కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మన బలహీనతలను చూసీచూడనట్లు వదిలేస్తాడా?

దేవుడు మన బలహీనతలను చూసీచూడనట్లు వదిలేస్తాడా?

బైబిలు ఉద్దేశము

దేవుడు మన బలహీనతలను చూసీచూడనట్లు వదిలేస్తాడా?

‘నేను దుష్టుడిని కాదు! నాకున్న చెడు అలవాట్లను మానుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నేను చాలా బలహీనుడిని!’

ఈమాటలు మీ భావాలను గానీ మీకు తెలిసిన ఎవరి భావాలనైనా గానీ ప్రతిబింబిస్తున్నాయా? బలంగా నాటుకుపోయిన నైతిక బలహీనతలను అధిగమించడం దాదాపు అసాధ్యమని చాలామంది అనుకుంటారు. కొంతమంది ప్రజలు మద్యపానం, పొగాకు లేదా మాదకద్రవ్యాల మీద ఆధారపడతారు. అనేకుల జీవితాలను స్వార్థం అదుపుచేస్తోంది. లైంగిక దుష్ప్రవర్తనకు లొంగిపోయి, లైంగిక కోరికలకు తాము పూర్తిగా బానిసలమైపోయామని చెప్పుకునే వారు మరికొందరు ఉన్నారు.

మత్తయి 26:41 వ వచనంలో సూచించబడినట్లు, యేసు మానవ బలహీనతలకు సంబంధించి తన అవగాహనను దయతో వ్యక్తం చేశాడు. * వాస్తవానికి, యెహోవా దేవుడు మరియు యేసు మానవులపట్ల నిజమైన దయ కలిగివున్నారన్న విషయాన్ని పూర్తి బైబిలు నివేదిక స్పష్టం చేస్తోంది. (కీర్తన 103:8, 9) కానీ దేవుడు మన బలహీనతలన్నింటినీ చూసీచూడనట్లు వదిలేస్తాడని మనం ఆశించవచ్చా?

మోషే, దావీదు

మోషే వృత్తాంతాన్ని పరిశీలించండి. ఆయన “భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు”గా పేరుపొందాడు, ఆ మంచి లక్షణాన్ని కాపాడుకోవడానికి ఆయన కృషి చేశాడు. (సంఖ్యాకాండము 12:3) ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతంలో ప్రయాణిస్తుండగా తరచూ నిర్హేతుకంగా ప్రవర్తించారు, దేవునిపట్ల ఆయన ప్రతినిధులపట్ల అగౌరవాన్ని చూపించారు. ఆ సమయమంతటిలో మోషే దైవిక నడిపింపు కోసం వినయంగా ఎదురుచూశాడు.​—సంఖ్యాకాండము 16:12-14, 28-30.

సుదీర్ఘమైన, అలసట కలిగించే ఆ ప్రయాణం ముగుస్తుండగా ఆయన పూర్తి జనాంగం ఎదుట కోపం తెచ్చుకుని దేవుని ఉపదేశాలకు అవిధేయత చూపించాడు. దేవుడు ఆయనను క్షమించాడు, కానీ ఆ సంఘటనను ఆయన చూసీచూడనట్లు వదిలేశాడా? లేదు. ఆయన మోషేకు ఇలా చెప్పాడు: ‘నన్ను నమ్ముకొనకపోతివి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి నీవు తోడుకొని వెళ్ళవు.’ మోషే వాగ్దాన దేశంలోకి ప్రవేశించడు. అంతటి అద్భుతమైన ఆధిక్యత కోసం 40 సంవత్సరాలు పోరాడిన తర్వాత, ఒక గంభీరమైన మానవ బలహీనత ఆయన ఆ ఆశీర్వాదాన్ని పొందకుండా చేసింది.​—సంఖ్యాకాండము 20:7-12.

రాజైన దావీదు కూడా దైవభక్తిగల వ్యక్తి, కానీ ఆయనకు ఒక బలహీనత ఉండేది. ఒకానొక సందర్భంలో ఆయన కామవాంఛకు లొంగిపోయి మరో వ్యక్తి భార్యతో లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నాడు. తర్వాత, ఆమె భర్తను చంపించడం ద్వారా తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు. (2 సమూయేలు 11:2-27) కానీ ఆ తర్వాత ఆయన తాను చేసిన పాపాలకు తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు, దానితో దేవుడు ఆయనను క్షమించాడు. కానీ దావీదు ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు, దాని ఫలితంగా వచ్చిన పర్యవసానాల నుండి యెహోవా దావీదును కాపాడలేదు. దావీదుకు పుట్టిన మగ శిశువు అనారోగ్యం పాలయ్యాడు, తన శిశువు కోసం దావీదు ప్రార్థించినప్పటికీ యెహోవా జోక్యంచేసుకోలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు, అప్పటి నుండి దావీదు గృహంలో దుర్ఘటనల పరంపర మొదలయ్యింది. (2 సమూయేలు 12:13-18; 18:33) నైతిక బలహీనతకు లొంగిపోవడం వల్ల దావీదు ఎన్నో బాధలు అనుభవించవలసి వచ్చింది.

దేవుడు మానవులను తమ ప్రవర్తనకు బాధ్యులుగా ఎంచుతాడని ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి. ఆయన సేవ చేయాలని కోరుకొనేవారు తమ ఆధ్యాత్మికతలో ఉన్న బలహీనతలను తొలగించుకుని, శ్రేష్ఠులైన క్రైస్తవులుగా తయారుకావాలి. మొదటి శతాబ్దంలో చాలామంది అలా చేశారు.

పాపం నుండి విముక్తి పొందడానికి పోరాటం

అపొస్తలుడైన పౌలు సరైన విధంగానే, క్రైస్తవ జీవితానికి ఒక మాదిరిగా పరిగణించబడ్డాడు. కానీ ఆయన తన బలహీనతలకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ పోరాడుతుండేవాడని మీకు తెలుసా? రోమీయులు 7:18-25 వచనాలు ఈ ఘర్షణను లేదా 23వ వచనం చెప్తున్నట్లు ‘పోరాటాన్ని’ చక్కగా వర్ణిస్తున్నాయి. పౌలు విడువక పోరాడాడు, ఎందుకంటే పాపం చాలా కఠినమైనదని ఆయనకు తెలుసు.​—1 కొరింథీయులు 9:26, 27.

ప్రాచీన కొరింథులో క్రైస్తవ సంఘంలోని కొందరు సభ్యులు మునుపు అలవాటుగా చెడు పనులు చేసేవారు. వారు ‘జారులు, వ్యభిచారులు, పురుషసంయోగులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులుగా’ ఉండేవారని బైబిలు చెబుతోంది. కానీ వారు ‘కడగబడ్డారు’ అని కూడా బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 6:9-11) ఎలా? వారు ఖచ్చితమైన జ్ఞానం ద్వారా, క్రైస్తవ సహవాసం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా తమ చెడు అలవాట్లను మానుకోవడానికి బలపర్చబడ్డారు. చివరికి వారు క్రీస్తు నామమున దేవునిచే నీతిమంతులుగా తీర్చబడ్డారు. అవును, దేవుడు వారిని క్షమించి వారికి మంచి మనస్సాక్షినిచ్చాడు.​—అపొస్తలుల కార్యములు 2:38; 3:19, 20.

పౌలు, కొరింథులోని క్రైస్తవులు తమ పాపభరితమైన ఉద్దేశాలను తక్కువ అంచనా వేయలేదు గానీ వారు వాటితో పోరాడారు. దేవుని సహాయంతో వారు విజయం సాధించారు. ఆ మొదటి శతాబ్దపు ఆరాధకులు తమ చుట్టూ చెడు పరిస్థితులు ఉన్నప్పటికీ అపరిపూర్ణమైన అభిరుచులు ఉన్నప్పటికీ నైతికంగా మెచ్చుకోదగినవారిగా తయారయ్యారు. మరి మన విషయమేమిటి?

మనం మన బలహీనతలకు వ్యతిరేకంగా పోరాడాలని దేవుడు ఆశిస్తాడు

ఒక బలహీనతతో పోరాడడం, ఆ బలహీనత పూర్తిగా నిర్మూలించబడేలా చేయకపోవచ్చు. మనం మన అపరిపూర్ణతకు లొంగిపోవలసిన అవసరం లేకపోయినప్పటికీ మనం దాన్ని నాశనం చేయలేము. అపరిపూర్ణత, మనపై తదేకంగా ఒత్తిడి తీసుకురాగల బలహీనతలను ఉత్పన్నం చేస్తుంది. అయినప్పటికీ మనం మన బలహీనతలకు లొంగిపోకూడదు. (కీర్తన 119:11) ఇది ఎందుకంత ప్రాముఖ్యం?

ఎందుకంటే దేవుడు, చెడు ప్రవర్తనకు ఎల్లప్పుడూ అపరిపూర్ణతను ఒక సాకుగా ఉపయోగించుకోవడానికి అనుమతించడు. (యూదా 4) మానవులు తమను తాము పరిశుభ్రపర్చుకోవాలని, మంచి నైతిక జీవితాన్ని గడపాలని యెహోవా ఆశిస్తున్నాడు. ‘చెడ్డదానిని అసహ్యించుకోండి’ అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 12:9) దేవుడు ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాడు?

ఒక కారణం ఏమిటంటే, బలహీనతలకు లొంగిపోవడం హానికరమైనది. “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని గలతీయులు 6:7 లో బైబిలు చెబుతోంది. చెడు అలవాట్లకు, స్వార్థానికి, లైంగిక విచ్ఛలవిడితనానికి లొంగిపోయేవారు తరచూ తమ జీవితాలలో ఘోరమైన పంటను కోస్తారు. అయితే మరింత ముఖ్యమైన కారణం మరొకటి ఉంది.

పాపం దేవునికి అభ్యంతరం కలిగిస్తుంది. అది దేవునికీ మనకూ మధ్య “అడ్డముగా” ఉంటుంది. (యెషయా 59:1, 2) పాపం చేసేవారు ఆయన అనుగ్రహాన్ని పొందలేరు కాబట్టి, వారికి ఆయన ఇలా ఉద్బోధిస్తున్నాడు: “మిమ్మును కడుగుకొనుడి; శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియ[లను] . . . తొలగింపుడి.”​—యెషయా 1:16.

మన సృష్టికర్త ప్రేమా దయా కలవాడు. ఆయన “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు[న్నాడు].” (2 పేతురు 3:9) ఎప్పుడూ బలహీనతలకు లొంగిపోతూ ఉండడం, మనం దేవుని అనుగ్రహాన్ని పొందకుండా చేస్తుంది. దేవుడు మన బలహీనతలను చూసీచూడనట్లుగా వదిలివేయడు కాబట్టి, మనం కూడా అలా చేయకూడదు.(g02 11/8)

[అధస్సూచి]

^ ‘ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము’ అని యేసు అన్నాడు.