ఎయిడ్స్ స్వైరవిహారం ఆగుతుందా? అయితే అదెలా జరుగుతుంది?
ఎయిడ్స్ స్వైరవిహారం ఆగుతుందా? అయితే అదెలా జరుగుతుంది?
కొంతకాలం వరకు అనేక ఆఫ్రికా దేశాలలో ఎయిడ్స్ మహమ్మారిని గుర్తించడానికి నిరాకరించారు. కొంతమంది ప్రజలు అసలు చర్చించడానికే ఇష్టపడని విషయం అది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో, ప్రత్యేకించి యువతకు ఈ వ్యాధి గురించి తెలియజేయడానికీ దీని గురించి నిర్మొహమాటంగా చర్చించేలా వారిని ప్రోత్సహించడానికీ కృషి చేయడం జరిగింది. అయితే ఈ కృషి కేవలం పరిమితమైన విజయాన్ని మాత్రమే సాధించింది. ప్రజల జీవిత విధానాలు, వారి ఆచారాలు బలంగా నాటుకుపోయి ఉన్నందువల్ల వారిలో మార్పు తీసుకురావడం కష్టం.
వైద్య అభివృద్ధి
వైద్య రంగంలో, శాస్త్రజ్ఞులు హెచ్‌ఐవి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, అనేకమంది జీవితాలను పొడిగించిన మందులను తయారుచేశారు. చాలా చురుకైన యాంటిరెట్రొవైరల్ థెరపీ అని పిలువబడే కనీసం మూడు యాంటిరెట్రోవైరల్ మందుల మిశ్రమం ప్రభావవంతంగా ఉపయోగించబడింది.
ఈ మందులు వ్యాధిని నయం చేయకపోయినప్పటికీ ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశాలలోని హెచ్‌ఐవి బాధితుల మరణాల సంఖ్యను తగ్గించడంలో అవి విజయాన్ని సాధించాయి. ఈ మందులను వర్ధమాన దేశాలకు సరఫరా చేయడంలోని ప్రాముఖ్యత గురించి చాలామంది ప్రజలు నొక్కిచెబుతున్నారు. అయితే ఈ మందులు
ఖరీదైనవి, ఈ దేశాలలోని అనేకమంది ప్రజల ఆదాయానికి మించినవి.ఈ పరిస్థితి ఒక సమస్యను లేవదీసింది: ఆర్థిక లాభం మానవ జీవితం కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనదా? హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై బ్రెజిల్ కార్యక్రమానికి డైరెక్టర్ అయిన డా. పౌలొ టీయెక్సీరా ఈ పరిస్థితిని గుర్తించి ఇలా అన్నారు: “సాధారణంగా సంపాదించుకునే లాభాలకంటే ఎక్కువ లాభాలను పొందడం కోసం, బ్రతికి బయటపడేందుకు సహాయపడే మందులు లేకుండా వేలాదిమందిని మనం అలా వదిలివేయలేము.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “వాణిజ్యపరమైన లాభాలు నైతిక విలువల, మానవ విలువల కంటే ఎక్కువగా పరిగణించబడకూడదని నేనెంతో వ్యాకులపడుతున్నాను.”
కొన్ని దేశాలు, పెద్ద ఫార్మాసూటికల్ కంపెనీల పేటెంట్‌లను కొన్నింటిని కొట్టివేసి, చాలా తక్కువ ఖర్చుతో కంపెనీ పేరులేని మందులను తయారుచేసుకోవాలని లేదా అలాంటి వాటిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. * ఒక అధ్యయనం ప్రకారం, “[కంపెనీ పేరులేని మందుల] కనీస ఖరీదు అమెరికాలోని ప్రామాణిక మందుల ఖరీదు కంటే 82% తక్కువని కనుగొనబడింది” అని సౌత్ ఆఫ్రికన్ మెడికల్ జర్నల్ పేర్కొంది.
