నాకు మొబైల్ ఫోన్ అవసరమా?
యువత ఇలా అడుగుతోంది . . .
నాకు మొబైల్ ఫోన్ అవసరమా?
“నాతోపాటు మొబైల్ ఫోన్ లేకపోతే నాకు చాలా అభద్రతగా చిరాకుగా అనిపిస్తుంది.”—అకీకో. *
అనేక దేశాల్లో మొబైల్ ఫోన్‌ల ఉపయోగం రోజురోజుకి ఎక్కువైపోతోంది. అవి అనుకూలమైనవి. మీ స్నేహితులు, తల్లిదండ్రులు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కాంటాక్ట్ చేయవచ్చు—మీరు కూడా అలాగే చేయవచ్చు. కొన్ని మొబైల్ ఫోన్‌లలో వ్రాతపూర్వకంగా చిన్న మెసేజ్‌లను పంపించుకునే సౌలభ్యం ఉంటుంది, అది “ఇతరులతో మాట్లాడాలనే తమ కోరికను సంతృప్తిపరచుకునేందుకు యౌవనస్థులకు అత్యాధునిక మార్గం” అని లండన్ వార్తాపత్రిక ద టైమ్స్ చెబుతోంది. వెబ్‌సైట్లను సందర్శించి ఇ-మెయిల్ పంపించుకునేందుకు వీలుగా మిమ్మల్ని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసే మొబైల్ ఫోన్‌లు కూడా ఉన్నాయి.
మీకు ఇప్పటికే ఒక మొబైల్ ఫోన్ ఉండవచ్చు లేదా ఒకటి కొనుక్కోవాలని మీరు అనుకుంటుండవచ్చు. విషయం ఏదైనప్పటికీ మీరు ఈ సామెతను పరిగణలోకి తీసుకోవలసిందే: “ప్రతి నాణానికి రెండు పార్శ్వాలుంటాయి.” మొబైల్ ఫోన్‌వల్ల తప్పకుండా కొన్ని ప్రయోజనాలుండవచ్చు. అయితే మీరు నాణానికి ఉన్న రెండో పార్శ్వం గురించి కూడా ఆలోచించాలని ఇష్టపడుతుండవచ్చు, ఎందుకంటే మీరు ఒక
మొబైల్ ఫోన్ కొనుక్కోవాలని నిశ్చయించుకున్నప్పటికీ దానివల్ల కలిగే అననుకూలతల గురించి పూర్తిగా మీకు తెలిసివుండడం, మీరు దాన్ని యుక్తంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.‘తగులుబడి లెక్క చూసుకోండి’
ఒక ప్రాముఖ్యమైన పని ప్రారంభించేముందు ఒక వ్యక్తి ‘తగులుబడి లెక్క చూసుకోవాలని’ యేసు జ్ఞానవంతమైన సూత్రాన్ని తెలియజేశాడు. (లూకా 14:28) ఆ సూత్రాన్ని మొబైల్ ఫోన్‌లకు అన్వయించవచ్చా? తప్పకుండా. మీకు ఫోన్ చాలా తక్కువ ధరకే లేదా ఉచితంగా కూడా లభించవచ్చన్నది నిజమే. అయితే 17 ఏళ్ళ హెన్నా కనుగొన్నట్లు “మీరు చేసిన ఫోన్‌కాల్‌ల ఖర్చు మిమ్మల్ని ఆశ్చర్యపర్చేంత ఎక్కువైపోవచ్చు.” అదనపు సేవలను అంగీకరించమనీ మరింత ఖరీదైన మొబైల్ ఫోన్‌లను కొనుక్కోమనీ ఎడతెగని ఒత్తిడి కూడా ఉండగలదు. అందుకే హీరోషీ ఇలా చెబుతున్నాడు: “నేను ఒక పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాను, ప్రతి సంవత్సరం ఒక క్రొత్త మోడల్ మొబైల్ ఫోన్‌ను కొనుక్కోవడానికి నేను డబ్బు దాచుకుంటాను.” చాలామంది యౌవనస్థులు కూడా అలాగే చేస్తారు. *
మీ తల్లిదండ్రులు మీ కోసం బిల్లు చెల్లించడానికి అంగీకరించినప్పటికీ దానికి ఎంత ఖర్చవుతుందో పరిశీలించడం ప్రాముఖ్యమే. జపాన్‌లోని ఒక క్రైస్తవ ప్రయాణ సేవకుడు ఇలా వ్యాఖ్యానించాడు: “కేవలం తమ పిల్లల మొబైల్ ఫోన్ బిల్లులను చెల్లించడానికే కొంతమంది తల్లులు అదనంగా పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని చేస్తున్నారు. తమ పిల్లలకు అసలు మొబైల్ ఫోన్ ఉండడమే అనవసరమైనప్పటికీ వారు అలా చేస్తున్నారు.” మీరు మీ తల్లిదండ్రుల మీద ఇలాంటి భారాన్ని మోపడానికి ఖచ్చితంగా ఇష్టపడరు!
