కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మోటారు వాహనాల దుర్ఘటనలు మీరు సురక్షితంగా ఉన్నారా?

మోటారు వాహనాల దుర్ఘటనలు మీరు సురక్షితంగా ఉన్నారా?

మోటారు వాహనాల దుర్ఘటనలు మీరు సురక్షితంగా ఉన్నారా?

“నాకు మంచి డ్రైవింగ్‌ రికార్డు ఉంది కాబట్టి మోటారువాహన దుర్ఘటన సంభవిస్తుందని నేను చింతించనవసరం లేదు.” “కేవలం నిర్లక్ష్యంగా డ్రైవ్‌చేసే యౌవనస్థులైన డ్రైవర్లకు మాత్రమే దుర్ఘటనలు సంభవిస్తాయి.” తమకు ఎప్పటికీ వాహన దుర్ఘటన సంభవించదు అని చాలామంది భావిస్తారు. మీరు కూడా అలాగే భావిస్తున్నారా? మీరు వాహన దుర్ఘటనలకు అతీతులా?

మీరు అభివృద్ధిచెందిన దేశంలో నివసిస్తుంటే, మీ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ట్రాఫిక్‌ దుర్ఘటనలో గాయపడే అవకాశం ఎంతైనా ఉందని గణాంకవివరాలు సూచిస్తున్నాయి. చాలామందికి ఇలాంటి దుర్ఘటనలు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా, ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఐదు లక్షలకంటే ఎక్కువ ట్రాఫిక్‌ దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. గత సంవత్సరం మరణించిన వారిలో చాలామంది తమకు అలాంటి దుర్ఘటన అసలు సంభవించదు అనే భావించివుండవచ్చు. మీరు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఏమి చేయవచ్చు? నివారణే దానికి కీలకం. నిద్రమత్తువలన, వృద్ధాప్యపు ప్రభావాలవలన కలిగే దుర్ఘటనలను మీరు ఎలా నివారించవచ్చో పరిశీలించండి.

నిద్రమత్తుగల డ్రైవరు

తాగుబోతు డ్రైవరు ఎంత ప్రమాదకరంగా ఉండగలడో నిద్రమత్తుగల డ్రైవరు కూడా అంతే ప్రమాదకరంగా ఉండగలడని కొందరు నిపుణులు చెబుతున్నారు. నిద్రమత్తు అంతకంతకూ పెరుగుతున్న సంఖ్యలో దుర్ఘటనలు జరగడానికి కారణమవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఒక్క సంవత్సరంలో, నార్వేలోవున్న డ్రైవర్లలోని ప్రతి 12 మందిలో ఒకరు డ్రైవ్‌ చేసేటప్పుడు నిద్రలోకి జారుకున్నట్లు సమాచారం అందిందని ఫ్లీట్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ సేఫ్టీ రిపోర్ట్‌ ఇటీవలే నివేదించింది. దక్షిణాఫ్రికాలోని జోహాన్నస్‌బర్గ్‌కు చెందిన ద స్టార్‌ వార్తాపత్రిక ప్రకారం, ఆ దేశంలో సంభవించే వాహన దుర్ఘటనలలో మూడవ వంతు డ్రైవర్లు అలసిపోయి ఉండడంవల్లనే జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాలలోని డ్రైవర్లను అలసట ప్రభావితం చేస్తుందని ఇతర దేశాలనుండి వచ్చిన నివేదికలు వెల్లడిచేస్తున్నాయి. నిద్రమత్తుగల డ్రైవర్లు ఇంతమంది ఎందుకు ఉన్నారు?

