కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎయిడ్స్‌ ఆఫ్రికాలో వ్యాపిస్తోంది

ఎయిడ్స్‌ ఆఫ్రికాలో వ్యాపిస్తోంది

ఎయిడ్స్‌ ఆఫ్రికాలో వ్యాపిస్తోంది

“మనం ఒక విధమైన అర్మగిద్దోనుతో వ్యవహరిస్తున్నాము.”

ఆఫ్రికాలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ సంబంధంగా పనిచేస్తున్న ఐక్య రాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి స్టీఫెన్‌ లూయిస్‌ అన్న ఆ మాటలు, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాలలోని ఎయిడ్స్‌ పరిస్థితి గురించి చింతిస్తున్న అనేకమంది భావాలను ప్రతిబింబిస్తున్నాయి.

హెచ్‌ఐవి వ్యాపించడంలో అనేక కారకాలు చేరివున్నాయి. అంతేకాకుండా, ఎయిడ్స్‌ ఇతర సమస్యలను కూడా తీవ్రతరం చేసింది. ఎయిడ్స్‌ వ్యాపిస్తున్న కొన్ని ఆఫ్రికా దేశాలలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో ఉన్న పరిస్థితులు తరచూ ఈ క్రింది విధంగా ఉంటున్నాయి.

నైతికత. హెచ్‌ఐవి సోకడానికి ప్రథమ మాధ్యమం లైంగిక సంబంధమే కాబట్టి, స్పష్టమైన నైతిక ప్రమాణాలు లేకపోవడం ఈ వ్యాధి వ్యాపించడాన్ని అధికం చేస్తోంది. అయితే, అవివాహితులను లైంగిక సంబంధాలకు దూరంగా ఉండమని ప్రోత్సహించడం ఆచరణాత్మకం కాదని చాలామంది భావిస్తున్నారు. “యౌవనస్థులను లైంగిక సంబంధాలకు దూరంగా ఉండమని హెచ్చరించడం మాత్రమే సరిపోదు. వారు ఎలా కనిపించాలి, ఎలా ప్రవర్తించాలి అన్న విషయాల్లో ప్రతిరోజు లైంగిక సంబంధమైన ఉదాహరణలను లేదా దృశ్యాలను చూస్తున్నారు” అని దక్షిణాఫ్రికాలోని జొహాన్నస్‌బర్గ్‌కు చెందిన ద స్టార్‌ వార్తాపత్రికలో ఫ్రాన్‌క్యోస్‌ డ్యూఫోర్‌ వ్రాస్తున్నాడు.

అంచనా వేయబడిన ఈ పరిస్థితిని యౌవనస్థుల ప్రవర్తన ధృవీకరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక దేశంలో జరిపిన సర్వే, 12 నుండి 17 సంవత్సరాల వయసున్న యౌవనస్థులలోని మూడవ వంతు అప్పటికే లైంగిక సంబంధంలో పాల్గొన్నారని సూచించింది.

బలాత్కారం దక్షిణాఫ్రికాలో ఒక జాతీయ విపత్తుగా వర్ణించబడింది. జొహాన్నస్‌బర్గ్‌కు చెందిన సిటిజెన్‌ వార్తాపత్రికలోని ఒక నివేదిక, అది ఎంత విస్తృతంగా ఉందంటే “ఈ దేశంలోని స్త్రీలకు, అలాగే పిల్లలకు మరే ఇతర ఆరోగ్య సమస్య వల్ల వచ్చే ప్రమాదాన్ని ఈ ప్రమాదం మించిపోయింది” అని నివేదించింది. అదే ఆర్టికల్‌ ఇలా వ్యాఖ్యానించింది: “ఇటీవలి కాలాల్లో పిల్లలను బలాత్కారం చేయడం రెండింతలు పెరిగింది . . . హెచ్‌ఐవి ఉన్న వ్యక్తి ఒక కన్యను బలాత్కారం చేస్తే అతని వ్యాధి నయమవుతుంది అన్న కట్టుకథను అనుసరించి ఈ కార్యాలు చేయబడుతున్నాయనిపిస్తుంది.”