“సమయాన్ని వృధా చేస్తుంది”
చాలామంది మొదట్లో మొబైల్ ఫోన్‌ను మితంగానే ఉపయోగించినప్పటికీ త్వరలోనే వారు తాము ఊహించిన దానికంటే ఎక్కువ సమయాన్ని అది తీసుకుంటుందనీ, మరింత ప్రాముఖ్యమైన విషయాల నుండి అది సమయాన్ని తీసుకుంటుందనీ గ్రహిస్తారు. మీకా రాత్రి భోజనాల సమయంలో తన కుటుంబంతో ఎంతో సమయాన్ని గడిపేది. “ఇప్పుడు మేము భోజనం చేసిన తర్వాత మా [మొబైల్ ఫోన్‌లను] తీసుకుని మా గదులకు వెళ్ళిపోతాము” అని ఆమె చెబుతోంది.
“16 నుండి 20 సంవత్సరాల వయస్సుగల యౌవనస్థులలో మూడు శాతంమంది, వ్రాయడం ద్వారా ఒకరినొకరు సంప్రదించుకునే మాధ్యమాలన్నింటిలోకెల్లా మొబైల్ ఫోన్‌ల ద్వారా వ్రాతపూర్వక మెసేజ్‌లను పంపించుకోవడాన్నే ఇష్టపడుతున్నారు” అని లండన్ వార్తాపత్రిక ద గార్డియన్ చెబుతోంది. అయితే ఇలా వ్రాతపూర్వకంగా మెసేజ్‌లను పంపించుకోవడానికి ఫోన్‌లో మాట్లాడడం కన్నా తక్కువ ఖర్చు అయినప్పటికీ మెసేజ్‌లను టైప్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. మియేకో ఇలా ఒప్పుకుంటోంది: “ఎవరైనా నాకు ‘గుడ్ నైట్’ అని మెసేజ్ పంపిస్తే నేను కూడా ‘గుడ్ నైట్’ అని జవాబు చెబుతాను. ఆ తర్వాత ఒక గంట పాటు మెసేజ్‌లు రావడం మళ్ళీ నేను వాటికి జవాబు పంపించడం కొనసాగుతుంది. మేము మాట్లాడుకునేదంతా అర్థరహితమైనదే.”
మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే వారిలో చాలామంది, ఫోన్ కోసం ఒక నెలలో తాము వెచ్చిస్తున్న సమయాన్నంతటినీ లెక్కకట్టి చూసుకుంటే ఎంతో ఆశ్చర్యపోతుండవచ్చు. 19 సంవత్సరాల యువతి టేజా ఇలా ఒప్పుకుంటుంది: “చాలామంది ప్రజల విషయంలో మొబైల్ ఫోన్ సమయాన్ని ఆదా చేసే బదులు సమయాన్ని వృధా చేస్తుంది.” మొబైల్ ఫోన్‌ను కలిగివుండడానికి మీకు బలమైన కారణం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించడానికి మీరు వెచ్చిస్తున్న సమయం గురించి జాగ్రత్తగా ఉండడం ప్రాముఖ్యం.
