అని ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సీనియర్ ఇంజనీరు రమన్ చక్రవర్తి చెబుతున్నాడు. “ఒక వాల్వ్ తెరుచుకున్నప్పుడు, ప్రత్యేకించి ముడిపదార్థంగా ఉన్న పెట్రోలియమ్‌ను పేరాఫిన్‌గా మారకుండా ఆపుచేసే ఆవిరిని నిర్బంధించే వాల్వ్ తెరుచుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ఏనుగులు ఎంతో ఇష్టపడుతున్నట్లు కనిపిస్తుంది.” నూనె అతివేగంగా బయటకు ప్రవహిస్తున్న “చప్పుడును” ఇష్టపడడమే కాకుండా “ముడిపదార్థాలతోపాటు వచ్చే మట్టి, నీళ్ళ” కోసం కూడా ఏనుగులు నూనె బావుల వైపుకు ఆకర్షించబడుతున్నట్లు కనిపిస్తుంది. “నీళ్ళు ఉప్పగా ఉంటాయి కాబట్టి ఏనుగులకు ఇష్టం” అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక నివేదిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అక్కడ నూనె కనుగొనబడడానికి అప్రయత్నంగా ఒక ఏనుగే దోహదపడింది. ఆ ప్రాంతానికి సంబంధించిన తొలి రైల్వే లైను కోసం లోహాన్ని మోసిన తర్వాత ఆ ఏనుగు క్యాంప్‌కు తిరిగివచ్చింది. అప్పుడు బ్రిటీష్ అధికారులు దాని కాళ్ళకు నూనె అంటుకుని ఉండడాన్ని గమనించి, ఏనుగు అడుగుజాడలను అనుసరించి ఒక నూనె గుంట వద్దకు చేరుకున్నారు. తత్ఫలితంగా 1889లో ఆసియాలోని మొదటి నూనె బావి తెరవబడింది. (g02 7/22)
అవివాహిత తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఎక్కువైపోతున్నారు
యూరప్‌కు చెందిన గణాంకవివరాల సంస్థయైన యూరోస్టాట్ ప్రకారం, ప్రస్తుతం యురోపియన్ యూనియన్‌లో జన్మించే నలుగురు శిశువులలో ఒకరు అవివాహిత తల్లిదండ్రులకు జన్మించిన శిశువని జర్మన్ వార్తాపత్రిక అయిన వెస్టడ్యూటస్క్ ఆల్జిమేయినీ జేయిటంగ్ నివేదించింది. 1980లో ఈ నిష్పత్తి 10 మందిలో ఒకరికన్నా తక్కువగా ఉండేది. అవివాహితులకు పుట్టిన పిల్లల సంఖ్య గ్రీసులో అతి తక్కువ అంటే 4 శాతం ఉంది. దానికి పూర్తి విరుద్ధంగా స్వీడన్‌లో జన్మించిన శిశువుల్లో సగం కంటే ఎక్కువ మంది అవివాహిత తల్లిదండ్రులకు జన్మించినవారే. ఐర్లాండ్‌లో అతి పెద్ద మార్పు జరిగింది. అవివాహిత తల్లిదండ్రులకు జన్మించిన శిశువుల సంఖ్య 1980లో కేవలం 5 శాతం ఉంటే అది 2000వ సంవత్సరానికి 31.8 శాతానికి పెరిగింది. ఇలా గమనార్హంగా పెరిగిన సంఖ్యలు “వివాహం పట్ల కుటుంబం పట్ల యూరోపియన్ల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని రుజువు చేస్తున్నాయి” అని ఆ నివేదిక వ్యాఖ్యానిస్తోంది. (g02 5/8)
నూరేళ్ళ వయస్సులో సంతోషంగా, ఆరోగ్యంగా