లైంగిక సంబంధాలవల్ల సంక్రమించే వ్యాధి. ఈ ప్రాంతంలో లైంగిక సంబంధాలవల్ల సంక్రమించే వ్యాధుల సంఖ్య అధికంగా ఉంది. సౌత్‌ ఆఫ్రికన్‌ మెడికల్‌ జర్నల్‌ ఇలా వ్యాఖ్యానించింది: “లైంగిక సంబంధాలవల్ల సంక్రమించిన వ్యాధి ఉంటే, ఆ వ్యక్తికి హెచ్‌ఐవి-1 సోకే అవకాశం 2 నుండి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది.”

పేదరికం. ఆఫ్రికాలోని అనేక దేశాలు పేదరికంతో పోరాడుతున్నాయి, ఇది ఎయిడ్స్‌ వ్యాపించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కనీస అవసరతలుగా దృష్టించబడేవి వర్ధమాన దేశాల్లోని అధికశాతం దేశాలలో అందుబాటులో లేవు. ఎన్నో సమాజాలకు విద్యుచ్ఛక్తి లేదు, సురక్షితమైన త్రాగే నీరు లభించదు. గ్రామీణ ప్రాంతాలలో చాలీచాలని రోడ్లు ఉంటాయి లేదా అసలు రోడ్లే ఉండవు. చాలామంది ప్రజలు పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారు, వైద్య సదుపాయాలు చాలా తక్కువగా సరిపోని విధంగా ఉన్నాయి.

వ్యాపారం మీద వాణిజ్యం మీద కూడా ఎయిడ్స్‌ హానికరమైన ప్రభావం చూపుతోంది. చాలామంది ఉద్యోగులకు ఎయిడ్స్‌ సంక్రమించడం వల్ల, గనుల కంపెనీల ఉత్పత్తి తగ్గిపోయింది. కార్మికులు తగ్గిపోవడం వల్ల వచ్చే నష్టాన్ని పూడ్చడానికి కొన్ని కంపెనీలు మరిన్ని ఆటోమేటిక్‌ లేదా ఎలక్ట్రానిక్‌ యంత్రాలను ఉపయోగించేందుకు మార్గాల గురించి ఆలోచిస్తున్నాయి. 2000 సంవత్సరంలో ఒక ప్లాటినమ్‌ గనిలోని ఉద్యోగులలో ఎయిడ్స్‌ రోగుల సంఖ్య దాదాపు రెండింతలు అయ్యిందనీ, మొత్తం కార్మికులలో దాదాపు 26 శాతం మందికి ఎయిడ్స్‌ సోకిందనీ అంచనా వేయబడింది.

ఎయిడ్స్‌ వల్ల కలిగే ఒక విషాదకరమైన పర్యవసానం ఏమిటంటే, తమ తల్లిదండ్రులు ఆ వ్యాధివల్ల చనిపోయినప్పుడు అనేకమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులతోపాటు ఆర్థిక భద్రతను కోల్పోవడమే కాకుండా, ఈ పిల్లలు ఎయిడ్స్‌వల్ల వచ్చే అవమానాలను భరించాలి. ఈ అనాథ పిల్లల బంధువులు లేదా సమాజాలు తరచూ వారికి సహాయం చేయలేనంత పేదవారు లేక వారికి సహాయం చేయడానికి ఇష్టపడరు. చాలామంది అనాథలు స్కూలుకు వెళ్ళడం మానేస్తారు. కొంతమంది వేశ్యావృత్తిని చేపట్టి ఈ వ్యాధి వ్యాపించడాన్ని అధికం చేస్తారు. ఇలాంటి అనాథలకు సహాయం చేయడానికి అనేక దేశాలు ప్రభుత్వ లేక ప్రైవేటు కార్యక్రమాలను స్థాపించాయి.