మారియా అనే ఒక క్రైస్తవ యువతి ఇలా వ్యాఖ్యానించింది: “క్రైస్తవ సమావేశాల వద్ద చాలామంది యౌవనస్థులు ఇతరులకు అనవసరమైన మెసేజ్‌లను పంపిస్తూ ఉంటారు. అది సర్వసాధారణం!” క్రైస్తవ పరిచర్యలో భాగం వహించే యౌవనస్థులు కూడా అలా చేస్తున్నట్లు గమనించడం జరిగింది. ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం సమయాన్ని “సద్వినియోగము” చేసుకొమ్మని బైబిలు క్రైస్తవులకు సలహా ఇస్తోంది. (ఎఫెసీయులు 5:15, 16) అలాంటి విలువైన సమయాన్ని టెలిఫోన్‌లో మాట్లాడడానికి ఉపయోగించడం ఎంత విచారకరం!
రహస్య సంప్రదింపులు
మరో ప్రమాదం గురించి మారియా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “కాల్స్ ఇంటికి కాకుండా నేరుగా ఆ వ్యక్తికే వస్తాయి కనుక, తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు లేక అసలు ఫోన్‌లో మాట్లాడుతున్నారా లేదా అన్న విషయం తల్లిదండ్రులకు తెలియకుండా ఉండే ప్రమాదం ఉంది.” కాబట్టి కొంతమంది యౌవనస్థులు వేరే అబ్బాయిలతో లేదా అమ్మాయిలతో రహస్యంగా మాట్లాడడానికి మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు వారు సాధారణంగా పాటించే ప్రమాణాలను అలక్ష్యం చేస్తూ కొందరు తాము సాధారణంగా తీసుకునే జాగ్రత్తలను విస్మరించారు. అదెలా?
“వ్రాతపూర్వకమైన మెసేజ్‌లను పంపించుకోవడం అంటే [యౌవనస్థులు] ఏమి చేస్తున్నారో ఎవ్వరూ గమనించలేరని అర్థం” అని లండన్ వార్తాపత్రిక ద డైలీ టెలిగ్రాఫ్ చెబుతోంది. అవతలి వ్యక్తిని చూడకుండా అతని/ఆమె స్వరాన్ని వినకుండా ఉండడం మీపై ప్రభావం చూపగలదు. “వ్రాతపూర్వకంగా మెసేజ్‌లను పంపించుకోవడం ఇతరులతో సంభాషించడానికి మరింత తటస్థమైన మార్గమని కొందరు భావిస్తారు. ఒక మెసేజ్‌లో, కొందరు తాము ఇతరుల సమక్షంలో చెప్పడానికి సాహసించలేమని భావించే విషయాలను వ్రాయవచ్చు” అని టిమో చెబుతున్నాడు.
కేకో అనే 17 సంవత్సరాల క్రైస్తవ యువతి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు ఆమె తన నంబర్‌ను అనేకమంది స్నేహితులకు తెలియజేసింది. కొంతకాలానికి ఆమె తన సంఘంలోని ఒక అబ్బాయితో రోజూ మెసేజ్‌ల ద్వారా మాట్లాడడం ప్రారంభించింది. “మొదట్లో మేము కేవలం సాధారణ విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం, కానీ ఆ తర్వాత మేము మా కష్టాలను పంచుకోవడం ప్రారంభించాము. మా మొబైల్ ఫోన్‌ల ద్వారా మేము కేవలం మాకు మాత్రమే పరిమితమైన చిన్న ప్రపంచాన్ని నిర్మించుకున్నాము” అని కేకో చెబుతోంది.