యోమ్యూరీ షింబున్ వార్తాపత్రికలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, “నూరేళ్ళ కన్నా ఎక్కువ వయసున్న ప్రజలలో 80 శాతం మంది తాము ఆరోగ్యంగా ఉన్నామనీ, ప్రతీరోజు మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉంటున్నామనీ భావిస్తున్నారు.” జపాన్‌లో మొదట 1981వ సంవత్సరంలో శతవృద్ధుల సంఖ్య 1,000ని దాటింది, 2000 సంవత్సరానికి ఆ సంఖ్య 13,000కు చేరుకుంది. ఇటీవలే, జపాన్ యొక్క హెల్త్ అండ్ స్టామినా ఫౌండేషన్ 1,900 కంటే ఎక్కువమంది శతవృద్ధుల మీద సర్వే నిర్వహించింది, నూరేళ్ళకు పైగా వయసున్న వారి “జీవిత నాణ్యత”పై జరిగిన అధ్యయనాల్లోకెల్లా బహుశా ఇదే అతిపెద్ద అధ్యయనం అయ్యుండవచ్చు. “తమ ‘జీవితానికి ఒక సంకల్పం ఉంది’ అని 43.6 శాతం మంది పురుషులు చెప్తుంటే, దానికి భిన్నంగా కేవలం 25.8 శాతం మంది స్త్రీలు మాత్రమే అలా చెబుతున్నారు” అని ఆ వార్తాపత్రిక నివేదించింది. శతవృద్ధులలో చాలామంది “కుటుంబం,” “దీర్ఘకాలిక జీవితం,” “మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవించడం” వంటివి తమ జీవిత సంకల్పాలలో భాగమని తెలియజేశారు. కాబట్టి “జీవితానికొక సంకల్పం ఉండడం, దీర్ఘకాలం జీవించడానికి నడిపిస్తుంది” అని యోమ్యూరీ షింబున్ సూచిస్తుంది. (g02 5/8)
దేవుని పేరిట దొంగతనం
“నేను 20 సంవత్సరాలుగా భద్రతా ఏర్పాట్లను క్రమబద్ధీకరించే ఆఫీసరుగా పనిచేస్తున్నాను, ఏ ఇతర విధంగా కన్నా దేవుని పేరిటే ఎక్కువ డబ్బు దొంగిలించబడడాన్ని నేను చూశాను, మీరు పెట్టుబడి పెట్టినప్పుడు, ఎవరైనా మీకు మీ మతాన్ని గానీ మీ విశ్వాసాన్ని గానీ గుర్తుచేసి మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు అప్రమత్తంగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు” అని నార్త్ అమెరికన్ సెక్యూరిటీస్ అడ్మినిస్ట్రేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన డెబోరా బార్టనర్ చెబుతోంది. క్రిస్టియన్ సెంచ్యురీ అనే పత్రిక ప్రకారం, “గత మూడు సంవత్సరాలలో, 27 రాష్ట్రాలలో ఉన్న భద్రతా ఏర్పాట్లను క్రమపరిచే ఆఫీసర్లు, పెట్టుబడిదార్ల నమ్మకాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లేదా మతపరమైన విశ్వాసాలను ఉపయోగించుకున్న వందలాది వ్యక్తులకు మరియు కంపెనీలకు వ్యతిరేకంగా చర్య తీసున్నారు . . . మోసపూరితమైన ఒక సంఘటనలో” ఒక ప్రొటస్టెంట్ సంస్థ “[ఐదేళ్ళ కంటే ఎక్కువ కాలంపాటు] దేశవ్యాప్తంగా 13,000 పెట్టుబడిదార్ల నుండి 59 కోట్ల డాలర్లను రాబట్టుకుంది. ఆ సంస్థ 1999వ సంవత్సరంలో ఆ దేశ భద్రతా ఆఫీసర్ల ద్వారా మూసివేయబడింది, ఆ సంస్థ యొక్క ముగ్గురు అధికారులు తమపై వేయబడిన నిందారోపణలను అంగీకరించారు.” ఇంకా మూడు సందర్భాల్లో “మొత్తం కలిపి 150 కోట్ల డాలర్ల నష్టం వచ్చింది” అని క్రిస్టియన్ సెంచ్యురీ నివేదిస్తుంది. (g02 5/22)