ఈ సమస్యకు కారణమయ్యే విషయాలలో ఒకటి, ఉరుకులు పరుగులతో సాగే నేటి జీవనవిధానం. అమెరికన్లు “20వ శతాబ్దపు ఆరంభంలో [వారు] నిద్రించిన దానికంటే ఇప్పుడు గంటన్నర తక్కువగా నిద్రిస్తుండవచ్చు​—⁠ఈ సమస్య ఇంకా ఘోరంగా తయారయ్యే అవకాశం ఉంది” అని ఇటీవలే న్యూస్‌వీక్‌ పత్రిక నివేదించింది. ఎందుకు? నిద్రకు సంబంధించిన విషయాల్లో నిపుణుడైన టెర్రీ యంగ్‌ మాటలను ఆ పత్రిక ఉల్లేఖించింది: “నిద్ర అనేది తమకు ఎంత కావలసివస్తే అంత తగ్గించుకోవచ్చు అని ప్రజలు భావిస్తున్నారు. చాలా తక్కువ నిద్రపోవడం, కష్టపడి పనిచేయడానికీ అభివృద్ధి సాధించడానికీ సూచనగా పరిగణించబడుతుంది.”

సగటు మనిషికి ప్రతి రాత్రి ఆరున్నర గంటల నుండి తొమ్మిది గంటలపాటు నిద్ర అవసరమని చెప్పబడుతుంది. అలా నిద్రపోనప్పుడు, ప్రజలు “నిద్ర అప్పు”ను పెంపొందించుకుంటారు. ట్రాఫిక్‌ భద్రత కోసమైన ఎ.ఎ.ఎ ఫౌండేషన్‌ ద్వారా పంచిపెట్టబడిన నివేదిక ఇలా అంటోంది: “పనిచేసే ఒక వారంలో ప్రతి రాత్రి అవసరమైన దానికంటే కేవలం 30 లేక 40 నిమిషాలు తక్కువ నిద్రపోవడం కూడా, వారాంతానికల్లా 3 నుండి 4 గంటల నిద్ర అప్పుకు దారితీయవచ్చు. పగటి పూట నిద్రమత్తును గమనార్హంగా పెంచడానికి అది చాలు.”

కొన్నిసార్లు మీరు రాత్రి మంచిగా నిద్రపోకపోవచ్చు. నిద్రలేమివల్ల, అనారోగ్యంతో బాధపడుతున్న శిశువును చూసుకోవాల్సి రావడం వల్ల, లేదా మీ ఆధీనంలో లేని ఇతర కారణాలవల్ల మీరు నిద్రపోలేకపోవచ్చు. తర్వాతి రోజు మీరు డ్రైవ్‌ చేస్తుండగా మీకు నిద్ర ముంచుకు వస్తున్నట్లు అనిపించవచ్చు. ఇలా జరిగితే మీరేమి చేయాలి?

కాఫీ త్రాగడం, వాహనపు కిటికీ తెరవడం, బబుల్‌గమ్‌ నమలడం లేదా ఘాటైనది ఏదైనా తినడం వంటి ప్రఖ్యాతి గాంచిన చిట్కాలు మిమ్మల్ని మెలకువగా ఉంచలేకపోవచ్చు. చిట్కాలు అని పిలువబడే వీటిలో ఏదీ కూడా అసలు సమస్యను పరిష్కరించదు. మీకు కావలసిందల్లా నిద్రే. కాబట్టి కొంత సమయం నిద్రపోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? “పనిచేసే రోజున పునరుత్తేజాన్ని పొందేందుకు 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోకూడదు; 30 నిమిషాలకంటే ఎక్కువసేపు నిద్రపోతే శరీరం గాఢనిద్రలోకి జారుకుంటుంది, ఆ నిద్రనుంచి మెలకువ రావడం కష్టం” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ సలహా ఇచ్చింది. మీరు మధ్యలో కాస్సేపు నిద్రపోవడమనేది మీరు మీ గమ్యాన్ని చేరుకోవడాన్ని కాస్త ఆలస్యం చేయవచ్చు, కానీ అది మీ జీవితాన్ని పొడిగించగలదు.