సంతోషకరంగా, పరిస్థితి విషమించకముందే ఆమె తన తల్లిదండ్రుల నుండి క్రైస్తవ పెద్దల నుండి సహాయాన్ని పొందింది. ఆమె ఇప్పుడు ఇలా ఒప్పుకుంటోంది: “నాకు మొబైల్ ఫోన్‌ను ఇచ్చే *
ముందు నా తల్లిదండ్రులు అబ్బాయిలతో మెసేజ్‌ల ద్వారా మాట్లాడడం గురించి ఎంతో హెచ్చరించారు, అయినప్పటికీ నేను అతనికి ప్రతిరోజు మెసేజ్‌లు పంపించేదాన్ని. అది ఫోన్‌ను ఉపయోగించవలసిన సరైన పద్ధతి కాదు.”“నిర్మలమైన మనస్సాక్షి కలిగి” ఉండమని బైబిలు మనకు ఉపదేశిస్తోంది. (1 పేతురు 3:15, 16) అంటే మీరు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించేటప్పుడు ఇతరులు మీ మెసేజ్‌లను చూసినా లేక మీ సంభాషణను విన్నా, కోయీచీ మాటల్లో చెప్పాలంటే, “మీరు సిగ్గుపడవలసిన విషయం ఏమీ లేకుండా ఉండేలా” నిశ్చయపర్చుకోవాలని దానర్థం. మన పరలోక తండ్రి తెలుసుకోలేని రహస్యాలు ఏమీ ఉండవని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. “[దేవుని] దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” అని బైబిలు వివరిస్తోంది. (హెబ్రీయులు 4:13) మరి రహస్య సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించడం ఎందుకు?
పరిమితులను ఏర్పర్చుకోండి
మీరు ఒక మొబైల్ ఫోన్‌ను తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లైతే, మొదట మీకు అది నిజంగా అవసరమా అని మీ పరిస్థితిని జాగ్రత్తగా ఎందుకు పరిశీలించుకోకూడదు? ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులతో చర్చించండి. యౌవనస్థురాలైన యెన్నా భావించినట్లే కొందరు భావిస్తారు, ఆమె ఇలా చెబుతోంది: “చాలామంది యౌవనస్థులకు మొబైల్ ఫోన్ అనేది మోయలేనంత పెద్ద బాధ్యతగా ఉంది.”
మీరు ఇలాంటి ఫోన్‌ను కలిగివుండాలని నిశ్చయించుకున్నా, దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం. అదెలా? సహేతుకమైన పరిమితులను ఏర్పరుచుకోండి. ఉదాహరణకు, మీరు ఉపయోగించే కార్యక్రమాల సంఖ్యను లేదా మీరు ఫోన్ కోసం వెచ్చించే సమయాన్ని ఖర్చు చేసే డబ్బును పరిమితం చేయండి. అనేక ఫోన్ కంపెనీలు మీరు ఫోన్‌ను ఎలా ఉపయోగించారన్న దాని విషయమై వివరణాత్మకమైన నివేదికను అందిస్తాయి కనుక అప్పుడప్పుడు మీరు మీ బిల్లును మీ తల్లిదండ్రులతో కలిసి చర్చించాలనుకోవచ్చు. మొబైల్ ఫోన్ ఉపయోగాన్ని అదుపులో ఉంచుకునేందుకు కొందరు, ముందుగానే డబ్బు చెల్లించే పద్ధతిని ఉపయోగించడం అనుకూలంగా ఉంటుందని గ్రహిస్తారు.
ఫోన్‌కాల్‌లకూ మెసేజ్‌లకూ మీరు ఎప్పుడు, ఎలా ప్రతిస్పందిస్తారన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరే స్వయంగా సహేతుకమైన మార్గనిర్దేశకాలను తయారుచేసుకోండి. షింజీ తన నియమాన్ని ఇలా వివరిస్తున్నాడు: “నాకు వచ్చిన మెసేజ్‌లను నేను రోజుకు ఒక్కసారి మాత్రమే చూసుకుంటాను, సాధారణంగా నేను ప్రాముఖ్యమైన మెసేజ్‌లకు మాత్రమే జవాబు పంపిస్తాను. దాని ఫలితంగా, నా స్నేహితులు నాకు అర్థరహితమైన మెసేజ్‌లను పంపించడం మానేశారు. నిజంగా అత్యవసరమైన సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు నాకు ఎలాగూ కాల్ చేస్తారు.” మరింత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎవరితోనైతే సంభాషించాలనుకుంటున్నారో వారిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. మీ ఫోన్ నంబర్‌ను ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంచి సహవాసులను ఎంపిక చేసుకొనే విషయంలో మీరు అన్వయించుకునే ప్రమాణాలనే ఈ విషయంలో కూడా అన్వయించుకోండి.—1 కొరింథీయులు 15:33.