చికిత్సను ఆటంకపరిచేవి
కొంతకాలానికి, పెద్ద మందుల కంపెనీలు అవసరంలో ఉన్న వర్ధమాన దేశాలకు ఎయిడ్స్ మందులను చాలా తక్కువ ధరలకే అందించడం ప్రారంభించాయి. ఈ విధంగా మునుపటి కంటే ఎక్కువమంది ప్రజలు మందులను వాడతారని ఆశించబడింది. అయితే, వర్ధమాన దేశాలలో ఇలాంటి మందులు సులభంగా లభ్యమయ్యేలా చేయడానికి పెద్దపెద్ద ఆటంకాలను అధిగమించాల్సి ఉంది. ఆ ఆటంకాలలో ఒకటి ఆ మందుల ధర. ఎంతో తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ అవసరమైన వారిలో అధికశాతం మందికి అవి ఇంకా ఎంతో ఖరీదైనవిగానే ఉన్నాయి.
మరో సమస్య ఏమిటంటే, ఈ మందులను రోగులకు సరైన మోతాదులో ఇవ్వడం సులభం కాదు. అనేక మాత్రలను ప్రతిరోజు ఖచ్చితమైన సమయాలలో తీసుకోవాలి. వాటిని సరిగ్గా వేసుకోకపోతే లేదా మందులను తీసుకునే దినచర్య మధ్యలో ఆగిపోతే, ఈ మందులను నిరోధించగల శక్తివున్న హెచ్‌ఐవి వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆఫ్రికా దేశాలలో ఉన్న పరిస్థితుల్లో రోగులు సరైన మోతాదులో మందులు తీసుకునేలా నిశ్చయపర్చుకోవడం కష్టం ఎందుకంటే అక్కడ వారికి పరిమితమైన ఆహారమే లభిస్తుంది, పరిశుభ్రమైన త్రాగే నీరు కేవలం కొంచెం మాత్రమే లభిస్తుంది, వైద్య సదుపాయాలు చాలా తక్కువ.
అంతేకాకుండా, ఈ మందులు తీసుకుంటున్నవారు పర్యవేక్షణ క్రింద ఉండాలి. నిరోధక శక్తి వృద్ధి చెందితే అప్పుడు వారు తీసుకునే మందుల సమ్మేళనాన్ని మార్చాలి. ఇలా చేయడానికి అనుభవంగల వైద్య సిబ్బంది కావాలి మరియు ఆ పరీక్షలు చాలా ఖరీదైనవి. అంతేకాకుండా, ఈ మందులు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ మందులను నిరోధించే శక్తిగల వైరస్ వృద్ధి చెందుతూ ఉంటుంది.
2001 సంవత్సరం జూన్ నెలలో ఎయిడ్స్‌పై యు.ఎన్. జనరల్ అసెంబ్లీ నిర్వహించిన ప్రత్యేక కూటంలో, వర్ధమాన దేశాలకు సహాయం చేయడానికి ఒక గ్లోబల్ హెల్త్ ఫండ్ వసూలు చేయాలని ప్రతిపాదించబడింది. 700 కోట్ల డాలర్ల నుండి 1000 కోట్ల డాలర్ల వరకూ డబ్బు అవసరమవుతుందని అంచనా వేయబడింది. లక్ష్యంగా పెట్టుకున్న మొత్తానికి, ఈ ఫండ్ కోసం విరాళంగా ఇస్తామని ఇంత వరకూ వాగ్దానం చేయబడిన మొత్తం తక్కువగా ఉంది.
శాస్త్రజ్ఞులు ఒక వాక్సిన్‌ను కనుగొంటామని బలమైన ఆశలు పెట్టుకుని ఉన్నారు, వివిధ దేశాలలో వేర్వేరు వాక్సిన్‌లు పరీక్షించబడుతున్నాయి. ఈ కృషి సఫలమైనప్పటికీ, ఒక వాక్సిన్‌ను కనుగొని దాన్ని పరీక్షించి అది సాధారణంగా ఉపయోగించడానికి సురక్షితమని నిరూపించబడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
బ్రెజిల్, థాయిలాండ్, యుగాండా వంటి కొన్ని దేశాలలో చికిత్స కార్యక్రమాల ద్వారా గమనార్హమైన విజయం లభించింది. స్థానికంగా తయారుచేయబడిన మందులను ఉపయోగించిన బ్రెజిల్, ఎయిడ్స్ వల్ల సంభవించే మరణాలలో సగానికి సగం మరణాలను తగ్గించుకుంది. ఆర్థిక స్థోమతగల చిన్న దేశమైన బోట్సువానా, దేశంలో అవసరమైన వారందరికీ యాంటీరిట్రోవైరల్ మందులను అందించడానికి కృషి చేస్తోంది, అవసరమైన వైద్య సదుపాయాలను అందించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.