చర్చీ వాణిజ్యం
హాజరవుతున్నవారి సంఖ్య తగ్గిపోవడం, చందాలు తగ్గిపోవడం వంటివి ఎదుర్కోవడం వల్ల అమెరికాలోని చర్చీలు తమ బిల్లులు కట్టుకోవడానికి సహాయపడేందుకు లౌకికపరమైన వ్యాపారాలను ప్రారంభిస్తున్నాయి. “ప్రతి శక్తివంతమైన చర్చి భవిష్యత్తు అదే,” అని ఇండియానాలోని మున్స్‌టార్‌లో కుటుంబ క్రైస్తవ కేంద్రానికి చెందిన సీనియర్ పాస్టర్ అయిన స్టీఫెన్ మున్సే చెబుతున్నాడు. ద వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, చర్చీల వాణిజ్య కార్యకలాపాలు, చర్చీ వసారాలో కాఫీ, డోనట్‌లు అమ్మడం దగ్గర నుండి చర్చి టెర్రస్ మీద అన్ని రకాల సేవలందించే రెస్టారెంట్‌లు నడపడం వరకూ విస్తరించి ఉన్నాయి. ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లాలోని ఒక చర్చీ, తన చర్చీ బిల్డింగ్ దగ్గర ఒక షాపింగ్ కాంప్లెక్స్‌ను తెరిచింది. ఆ కాంప్లెక్స్‌లో ఒక ట్రావెల్ ఏజెన్సీ, బ్యూటీ పార్లర్, దక్షిణ బ్లాక్ అమెరికన్లు సాంప్రదాయకంగా తినే ఆహారపు రెస్టారెంట్ ఉన్నాయి. ఆ చర్చీ సంస్థాపకుడు, బిషప్ అయిన వాన్ మెక్‌లాఫ్‌లెన్ ఇలా అంటున్నాడు: “యేసు తాను మనకు ఇచ్చే బహుమానాలను మనం స్వీకరించి, వాటినుండి వడ్డీ పొందాలని కోరుకుంటున్నాడు.” 2000వ సంవత్సరంలో చర్చీ వ్యాపారం 10 కోట్ల రూపాయిలకు పైగా ఆదాయాన్ని తెచ్చి పెట్టిందని కూడా ఆయన చెబుతున్నాడు. (g02 6/22)
ఫ్రాన్సులో బైబిలు పఠనం
క్యాథలిక్ వార్తాపత్రిక లా క్ర్వాలో ప్రచురించబడిన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం సర్వే చేయబడిన ఫ్రెంచి ప్రజలలో 42 శాతం మంది దగ్గర బైబిలు ఉన్నప్పటికీ, కేవలం 2 శాతం మంది మాత్రమే తాము దాన్ని దాదాపు ప్రతిరోజు చదువుతామని చెప్పారు. డెబ్భైరెండు శాతం మంది తాము “బైబిలును ఎన్నడూ చదవము” అని చెబుతున్నారు. సర్వే చేయబడినవారిలో 54 శాతం మంది బైబిలును “ఆధునిక లోకంతో ఏమాత్రం పొందిక లేని ప్రాచీన పుస్తకంగా” పరిగణించారు. “ఫ్రెంచి ప్రజలు బైబిలును విద్యాపరమైన దృక్కోణంనుండి పరిశీలిస్తారు, దానిలో యూదా క్రైస్తవ మతాల ఆరంభాలకు” సంబంధించిన వివరణల కోసం చూస్తారని ఆ నివేదిక వివరిస్తుంది. “ప్రతి సంవత్సరం ఫ్రాన్సులో దాదాపు 2,50,000 బైబిళ్ళు, 30,000 క్రొత్త నిబంధనలు అమ్మబడుతున్నాయి” అని లా క్ర్వా నివేదిస్తోంది. (g02 7/8)