‘ప్రతిదానికి సమయము కలదు. మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయము కలదు’ అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 3:1, 7) మొబైల్ ఫోన్‌లు “మౌనముగా” ఉండవలసిన సమయాలు కూడా ఉన్నాయని స్పష్టమౌతోంది. మన క్రైస్తవ కూటాలు, పరిచర్య ఫోన్‌ను ఉపయోగించడానికి కాదుగానీ దేవుణ్ణి ఆరాధించడానికి కేటాయించబడిన “సమయము.” రెస్టారెంటు, థియేటర్ మేనేజర్‌లు తమ వినియోగదారులను మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని తరచూ కోరుతుంటారు. మనం అలాంటి విన్నపాలను గౌరవపూర్వకంగా అంగీకరిస్తాము. విశ్వ సర్వాధిపతి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ గౌరవాన్ని పొందడానికి అర్హుడు!
చాలామంది ప్రాముఖ్యమైన కాల్ కోసం ఎదురుచూడడం లేదంటే ఆ సమయంలో తమ ఫోన్‌లను ఆఫ్ చేసివుంచుతారు, లేదా అవసరమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పుడు వారు తమ ఫోన్‌లు మ్రోగకుండా ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. కొందరు తమ మొబైల్ ఫోన్‌ను సులభంగా అందుకోలేనంత దూరంలో ఉంచుతారు. ఎంతైనా, మెసేజ్‌ల గురించి ఆ తర్వాత చూసుకుంటే సరిపోదంటారా?
మొబైల్ ఫోన్‌ను కలిగివుండాలని మీరు నిర్ణయించుకుంటే అది మిమ్మల్ని అదుపుచేయడం కాదు గానీ అది మీ అదుపులో ఉండేలా చూసుకోవాలని తీర్మానించుకోండి. మీరు అప్రమత్తంగా ఉండి, మీ మొబైల్ ఫోన్ మరింత ప్రాముఖ్యమైన విషయాలను ఆటంకపర్చకుండా ఉండేలా జాగ్రత్తపడడం అవసరమని స్పష్టమవుతోంది. “మీ సహనమును [“సహేతుకత,” NW] సకల జనులకు తెలియబడనియ్యుడి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (ఫిలిప్పీయులు 4:5) మొబైల్ ఫోన్ కలిగివుండాలని మీరు నిశ్చయించుకుంటే దయచేసి మీరు దాన్ని ఉపయోగించే విషయంలో సహేతుకతను ప్రదర్శించాలని తీర్మానించుకోండి. (g02 10/22)
[అధస్సూచీలు]
^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
^ స్కూల్ తర్వాత చేసే ఉద్యోగాల గురించిన చర్చ కోసం అక్టోబరు 8, 1997, తేజరిల్లు!లో “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు—డబ్బు సంపాదించడంలో తప్పేమిటి?” అనే ఆర్టికల్ చూడండి.
^ అబ్బాయిలతో లేక అమ్మాయిలతో క్రమంగా మెసేజ్‌ల ద్వారా లేదా ఫోన్‌లో మాట్లాడడం ఒక విధమైన డేటింగ్ కావచ్చు. దయచేసి ఆగస్టు 22, 1922, తేజరిల్లు!లోని (ఆంగ్లం) “యువత ఇలా అడుగుతోంది—ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో తప్పేముంది?” అనే ఆర్టికల్ చూడండి.
[20వ పేజీలోని చిత్రాలు]
కొందరు యౌవనస్థులు మొబైల్ ఫోన్ ద్వారా రహస్య సంబంధాలను కొనసాగిస్తారు