ఎయిడ్స్ ఓటమి
ఎయిడ్స్ ఒక ప్రాముఖ్యమైన విషయంలో ఇతర మహమ్మారులకు భిన్నంగా ఉంది: దాన్ని మనం నివారించవచ్చు. ప్రజలు ప్రాథమిక బైబిలు సూత్రాలకు కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉంటే, అన్ని సందర్భాల్లో కాకపోయినా చాలా సందర్భాల్లో ఈ వ్యాధి సోకకుండా నివారించవచ్చు.
బైబిలు నైతిక సూత్రాలు స్పష్టంగా ఉన్నాయి. అవివాహితులు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. (1 కొరింథీయులు 6:18) వివాహితులు తమ భాగస్వాములపట్ల విశ్వసనీయంగా ఉండాలి, వ్యభిచారం చేయకూడదు. (హెబ్రీయులు 13:4) రక్తానికి దూరంగా ఉండమన్న బైబిలు ఉద్బోధను లక్ష్యపెట్టడం కూడా ప్రజలను కాపాడుతుంది.—అపొస్తలుల కార్యములు 15:28, 29.
ఇప్పటికే ఈ వ్యాధి ఉన్న ప్రజలు, సమీప భవిష్యత్తు కోసం దేవుడు వాగ్దానం చేసిన వ్యాధిలేని లోకం గురించి తెలుసుకోవడం ద్వారా, దేవుడు మననుండి కోరుతున్న వాటికి కట్టుబడి ఉండడం ద్వారా గొప్ప సంతోషాన్నీ ఓదార్పునూ పొందవచ్చు.
కొద్ది కాలానికి వ్యాధులతో సహా మానవజాతి బాధలన్నీ సమసిపోతాయని బైబిలు మనకు హామీ ఇస్తుంది. ఈ వాగ్దానం ప్రకటన గ్రంథంలో చేయబడింది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”—ప్రకటన 21:3, 4.
ఆ హామీ ఖరీదైన మందులు కొనుక్కోగల స్తోమత ఉన్నవారికి మాత్రమే కాదు. ప్రకటన 21వ అధ్యాయంలో ఉన్న ప్రవచన వాగ్దానం యెషయా 33:24వ వచనంలో ధృవీకరించబడింది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” అప్పుడు భూమ్మీద నివసించే వారందరూ దేవుని నియమాలకు కట్టుబడి ఉండి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. అలా, ప్రాణాంతకమైన ఎయిడ్స్—అలాగే ఇతర వ్యాధులన్నిటి—స్వైరవిహారం శాశ్వతంగా ఆగిపోతుంది. (g02 11/8)(g02 11/08)
[అధస్సూచి]
^ కంపెనీ పేరులేని మందులు, ఇతర ఫార్మాసూటికల్ కంపెనీల ద్వారా పేటెంట్ చేయబడిన మందులకు నకలు మందులు. అత్యవసర పరిస్థితుల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో సభ్యులుగా ఉన్న దేశాలు మందుల పేటెంట్‌లను చట్టబద్ధంగా కొట్టివేయవచ్చు.
[9, 10వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
నేను వెదుకుతున్న నిజమైన చికిత్స ఇదే
నేను ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో నివసిస్తున్నాను, నా వయస్సు 23 సంవత్సరాలు. నాకు హెచ్‌ఐవి పాజిటివ్ ఉందని తెలిసిన రోజు నాకింకా గుర్తుంది.