అజ్ఞానం. హెచ్‌ఐవి ఉన్నవారిలో చాలామందికి ఆ విషయం తెలియదు. ఈ వ్యాధి ఉందని తెలిస్తే అవమానాల పాలవ్వాలి కాబట్టి చాలామంది పరీక్ష చేయించుకోవడానికి ఇష్టపడరు. “హెచ్‌ఐవి ఉన్న ప్రజలకు, లేదా అది ఉందని అనుమానించబడిన ప్రజలకు ఆరోగ్య సదుపాయ కేంద్రాలలో చికిత్స చేయబడదు, వారికి ఇళ్ళు అద్దెకు దొరకవు, ఉద్యోగాలు దొరకవు, స్నేహితులు సహోద్యోగులు వారికి దూరమవుతారు, వారికి ఇన్సూరెన్సు కవరేజీ నిరాకరించబడుతుంది, విదేశాలకు వెళ్ళడానికి వారికి అనుమతి లభించదు” అని జాయింట్‌ యునైటెడ్‌ నేషన్స్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ (యు.ఎన్‌.ఎయిడ్స్‌) విడుదల చేసిన ఒక నివేదిక చెబుతోంది. కొందరికి హెచ్‌ఐవి ఉందని తెలియగానే వారిని హత్య చేయడం కూడా జరిగింది.

సంస్కృతి. ఆఫ్రికాలో అనేక సంస్కృతుల్లోని స్త్రీలు తమ భర్తలను వివాహేతర సంబంధాల గురించి ప్రశ్నించలేరు, లైంగిక సంబంధాన్ని నిరాకరించలేరు, లేదా వారికి సురక్షితమైన లైంగిక అలవాట్ల గురించి సలహా ఇవ్వలేరు. సాంస్కృతిక నమ్మకాలు తరచూ ఎయిడ్స్‌ గురించిన నిజాన్ని అంగీకరించేందుకు నిరాకరించడాన్ని, అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు, ఈ అనారోగ్యం క్షుద్రవిద్యవల్ల వచ్చిందని భావిస్తూ మాంత్రికుల నుండి సహాయం తీసుకోబడుతుంది.

వైద్య సదుపాయాల కొరత. అప్పటికే పరిమితంగా ఉన్న వైద్య సదుపాయాలపై ఎయిడ్స్‌ మూలంగా అధిక పన్ను విధించబడింది. వైద్య సదుపాయాల కోసం ఆస్పత్రిలో చేరే రోగులలో సగం కంటే ఎక్కువమంది హెచ్‌ఐవి పాజిటివ్‌ ఉన్నవారే అని రెండు పెద్ద ఆస్పత్రులు నివేదిస్తున్నాయి. క్వాజూలూ-నాటాల్‌లోని ఒక ఆస్పత్రిలోని ప్రధాన వైద్య అధికారి, తన ఆస్పత్రి వార్డులు 140 శాతం స్థాయిలో చికిత్స చేస్తున్నాయని చెప్పాడు. కొన్నిసార్లు ఇద్దరు రోగులు ఒకే మంచం మీద పడుకుంటారు, మూడవ రోగి ఆ మంచం క్రింద నేలపై పడుకుంటాడు!​—⁠సౌత్‌ ఆఫ్రికన్‌ మెడికల్‌ జర్నల్‌.

ఆఫ్రికాలోని పరిస్థితి ఇప్పటికే విషాదకరంగా ఉంది, అయితే పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. “మనం ఇంకా ఈ మహమ్మారి తొలి దశల్లోనే ఉన్నాము” అని యు.ఎన్‌.ఎయిడ్స్‌కు చెందిన పీటర్‌ పాయట్‌ వ్యాఖ్యానించారు.

కొన్ని దేశాలలో ఈ వ్యాధితో వ్యవహరించడానికి కృషి చేయబడుతోందని స్పష్టమవుతోంది. 2001 జూన్‌ నెలలో మొదటిసారిగా, యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ గురించి చర్చించడానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. మానవ కృషి సఫలమవుతుందా? ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ ప్రయాణం చివరికి ఎప్పుడు ముగుస్తుంది? (g02 11/8)

[5వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఎయిడ్స్‌ మందు నెవైరపీన్‌, దక్షిణాఫ్రికా సందిగ్ధావస్థ

నెవైరపీన్‌ అంటే ఏమిటి? జర్నలిస్ట్‌ నికోల్‌ ఇటానొ చెప్పిన దాని ప్రకారం, అది “[ఒక తల్లి నుండి] ఆమె శిశువుకు ఎయిడ్స్‌ సంక్రమించే అవకాశాలను సగం వరకు తగ్గించగలదని పరీక్షలు చూపిస్తున్న ఒక యాంటిరిట్రోవైరల్‌ మందు.” రాబోయే ఐదు సంవత్సరాల వరకూ ఈ మందును దక్షిణాఫ్రికాకు ఉచితంగా సరఫరా చేస్తామని ఒక జర్మన్‌ మందుల కంపెనీ ప్రతిపాదించింది. అయినప్పటికీ ఆగస్టు 2001 వరకు ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు? ఎందుకని?

దక్షిణాఫ్రికాలో 47 లక్షల కంటే ఎక్కువమంది హెచ్‌ఐవి-పాజిటివ్‌ ప్రజలున్నారు, ప్రపంచంలోని మరే ఇతర దేశంలోనూ అంతమంది లేరు. దక్షిణాఫ్రికా ప్రధాని థాబో బెకీ “హెచ్‌ఐవి ఎయిడ్స్‌కు దారితీస్తుందని సాధారణంగా అంగీకరించబడిన విషయాన్ని అనుమానిస్తున్నాడు, యాంటీ-ఎయిడ్స్‌ మందుల ధర, వాటి నిరపాయత, వాటి ఉపయోగం గురించి సందేహిస్తున్నాడు. ఆయన వాటిని నిషేధించలేదు, కాని దక్షిణాఫ్రికాలోని వైద్యులు వాటి ఉపయోగం విషయంలో నిరుత్సాహపర్చబడ్డారు” అని లండన్‌కు చెందిన ద ఎకానమిస్ట్‌ వార్తాపత్రిక 2002 ఫిబ్రవరి నెలలో నివేదించింది. ఇది ఎందుకంత ప్రాముఖ్యమైన విషయం? ఎందుకంటే దక్షిణాఫ్రికాలో ప్రతి సంవత్సరం వేలాదిమంది పిల్లలు హెచ్‌ఐవితో జన్మిస్తున్నారు, గర్భం దాల్చిన స్త్రీలలో 25 శాతం మందికి ఆ వైరస్‌ ఉంది.

ఈ విషయంలో అభిప్రాయభేదాలు ఉండడంవల్ల, నెవైరపీన్‌ పంచిపెట్టేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి కోర్టులో ఒక చట్టబద్ధమైన కేసు నమోదుచేయబడింది. 2002 ఏప్రిల్‌ నెలలో దక్షిణాఫ్రికా కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టు తన తీర్పును చెప్పింది. ద వాషింగ్‌టన్‌ పోస్ట్‌ వార్తాపత్రికలో వ్రాస్తున్న రవి నెస్స్‌మాన్‌ చెప్పిన దాని ప్రకారం, “ఆ మందును సరిగ్గా ఉపయోగించగల సామర్థ్యం ఉన్న వైద్య కేంద్రాలలో అది లభ్యమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి” అని కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును పూర్తిగా అమలుచేసే ముందు సమస్యలను కనుగొని వాటిని పరిష్కరించడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం దేశవ్యాప్తంగా 18 సైట్లలో మాత్రమే ఆ మందును సరఫరా చేయడం ప్రారంభించింది. అలా చేయడంవల్ల ఆ దేశంలో హెచ్‌ఐవి ఉన్న గర్భిణులకు క్రొత్త నిరీక్షణ లభించింది.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

జిత్తులమారి వైరస్‌ జీవకణాన్ని మోసం చేయడం

హ్యూమన్‌ ఇమ్యూనోడెఫీషియన్సీ వైరస్‌కు (హెచ్‌ఐవి) సంబంధించిన అతిసూక్ష్మమైన ప్రపంచంలోకి ఒకసారి అడుగుపెట్టండి. ఒక శాస్త్రజ్ఞురాలు ఇలా వ్యాఖ్యానించింది: “ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ నుండి ఎన్నో సంవత్సరాలపాటు వైరస్‌ రేణువులను చూసిన తర్వాత, అంత సూక్ష్మమైన రేణువు ఖచ్చితత్వాన్ని దాని నిర్మాణ శైలిని చూసి నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను.”

ఒక వైరస్‌ సూక్ష్మాతి సూక్ష్మమైన ఏకకణ జీవికంటే చిన్నగా ఉంటుంది. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఏకకణ జీవి సాధారణ మానవ జీవకణం కంటే ఎంతో చిన్నగా ఉంటుంది. ఒక ప్రమాణం ప్రకారం హెచ్‌ఐవి ఎంత సూక్ష్మమైనదంటే “ఈ వాక్యం చివర్లో ఉన్న చుక్కమీద 23 కోట్ల [హెచ్‌ఐవి రేణువులు] సరిపోతాయి.” ఒక జీవకణాన్ని ఆక్రమించుకుని ఆ కణానికి సంబంధించిన వనరులపై అధికారాన్ని సంపాదించుకున్న తర్వాత మాత్రమే ఒక వైరస్‌ విభజన చెందగలదు.

హెచ్‌ఐవి మానవ శరీరాన్ని ఆక్రమించుకున్నప్పుడు, ఆ శరీరానికి సంబంధించిన వ్యాధి నిరోధక వ్యవస్థ వద్ద ఉన్న గమనార్హమైన సామర్థ్యాలతో అది పోరాడవలసి ఉంటుంది. * తెల్ల రక్త కణాలతో తయారుచేయబడిన ఒక ఆత్మరక్షణా వ్యవస్థ ఎముకల మూలుగలో తయారుచేయబడుతుంది. తెల్ల రక్త కణాల్లో, టి కణాలు బి కణాలు అని పిలువబడే రెండు ప్రధాన రకాలైన లింఫోసైట్లు ఉంటాయి. కొన్ని ఇతర తెల్లరక్త కణాలు ఫాగోసైట్లు లేదా “కణ భక్షకులు” అని పిలువబడతాయి.

టి కణాలలోని వివిధ వర్గాలకు వేర్వేరు పనులు నియమించబడి ఉంటాయి. సహాయక టి కణాలు అని పిలువబడే కణాలు ఈ యుద్ధతంత్రంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. అవి, విదేశీ ఆక్రమణదారులను గుర్తుపట్టడంలో సహాయం చేసి, శత్రువుపై దాడిచేసి నాశనం చేసే కణాల ఉత్పత్తికి ఆదేశాలను జారీ చేస్తాయి. హెచ్‌ఐవి దాడిచేసినప్పుడు అది ప్రత్యేకించి ఈ సహాయక టి కణాలను గురిగా పెట్టుకుంటుంది. అప్పటికే ఆక్రమించుకోబడిన శరీర కణాలను నాశనం చేయడానికి చంపే టి కణాలు చైతన్యవంతం చేయబడతాయి. ఇన్ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ఉపయోగించబడే ప్రతిరక్షకాలను బి కణాలు ఉత్పత్తి చేస్తాయి.

కపట వ్యూహం

హెచ్‌ఐవి ఒక రెట్రో వైరస్‌గా వర్గీకరించబడింది. హెచ్‌ఐవికి చెందిన జన్యుసంబంధమైన నకలు డిఎన్‌ఎ రూపంలో (డీఆక్సిరైబోన్యూక్లిక్‌ యాసిడ్‌) కాక ఆర్‌ఎన్‌ఎ (రైబోన్యూక్లిక్‌ యాసిడ్‌) రూపంలో ఉంటుంది. హెచ్‌ఐవి రెట్రో వైరస్‌లలోని ఒక నిర్దిష్టమైన ఉపగుంపుకు చెందిన లెంటివైరస్‌లు అని పిలువబడే వైరస్‌లకు సంబంధించినది, ఎందుకంటే వ్యాధికి సంబంధించిన గంభీరమైన సూచనలు కనబడడానికి ముందు దీర్ఘకాలం వరకు అది గుప్తంగా ఉండగలదు.

హెచ్‌ఐవి జీవకణంలోకి ప్రవేశించిన తర్వాత, తన లక్ష్యాన్ని సాధించుకోవడానికి అది జీవకణానికి సంబంధించిన వ్యవస్థను ఉపయోగించుకోగలుగుతుంది. హెచ్‌ఐవి రేణువులను అధికం చేయడానికి అది జీవకణం యొక్క డిఎన్‌ఎను “తిరిగి వ్రాస్తుంది.” కానీ హెచ్‌ఐవి అలా చేయడానికి ముందు అది ఒక భిన్నమైన జన్యుసంబంధ “భాష”ను ఉపయోగించాలి. జీవకణానికి సంబంధించిన వ్యవస్థను చదివి, అర్థం చేసుకునే విధంగా అది తన సొంత ఆర్‌ఎన్‌ఎను డిఎన్‌ఎగా మార్చుకోవాలి. దీన్ని సాధించడానికి హెచ్‌ఐవి రివర్స్‌ ట్రాన్‌స్క్రిప్టేస్‌ అనే వైరల్‌ ఎంజైమ్‌ను ఉపయోగిస్తుంది. కొద్దికాలానికి, వేలాది క్రొత్త హెచ్‌ఐవి రేణువులను ఉత్పత్తి చేసిన తర్వాత ఆ జీవకణం చనిపోతుంది. క్రొత్తగా ఉత్పత్తి చేయబడిన ఈ రేణువులు ఇతర కణాలను ఆక్రమించుకుంటాయి.

సహాయక టి కణాల సంఖ్య గమనార్హంగా తగ్గిపోయిన తర్వాత, దాడిచేయబడుతుందన్న భయం లేకుండా ఇతర శక్తులు శరీరాన్ని ఆక్రమించుకుంటాయి. శరీరం అన్ని రకాల వ్యాధులకు, ఇన్ఫెక్షన్‌లకు గురవుతుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్‌ ఉన్న వ్యక్తి పరిపక్వ దశలోని ఎయిడ్స్‌ వ్యాధిని కలిగివుంటాడు. హెచ్‌ఐవి ఆ వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థనంతటినీ నాశనం చేయడంలో సఫలమయ్యింది.

ఇది ఒక సరళీకృత వివరణ. అయితే వ్యాధి నిరోధక వ్యవస్థ గురించి, హెచ్‌ఐవి ఎలా పనిచేస్తుంది అన్నదాని గురించి పరిశోధకులకు తెలియనిది ఇంకా ఎంతో ఉందని మనస్సులో ఉంచుకోవాలి.

దాదాపు రెండు దశాబ్దాలుగా, ఈ చిన్న వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య పరిశోధకుల శారీరక, మానసిక వనరులను ఉపయోగించుకుంది కనుక అధిక మొత్తంలో డబ్బు ఖర్చయ్యింది. దాని ఫలితంగా హెచ్‌ఐవి గురించి ఎంతో సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఒక సర్జన్‌ అయిన డా. షెర్విన్‌ బి. నూలాండ్‌, కొన్ని సంవత్సరాల క్రితం ఇలా వ్యాఖ్యానించారు: “హ్యూమన్‌ ఇమ్యూనోడెఫీషియన్సీ వైరస్‌ గురించి . . . సమకూర్చబడిన సమాచారం, దాని భీకరమైన దాడులకు వ్యతిరేకంగా రక్షణను రూపొందించడంలో సాధించిన అభివృద్ధి నిజంగా ఒక అద్భుతమే.”

అయినప్పటికీ ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ పయనం శరవేగంతో సాగుతోంది.

[అధస్సూచి]

[చిత్రం]

హెచ్‌ఐవి వ్యాధి నిరోధక వ్యవస్థలోని లింఫోసైట్‌లను ఆక్రమించుకొని హెచ్‌ఐవిని ఉత్పత్తి చేయడానికి వాటిని తిరిగి వ్రాస్తుంది

[చిత్రసౌజన్యం]

CDC, Atlanta, Ga.

[7వ పేజీలోని చిత్రం]

వేలాదిమంది యౌవనస్థులు బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నారు