మీరు నిద్రమత్తుగల డ్రైవరుగా తయారవ్వడానికి మీ జీవిత విధానమే కారణం కాగల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇంటర్‌నెట్‌ వద్ద ఎక్కువ గంటలు గడుపుతారా, లేక రాత్రి బాగా ఆలస్యమయ్యేంతవరకూ టీవీ చూస్తారా? తెల్లవారుఝాము వరకూ కొనసాగే పార్టీలకు మీరు వెళతారా? ఇలాంటి అలవాట్లు మీకు నిద్ర లేకుండా చేయడానికి అనుమతించకండి. జ్ఞానియైన సొలొమోను రాజు ‘ఒక చేతినిండ విశ్రాంతి కలిగియుండడంలోని’ విలువను నొక్కిచెప్పాడు.​—ప్రసంగి 4:6NW.

అనుభవజ్ఞులే అయినా వృద్ధులు

వృద్ధులైన డ్రైవర్లు డ్రైవ్‌ చేయడంలో మిగతావారికంటే ఎక్కువ అనుభవం కలిగివుంటారు. అంతేకాకుండా, వారు చాలా జాగ్రత్తగా ఉంటారు, వారికి వారి పరిమితులు తెలుసు. అయితే వృద్ధులైన డ్రైవర్లు వాహన దుర్ఘటనలకు అతీతులేమీ కాదు. నిజానికి, వారి వయస్సు పెరుగుతున్నకొద్ది వారికి ఇలాంటి దుర్ఘటనలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమెరికా పత్రికైన కార్‌ అండ్‌ ట్రావెల్‌ ఇలా నివేదించింది: “జనాభాలో 70 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న ప్రజలు 9 శాతం మంది ఉన్నారు, అయితే ట్రాఫిక్‌ దుర్ఘటనలకు గురవుతున్నవారి విషయంలో చూస్తే 70 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న వారు 13 శాతంమంది ఉన్నారు.” విచారకరంగా, వృద్ధులైన డ్రైవర్లకు సంబంధించిన దుర్ఘటనల సంఖ్య పెరుగుతూనే వుంది.

మిర్టిల్‌ అనే 80 సంవత్సరాల వయస్సుగల స్త్రీ చెప్పిన విషయాల గురించి ఆలోచించండి. * ఆమె 60 సంవత్సరాలకంటే ఎక్కువకాలం క్రితమే డ్రైవింగ్‌ మొదలుపెట్టింది, ఇప్పటివరకూ ఆమెకు వాహన దుర్ఘటన సంభవించలేదు. అయినప్పటికీ, చాలామంది ఇతరుల వలే ఆమె కూడా వృద్ధాప్య ప్రభావాలను అంటే ఆమె దుర్ఘటనకు గురయ్యే అవకాశాలను అధికం చేయగల ప్రభావాలను అనుభవిస్తోంది. ఆమె ఇటీవలే తేజరిల్లు!కు ఇలా చెప్పింది: “వయస్సు పైబడుతున్న కొద్దీ [డ్రైవింగ్‌తో సహా] జీవితంలోని ప్రతిదీ ఒక సవాలుగా మారుతుంది.”

వాహన దుర్ఘటన సంభవించే ప్రమాదాన్ని తగ్గించడానికి ఆమె ఏమి చేసింది? “సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ, నా వయసుకు తగినట్లుగా నేను సవరింపులు చేసుకున్నాను,” అని మిర్టిల్‌ అంటుంది. ఉదాహరణకు, ఆమె డ్రైవ్‌ చేసే సమయాన్ని, ప్రత్యేకించి రాత్రివేళల్లో డ్రైవ్‌ చేయడాన్ని తగ్గించింది. ఈ చిన్న సవరింపు ఆమె డ్రైవింగ్‌ను పూర్తిగా మానివేయకుండానే ఒక మంచి డ్రైవింగ్‌ రికార్డును కలిగివుండడానికి ఆమెకు సహాయపడుతుంది.

వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని ఒప్పుకోవడం ఎంతో కష్టమే అయినప్పటికీ అది ఒక తిరుగులేని నిజం. (ప్రసంగి 12:1-7) అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, ఏదైనా ఒక విషయానికి మనం కొంచెం నెమ్మదిగా ప్రతిస్పందిస్తాము, కంటిచూపు తగ్గిపోతుంది​—ఇవన్నీ కూడా సురక్షితంగా డ్రైవ్‌ చేయడాన్ని కష్టతరంచేయగలవు. అయితే, పైబడుతున్న వయస్సు ఒక వ్యక్తిని డ్రైవరుగా అనర్హుడిని చేయదు. డ్రైవ్‌ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎంత చక్కగా పనిచేస్తాడు అన్నదే ప్రాముఖ్యం. మన శారీరక సామర్థ్యాలలో వచ్చే మార్పులను గుర్తించడం, మన దైనందిన జీవితంలో తగిన మార్పులు చేసుకోవడం, డ్రైవింగ్‌లో మన నైపుణ్యాన్ని మెరుగుపర్చగలవు.

మీరు గమనించకపోవచ్చు, కానీ మీ దృష్టి మందగిస్తుంది. మీరు వృద్ధులయ్యే కొద్దీ మీ కంటి చూపు తగ్గిపోతుంది, రెటీనాకు మరింత వెలుగు అవసరమవుతుంది. ది ఓల్డర్‌ అండ్‌ వైసర్‌ డ్రైవర్‌ అనే పుస్తకం ఇలా నివేదిస్తుంది: “60 సంవత్సరాల డ్రైవరుకు, ఒక యౌవనస్థుడికి అవసరమైన వెలుగుకంటే మూడురెట్లు ఎక్కువ వెలుగు అవసరం, వెలుగునుండి చీకటికి అలవాటు పడడానికి రెండింతల కంటే ఎక్కువ సమయం పడుతుంది.” మన కళ్ళలో వచ్చే ఈ మార్పులు రాత్రివేళల్లో డ్రైవ్‌ చేయడాన్ని కష్టతరం చేయగలవు.

హెన్రీకి 72 ఏండ్లు, ఆయన 50 సంవత్సరాలకంటే ఎక్కువ కాలంగా మంచి డ్రైవింగ్‌ రికార్డును కలిగివున్నాడు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, రాత్రివేళల్లో తనకు ఎదురుగా వచ్చే కార్ల హెడ్‌లైట్‌ వెలుగు తనను ఇబ్బందిపెట్టి, డ్రైవ్‌ చేయడాన్ని కష్టతరం చేస్తుందని ఆయన గమనించడం ప్రారంభించాడు. కంటి పరీక్ష చేయించుకున్న తర్వాత, రాత్రివేళల్లో వెలుగు వల్ల కలిగే ఇబ్బందిని తగ్గించేందుకు తయారుచేయబడిన క్రొత్త కళ్ళద్దాలు తనకు అవసరమని ఆయన తెలుసుకున్నాడు. “రాత్రివేళల్లో డ్రైవ్‌ చేయడం ఇప్పుడింక ఎంతమాత్రం కష్టంగా లేదు” అని హెన్రీ చెబుతున్నాడు. ఆయనకు ఈ చిన్న సవరింపు, తన డ్రైవింగ్‌లో చాలా పెద్ద తేడానే తెచ్చింది. మిర్టిల్‌ లాంటి ఇతరులకు, రాత్రివేళల్లో డ్రైవ్‌ చేయకుండా ఉండడమే ఈ సమస్యకు పరిష్కారం కావచ్చు.

వృద్ధాప్యం, ఒక వ్యక్తి ప్రతిస్పందించే సమయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వృద్ధుల మనస్సులు యౌవనస్థుల మనస్సులకంటే జ్ఞానవంతంగా, మరింత తెలివైనవిగా ఉండగలవు. అయితే, ఒక వ్యక్తి వయస్సు ఎంత పెరిగితే, ఆ వ్యక్తి మనస్సు సమాచారాన్ని విశ్లేషించుకుని ప్రతిస్పందించడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది. ఇది డ్రైవింగ్‌ను మరింత సవాలుదాయకంగా చేస్తుంది ఎందుకంటే ట్రాఫిక్‌ మరియు రోడ్డు మీది పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. సమయం మించిపోకముందే చర్య తీసుకోవాలంటే ఈ మార్పుల పరిమితులను అతిత్వరగా గ్రహించాలి.

“వయోధికులైన డ్రైవర్లకు ప్రాణాంతకమైన దుర్ఘటనలు సంభవించడానికి అతిసాధారణమైన కారణం ఏమిటంటే, వారు ట్రాఫిక్‌ కంట్రోల్‌ పరికరాన్ని దాటి వెళ్ళిపోవడమే” అని కార్‌ అండ్‌ ట్రావెల్‌ పత్రిక నివేదిస్తోంది. అలా ఎందుకు జరుగుతుంది? అదే నివేదిక ఇంకా ఇలా చెబుతోంది: “సమస్య . . . ఒక వృద్ధుడైన డ్రైవరు కూడలిని దాటేటప్పుడు ఎడమవైపున్న రోడ్డులోనూ కుడివైపున్న రోడ్డులోనూ మారుతున్న పరిస్థితులను గ్రహించవలసిన సందర్భాలకు సంబంధించినదని అనిపిస్తుంది.”

ఆలస్యంగా ప్రతిస్పందించడానికి ప్రతిగా మీరు ఏమి చేయవచ్చు? కూడళ్ళను సమీపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ముందుకు కొనసాగేముందు ఎప్పుడూ ట్రాఫిక్‌ను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయండి. ప్రత్యేకించి మలుపులు తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కూడళ్ళవద్ద మలుపు తిరగడం ప్రాణాంతకం కాగలదు, ప్రత్యేకించి మీరు వెళ్ళే దారిలో వాహనాలు మీకు ఎదురుగా వస్తుంటే ఆ రోడ్లను దాటవలసివచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి.

అమెరికాలో 75 సంవత్సరాలకు పైబడిన డ్రైవర్లకు సంభవించే ప్రాణాంతకమైన కూడలి దుర్ఘటనలలో 40 దుర్ఘటనలు ఎడమవైపుకు మలుపు తిరిగేటప్పుడు జరిగినవే. ఆ దేశంలోని డ్రైవర్లకు, ట్రాఫిక్‌ భద్రత కోసమైన ఎ.ఎ.ఎ ఫౌండేషన్‌ ఈ సలహా ఇస్తుంది: “మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి కొన్నిసార్లు ఎడమవైపుకు మలుపు తిరిగే బదులు మూడుసార్లు కుడివైపున్న మలుపులను తీసుకోవచ్చు.” ఆ సూత్రాన్ని మీరు జీవిస్తున్న పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవచ్చు. సమయానికి ముందే కొంత ప్రణాళిక వేసుకోవడంవల్ల, మీరు ప్రమాదకరమైన కష్టతరమైన కూడళ్ళను నివారించగలుగుతారు.

పరిగణలోకి తీసుకోవలసిన నిర్ణయం

మీ డ్రైవింగ్‌ సామర్థ్యాలను అంచనా వేసుకోవడానికి మీకు ఏది సహాయపడగలదు? బహుశా మీరు ఒక గౌరవపూర్వకమైన స్నేహితున్ని లేక కుటుంబ సభ్యున్ని మీతోపాటు వచ్చి మీ నైపుణ్యాలను గమనించమని అడగవచ్చు. తర్వాత, తాము గమనించిన ఏ విషయాలనైనా వారు చెప్పదలుచుకుంటే శ్రద్ధగా వినండి. మీరు ఒక సురక్షితమైన డ్రైవింగ్‌ కోర్సు చేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు. అనేక డ్రైవింగ్‌ అసోసియేషన్లు వయోధికులైన డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన కోర్సులను అందిస్తాయి. మరణానికి లేదా గాయపడడానికి దారితీయగల ప్రమాదకరమైన పరిస్థితులు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఎదురైతే, అది మీ డ్రైవింగ్‌ నైపుణ్యాలు మునుపు ఉన్నంత మంచిగా లేవని తెలియజేసే హెచ్చరికా సూచన కావచ్చు.

వాస్తవానికి, ఏదో ఒకరోజు మీరు డ్రైవింగ్‌ మానేయడం, మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. అలా నిర్ణయించుకోవడం కష్టంగానూ బాధాకరంగానూ ఉండవచ్చు. ముందు ప్రస్తావించబడిన మిర్టిల్‌కు, తాను త్వరలోనే ఏదో ఒకరోజు డ్రైవింగ్‌ మానేయాలని తెలుసు. ఆ రోజు సమీపిస్తున్నకొద్దీ, ఆమె ఇప్పటికే తరచుగా ఇతరులతో కలిసి ప్రయాణిస్తుంది. వేరే ఎవరికైనా డ్రైవింగ్‌ను అప్పచెప్పడం గురించి ఆమె ఎలా భావిస్తుంది? “డ్రైవ్‌ చేసేటప్పుడు కలిగే ఒత్తిడిలేకుండా ప్రయాణాన్ని ఆనందించడం చాలా బాగుంది” అని ఆమె అంటుంది.

ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మీకు కూడా అలాగే అనిపించవచ్చు. షాపింగ్‌ చేయడం, చిన్న చిన్న పనులు చేయడానికి బయటకు వెళ్ళడం, ఎవరినైనా కలవడానికి లేదా కూటాలకు వెళ్ళడం అనేవి ఒక స్నేహితునితో కలిసి చేస్తే మరింత ఆనందదాయకంగా ఉండవచ్చు. బహుశా, మీ స్నేహితుడు మీ కారు డ్రైవ్‌ చేస్తూ మిమ్మల్ని తీసుకుని వెళ్ళవచ్చు. అలా ప్రయాణించడం, ఒంటరిగా ప్రయాణించడం కంటే సురక్షితంగా మరింత ఆహ్లాదకరంగా ఉండగలదు. అందుబాటులో ఉన్నప్పుడల్లా ప్రజా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవడం, మరో ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయం. మీ డ్రైవింగ్‌ సామర్థ్యంపై మీ విలువ ఆధారపడివుండదని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తిగా మీకున్న మంచి గుణాలే, మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు, దేవునికి మిమ్మల్ని విలువైనవారిగా చేస్తాయి.​—సామెతలు 12:2; రోమీయులు 14:18.

మీరు వృద్ధులైనా యౌవనస్థులైనా, అనుభవజ్ఞులైన డ్రైవరైనా క్రొత్తగా డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నవారైనా, మీరు వాహన దుర్ఘటనలకు అతీతులు కారు. డ్రైవింగ్‌తో పాటు వచ్చే గంభీరమైన బాధ్యతను గుర్తించండి. మీకు దుర్ఘటన సంభవించే అవకాశాలను తగ్గించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. అలా చేయడం ద్వారా, మీరు మిమ్మల్ని మరియు ఇతరులను భవిష్యత్తులో మీరు చేయబోయే ఎన్నో ప్రయాణాల సమయంలో కాపాడుకోవచ్చు. (g02 8/22)

[అధస్సూచి]

^ ఈ ఆర్టికల్‌లోని పేర్లు మార్చబడ్డాయి.

[22వ పేజీలోని చిత్రం]

మీ శరీరం మంచినిద్ర అనే “ఇంధనం”తో నింపబడివుండేలా నిశ్చయపర్చుకోండి

[23వ పేజీలోని చిత్రం]

కొద్ది సమయం నిద్రపోవడం, కాస్త ఆలస్యమయ్యేలా చేసినప్పటికీ, అది ప్రాణాలను కాపాడగలదు

[23వ పేజీలోని చిత్రం]

వయోధికులైన డ్రైవర్లు ఎక్కువ అనుభవజ్ఞులు, కానీ వారు ప్రత్యేకమైన సవాళ్ళను ఎదుర్కొంటారు

[24వ పేజీలోని చిత్రం]

ఒక సహచరితో ప్రయాణించడంలో ప్రయోజనాలున్నాయి