డాక్టర్ మాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను నా తల్లితోపాటు కన్సల్టింగ్ రూమ్‌లో ఉన్నాను. నేను నా జీవితంలో విన్న అతివిషాదకరమైన వార్త అదే. నేను కలవరపడ్డాను. నేను దాన్ని నమ్మలేకపోయాను. బహుశా లాబొరేటరీ పొరపాటు చేసిందేమో అనుకున్నాను. ఏమి చెయ్యాలో ఏమి మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. నాకు ఏడ్వాలనిపించింది, కానీ కన్నీళ్ళు రాలేదు. డాక్టర్ యాంటీరెట్రోవైరల్ మందుల గురించి ఇతర విషయాల గురించి నా తల్లితో మాట్లాడడం ప్రారంభించాడు, కానీ నేను ఏ విషయాన్నీ అర్థం చేసుకోలేనంతగా స్థాణువైపోయాను.
నేను చదువుతున్న విశ్వవిద్యాలయంలో ఎవరి ద్వారానైనా నాకు ఈ వ్యాధి సంక్రమించివుండవచ్చని నేను గ్రహించాను. నా పరిస్థితిని అర్థంచేసుకోగలిగే వారెవరితోనైనా మాట్లాడాలని నాకు అనిపించింది, కానీ అలాంటి వారెవ్వరూ నాకు గుర్తురాలేదు. నేను దేనికి పనికిరాను, నేను విఫలమైపోయాను అన్న భావాలకు నేను లొంగిపోయాను. నా కుటుంబం నాకు మద్దతునిచ్చినప్పటికీ నేను నిరాశకు గురై, భయపడిపోయాను. ఇతర యౌవనస్థుల్లాగే నేనూ ఎన్నో కలలు కనేదాన్ని. బాచ్లర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేయడానికి నాకు రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలాయి, కానీ ఆ ఆశంతా అడియాసైపోయింది.
డాక్టర్ తీసుకోమని చెప్పిన యాంటిరెట్రోవైరల్ మందులను నేను తీసుకోవడం ప్రారంభించాను, ఎయిడ్స్ కౌన్సిలర్ల వద్దకు కూడా వెళ్ళాను కానీ కృంగుదల మాత్రం నన్నింకా వీడిపోలేదు. మరణించే ముందు నాకు నిజమైన క్రైస్తవత్వాన్ని చూపించమని నేను దేవునికి ప్రార్థించాను. నేను ఒక పెంతెకొస్తు చర్చిలో సభ్యురాలిగా ఉండేదాన్ని, కానీ నా చర్చినుండి ఎవ్వరు నన్ను చూడడానికి రాలేదు. నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాను అనే విషయంలో సత్యమేమిటో తెలుసుకోవాలనుకున్నాను.
1999వ సంవత్సరం ఆగస్టు నెల ప్రారంభంలో ఒక ఉదయం ఇద్దరు యెహోవాసాక్షులు నా ఇంటి తలుపు తట్టారు. నాకు ఆ రోజు ఆరోగ్యం అస్సలు బాలేదు, అయినప్పటికీ నేను హాల్లో కూర్చోగలిగాను. ఆ ఇద్దరు స్త్రీలు తమను తాము పరిచయం చేసుకొని, బైబిలు అధ్యయనం చేయడానికి ప్రజలకు సహాయం చేస్తున్నామని చెప్పారు. చివరికి నా ప్రార్థనలకు జవాబు దొరికినందుకు నేను ఎంతో ఉపశమనాన్ని పొందాను. కానీ అప్పటికి నేను ఎంత బలహీనంగా ఉన్నానంటే నేను ఎక్కువ సేపు కూర్చొని అవధానముంచి చదవలేకపోయేదాన్ని.