ఎవరెస్టు శిఖరాన్ని శుభ్రం చేయడం
భూమ్మీదున్న పర్వతాల్లోకెల్లా ఎత్తైన పర్వతం (8,850 మీటర్లు) సాధారణంగా స్వచ్ఛమైన శోభకు వైభవానికి ప్రతిరూపంగా ఉంటుంది. అయితే, ఎవరెస్టు శిఖరం ఒక పెద్ద చెత్త కుప్పగా తయారయ్యిందని న్యూ ఢిల్లీ పత్రిక అయిన డౌన్ టు ఎర్త్ వెల్లడిచేస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వందలాది మంది “ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు, పాత నిచ్చెనలు లేదా స్తంభాలు, ప్లాస్టిక్ క్యాన్ల”తో సహా అక్షరార్థంగా టన్నుల కొద్ది చెత్తను అక్కడ వదిలి వచ్చారు. అన్నింటికంటే మురికి క్యాంప్ “అధిరోహించే వ్యక్తులలో అధిక శాతం శిఖరాగ్రానికి చేరుకునేందుకు ఆఖరి అధిరోహణ చేసే దక్షిణ కోల్ క్యాంప్” అన్ని క్యాంప్‌లకంటే ఎక్కువ చెత్తను కలిగివున్న మురికి క్యాంప్ అని ఆ నివేదిక చెబుతోంది. నేపాల్ మౌంటేనీరింగ్ అసోసియేషన్‌కు చెందిన అధికారి అయిన భూమి లాల్ లామా, “[షెర్పాలు] సేకరించే ప్రతి కేజీ చెత్తకు మేము వారికి 650 రూపాయిలు చెల్లించాలని ఆలోచిస్తున్నాము” అని చెప్పాడు. షెర్పాలు “సాధారణంగా” ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే “వ్యక్తులకు గైడ్లుగా, వారికి అవసరమైన వాటిని మోసుకువెళ్ళేవారిగా పనిచేస్తారు” అని ఆ నివేదిక చెబుతోంది. (g02 7/8)
ఆసియాలో వాయు కాలుష్య ప్రమాదం
“భారతదేశంలో ప్రతి సంవత్సరం 40,000 కంటే ఎక్కువమంది వాయు కాలుష్యం మూలంగా చనిపోతున్నారు” అని పర్యావరణ సంబంధ పత్రికైన డౌన్ టు ఎర్త్ నివేదిస్తుంది. వరల్డ్ బ్యాంక్, స్టాక్‌హోమ్ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించిన పరిశోధన, ఆసియాలోని వాయు కాలుష్యం యూరప్, అమెరికా రెండింటిలో కలిపి ఉన్న వాయు కాలుష్యాన్ని మించిపోయిందనీ సీయోల్, బీజింగ్, బ్యాంకాక్, జకార్తా, మనీలాల్లో వేలాది మరణాలకు కారణమవుతోందనీ చూపించింది. ఉదాహరణకు మనీలాలో ప్రతి సంవత్సరం 4,000 కంటే ఎక్కువమంది ఊపిరి పీల్చుకోవడానికి సంబంధించిన వ్యాధులతో మరణిస్తుంటే, 90,000 మంది తీవ్రమైన దీర్ఘకాలిక శ్వాసకోశవ్యాధులతో బాధపడుతున్నారు. మరణించే ప్రజల నిష్పత్తి బీజింగ్ మరియు జకార్తాలలో మరింత ఎక్కువగా ఉంది. “తక్కువ నాణ్యతగల ఇంధనాన్ని ఉపయోగించడం, శక్తిని ఉత్పత్తి చేయడానికి అసమర్థ పద్ధతులను ఉపయోగించడం, మరమ్మత్తు చేయవలసిన వాహనాలను మరమ్మత్తు చేయకుండా అలాగే ఉపయోగించడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం” వంటివి ఈ సమస్యకు కారణాలని ఆ పత్రిక చెబుతోంది. (g02 8/22)