అయినప్పటికీ నేను బైబిలును అధ్యయనం చేయాలనుకుంటున్నానని వారికి చెప్పాను, నన్ను మళ్ళీ కలుసుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే విషాదకరమైన విషయం ఏమిటంటే, వాళ్ళు తిరిగి వచ్చేముందే నా కృంగుదల మూలంగా నన్ను సైక్రియాట్రిక్ హాస్పిటల్‌లో చేర్పించారు. మూడు వారాల తర్వాత నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. సాక్షులు నన్ను ఇంకా మర్చిపోలేదని తెలుసుకుని నేను ఎంతో సంతోషించాను. ఆ సాక్షులలో ఒకరు, నా ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తూనే ఉండేది అని నాకు ఇంకా గుర్తుంది. నేను శారీరకంగా కొంచెం కోలుకున్నాక, ఆ సంవత్సరాంతంలో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాను. అధ్యయనం చేయడం నాకు అంత సులభంగా అనిపించలేదు ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండేది కాదు. కానీ నాతో అధ్యయనం చేసే వ్యక్తి నన్ను బాగా అర్థం చేసుకొని సహనంతో అధ్యయనం నిర్వహించేది.
యెహోవా గురించి ఆయన లక్షణాల గురించి నేను బైబిలు నుండి అధ్యయనం చేసినప్పుడు, ఆయనను తెలుసుకోవడం అంటే ఏమిటో నిత్యజీవం గురించి ఎదురుచూడడం అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడు నేను ముగ్ధురాలినయ్యాను. మొదటిసారిగా, మానవజాతి బాధల వెనకున్న కారణాన్ని అర్థం చేసుకున్నాను. త్వరలోనే మానవ ప్రభుత్వాల స్థానాన్ని తీసుకునే దేవుని రాజ్యం గురించి తెలుసుకోవడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నా జీవిత విధానాన్ని పూర్తిగా మార్చుకొనేలా అది నన్ను పురికొల్పింది.
నేను వెదుకుతున్న నిజమైన చికిత్స ఇదే. యెహోవా ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాడనీ నన్ను శ్రద్ధగా చూసుకుంటాడనీ గ్రహించడం ఎంత ఓదార్పుకరం! మునుపు, దేవుడు నన్ను ద్వేషిస్తున్నందువల్లే నాకు ఈ వ్యాధి సోకిందని నేను భావించాను. కానీ యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ద్వారా పాపాలను క్షమించడానికి యెహోవా ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేశాడని నేను నేర్చుకున్నాను. దేవుడు మనపట్ల శ్రద్ధ కలిగివున్నాడని నాకు తెలుసు ఎందుకంటే 1 పేతురు 5:7వ వచనం ఇలా చెబుతోంది: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”
ప్రతిరోజు బైబిలును అధ్యయనం చేయడం ద్వారా, రాజ్యమందిరంలో కూటాలకు హాజరవ్వడం ద్వారా, నాకు సాధ్యమైనంతగా యెహోవాకు సన్నిహితంగా ఉండడానికి నేను ఎంతో కృషి చేస్తున్నాను. అలా చేయడం ఎల్లప్పుడు సులభం కాకపోయినప్పటికీ నేను ప్రార్థన ద్వారా నా చింతలన్నీ యెహోవా ఎదుట ఉంచి నాకు తన బలాన్ని, ఓదార్పును ఇవ్వమని అడుగుతాను. సంఘ సభ్యులు నాకు మద్దతునివ్వడానికి, సహానుభూతి చూపించడానికి, నాతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను.
నేను స్థానిక సంఘంతో క్రమంగా ప్రకటనా పనిలో భాగం వహిస్తాను. నేను ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయాలనుకుంటున్నాను, ప్రత్యేకించి నాలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయపడాలనుకుంటున్నాను. నేను 2001 డిసెంబరులో బాప్తిస్మం తీసుకున్నాను.
[చిత్రం]
దేవుని రాజ్యం గురించి తెలుసుకోవడం నాకు గొప్ప సంతోషాన్నిచ్చింది
[8వ పేజీలోని చిత్రం]
బోట్స్‌వానాలోని ఎయిడ్స్ కౌన్సిలింగ్ టీమ్
[10వ పేజీలోని చిత్రం]
పరదైసు భూమ్మీద అందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు